హైదరాబాద్‌లో డబ్బావాలా! | dabba wala in hyderabad :bento wagon | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో డబ్బావాలా!

Published Sat, Jul 1 2017 12:41 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

హైదరాబాద్‌లో డబ్బావాలా!

హైదరాబాద్‌లో డబ్బావాలా!

స్కూళ్లు, ఆఫీసులకు లంచ్‌ బాక్స్‌ డెలివరీ చేస్తున్న బెంటోవాగన్‌
‘స్టార్టప్‌ డైరీ’తో బెంటోవాగన్‌ కోఫౌండర్‌ ఎస్‌ విజయలక్ష్మి
 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ముంబై డబ్బావాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడిదే కాన్సెప్ట్‌తో హైదరాబాద్‌లోనూ డబ్బావాలా సేవలు ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థ బెంటోవాగన్‌... కార్యాలయాలు, పాఠశాలలకు టిఫిన్‌ బాక్స్‌లను డెలివరీ చేస్తోంది. మరిన్ని వివరాలు సంస్థ కోఫౌండర్‌ సుంకు విజయలక్ష్మి మాటల్లోనే..

గృహిణిగా, ఉద్యోగినిగా మహిళల ప్రధాన సవాల్‌ వంట గదిలోనే. ఉదయాన్నే పిల్లలకు బాక్స్‌ను రెడీ చేయటమంటే మామూలు విషయం కాదు. ఆపైన ఆఫీసుకెళ్లటం. తిరిగి ఇంటికొచ్చే వరకూ పిల్లలేం తిన్నారోననే టెన్షన్‌. కాగ్నిజెంట్‌లో ఉద్యోగిగా ఉన్న నాకూ ఇదంతా అనుభవమే. అయితే నాలా మరే మహిళకూ హడావుడిగా లంచ్‌ బాక్స్‌ ప్రిపరేషన్‌ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నా. ఇదే నిర్ణయాన్ని మా ఆయన సునీల్‌ కుమార్‌తో చర్చించా. మీరు నమ్మరూ!! అప్పటిదాకా విప్రో వంటి ఐటీ కంపెనీలో పని చేస్తున్న ఆయన.. నా నిర్ణయాన్ని గౌరవించి ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేసేసి సహాయపడ్డారు.

సర్వేతో మొదలు..
కంపెనీ ప్రారంభానికి ముందు మార్కెట్లో ఎలా ఉంటుందని కొన్ని స్కూళ్లకు, ఆఫీసులకెళ్లి ఐడియాను షేర్‌ చేసుకున్నాం. వాళ్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కొన్నిసార్లు ఉదయం బాక్స్‌లో తెచ్చుకున్న కూరలు మధ్యాహ్నం అయ్యే సరి కి పాడైపోయేవని చెప్పుకొచ్చేవాళ్లు. వాళ్ల సూచనలు, సలహాలను తీసుకొని ఈ ఏడాది మార్చిలో బెంటోవాగన్‌ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించాం. వెబ్‌సైట్‌ అభివృద్ధి, మార్కెటింగ్, కాల్‌ సెంటర్‌ కోసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేశాం.

బెంటోవాగన్‌ అంటే..: బెంటోవాగన్‌ అనేది జపనీస్‌ పదం. ఇందులో బెంటో అంటే అందంగా డెకరేట్‌ చేసిన టిఫిన్‌ బ్యాక్స్‌ అని, వాగన్‌ అంటే వాహనం అని అర్థం. అందుకే రెండూ కలిపి బెంటోవాగన్‌.కామ్‌ అని పేరు పెట్టాం. ప్రస్తుతం కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, మణికొండ, బొల్లారం, నిజాంపేట, బీహెచ్‌ఈఎల్, మూసాపేట్, చందానగర్, కేపీహెచ్‌బీ, మదీనాగూడ, హఫీజ్‌పేట, బాచుపల్లి ప్రాంతాల్లో సేవలందిస్తున్నాం. స్కూళ్లు, ఆఫీసులకు లంచ్‌ బాక్స్‌లను మాత్రమే డెలివరీ చేస్తున్నాం. త్వరలోనే డిన్నర్‌ బాక్స్‌లనూ డెలివరీ చేస్తాం. ఈ ఏడాదిలోపు హైదరాబాద్‌ అంతా విస్తరించాలనేది లక్ష్యం.

ఒక్క బాక్స్‌కు నెలకు రూ.500..
ప్రస్తుతానికి వెబ్‌సైట్, కాల్‌ సెంటర్‌ (96404 00079) ద్వారా ఆర్డర్లను స్వీకరిస్తున్నాం. సబ్‌స్క్రైబర్లకు బెంటోవాగన్‌ బ్యాగ్‌ ఇస్తాం. ఇందులో టిఫిన్‌ బాక్స్‌ను పెట్టి ఇవ్వాలి. మొదటి వారం మాత్రం ఉచితంగా డెలివరీ చేస్తాం. సేవలు నచ్చితే... 5 కి.మీ. పరిధిలో ఒక్క బాక్స్‌కు నెలకు రూ.500 చార్జీ ఉంటుంది. కి.మీ. పెరిగితే ధర కూడా పెరుగుతుంది. ప్రస్తుతం 5 వేల వెబ్‌సైట్‌ యూజర్లున్నారు. రోజుకు 80 నుంచి 100 ఆర్డర్లొస్తున్నాయి. ఇందులో 70% స్కూళ్లు, మిగిలినవి ఆఫీసులవి. బాక్స్‌ల డెలివరీ కోసం 10 మంది ఉద్యోగులున్నారు. వీరికి మూడున్నర గంటలకు రూ.7,500–9,500 మధ్య వేతనాలను చెల్లిస్తున్నాం.

రూ.10 కోట్ల నిధుల సమీకరణ..
ప్రతి నెలా వ్యాపారం పెరుగుతోంది. త్వరలోనే యాప్‌ను విడుదల చేస్తాం. కస్టమర్‌ యాప్‌ కంటే డెలివరీ యాప్‌ విడుదల చేయాలని నిర్ణయించాం.  హైదరాబాద్‌లో పూర్తి స్థాయిలో విస్తరించాక.. రూ.10 కోట్ల నిధులు సమీకరిస్తాం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్‌ చేయండి...

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement