Lunch Box
-
వంద రూపాయలకే.. మూడు పూటల భోజనం
రూ.వందకు ఈ రోజుల్లో ఒక పూట భోజనం రావడమే కష్టం.. కర్రీ పాయింట్లలో మూడు రకాల కూరలు తీసుకుంటేనే రూ.50 నుంచి రూ.70 వరకు అవుతుంది. అలాంటిది ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం ఐదు రకాల కూరలు ఇంటికే సరఫరా చేస్తున్నారు ‘కృష్ణాస్ లంచ్ బాక్స్’ నిర్వాహకులు. వంట చేసుకోలేని ఒంటరివాళ్లు, వృద్ధులకు ఇది వరంగా మారుతోంది. తెనాలి: ఆయనో డెబ్భై ఏళ్ల వృద్ధుడు. భార్య మరణించింది. బిడ్డలు ఎక్కడో నగరంలో ఉద్యోగాల్లో ఉన్నారు. సొంతూరు వదిలి వెళ్లాలని లేని ఆయన ఓపిగ్గా తిరుగుతున్నా ఇంట్లో వంట చేసుకోలేని అశక్తత.. భార్యాభర్తలిద్దరూ వృద్ధులు.. బిడ్డలు ఈ దేశంలోనే లేరు. అక్కడకు వెళ్లలేరు. ఇక్కడ తిండితిప్పలూ సొంతంగా చేసుకొనే ఓపిక లేదు.. ఇలాంటివారు ఎందరికో ఆంధ్రాప్యారిస్ తెనాలిలో ‘కృష్ణాస్ లంచ్ బాక్స్’ అక్షయపాత్రగా మారింది. కేవలం వంద రూపాయలకు ప్రతిరోజూ ఠంఛనుగా సమయానికి మూడు పూటలా వండిన ఆహారాన్ని ఇంటికే సరఫరా చేస్తోంది. రెండున్నరేళ్ల క్రితం ఒక్కరితో ఆరంభం తెనాలి చెంచుపేటలోని అమరావతి ప్లాట్స్‌లో సాధారణ డాబా ఇంటిలో నడుస్తోందీ ‘కృష్ణాస్ లంచ్ బాక్స్’ సోమవారం 11 గంటల ప్రాంతంలో ఆ ఇంటికి వెళ్లగానే ఒక పక్క వంటలు వండుతున్నారు. వండిన వంటలను క్యారేజి బాక్సుల్లో సర్దుతున్నారు. వాటిని తీసుకెళ్లేందుకు డెలివరీ బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. లంచ్ బాక్స్ నిర్వాహకురాలు పరుచూరి లక్ష్మి. విద్యుత్ శాఖలో లైన్మెన్గా చేస్తున్న ఆమె కుమారుడు పవన్‌కుమార్, కోడలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీలేఖ ఆమెకు సహకారం అందిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం ఒక సహాయకుడితో కేవలం ఒక్కరికి భోజనం పంపటంతో ఆరంభించిన ఈ లంచ్ బాక్స్.. ఇప్పుడు 125 మందికిపైగా ఖాతాదారులకు రోజూ అందుతోంది. ఈ వినూత్నమైన ఆలోచన ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 మందికిపైగా ఉపాధి కలి్పస్తోంది. ఓ వృద్ధుడి అభ్యర్థనతో నాంది 2022లో కంటి శుక్లం తీయించుకున్న పెద్దాయన ఒకరు ‘తెలిసినవాళ్లు ఎవరైనా రెండువారాలు భోజనం పంపుతారేమో చూసిపెట్టండి’ అని చేసిన అభ్యర్థన కృష్ణాస్ లంచ్ బాక్స్‌కు నాంది పలికింది. దగ్గర్లోనే ఉండే పెద్దాయనకు మనం వండుకుందే పంపితే సరిపోతుందని అనుకున్నారు. ఆ విధంగా రోజూ తాము చేసుకున్న బ్రేక్‌ఫాస్ట్, భోజనం, రాత్రికి మరోసారి అల్పాహారం పంపుతూ వచ్చారు. కరోనాతో తల్లి చనిపోయిన ఇద్దరు అన్నదమ్ములు ఈ విషయం తెలిసి, ‘మాక్కూడా ఇవ్వొచ్చు కదా’ అని అడిగారు. దగ్గర్లోని వేర్‌హౌసింగ్ గిడ్డంగి దగ్గరకు వ్యాహ్యాళి కోసం వచ్చే పెద్దలు మేం కూడా తీసుకుంటాం అంటూ ముందుకొచ్చారు. ఆ విధంగా కృష్ణాస్ లంచ్ బ్యాక్స్‌ను విస్తరించినట్టు లక్ష్మి వెల్లడించారు. మెనూ ప్రకారమే.. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల్లోపు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం 12.30 గంటలలోగా కూరలు, రాత్రి 7.30గంటల కల్లా టిఫిన్ ఖాతాదారులకు పంపుతున్నారు. పట్టణంతోపాటు పరిసరాల్లోని 125 మందికిపైగా లంచ్ బాక్స్ మూడుపూటలా వెళుతోంది. ఏరోజు ఏ బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేదీ మెనూలో ఉంది. వారంలో మూడురోజులు ఇడ్లీ, మిగిలిన నాలుగురోజులు దోసె, వడ, పూరీ, పెసరట్టు, సాయంత్రం రెండు రోజులు చపాతి, మిగిలిన ఐదు రోజులు గోధుమరవ్వ ఉప్మా, సెట్ దోశ, సాంబారు ఇడ్లీ, ఊతప్పం పంపుతున్నారు. మధ్యాహ్నం రోటి పచ్చడి, ఇగురుకూర, గుజ్జుకూర/పప్పు, పప్పుచారు, రసం చొప్పున ఐదు రకాలను అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఆదివారం కూరలతోపాటు చికెన్ కూర, ఎగ్ పులుసు, చేపల పులుసులో ఏదో ఒకటి పంపుతారు. సమయానికి డెలీవరి.. ఆహారం సరఫరాకు ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలను సమకూర్చుకున్నారు. వాటిపై డెలివరీ బాయ్స్ ఇళ్లకు వెళ్లి ఇచ్చి వస్తుంటారు. బండి చెడిపోయి ఎక్కడన్నా ఆగిపోతే ఆ బాక్స్‌ను చేర్చటానికి ఇంట్లో మరో ఇద్దరు ప్రత్యామ్నాయంగా సిద్ధంగా ఉంటున్నారు. పెద్దవయసు వాళ్లు ఆకలికి ఆగలేరు. షుగర్, బీపీ వంటి మందులు వేసుకుంటారు. అందుకనే డెలివరీకి సమయపాలన పాటిస్తున్నట్టు నిర్వాహకురాలు లక్ష్మి వివరించారు. లాభార్జన కోసం చేయటం లేదుమేం వ్యాపారం చేస్తున్నామని అనుకోవటం లేదు. మానవత, సేవా దృష్టితోనే చేస్తున్నాం. పెద్దలను దృష్టిలో ఉంచుకుని వంటకాల్లో మసాలాలు వాడటం లేదు. ఉప్పూ, కారం తక్కువగానే ఉంటాయి. పెద్దలు రైస్‌ను ఇంట్లోనే కుక్కర్లో వండుకుంటున్నారు. తప్పనిసరి అంటే రైస్ కూడా పంపుతున్నాం. – పరుచూరి లక్ష్మి, నిర్వాహకురాలు -
ఈ టేస్టీ స్నాక్స్‌తో.. స్కూల్ లంచ్ బాక్సుకి రెడీ అయిపోండి..!
క్యాలెండర్ పేజీ తిప్పమంటోంది. జూన్‌కి స్వాగతం పలకాల్సిందే. కొత్త టైమ్‌టేబుల్‌నీ స్వాగతించాల్సిందే. లంచ్ బాక్సు... స్కూల్‌కి రెడీ అయిపోతుంది. పిల్లలు సాయంత్రం వచ్చేటప్పటికి ఏం చేయాలి? ఇవిగో వీటిని మన వంటింట్లో ట్రై చేయండి..బ్రెడ్ పొటాటో రోల్..కావలసినవి..బంగాళదుంపలు– 3 (మీడియం సైజువి);క్యారట్ తురుము లేదా పచ్చి బఠాణీలు – అర కప్పు ;మిరప్పొడి– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;పసుపు – చిటికెడు;నిమ్మరసం –పావు టీ స్పూన్;కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;బ్రెడ్ స్లయిస్‌లు – 10;వెన్న – టేబుల్ స్పూన్ – 2 టేబుల్ స్పూన్లు;పాలు– అర కప్పు; మొక్కజొన్న పిండి లేదా మైదా లేదా శనగపిండి– 2 టేబుల్ స్పూన్లు (బ్రెడ్ స్లయిస్‌లను రోల్ చేసి అతికించడానికి).తయారీ..బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించాలి. వేడి తగ్గిన తరవాత తొక్క తీసి చిదిమి ఒకపాత్రలో వేసుకోవాలి.క్యారట్ లేదా బఠాణీలను ఉడికించి పక్కన పెట్టాలి.ఇప్పుడు చిదిమిన బంగాళదుంప గుజ్జులో మిరప్పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కొత్తిమీర, నిమ్మరసం, ఉడికించిన క్యారట్ లేదా బఠాణీలను వేసి సమంగా కలిసే వరకు వేళ్లతో చిదమాలి.ఉప్పు, కారం సరి చూసుకుని అవసరమైతే మరికొంత చేర్చుకోవచ్చు.ఈ మిశ్రమాన్ని పది సమభాగాలుగా చేయాలి. ఒక్కో భాగాన్ని ఓవల్ షేప్ (దొండకాయ ఆకారం)లో చేయాలి.బ్రెడ్ అంచులు కట్ చేసి తీసేసిన తర్వాత బ్రెడ్ స్లయిస్‌ని పూరీల పీట మీద పెట్టి రోలర్‌తో వత్తాలి.ఇలా చేయడం వల్ల గుల్లబారి ఉన్న బ్రెడ్ చపాతీలాగ పలుచగా వస్తుంది.పాలలో బ్రష్ ముంచి ఈ స్లయిస్ల మీద చల్లాలి లేదాపాలలో వేళ్లు ముంచి బ్రెడ్ స్లయిస్ మీద చల్లి తడిపొడిగా ఉండేటట్లు మునివేళ్లతో అద్దాలి.బ్రెడ్ చివర్లు అతికించడం కోసం తీసుకున్న పిండిలో నీరుపోసి గరిట జారుడుగా కలుపుకోవాలి.ఇప్పుడు బ్రెడ్ స్లయిస్ మీద బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి అంచులకు పిండి ద్రవాన్ని అద్దుతూ అతికిస్తే బ్రెడ్‌రోల్ రెడీ.వీటిని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. బయటే ఉంచినప్పుడు ఒకవేళ కాల్చడం ఆలస్యం అయితే బ్రెడ్ అంచులు ఎండిపోయి రోల్ ఊడిపోతుంది.పెనం వేడి చేసి వెన్న రాసి బ్రెడ్ రోల్స్‌ను ఒకదాని పక్కన ఒకటిగా అమర్చాలి. దోరగా కాలేకొద్దీ మరొక వైపుకు తిప్పుతూ అన్ని వైపులా కాలేటట్లు చూడాలి.పెనం మీద కాల్చినప్పుడు నూనెలో రోస్ట్ చేసినట్లు రోల్ అంతా సమంగా ఒకే రంగులో ఉండదు. కానీ లోపల మిశ్రమం ఉడికిపోతుంది. రోల్ పై భాగం కరకరలాడుతూ రుచిగా ఉంటుంది.మొత్తంగా ఒకేరంగులో ఉండాలంటే బాణలిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి మరిగించి అందులో నాలుగు రోల్స్ వేసి అవి కాలిన తర్వాత మరికొన్ని వేస్తూ కాల్చుకోవచ్చు.ఇలా చేసినప్పుడు నూనెలో నుంచి తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేస్తే అదనంగా ఉన్న నూనెను పేపర్ పీల్చుకుంటుంది.ఒవెన్‌లో అయితే... 200 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేసి బేకింగ్ ట్రేలో రోల్స్‌ను అమర్చి పది నుంచి పన్నెండు నిమిషాల సేపు బేక్ చేయాలి.చీజ్ బాల్స్..కావలసినవి..బంగాళదుంపలు –పావు కేజీ;వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్;ఉప్పు –పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి;రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదా పచ్చిమిర్చి తరుగు లేదా మిరప్పొడి – అర టీ స్పూన్;మిరియాల పొడి –పావు టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;బ్రెడ్ క్రంబ్స్ – 6 టేబుల్ స్పూన్లు;నూనె – వేయించడానికి తగినంత.స్టఫింగ్ కోసం.. చీజ్ – 100 గ్రాములు;ఎండిన పుదీన – అర టీ స్పూన్ (ఆకులను అరచేతిలో వేసి వేళ్లతో నలిపి పొడి చేయాలి);రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదా పచ్చిమిర్చి తరుగు లేదా మిరప్పొడి –పావు టీ స్పూన్;మిరియాల పొడి–పావు టీ స్పూన్, గరం మసాలా పొడి– చిటికెడు.కోటింగ్ కోసం.. కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు;ఎగ్ – ఒకటి (ఎగ్ వేయనట్లయితే మరో 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలి);బ్రెడ్ క్రంబ్స్– అర కప్పు.తయారీ..బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించి, వేడి తగ్గిన తర్వాత తొక్క తీసి చిదమాలి.అందులో వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, బ్రెడ్ క్రంబ్స్ వేసి సమంగా కలిసేటట్లు చిదిమి ఒకసారి రుచి చూసుకుని అవసరమైతే ఉప్పు, కారం కలుపుకుని మిశ్రమం మొత్తాన్ని బాల్స్ చేసి ఆరిపోకుండా ఒక గిన్నెలో వేసి మూత పెట్టుకోవాలి.స్టఫింగ్ కోసం తీసుకున్న వాటిలో చీజ్ తప్ప మిగిలిన అన్నింటినీ ఒకపాత్రలో వేసి కలపాలి. అందులో చీజ్ ని అర అంగుళం ముక్కలుగా కట్ చేసి వేసిపాత్రను కొద్దిగా కదిలిస్తూ మసాలా పొడులు చీజ్ ముక్కలకు పట్టేలా చేసి వేడి తగలకుండా స్టవ్‌కు దూరంగా ఉంచాలి.ఇప్పుడు బంగాళదుంప బాల్స్ ఒక్కొక్కటిగా తీసుకుని అరచేతిలో పెట్టి వేళ్లతో చిన్న పూరీలా వత్తి అందులో మసాలా పట్టించిన చీజ్ ఒక ముక్క పెట్టి బంగాళాదుంప మిశ్రమం పూరీ అంచులను మూసేస్తూ బాల్ చేయాలి.ఇలా అన్నింటినీ చేసిన తర్వాత ఒక ప్లేట్లో కార్న్‌ఫ్లోర్ వేసి అందులో ఒక్కో బాల్ని వేస్తూ మెల్లగా వేళ్లతో కదిలిస్తూ పిండి అన్ని వైపులా సమంగా పట్టేటట్లు చేయాలి.మరొక ప్లేట్లో బ్రెండ్ క్రంబ్స్ వేసుకుని కార్న్‌ఫ్లోర్ పట్టించిన బాల్స్‌ని వేసి అన్ని వైపులా సమంగా పట్టేటట్లు చేయాలి.కోడిగుడ్డు సొనను ఒక గిన్నెలో వేసి గిలక్కొట్టాలి.ఎగ్ వాడనట్లయితే రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ను తగినంత నీటితో గరిటజారుడుగా కలుపుకోవాలి.పొడి కార్న్‌ఫ్లోర్ పట్టించిన బంగాళాదుంప– చీజ్ బాల్స్‌ని కార్న్‌ఫ్లోర్ ద్రవం లేదా కోడిగుడ్డు సొనలో ముంచి తీసి పదినిమిషాల సేపు ఆరనివ్వాలి.ఈ లోపు బాణలిలో నూనె వేడి చేయాలి. ఒక్కో బాల్‌ను జాగ్రత్తగా నూనెలో వేసి మీడియం మంట మీద బాల్ అన్ని వైపులా సమంగా కాలిన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.బాల్స్ మీద టిష్యూ పేపర్ని కప్పి ఉంచితే అదనపు ఆయిల్ వదులుతుంది.బంగాళాదుంప– చీజ్ బాల్స్‌ని టొమాటో సాస్ లేదా కెచప్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.ఇవి చదవండి: చూపులను కట్టడి చేసేలా! -
బస్సులోనే కేసీఆర్ భోజనం.. వడ్డించింది ఎవరంటే?
