ఇటువంటి వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా? | Have You Ever Tried Such Variety Of Dishes? | Sakshi
Sakshi News home page

ఇటువంటి వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా?

Published Sun, Jul 7 2024 4:23 AM | Last Updated on Sun, Jul 7 2024 4:23 AM

Have You Ever Tried Such Variety Of Dishes?

మంచూరియా రోల్స్‌..
కావలసినవి..
చపాతీలు – 5 లేదా 6,
మంచూరియా – అర కప్పు (నచ్చిన ఫ్లేవర్‌లో తయారుచేసుకోవచ్చు),
ఉల్లికాడ ముక్కలు,
కొత్తిమీర తురుము – అర టేబుల్‌ స్పూన్‌  చొప్పున
టొమాటో సాస్,
పుదీనా చట్నీ – కొద్దికొద్దిగా (అభిరుచిని బట్టి)
నూనె – సరిపడా

తయారీ..

  • ముందుగా నచ్చిన విధంగా మంచూరియా చేసి పెట్టుకోవాలి.

  • అదే సమయంలో చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలి.

  • అనంతరం చపాతీలు చేసుకుని.. వాటిని ఇరువైపులా దోరగా వేయించుకోవాలి.

  • ఒక్కో చపాతీపైన టొమాటో సాస్, పుదీనా చట్నీ రాసుకుని.. కొన్ని మంచూరియాలను అందులో పెట్టుకుని.. కొత్తిమీర తురుము, ఉల్లికాడ ముక్కలు జల్లుకుని.. రోల్స్‌లా చుట్టుకోవాలి.

  • వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే కమ్మగా ఉంటాయి.

అల్లం స్వీట్‌..
కావలసినవి..
అల్లం – 2 కప్పులు (శుభ్రం చేసుకుని.. తొక్క తీసి పేస్ట్‌లా గ్రైండ్‌ చేసుకోవాలి)
పంచదార – 4 కప్పులు,
ఏలకుల పొడి – కొద్దిగా,
ఉప్పు – తగినంత
నీరు – 2 కప్పులు,
నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్లు

తయారీ..

  • ముందుగా కళాయి వేడి చేసుకుని అందులో బెల్లం, పంచదార వేసి..  నీళ్లు పోయాలి.  పంచదార, బెల్లం కరిగి.. సిరప్‌లా తయారవుతున్న సమయంలో అల్లం పేస్ట్, ఏలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసుకుని.. చిక్కబడే వరకు మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి.

  • కాస్త దగ్గరపడే సమయంలో నెయ్యి వేసుకుని కాసేపు స్టవ్‌ మీద ఉంచి.. మరోసారి కలుపుకోవాలి.

  • ఆ మిశ్రమం మొత్తం దగ్గరపడిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని.. ఏదైనా బౌల్‌కి లేదా ప్లేట్‌కి ఆయిల్‌ రాసి ఆ మిశ్రమాన్ని అందులోకి తీసుకోవాలి.

  • సమాంతరంగా పరచి.. సుమారు 30 నిమిషాల పాటు చల్లారబెట్టి.. నచ్చిన షేప్‌లో ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఈ స్వీట్‌.. జలుబు, దగ్గును దూరం చేస్తుంది.

బ్రెడ్‌ – పిస్తా లడ్డూ..
కావలసినవి..
పిస్తా పేస్ట్‌ – 1 కప్పు (గ్రైండ్‌ చేసుకోవాలి)
పిస్తా – పావు కప్పు (దోరగా వేయించి, పొడిలా మిక్సీ పట్టుకోవాలి)
బ్రెడ్‌ పౌడర్‌ – పావు కప్పు (పౌడర్‌లా మిక్సీ పట్టుకోవాలి)
ఓట్స్‌ పౌడర్‌ – పావు కప్పు (ఓట్స్‌ని వేయించి పౌడర్‌ చేసుకోవాలి)
పల్లీలు – పావు కప్పు (దోరగా వేయించి.. తొక్క తీసి.. కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి)
కొబ్బరి పాలు – సరిపడా
బాదం పౌడర్‌ – 4 టేబుల్‌ స్పూన్లు 
నెయ్యి – ఉండ చేసేందుకు చేతులకు
బెల్లం లేదా పంచదార పాకం – కొద్దిగా

తయారీ..

  • ముందుగా ఒక బౌల్లో బ్రెడ్‌ పౌడర్, బాదం పౌడర్, ఓట్స్‌ పౌడర్, కచ్చాబిచ్చాగా చేసిన పల్లీలు, పిస్తా పేస్ట్‌ వేసుకుని.. కొద్దికొద్దిగా కొబ్బరి పాలు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి.

  • ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకుని.. ఆ ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని.. పక్కన పెట్టుకోవాలి.

  • ప్రతి లడ్డూకి.. బెల్లం లేదా పంచదార పాకంలో ముంచి.. పిస్తా పొడి పట్టించాలి. కాసేపు గాలికి ఆరనిచ్చి.. సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

ఇవి చదవండి: Sharvari Wagh: అది సినిమానా? ఓటీటీనా? టీవీ సీరియలా అని చూడను..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement