ఈ టేస్టీ స్నాక్స్‌తో.. స్కూల్‌ లంచ్‌ బాక్సుకి రెడీ అయిపోండి..! | Bread Potato Roll, Cheese Balls Tasty Snacks Recipe | Sakshi
Sakshi News home page

ఈ టేస్టీ స్నాక్స్‌తో.. స్కూల్‌ లంచ్‌ బాక్సుకి రెడీ అయిపోండి..!

Published Fri, May 31 2024 12:11 PM | Last Updated on Fri, May 31 2024 12:11 PM

Bread Potato Roll, Cheese Balls Tasty Snacks Recipe

క్యాలెండర్‌ పేజీ తిప్పమంటోంది. జూన్‌కి స్వాగతం పలకాల్సిందే. కొత్త టైమ్‌టేబుల్‌నీ స్వాగతించాల్సిందే. లంచ్‌ బాక్సు... స్కూల్‌కి రెడీ అయిపోతుంది. పిల్లలు సాయంత్రం వచ్చేటప్పటికి ఏం చేయాలి? ఇవిగో వీటిని మన వంటింట్లో ట్రై చేయండి..

బ్రెడ్‌ పొటాటో రోల్‌..
కావలసినవి..
బంగాళదుంపలు– 3 (మీడియం సైజువి);
క్యారట్‌ తురుము లేదా పచ్చి బఠాణీలు – అర కప్పు ;
మిరప్పొడి– అర టీ స్పూన్‌;
గరం మసాలా పొడి– అర టీ స్పూన్‌;
పసుపు – చిటికెడు;
నిమ్మరసం –పావు టీ స్పూన్‌;
కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్‌లు;
ఉప్పు – అర టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి;
బ్రెడ్‌ స్లయిస్‌లు – 10;
వెన్న – టేబుల్‌ స్పూన్‌ – 2 టేబుల్‌ స్పూన్‌లు;
పాలు– అర కప్పు; మొక్కజొన్న పిండి లేదా మైదా లేదా శనగపిండి– 2 టేబుల్‌ స్పూన్‌లు (బ్రెడ్‌ స్లయిస్‌లను రోల్‌ చేసి అతికించడానికి).

తయారీ..

  • బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించాలి. వేడి తగ్గిన తరవాత తొక్క తీసి చిదిమి ఒకపాత్రలో వేసుకోవాలి.

  • క్యారట్‌ లేదా బఠాణీలను ఉడికించి పక్కన పెట్టాలి.

  • ఇప్పుడు చిదిమిన బంగాళదుంప గుజ్జులో మిరప్పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కొత్తిమీర, నిమ్మరసం, ఉడికించిన క్యారట్‌ లేదా బఠాణీలను వేసి సమంగా కలిసే వరకు వేళ్లతో చిదమాలి.

  • ఉప్పు, కారం సరి చూసుకుని అవసరమైతే మరికొంత చేర్చుకోవచ్చు.

  • ఈ మిశ్రమాన్ని పది సమభాగాలుగా చేయాలి. ఒక్కో భాగాన్ని ఓవల్‌ షేప్‌ (దొండకాయ ఆకారం)లో చేయాలి.

  • బ్రెడ్‌ అంచులు కట్‌ చేసి తీసేసిన తర్వాత బ్రెడ్‌ స్లయిస్‌ని పూరీల పీట మీద పెట్టి రోలర్‌తో వత్తాలి.

  • ఇలా చేయడం వల్ల గుల్లబారి ఉన్న బ్రెడ్‌ చపాతీలాగ పలుచగా వస్తుంది.పాలలో బ్రష్‌ ముంచి ఈ స్లయిస్‌ల మీద చల్లాలి లేదాపాలలో వేళ్లు ముంచి బ్రెడ్‌ స్లయిస్‌ మీద చల్లి తడిపొడిగా ఉండేటట్లు మునివేళ్లతో అద్దాలి.

  • బ్రెడ్‌ చివర్లు అతికించడం కోసం తీసుకున్న పిండిలో నీరుపోసి గరిట జారుడుగా కలుపుకోవాలి.

  • ఇప్పుడు బ్రెడ్‌ స్లయిస్‌ మీద బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి అంచులకు పిండి ద్రవాన్ని అద్దుతూ అతికిస్తే బ్రెడ్‌రోల్‌ రెడీ.

  • వీటిని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. బయటే ఉంచినప్పుడు ఒకవేళ కాల్చడం ఆలస్యం అయితే బ్రెడ్‌ అంచులు ఎండిపోయి రోల్‌ ఊడిపోతుంది.

  • పెనం వేడి చేసి వెన్న రాసి బ్రెడ్‌ రోల్స్‌ను ఒకదాని పక్కన ఒకటిగా అమర్చాలి. దోరగా కాలేకొద్దీ మరొక వైపుకు తిప్పుతూ అన్ని వైపులా కాలేటట్లు చూడాలి.

  • పెనం మీద కాల్చినప్పుడు నూనెలో రోస్ట్‌ చేసినట్లు రోల్‌ అంతా సమంగా ఒకే రంగులో ఉండదు. కానీ లోపల మిశ్రమం ఉడికిపోతుంది. రోల్‌ పై భాగం కరకరలాడుతూ రుచిగా ఉంటుంది.

  • మొత్తంగా ఒకేరంగులో ఉండాలంటే బాణలిలో నాలుగు టేబుల్‌ స్పూన్‌ల నూనె లేదా నెయ్యి మరిగించి అందులో నాలుగు రోల్స్‌ వేసి అవి కాలిన తర్వాత మరికొన్ని వేస్తూ కాల్చుకోవచ్చు.

