ఈ వంటకాలను ఎప్పుడైనా ట్రై చేశారా..! | Sakshi
Sakshi News home page

ఈ వంటకాలను ఎప్పుడైనా ట్రై చేశారా..!

Published Mon, Apr 29 2024 2:18 PM

Mealmaker Samosa Raw Banana Coconut Cutlet Recipe Making Procedure

మారుతున్న అభిరుచులనుబట్టి వంటకాలలో కూడా కొత్త కొత్త పద్ధతుల అనుసరిస్తున్నారు. ఆ పద్ధతులనుగుణంగా రుచులలో కూడా కొత్తదనం కనిపిస్తుంది. ఎన్నడూ ఇటువంటి కమ్మని రుచులను చూడలేదనే విధంగా సరికొత్త వంటలు ఎదురుపడుతున్నాయి. మరి ఆ విధానాలననుసరించి మనం కూడా తయారుచేద్దామా.. 

స్వీట్‌ కార్న్‌ రైస్‌ కేక్‌..

కావలసినవి..
స్వీట్‌ కార్న్‌ – 2 (మెత్తగా ఉడికించి.. చల్లారక గింజలు ఒలిచి పెట్టుకోవాలి); బియ్యప్పిండి – 2 కప్పులు; జొన్న పిండి– పావు కప్పు; గుడ్డు – తెల్లసొన (అభిరుచిని బట్టి); చీజ్‌ తురుము – కొద్దిగా; బటర్‌ – కొద్దిగా; పంచదార – ఒకటిన్నర కప్పులు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు); చిక్కటి పాలు – పావు లీటర్‌ (కాచి చల్లార్చినవి).

తయారీ..

  • ముందుగా  స్వీట్‌ కార్న్‌ గింజల్ని.. పాలతో కలిపి మిక్సీ పట్టుకోవాలి.

  • అందులోనే జొన్నపిండి, బియ్యప్పిండి, చీజ్‌ తురుము, బటర్‌ వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకోవాలి.

  • ఆ మిశ్రమం పలుచగా ఉంటే కొద్దిగా బియ్యప్పిండి, గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్‌లా చేసుకుని.. ఆ మిశ్రమాన్ని కేక్‌ బౌల్‌లో వేసుకుని బేక్‌ చేసుకోవాలి.

  • అనంతరం నచ్చినవిధంగా కట్‌ చేసుకుని తినొచ్చు.

  • లేదంటే.. క్రీమ్స్‌ సాయంతో బర్త్‌డే కేక్‌లా కూడా చేసుకోవచ్చు.

మీల్‌మేకర్‌ సమోసా..
కావలసినవి.. మీల్‌మేకర్‌ – పావు కప్పు (వేడి నీళ్లల్లో శుభ్రం చేసుకుని, ఉడికించి, చల్లారాక తురుములా చేసుకోవాలి); మైదా పిండి – పావు కిలో; రెడ్‌ చిల్లీ సాస్‌ – 1 టీ స్పూన్‌; సోయాసాస్‌ – 2 టీ స్పూన్లు; వాము – అర టీ స్పూన్‌; అల్లం – వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌; క్యాబేజీ తురుము, క్యారట్‌ తురుము, ఉల్లికాడ ముక్కలు – 3 టీ స్పూన్ల చొప్పున; మొక్కజొన్న పిండి – 1  టీ స్పూన్‌ (కొద్దిగా నీళ్లు కావాలి); ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ..

  • ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో మైదాపిండి, ఉప్పు, 1 టీ స్పూన్‌ నూనె వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ, ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

  • తర్వాత ఒక కళాయిలో నూనె వేసుకుని, వేడి కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించి.. అందులో క్యాబేజీ తురుము, క్యారట్‌ తురుము,  ఉల్లికాడ ముక్కలు, రెడ్‌ చిల్లీ సాస్, సోయా సాస్‌ వేసి బాగా వేయించాలి.

  • తర్వాత సరిపడా ఉప్పు, కొద్ది నీళ్లల్లో కలిపిన మొక్కజొన్న పిండి, మీల్‌ మేకర్‌ తురుము వేసుకుని.. గరిటెతో నిమిషం పాటు అటూ ఇటూ తిప్పి.. స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

  • మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలి.

  • పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల ఆ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసెయ్యాలి.

  • అలా తయారు చేసుకున్న సమోసాలను నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.

రా బనానా – కోకోనట్‌ కట్లెట్‌..
కావలసినవి.. కొబ్బరి కోరు – పావు కప్పు; అరటికాయ ముక్కలు – పావు కిలో (బాగా శుభ్రం చేసుకుని మెత్తగా ఉడికించి, చల్లారక ముద్దలా చేసుకోవాలి); అల్లం తరుగు – కొద్దిగా; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; పచ్చిమిర్చి – 3, పెరుగు – పావు కప్పు; గరం మసాలా – అర టీ స్పూన్‌; పసుపు  – పావు టీ స్పూన్‌; ఉప్పు – తగినంత, నూనె – సరిపడా;

తయారీ..

  • ముందుగా ఒక మిక్సీ బౌల్‌ తీసుకుని అందులో.. అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి.

  • ఈ మిశ్రమానికి తగినంత ఉప్పు, పసుపు, పెరుగు, గరం మసాలా, నిమ్మరసం, ఉడికించిన అరటికాయ గుజ్జు, కొబ్బరి కోరు వేసుకుని బాగా కలిపి.. ముద్దలా చేసుకుని.. కట్లెట్స్‌ చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి.

  • అభిరుచిని బట్టి వీటిలో కొన్ని ఇన్‌గ్రీడియంట్స్‌ కలుపుకోవచ్చు లేదా చేంజ్‌ చేసుకోవచ్చు.

ఇవి చదవండి: Beauty Tips: చూడటానికి ఇది ల్యాండ్‌ ఫోన్‌లాగా.. కానీ ఇదొక బ్యూటీ మసాజర్‌..!

Advertisement
Advertisement