సాక్షి, ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్నారు. బోనకల్ మండలంలోని రామపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల జిల్లాలో కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అయితే, ఖమ్మం పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ బస్సులోనే ఆహారం తీసుకున్నారు. హెలిప్యాడ్ వద్ద బస్సులో కూర్చున్న సీఎం కేసీఆర్.. పులిహోర తిన్నారు. పర్యటన సందర్భంగా షెడ్యూల్ బిజీగా ఉండటం కారణంగా సమయం వృథా కాకుడదనే ఉద్దేశ్యంతో కేసీఆర్ సహా మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు బస్సులోనే భోజనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు సీట్లో కూర్చుని పులిహోర, పెరుగన్నం, అరటిపండు తిన్నారు. ఆయన వెనుక సీట్లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ నేతలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి, సెక్రటరీ టు సీఎం స్మితా సబర్వాల్ సహా ఇతర అధికారులు భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బస్సులో ఉన్న నేతలకు, అధికారులకు పులిహోర వడ్డించారు. ఈ క్రమంలో సరదాగా ముచ్చటించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లా పర్యటన సందర్బంగా రైతులకు సీఎం కేసీఆర్ కీలక హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రైతులతో సమావేశం నిర్వహించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా.. ఇటీవల కురిసిన వడగంట్ల వానల కారణంగా నాలుగు జిల్లాల్లోని పంటలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. -
డబ్బావాలాల కొత్త వ్యాపారం సెంట్రల్ కిచెన్
సాక్షి, ముంబై: కరోనా కారణంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న ముంబై డబ్బావాలాలు ప్రత్యామ్నాయ వేటలో పడ్డారు. అందులో భాగంగా ‘డబ్బావాల సెంట్రల్ కిచెన్’అనే కొత్త పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాలని ముంబై డబ్బావాలాలు నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. కొత్త వ్యాపారం ద్వారా ప్రతీరోజు సుమారు 70 వేల వినియోగదారులకు భోజన సౌకర్యం కల్పించనున్నారు. 130 ఏళ్ల నుంచి లంచ్ బాక్స్‌లు చేరవేత మేనేజ్మెంట్ గురుగా పేరు సంపాదించుకున్న ముంబై డబ్బావాలాలు స్వాతంత్య్రానికి ముందు అంటే సుమారు 130 ఏళ్ల నుంచి ముంబైలోని వివిధ కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు లంచ్‌బాక్స్‌లు చేరవేస్తున్నారు. ఇదివరకు లంచ్ బాక్స్‌లు తారుమారైన సంఘటనలు లేవు. కార్యాలయాల్లో లంచ్ టైమ్‌కు ముందే ఉద్యోగుల చెంతకు లంచ్ బాక్స్‌లు చేరవేసేవారు. క్రమశిక్షణలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కాని కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం 2020 మార్చిలో లాక్డౌన్ అమలు చేసింది. అప్పటి నుంచి ముంబై డబ్బావాలాల వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. చదవండి: (భార్య చనిపోతే.. మరో కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు..) కార్యాలయాలన్నీ మూసివేయడంతో ఉపాధి కరువైంది. అనేక డబ్బావాలాల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. గత్యంతరం లేక కొందరు సెక్యూరిటీ గార్డులుగా మారారు. మరికొందరు మంది స్వగ్రామాలకు తరలిపోయి అక్కడ వ్యవసాయ కూలీలుగా, మరికొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు. అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఎవరు, ఎక్కుడున్నారో తెలియదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఆంక్షలు వి«ధించడంతో ఎవరు, ఎçప్పుడు విధులకు వస్తున్నారో తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో డబ్బావాలాలకు ఇప్పటికీ ఉపాధి లేకుండా పోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేసి ఉపాధి పొందాలని నిర్ణయం తీసుకున్నారు. -
భర్తపై ఎనలేని ప్రేమ.. 41 ఏళ్లుగా
టెక్సాస్ : నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఓ భార్య. తన భర్త అన్న చిన్న మాటను ఆలోచనగా మలిచి 41 ఏళ్లుగా ప్రేమను లంచ్ రూపంలో పంచిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌కు చెందిన ట్రేసీ హౌవెల్‌కు క్లిపొర్డ్ అనే వ్యక్తితో 41ఏళ్ల క్రితం వివాహం అయింది. మొదటి రోజు నుంచి ఆఫీసుకు వెళ్లే తన భర్తకు లంచ్ బాక్స్ తయారుచేసేది. ఓ రోజు భర్తతో పాటు ఆఫీసుకు వెళ్లిన ఆమె అతడితో కలిసి భోజనం చేసింది. ఆ తర్వాత ఆమె భర్త ‘మనం ప్రేమించే వారితో కలిసి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది’ అని అన్నాడు. దీంతో ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. ( వైరల్: నీ భార్యను ఆ దేవుడే కాపాడాలి..) ఆ తర్వాతినుంచి అతడి కోసం లంచ్ బాక్స్ తయారుచేసిన తర్వాత అందులోంచి ఓ కొంత ఆమె తినేది. ఎవరో తన ఆహారాన్ని తిన్నారని భర్త చెప్పగా.. ‘నీతో కలిసి భోజనం చేయలేకపోతున్నందుకు నేనే అందులోంచి కొంత తిన్నాను’ అని అంది. అతడికి విషయం అర్థమైంది. అలా 41 ఏళ్లుగా చేస్తూనే ఉంది. కొద్దిరోజుల క్రితం ఫేస్బుక్ వేదికగా తన అనుభవాలను పంచుకుంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. ఆమె పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( ఓ అజ్ఞాత వాసి నీ వివరాలు పంపు!) -
పోలీస్ భార్య ప్రేమ