  • ఇలా చేసినప్పుడు నూనెలో నుంచి తీసిన వెంటనే టిష్యూ పేపర్‌ మీద వేస్తే అదనంగా ఉన్న నూనెను పేపర్‌ పీల్చుకుంటుంది.

  • ఒవెన్‌లో అయితే... 200 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో వేడి చేసి బేకింగ్‌ ట్రేలో రోల్స్‌ను అమర్చి పది నుంచి పన్నెండు నిమిషాల సేపు బేక్‌ చేయాలి.

చీజ్‌ బాల్స్‌..
కావలసినవి..
బంగాళదుంపలు –పావు కేజీ;
వెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్‌;
ఉప్పు –పావు టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి;
రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్‌ లేదా పచ్చిమిర్చి తరుగు లేదా మిరప్పొడి – అర టీ స్పూన్‌;
మిరియాల పొడి –పావు టీ స్పూన్‌;
కొత్తిమీర తరుగు – టీ స్పూన్‌;
బ్రెడ్‌ క్రంబ్స్‌ – 6 టేబుల్‌ స్పూన్‌లు;
నూనె – వేయించడానికి తగినంత.

స్టఫింగ్‌ కోసం.. చీజ్‌ – 100 గ్రాములు;
ఎండిన పుదీన – అర టీ స్పూన్‌ (ఆకులను అరచేతిలో వేసి వేళ్లతో నలిపి పొడి చేయాలి);
రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్‌ లేదా పచ్చిమిర్చి తరుగు లేదా మిరప్పొడి –పావు టీ స్పూన్‌;
మిరియాల పొడి–పావు టీ స్పూన్, గరం మసాలా పొడి– చిటికెడు.

కోటింగ్‌ కోసం.. కార్న్‌ ఫ్లోర్‌ – 2 టేబుల్‌ స్పూన్‌లు;
ఎగ్‌ – ఒకటి (ఎగ్‌ వేయనట్లయితే మరో 2 టేబుల్‌ స్పూన్‌ల కార్న్‌ఫ్లోర్‌ తీసుకోవాలి);
బ్రెడ్‌ క్రంబ్స్‌– అర కప్పు.

తయారీ..

  • బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించి, వేడి తగ్గిన తర్వాత తొక్క తీసి చిదమాలి.

  • అందులో వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, బ్రెడ్‌ క్రంబ్స్‌ వేసి సమంగా కలిసేటట్లు చిదిమి ఒకసారి రుచి చూసుకుని అవసరమైతే ఉప్పు, కారం కలుపుకుని మిశ్రమం మొత్తాన్ని బాల్స్‌ చేసి ఆరిపోకుండా ఒక గిన్నెలో వేసి మూత పెట్టుకోవాలి.

  • స్టఫింగ్‌ కోసం తీసుకున్న వాటిలో చీజ్‌ తప్ప మిగిలిన అన్నింటినీ ఒకపాత్రలో వేసి కలపాలి. అందులో చీజ్‌ ని అర అంగుళం ముక్కలుగా కట్‌ చేసి వేసిపాత్రను కొద్దిగా కదిలిస్తూ మసాలా పొడులు చీజ్‌ ముక్కలకు పట్టేలా చేసి వేడి తగలకుండా స్టవ్‌కు దూరంగా ఉంచాలి.

  • ఇప్పుడు బంగాళదుంప బాల్స్‌ ఒక్కొక్కటిగా తీసుకుని అరచేతిలో పెట్టి వేళ్లతో చిన్న పూరీలా వత్తి అందులో మసాలా పట్టించిన చీజ్‌ ఒక ముక్క పెట్టి బంగాళాదుంప మిశ్రమం పూరీ అంచులను మూసేస్తూ బాల్‌ చేయాలి.

  • ఇలా అన్నింటినీ చేసిన తర్వాత ఒక ప్లేట్‌లో కార్న్‌ఫ్లోర్‌ వేసి అందులో ఒక్కో బాల్‌ని వేస్తూ మెల్లగా వేళ్లతో కదిలిస్తూ పిండి అన్ని వైపులా సమంగా పట్టేటట్లు చేయాలి.

  • మరొక ప్లేట్‌లో బ్రెండ్‌ క్రంబ్స్‌ వేసుకుని కార్న్‌ఫ్లోర్‌ పట్టించిన బాల్స్‌ని వేసి అన్ని వైపులా సమంగా పట్టేటట్లు చేయాలి.

  • కోడిగుడ్డు సొనను ఒక గిన్నెలో వేసి గిలక్కొట్టాలి.

  • ఎగ్‌ వాడనట్లయితే రెండు టేబుల్‌ స్పూన్‌ల కార్న్‌ఫ్లోర్‌ను తగినంత నీటితో గరిటజారుడుగా కలుపుకోవాలి.

  • పొడి కార్న్‌ఫ్లోర్‌ పట్టించిన బంగాళాదుంప– చీజ్‌ బాల్స్‌ని కార్న్‌ఫ్లోర్‌ ద్రవం లేదా కోడిగుడ్డు సొనలో ముంచి తీసి పదినిమిషాల సేపు ఆరనివ్వాలి.

  • ఈ లోపు బాణలిలో నూనె వేడి చేయాలి. ఒక్కో బాల్‌ను జాగ్రత్తగా నూనెలో వేసి మీడియం మంట మీద బాల్‌ అన్ని వైపులా సమంగా కాలిన ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.

  • బాల్స్‌ మీద టిష్యూ పేపర్‌ని కప్పి ఉంచితే అదనపు ఆయిల్‌ వదులుతుంది.

  • బంగాళాదుంప– చీజ్‌ బాల్స్‌ని టొమాటో సాస్‌ లేదా కెచప్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

ఇవి చదవండి: చూపులను కట్టడి చేసేలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement