ఒత్తిడి, చిరాకు ఎక్కువైనప్పుడు సహనం కోల్పోవడం, సహనం కోల్పోయినప్పుడు కేకలేయడం సహజం. కోపం వచ్చినప్పుడు కేకలేయడం ఆఫీసుల్లో అధికారంలో ఉన్నవాళ్లకు కుదురుతుందేమో గాని, సామాన్య ఉద్యోగులకు కుదరదు. పనిఒత్తిడి మితిమీరినప్పుడు సామాన్య ఉద్యోగులకు కూడా కోపతాపాలు రావడం సహజం.
ఆఫీసుల్లో కేకలేయలేని దుర్భర స్థితి వాళ్లది. మరి వాళ్లు తమ కోపాన్ని, అసహనాన్ని తీర్చుకోవడం ఎలా? కోపతాపాలను ఎక్కువకాలం అణచిపెట్టి ఉంచుకుంటే, తర్వాత రక్తపోటు నుంచి గుండెజబ్బుల వరకు నానా వ్యాధులకు లోనయ్యే పరిస్థితి దాపురిస్తుంది. కోపం తీర్చుకోవాలనుకునే వారికి ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి వేదికా లేదు.
ఈ లోటును తీర్చడానికే పారిస్‌లోని ‘అర్మాత్‌వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా తన అతిథులకు కోపం తీరేలా కేకలు వేసుకునే అవకాశం కల్పిస్తోంది. హోటల్ చుట్టూ 400 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ప్రైవేటు చిట్టడవిలో అతిథులు గొంతు చించుకుని కేకలు వేయవచ్చు. తమ కోపానికి కారణమైన వారిని తలచుకుని కసితీరా బూతులు తిట్టుకోవచ్చు. కోపావేశాలు చల్లబడేంత వరకు ఎవరి శక్తి మేరకు వాళ్లు ఇలా కేకలు వేసుకోవచ్చు.
ఈ ప్రక్రియను ‘అర్మాత్ వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా యాజమాన్యం ‘స్పా థెరపీ’గా చెబుతోంది. దీనివల్ల మనుషుల కోపావేశాలు చల్లబడి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని, తద్వారా వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఈ హోటల్ స్పా మేనేజర్ లోరెలా మోవిలియానో చెబుతుండటం విశేషం.
ఇవి చదవండి: 'పుష్పవజ్రమా'..! అదెలా ఉంటుంది అనుకుంటున్నారా?
Comments
Please login to add a commentAdd a comment