కర్ణాటక,బనశంకరి: ఆదివారం కరోనా కర్ఫ్యూ సమయంలో భర్తకు భోజనం బాక్స్‌ను అందించడానికి ఓ పోలీసు భార్య ఆరుకిలోమీటర్లు నడిచివెళ్లిన ఘటన బెళగావిలో చోటుచేసుకుంది. ఆదివారం లాక్డౌన్ వల్ల హోటళ్లన్నీ బంద్ అయ్యాయి. బెళగావి దక్షిణ ట్రాపిక్ పోలీస్‌స్టేషన్‌లో అలీఖాన్ అనే కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. ఎన్డీ కోట సర్కిల్లో విధుల్లో ఉన్నాడు. ఏపీఎంసీ యార్డులో కుటుంబం నివసిస్తోంది. రెండు ప్రాంతాల మధ్య ఆరుకిలోమీటర్ల దూరం ఉంది. భోజనం తేవాలని భార్యకు ఫోన్ చేయగా, ఆమె ఆటోల కోసం చూసినా ఏవీ దొరకలేదు. దీంతో నడుచుకుంటూ క్యారియర్ తీసుకొచ్చి భర్తకు అందజేసింది. దీంతో అలీఖాన్ భార్య ప్రేమ పట్ల ఉబ్బితబ్బిబ్బయ్యాడు. లాక్డౌన్ సమయంలో మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతానని చెప్పాడు. -
హెల్దీ టేస్టీ లంచ్ బాక్స్
ఇక వచ్చే వారం నుంచి మళ్లీ పిల్లలకు స్కూళ్లు మొదలవ్వబోతున్నాయి. వేసవి సెలవుల వల్ల ఇప్పటివరకూ ఇంట్లోనే కళ్ల ముందు ఉన్న పిల్లలు నేడో రేపో బడికి వెళ్లక తప్పదు. బాక్స్ కట్టి ఇచ్చినా అక్కడ వాళ్లేం తింటారో ఎలా తింటారో అసలు తింటారో లేదో అన్న బెంగ తల్లులకు వారం రోజుల ముందునుంచే మొదలైపోతుంది. ఇప్పటివరకూ ఇంట్లో ఉంటేనే ఎన్నోసార్లు బతిమిలాడితేగానీ పిల్లలు ఇంతన్నా తినరు. అలాంటి ఆ లంచ్ టైమ్‌లో ఎంత తింటారో తెలియదు. అందుకే స్కూల్ మొదలయ్యాక... మన ఎదిగే పిల్లలకు పోషకాలేమీ మిస్ కాకుండా ఇవ్వాల్సిన ఆహారం ఎలా ఉండాలో తెలుకునేందుకే ఈ కథనం. స్కూలుకు బయలుదేరేముందు పిల్లలు చాలా హడావుడిగా ఏదో తినేస్తుంటారు. బడికి టైమ్ అవుతుందన్న తొందరలో ఇంత నోట్లో వేసుకొని బయలుదేరుతారు. పైగా చాలా స్కూళ్లు ఎనిమిదింటికల్లా మొదలైపోతుంటాయి. దాంతో పిల్లలు నింపాదిగా, నిమ్మళ్లంగా తినడానికే టైమ్ ఉండదు. అయితే స్కూల్‌కు వెళ్లే ముందర కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం పిల్లలకు చాలా మేలు చేస్తుంది. వాళ్లు ఆరోగ్యకరంగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు... అలా పొద్దున్నే టిఫిన్ తిన్న పిల్లల్లో ఏకాగ్రత, విజయసాధన అవకాశాలు చాలా ఎక్కువని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. వివిధ వయసుల్లోని స్కూలు పిల్లలకు ఏయే పోషకాలు అవసరమో తెలుసుకుందాం. ప్రోటీన్ ఇవ్వడం మరవద్దు రోజును మంచి ప్రోటీన్‌తో ప్రారంభించడం పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. ఎదిగే వయసు పిల్లల విషయంలో ప్రోటీన్లను ‘బిల్డింగ్ బ్లాక్స్’గా చెబుతుంటారు ఆహార నిపుణులు. అంటే భవన నిర్మాణానికి ఇటుకలు ఎలాగో... శరీర నిర్మాణానికి ప్రోటీన్లు అలాగన్నమాట. పైగా ప్రోటీన్లు మన కండరాల్లో అయిన గాయాలను ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తుంటాయి.అందుకే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పిల్లలకు ప్రోటీన్లు పుష్కలంగా ఉండే గుడ్డు పెట్టవచ్చు. దాంతోపాటు వెన్న, పెరుగు వంటి వాటిల్లోనూ ప్రోటీన్ ఎక్కువగానే ఉంటుంది. అలాగే పప్పులో కూడా ప్రోటీన్ ఎక్కువ. అందుకే పూరీ/చపాతీతో పాటు పప్పు లేదా శనగల వంటివి ఇవ్వడం వల్ల అటు పూరీ/చపాతీలోని కార్బోహైడ్రేట్లతో పాటు ఇటు పప్పు, శనగలు, గుడ్డు వంటి వాటి నుంచి ప్రోటీన్ కూడా సమకూరుతుంది. స్కూల్ నుంచి రాగానే... పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారికి ‘‘పవర్’’ శ్నాక్స్ ఇవ్వడం మంచిది. అంటే ఇందులో భాగంగా పొట్టు తీయని ధాన్యంతో తయారు చేసిన బ్రెడ్ ముక్కలకు వెన్న, చీజ్ వంటివి పుష్కలంగా రాసి, ఆ బ్రెడ్ ముక్కల మధ్యన తాజా ఆకుకూరలు, కీర, టొమాటో వంటి కాయగూరలు నింపి శాండ్విచ్లు తయారు చేసి ఇవ్వాలి. వీటితో పాటు అరటిపండ్లు ఇవ్వడం మంచిది. పిల్లలు స్కూల్ల్లో బాగా ఆటలాడి వచ్చినా లేదా స్కూల్ నుంచి రాగానే ఆటలకు వెళ్లాలనుకున్నా ఈ తరహా శాండ్విచ్లు వారికి అవసరమైన పోషకాలను, తక్షణ శక్తిని ఇస్తాయి. రాత్రి వేళలో ద్రవాహారాలు ఇవ్వండి పిల్లల రాత్రి భోజనం సమయంలో వారికి ద్రవాలు ఎక్కువగా ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఉదయం నుంచి స్కూలుకు వెళ్లడం, ఆటలాడటం వంటి కార్యకలాపాలతో వారు చేసిన శారీరక శ్రమ వల్ల వారు కోల్పోయిన వారి ఒంట్లోని లవణాలు, ద్రవాలు మళ్లీ భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల లంచ్‌బాక్స్ ఎలా ఉండాలంటే... పిల్లలు స్కూల్లో దాదాపుగా ఒక పూట లేదంటే రెండు పూటలు తింటారు. ఆ బాక్స్ ఈ కిందివిధంగా ఉండటం వారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.పిల్లల లంచ్–బాక్స్ ఎలా ఉండాలనేందుకు చాలా సింపుల్ ఫార్ములా ఉంది. అదేమిటంటే... వారి లంచ్‌బాక్స్‌లో సగం... రంగురంగుల తాజా పండ్ల ముక్కలతో నింపండి. (ఇందులో కనీసం రెండు నుంచి మూడు రకాలు ఉండాలి). ఆ తర్వాత మరో పావు భాగం దంపుడు బియ్యం (పాలిష్ చేయని బియ్యం)తో వండిన అన్నం లేదా పొట్టు తీయని ధాన్యాలతో చేసిన చపాతీలు నింపండి. ఇక మిగతా పావు భాగాన్ని ప్రోటీన్ పుష్కలంగా ఉండే కూరలతో నింపండి. అంటే శాకాహారులైతే బీన్స్, కిడ్నీ–బీన్స్, ఛోలే వంటి వాటితో వండిని కూరలు గానీ... మాంసాహారులైతే చికెన్, చేపలతో వండిన కూరలను ప్రతిరోజూ మార్చి మార్చి వారికి ఇస్తుండాలి. ఇక వారు రోజూ తగినన్ని నట్స్ కూడా తినేలా చూడాలి. ఇక అన్నం, చపాతీలకు బదులుగా తమకు అందుబాటులో ఉన్నవారు హోల్‌గ్రెయిన్ పాస్తా, క్వినోవా వంటి వాటినీ వండి ఇవ్వవచ్చు. ►అరబాక్స్ పండ్లలో ఏమేం ఉండాలంటే... తాజా ద్రాక్ష, ఆపిల్స్, పుచ్చపండు ముక్కలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, అరటిపండ్లు వంటివి ►రంగురంగుల పచ్చికాయగూరల్లో... క్యారట్, దోస, కీర, బ్రాకలీ, బెల్‌పెప్పర్ (బెంగుళూరు మిర్చీల పేరిట ఇవి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగుల్లో లభ్యమవుతుంటాయి), టొమాటోల వంటి వాటిని ముక్కలుగా కోసి పండ్ల ముక్కలతో పాటు కలిపి కొన్ని ఇవ్వాలి ►ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలివే... బీన్స్, శనగలు, పీనట్ బటర్, చికెన్, చేపలు, ఉడకబెట్టిన గుడ్లు ►ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఏమిటంటే... పొట్టు తీయని పాస్తా, పొట్టు తీయని ధాన్యాలతో చేసిన బ్రెడ్, ముడిబియ్యంతో వండిన అన్నం, ఓట్స్ వంటివి ►ద్రవాహారాలుగా పాల ఉత్పాదనలివి... పాలు, ఫ్లేవర్డ్ మిల్క్, పెరుగు, వెన్న, కాటేజ్ చీజ్, సోయా పాలు, (అందుబాటులో ఉన్నవారు సోయా యోగర్ట్ వంటివి తీసుకోవచ్చు). వీటిలో పిల్లల ఎముకలను బలంగా చేయడానికి, వారు ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడే క్యాల్షియమ్, విటమిన్–డి పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్లు కూడా ఉండనే ఉంటాయి. ఇక పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వారికి మీరే భోజనం ఎలాగూ పెడతారు. వారు ఇంట్లో ఉన్నప్పుడు తక్కువ మోతాదుల్లో వీలైనన్ని ఎక్కువ సార్లు మీరు ఇంట్లో తినే ఆరోగ్యకరమైన భోజనం పెట్టండి. వేర్వేరు వయసుల పిల్లలకు లంచ్ బాక్స్ ఇలా... మూడున్నర ఏళ్ల నుంచి ఆరేళ్ల పిల్లల లంచ్‌బాక్స్ : ఇప్పుడు పిల్లలు మూడున్నర ఏళ్ల నుంచే ప్రీ–స్కూల్ అంటూనో, ఎల్కేజీ, యూకేజీ అంటూనో స్కూలుకు వెళ్తున్నారు. ఆ వయసు నుంచి ఆరేళ్ల లోపు వారి లంచ్ బాక్స్ ఈ కింద ఉన్న పదార్థాలతో ఉండటం మంచిది. వారి బాక్స్‌లో పొట్టు తీయని ధాన్యాలతో చేసిన రొట్టెలు (రోటీ–పప్పు), ముడిబియ్యంతో వండిన అన్నం (దాల్–చావల్), శాండ్విచ్ పరాఠాలు వంటివి ఇవ్వవచ్చు. ఈ వయసు పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కొన్ని ఆప్షన్స్ చూద్దాం 1 క్యారట్ రైస్ + బీన్స్ కూర + ఆకుకూరలతో చేసిన కూర+ పెరుగు + పండ్లు 2 పాలక్ రైస్ + పప్పు (1 కప్పు) + ఏదైనా ఆకుకూర/కాయగూర (1 కప్పు) + పెరుగు + పండ్లముక్కలు 3 బీట్రూట్ రోటీ + ఏదైనా ఆకుకూర/కాయగూర (ఒక కప్పు) + ఒక ఉడకబెట్టిన గుడ్డు + పెరుగు + పండ్లముక్కలు 4 మిక్స్డ్ వెజిటబుల్ రైస్ గ్రీన్‌పీస్ పనీర్ కూర లేదా చిక్కుళ్ల వంటి ప్రోటీన్ కూర + పెరుగు + పండ్ల ముక్కలు. 6 – 12 ఏళ్ల పిల్లల లంచ్ బాక్స్: ఈ పిల్లల్లో ఎదుగుదల చాలా వేగంగా జరగుతుంటుంది. వాళ్లకు అవసరమైన రోజువారీ శక్తి (ఎనర్జీ) కూడా ఎక్కువే. ఈ రెండు అవసరాలు తీరేలా వారి ఆహారం ఉండాలి. వారి ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు ఎక్కువగా ఉండాలి. అయితే వారికి చాలా ఎక్కువ శక్తి అవసరం కాబట్టి వారి ఆహారంలో అధిక క్యాలరీలను ఇచ్చే ఆరోగ్యకరమైన పదార్థాలే ఉండాలి తప్ప... ఎక్కువ క్యాలరీలను ఇచ్చే చక్కెర పదార్థాలు (కోలా డ్రింక్స్‌లో ఉండే షుగర్స్ వంటివి), చెడు కొవ్వు పదార్థాలు (ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వాడే మార్జరిన్ వంటి నూనెలతో చేసిన పదార్థాలు) ఉండకూడదు. అందుకే వారికి సాఫ్ట్‌డ్రింక్స్, చిప్స్, క్యాండీలు, తియ్యటి డెజర్ట్స్ చాలా తక్కువగా/పరిమితంగా మాత్రమే ఇవ్వాలి. ఎప్పుడో ఒకసారి రుచికోసం మాత్రమే ఇవి అని వారు గుర్తుంచుకునేలా వారికి మంచి ఆహారపు అలవాట్లను మప్పాలి. ఈ వయసు పిల్లల్లో ముడి బియ్యం, పొట్టుతీయని ధాన్యాలతో వండిన పదార్థాల వల్ల వారికి కార్బోహైడ్రేట్లతో పాటు పీచుపదార్థాలు, విటమిన్–బి కాంప్లెక్స్ వంటివి దొరుకుతాయి. ఇక తాజా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల నుంచి విటమిన్–ఏ, విటమిన్–సి, పొటాషియమ్, పీచుపదార్థాలు లభ్యమవుతాయి. అందుకోసం వారి రాత్రి భోజనంలో అన్నంతో పాటు కరకర నమిలి తినే క్యారట్లు, ఆపిల్స్ ఇవ్వాలి. డిన్నర్లో వారి కూరల్లో బ్రాకలీ, బెల్‌పెప్పర్, మొక్కజొన్న గింజలు, గ్రీన్‌సలాడ్స్ అందేలా చూడాలి. ఆరెంజ్ వంటి తాజా పండ్లు ఇవ్వాలి. పిల్లల ఎదిగే అవసరాల కోసం క్యాల్షియమ్, పొటాషియమ్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ వంటివి బాగా అందేలా చూడాలి. ఇందుకోసం వీలైతే మూడు పూటలా లేదా కనీసం రెండు పూటలా పాలు, పాల ఉత్పాదనలు తీసుకునేలా చూడాలి. ఒకవేళ పాలు తాగని వారు సోయామిల్క్, సోయా పెరుగు, క్యాల్షియమ్ సెట్ టోఫూ తీసుకునేలా చూడాలి.వారి ప్రోటీన్ అవసరాల కోసం కొవ్వు తక్కువగా ఉండే చికెన్, తాజా చేపల కూర, బీన్స్, నట్స్, ఇవ్వాలి. అలాగే ఆ మాంసాహారం వల్లనే వారికి ఐరన్, జింక్‌తో పాటు బి–విటమిన్‌లోని బి12 వంటివీ సమకూరతాయని గుర్తుంచుకోండి. ఈ వయసులోని పిల్లలకు వారంలో వీలైనన్ని సార్లు గుడ్లు ఇవ్వవచ్చు. రోజుకో గుడ్డు తప్పక ఇవ్వడమూ వారికి మేలు చేస్తుంది. అలాగే ఈ వయసు పిల్లలు ఆటలు ఎక్కువ ఆడతారు. కాబట్టి వారు తరచూ వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగేలా చూసుకోవాలి ఈ వయసులో పిల్లలు చాలా వేగంగా ఎదుగుతుంటారు. వాళ్ల ఎదుగుదలకు తగ్గట్లుగా పోషకాలు అందేలా వాళ్ల లంచ్ బాక్స్ ఉండాలి. ఒకవేళ అన్ని పోషకాలు అందక వాళ్ల ఎదుగుదల తగినంత వేగంగా జరగకపోయినా లేదా అనీమియా వంటి లోపాలు కనిపించినా డాక్టర్ సలహాలతో న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వాడటం మంచిది. ఎందుకంటే ఈ వయసులో ఆహార లోపాలవల్ల భవిష్యత్తులో వాళ్లకు హార్మోన్ సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 13–18 ఏళ్ల పిల్లల లంచ్‌బాక్స్... ఈ వయసు పిల్లల్లో పెరుగుదల చాలా ఎక్కువ. పైగా మిగతా అన్ని దశలతో పోలిస్తే ఆహారం, పోషకాల అవసరం ఈ దశలో చాలా ఎక్కువ. ఫ్రెండ్స్ ప్రభావాలతో ఆహారపు అలవాట్లు మారిపోయే అవకాశం కూడా ఉంది. తమ స్నేహితులతో కలిసి తినేందుకు వారు లంచ్ బాక్స్‌ను కూడా స్కిప్ చేస్తుంటారు. ఇలాంటి వారు జంక్‌ఫుడ్‌కు అలవాటు పడే ప్రమాదం ఉంది. స్వీట్స్, బాగా ప్రాసెస్ చేసిన ఆహారం, వేపుళ్లు, ఫాస్ట్ఫుడ్స్ వైపు మొగ్గుచూపి ఆరోగ్యకరమైన ఆహారానికి దూరమయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. చిప్స్, పిజ్జా, బర్గర్స్కు సాధ్యమైనంత దూరంగా ఉంచి అన్ని రకాల ఆకూకూరలు, కూరగాయలు, మాంసాహారంతో ఆరోగ్యకరమైన సమతుల ఆహారం అందేలా చూడాలి. 6–12 ఏళ్ల పిల్లలకు ఇచ్చే ఆహారాలే మరింత ఎక్కువ మోతాదుల్లో వీరి లంచ్‌బాక్స్‌లో ఉండాలి. ఈ వయసు పిల్లలు లంచ్ బాక్స్ తీసుకెళ్లేలా పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలి. ఏయే ఆహారాలలో ఎన్నెన్ని క్యాలరీలు ►ఆరు అంగుళాల వ్యాసంతో ఉన్న రోటీలో దాదాపు 85 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు దాదాపు 0.5 గ్రాముల వరకు ఉంటాయి ►150 గ్రాముల మినప్పప్పులో 154 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు 6 గ్రాముల వరకు ఉంటాయి ►150 గ్రాముల శనగలు / రాజ్మా లో 153 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు 5 గ్రాముల వరకు ఉంటాయి ►150 గ్రాముల మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ (కూరలో) 142 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 15 గ్రాముల కొవ్వులు ఉంటాయి. (ఈ కొవ్వుల పాళ్లు కూర కోసం వాడిన నూనె పరిమాణం మీద ఆధారపడిఉంటాయి) ►100 గ్రాముల చికెన్ కర్రీలో 300 క్యాలరీలు ఉంటాయి. ఇందులో 15–35 గ్రాముల కొవ్వుల వరకు ఉండవచ్చు. (ఇది స్కిన్‌తో ఉన్న చికెనా, స్కిన్లెస్నా, ఇక అందులో వాడిన నూనె ఎంత అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది) ∙ఒక సాధారణ ప్లెయిన్ దోశ లో 125 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 3 గ్రాముల కొవ్వు ఉంటుంది ∙రెండు సాధారణ సైజ్ ఇడ్లీల్లో 132 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 3 గ్రాముల కొవ్వు ఉంటుంది ∙100 గ్రాముల పెరుగన్నం (కర్డ్ రైస్)లో 190 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు దాదాపు 7 గ్రాముల ఉంటాయి ∙100 కోకోనట్ రైస్‌లో 369 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 15 గ్రాముల కొవ్వు ఉంటుంది. కంటి నిండా నిద్ర పోనివ్వండి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని, ఈ వయసులోనే కష్టపడాలంటూ ఉదయం చాలా త్వరగా నిద్రలేపేస్తుంటారు. ఎదిగే వయసులోని ఏ పిల్లలైనా సరే... ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోయేలా చూడండి. ఆ నిద్రే లేకపోతే వారు చదివేదంతా మెదడులో సరిగా నిక్షిప్తం కాదు. మంచి నిద్ర సమయంలోనే చదివిందంతా పర్మనెంట్ మెమరీలోకి వెళ్తుందని గుర్తుంచుకోండి. సుజాతా స్టీఫెన్, చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ -
లంచ్ బాక్స్ తేవాలా..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓ విద్యార్థి సహచర విద్యార్థి ఇంట్లో ఖరీదైన పెన్సిల్ మర్చిపోయాడు. తెల్లవారితే డ్రాయింగ్ కాంపిటీషన్. ఆ స్టూడెంట్ పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగులు. పెన్సిల్ తెచ్చే సమయం లేక డెలివరీ యాప్ ‘విజ్జీ’ని ఆశ్రయించారు. స్కూల్‌కు వెళ్లే సమయానికి విద్యార్థి చేతిలోకి ఆ పెన్సిల్ వచ్చి చేరింది. ఇలాంటి అవసరాలే కాదు.. లంచ్ బాక్స్ ఇంటి నుంచి తేవాలన్నా, ఇంట్లో మర్చిపోయిన పెన్ డ్రైవ్, పేపర్స్, పాస్‌పోర్ట్ వంటివి దరి చేరాలన్నా మేమున్నాం అని అంటోంది విజ్జీ. ఫుడ్, గ్రాసరీ డెలివరీ కంపెనీలకు భిన్నంగా ఈ స్టార్టప్ సేవలను విస్తరిస్తోంది. కస్టమర్ కోరితే రూ.10,000 వరకు క్యాష్ సైతం విజ్జీ ఉద్యోగి తీసుకొచ్చి ఇస్తారు. పేటీఎం ద్వారా వినియోగదారుడు ఆ మొత్తాన్ని కంపెనీకి చెల్లించాలి. పేటీఎం లావాదేవీ చార్జీతోపాటు డెలివరీ చార్జీ ఉంటుంది. ఏడాదిలో 1,000 మందికి ఉపాధి... ఎన్నారైలు రవి బత్తి, రవి గొల్లపూడి నాలుగు నెలల కిందట విజ్జీని ప్రారంభించారు. ప్రస్తుతం 15 మంది డెలివరీ బాయ్స్ ఉన్నారు. డిసెంబరుకల్లా ఈ సంఖ్యను 1,000కి చేర్చాలని లకి‡్ష్యంచుకున్నట్లు రవి బత్తి తెలిపారు. ఇప్పటి వరకు 1,300 మంది కస్టమర్లు 3,000 పైచిలుకు ఆర్డర్లు ఇచ్చారని చెప్పారు. మూడు కిలోమీటర్ల వరకు డెలివరీ చార్జీ రూ.20. ప్రతి అదనపు కిలోమీటరుకు రూ.10 ఉంటుందని రవి గొల్లపూడి పేర్కొన్నారు. డెలివరీ బాయ్స్‌కు రోజుకు 8 గంటలకు గాను నెలకు రూ.14,000 వేతనం, రూ.3,000 పెట్రోల్ అలవెన్స్ ఇస్తున్నామని చెప్పారు. ‘ఆహారోత్పత్తుల తయారీదార్లకు డెలివరీ పెద్ద సమస్య. విజ్జీ ఆ బాధ్యతను తీసుకుంటుంది. వారి వ్యాపార వృద్ధికి మా సేవలు ఉపయోగపడుతున్నాయి. వారు తయారు చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేస్తాం’ అని వివరించారు. -
లంచ్ బాక్స్ తెరచి చూస్తే షాక్..!!
హర్దోయ్/ఉత్తరప్రదేశ్ : సామాజిక సమ్మేళనం పేరిట దేవాలయంలో మద్యం పంపిణీ జరిగింది. ఈ ఘటన హర్దోయ్‌లోని శ్రావణ దేవి ఆలయంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. బీజేపీ ఎమ్మెల్యే నితిన్ అగర్వాల్ ఆధ్వర్యంలో ‘పాసి సమ్మేళన్’ జరిగింది. మీటింగ్‌లో పాల్గొన్న వారికి లంచ్ బాక్సుల్లో పెట్టి మద్యం సీసాలను అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్న పిల్లలకు కూడా అవే బాక్సులు ఇచ్చారు. బాక్స్ తెరచి చూడగా అందులో ఆహారంతో పాటు మద్యం సీసా కూడా ఉండడంతో పిల్లలు షాక్ అయ్యారు. ఈ వార్త బయటకు తెలియడంతో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. కావాలనే చేశారు.. దేవాలయంలో మద్యం పంపిణీ ‘ఒక దురదృష్టకర సంఘటన’ అని హర్దోయ్ ఎంపీ అన్షుల్ వర్మ వ్యాఖ్యానించారు. విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఇటీవలే సమాజ్‌వాది పార్టీ నుంచి బీజేపీలో చేరిన నితిన్ తండ్రి నరేష్ అగర్వాల్ ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. బీజేపీపై దుష్ప్రచారంలో భాగంగానే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు. మీటింగ్‌లో పాల్గొన్న చిన్న పిల్లలకు సైతం మద్యం బాటిళ్లు చేరడం దుశ్చర్య అని అన్నారు. ఇంత భారీ స్థాయిలో మద్యం పంపిణీ జరుగుతోంటే ఎక్సైజ్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్‌ని బీజేపీలో చేర్చుకోవడంపై పార్టీ నాయకత్వం మరోసారి ఆలోచించాలని అభిప్రాయపడ్డారు. కాగా, కార్యక్రమానికి హాజరైన పలు గ్రామాల పెద్దలు లంచ్ బాక్స్‌లు తీసుకొని, ఆయా గ్రామాల్లోని తమ వర్గంవారికి తప్పక పంపిణీ చేయాలని ఎమ్మెల్యే నితిన్ చెప్పున్న వీడియో ఒకటి బయటపడింది. అయితే, నితిన్ తండ్రి నరేష్ అగర్వాల్‌ని దోషిని చేయడం ద్వారా బీజేపీ ఈ వివాదం నుంచి బయటపడాలని చూస్తోందని విమర్శలు వస్తున్నాయి. నితిన్, నరేష్‌లు ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
ఓ మంచి లంచ్‌బాక్స్!
పిల్లలకు ఆహారం తినిపించాలంటే తల్లులకు కత్తిమీద సాములాంటిదే. ఇంటి దగ్గర ఉంటే ఏదోలా బుజ్జగించి తినిపించేస్తారు. అదే స్కూల్‌కి వెళ్లితే.. అక్కడ ఎలా తింటారో, ఏం తింటారో? అసలు తినకుండా లంచ్ బాక్సును ఇంటికి తీసుకొస్తారేమో.. అన్న ఆలోచన వెంటాడుతూ ఉంటుంది. దీనికి తోడు ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు రోజూ బండెడు పుస్తకాలు, తరగని సిలబస్‌తో కుస్తీ పడుతుంటారు. దానికి అవసరమైన ఎనర్జీ అందించాలంటే వారికి మంచి పోషకవిలువలున్న భోజనం అవసరం. పిల్లకు ఇష్టం కదా అని వేపుళ్లు, జంక్‌ఫుడ్ పెట్టకూడదు. బయట తీసుకుంటున్నా.. నిలువరించాలి. చదువుకునే పిల్లల జ్ఞాపకశక్తి, ఆరోగ్యంపై ప్రభావం చూపే జంక్‌ఫుడ్‌ను దూరం చేయాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే చిన్నారుల మంచి ఆరోగ్యానికి మంచి లంచ్‌బాక్సు అవసరం! తాడేపల్లిరూరల్ : పిల్లలు రోజూ తీసుకెళ్లే లంచ్‌బాక్సులో తల్లిదండ్రులు అనారోగ్యాన్ని పంపిస్తున్నారు. జాతీయ పోషకాహార సంస్థ చేపట్టిన పరిశీలనలో ఈ తరహా నిజాలు చిన్నారు ఆరోగ్యాన్ని కలవరపెడుతున్నాయి. పిల్లలు పాఠశాలలకు తీసుకెళ్లే ఆహారంలో మార్పుల వల్లనే అధిక బరువు సమస్య వస్తోందని నిర్ధారణలో తేలింది. 2016తో పోలిస్తే దాదాపు 30 శాతం పిల్లలు ఇప్పుడు జంక్‌ఫుడ్ తీసుకెళ్తున్నారు. అన్నం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు వంటి ఆహార పదార్థాలు లంచ్‌బాక్స్‌ల్లో కనుమరుగైపోతున్నాయి. ఏ లంచ్‌బాక్స్ చూసినా నూడుల్స్, సమోసా, పఫ్, కేక్‌లు, బర్గర్లు, పిజ్జాముక్కలు, ఫ్రైడ్పదార్థాలు, చిప్స్, చాక్లెట్స్ వంటి పదార్థాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తక్కువ సమయంలో రెడీ అయ్యే ఇటువంటి పదార్థాలకు తల్లిదండ్రులు అలవాటు పడిపోతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే చిన్నారుల్లో 10 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే చిన్నారుల్లో 3 శాతం మందికి ఊబకాయం సమస్య ఉందని నివేదికలు చెబుతున్నాయి. పరిశోధనలు ఏం చెబుతున్నాయి.. జంక్‌ఫుడ్‌లో సరైన పోషకాలు, సరిపడినన్ని కేలరీలు ఉండవు. దీనివల్ల ఊబకాయంతో పాటు మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా కొవ్వు, అధిక చక్కెర, ఉప్పు, అధిక కేలరీలు కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మెదడుపై ప్రభావం చూపుతుందంటున్నారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఎలుకలపై పరిశోధన చేసి ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. జంక్‌ఫుడ్ తిన్న ఎలుకలు తాము వెళ్లేదారిని కూడా మరిచిపోయినట్లు గుర్తించారు. పిల్లలకు నచ్చజెప్పాలి.. సమతుల ఆహారాన్ని ఎంపికచేసి, ఉదయం లేచిన వెంటనే ఏది పెట్టాలో పిల్లలను అడిగి.. అదే బాక్సుల్లో పెట్టాలి. ఆ విధంగా బాక్స్ ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలు వారంతట వారే ఎంపిక చేసిన ఆహారాన్ని తీసుకెళ్తుంటే.. 85 శాతం మంది పిల్లలు పూర్తిగా లంచ్‌బాక్స్ ఖాళీ చేసేస్తున్నారు. పోషకాహారమే మేలు.. స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఎక్కువగా ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ వంటి పదార్థాలు అందించాలి. స్కూల్లో కంటి చూపును ఎక్కువగా ఉపయోగిచాల్సి ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు ఇవ్వాలి. చదువడం, ఆడటం వల్ల కేలరీలు అధికంగా ఖర్చవుతుంటాయి. అందువల్ల కేలరీలు లభించే ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే వారు నీరసించే అవకాశముండదు. వారంలో నాలుగైదు రోజులు గుడ్లు ఉడికించి ఇవ్వాలి. 18 ఏళ్ల వరకు పిల్లల్ని జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉంచితే.. 40 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. లంచ్‌బాక్స్ ఎలా ఉండాలి? ⇔ ఆహారం తాజాగా ఉండే మెటీరియల్‌ను ఎంచుకోవాలి. ⇔ లోపల ఎక్కువ భాగాలుండేలా ఎంపిక చేస్తే ఎక్కువ ఐటమ్స్ పెట్టే వీలుంటుంది. ⇔ ప్రతిభాగం శుభ్రపరిచేలా చూడాలి. లేదంటే బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. ⇔ సైజ్ మరీ పెద్దది కాకుండా చిన్నది కాకుండా మీడియం సైజ్ మంచిది. ⇔ ప్లాస్టిక్ బాక్సులు వాడకూడదు. వేడి వస్తువులను బాక్సుల్లో పెడితే ఆ వేడికి రసాయనాలు ఆహారంలో కలిసి, అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. -
హైదరాబాద్‌లో డబ్బావాలా!
♦ స్కూళ్లు, ఆఫీసులకు లంచ్ బాక్స్ డెలివరీ చేస్తున్న బెంటోవాగన్ ♦ ‘స్టార్టప్ డైరీ’తో బెంటోవాగన్ కోఫౌండర్ ఎస్ విజయలక్ష్మి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై డబ్బావాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడిదే కాన్సెప్ట్‌తో హైదరాబాద్‌లోనూ డబ్బావాలా సేవలు ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థ బెంటోవాగన్... కార్యాలయాలు, పాఠశాలలకు టిఫిన్ బాక్స్‌లను డెలివరీ చేస్తోంది. మరిన్ని వివరాలు సంస్థ కోఫౌండర్ సుంకు విజయలక్ష్మి మాటల్లోనే.. గృహిణిగా, ఉద్యోగినిగా మహిళల ప్రధాన సవాల్ వంట గదిలోనే. ఉదయాన్నే పిల్లలకు బాక్స్‌ను రెడీ చేయటమంటే మామూలు విషయం కాదు. ఆపైన ఆఫీసుకెళ్లటం. తిరిగి ఇంటికొచ్చే వరకూ పిల్లలేం తిన్నారోననే టెన్షన్. కాగ్నిజెంట్‌లో ఉద్యోగిగా ఉన్న నాకూ ఇదంతా అనుభవమే. అయితే నాలా మరే మహిళకూ హడావుడిగా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నా. ఇదే నిర్ణయాన్ని మా ఆయన సునీల్ కుమార్‌తో చర్చించా. మీరు నమ్మరూ!! అప్పటిదాకా విప్రో వంటి ఐటీ కంపెనీలో పని చేస్తున్న ఆయన.. నా నిర్ణయాన్ని గౌరవించి ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేసేసి సహాయపడ్డారు. సర్వేతో మొదలు.. కంపెనీ ప్రారంభానికి ముందు మార్కెట్లో ఎలా ఉంటుందని కొన్ని స్కూళ్లకు, ఆఫీసులకెళ్లి ఐడియాను షేర్ చేసుకున్నాం. వాళ్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొన్నిసార్లు ఉదయం బాక్స్‌లో తెచ్చుకున్న కూరలు మధ్యాహ్నం అయ్యే సరి కి పాడైపోయేవని చెప్పుకొచ్చేవాళ్లు. వాళ్ల సూచనలు, సలహాలను తీసుకొని ఈ ఏడాది మార్చిలో బెంటోవాగన్ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించాం. వెబ్సైట్ అభివృద్ధి, మార్కెటింగ్, కాల్ సెంటర్ కోసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేశాం. బెంటోవాగన్ అంటే..: బెంటోవాగన్ అనేది జపనీస్ పదం. ఇందులో బెంటో అంటే అందంగా డెకరేట్ చేసిన టిఫిన్ బ్యాక్స్ అని, వాగన్ అంటే వాహనం అని అర్థం. అందుకే రెండూ కలిపి బెంటోవాగన్.కామ్ అని పేరు పెట్టాం. ప్రస్తుతం కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, మణికొండ, బొల్లారం, నిజాంపేట, బీహెచ్ఈఎల్, మూసాపేట్, చందానగర్, కేపీహెచ్‌బీ, మదీనాగూడ, హఫీజ్‌పేట, బాచుపల్లి ప్రాంతాల్లో సేవలందిస్తున్నాం. స్కూళ్లు, ఆఫీసులకు లంచ్ బాక్స్‌లను మాత్రమే డెలివరీ చేస్తున్నాం. త్వరలోనే డిన్నర్ బాక్స్‌లనూ డెలివరీ చేస్తాం. ఈ ఏడాదిలోపు హైదరాబాద్ అంతా విస్తరించాలనేది లక్ష్యం. ఒక్క బాక్స్‌కు నెలకు రూ.500.. ప్రస్తుతానికి వెబ్సైట్, కాల్ సెంటర్ (96404 00079) ద్వారా ఆర్డర్లను స్వీకరిస్తున్నాం. సబ్స్క్రైబర్లకు బెంటోవాగన్ బ్యాగ్ ఇస్తాం. ఇందులో టిఫిన్ బాక్స్‌ను పెట్టి ఇవ్వాలి. మొదటి వారం మాత్రం ఉచితంగా డెలివరీ చేస్తాం. సేవలు నచ్చితే... 5 కి.మీ. పరిధిలో ఒక్క బాక్స్‌కు నెలకు రూ.500 చార్జీ ఉంటుంది. కి.మీ. పెరిగితే ధర కూడా పెరుగుతుంది. ప్రస్తుతం 5 వేల వెబ్సైట్ యూజర్లున్నారు. రోజుకు 80 నుంచి 100 ఆర్డర్లొస్తున్నాయి. ఇందులో 70% స్కూళ్లు, మిగిలినవి ఆఫీసులవి. బాక్స్‌ల డెలివరీ కోసం 10 మంది ఉద్యోగులున్నారు. వీరికి మూడున్నర గంటలకు రూ.7,500–9,500 మధ్య వేతనాలను చెల్లిస్తున్నాం. రూ.10 కోట్ల నిధుల సమీకరణ.. ప్రతి నెలా వ్యాపారం పెరుగుతోంది. త్వరలోనే యాప్‌ను విడుదల చేస్తాం. కస్టమర్ యాప్ కంటే డెలివరీ యాప్ విడుదల చేయాలని నిర్ణయించాం. హైదరాబాద్‌లో పూర్తి స్థాయిలో విస్తరించాక.. రూ.10 కోట్ల నిధులు సమీకరిస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
అలా ఆలోచించడం అమానుషం!
పదిహేనేళ్లు.... ఈ రోజుల్లో ఓ హీరోయిన్ ఇంత సుదీర్ఘంగా కెరీర్ కొనసాగించడం గొప్ప విషయమే. ‘ఇష్టం’తో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన శ్రీయా శరణ్ ఇప్పటివరకూ హీరోయిన్‌గానే కొనసాగుతున్నారు. తాజాగా ‘ఊపిరి’లో నాగ్‌కు జోడీగా కనిపించారు. హీరోయిన్ కెరీర్ వయసు చాలా తక్కువని అనుకునే చాలా మంది నమ్మకాన్ని వమ్ము చేశారామె. ఈ లాంగ్ ఇన్నింగ్స్ గురించి మీ అభిప్రాయం? అనే ప్రశ్న శ్రీయ ముందుంచితే - ‘‘హీరోయిన్ అంటే జస్ట్ ఐదేళ్లు సినిమాలు చేయాలి.. ఆ తర్వాత వెళ్లిపోవాలి అనే ఆలోచన సరి కాదు. అలా అనుకోవడం అమానుషం. కాలం మారుతోంది. ఒకప్పటిలా ఇప్పుడు కథానాయిక పాత్రలకూ ప్రాధాన్యం పెరుగుతోంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ పెరిగాక ఆర్ట్ సినిమాకూ, కమర్షియల్ సినిమాకూ వ్యత్యాసం తగ్గిపోయింది. ‘లంచ్‌బాక్స్’, ‘కహానీ’ తరహా చిత్రాలు రావడానికి కారణం కూడా ఇదే. హీరోయిన్గా ఎక్కువ కాలం కొనసాగాలను కునేవాళ్లకిఇది కరెక్ట్ టైమ్’’ అని చెప్పారు. -
ఇక లంచ్ చల్లారదు!
పొద్దున్నే లేచి, లంచ్‌బాక్సులు కట్టుకుని ఆఫీసులకు పరుగు తీస్తాం. తీరా లంచ్ టైమ్‌లో బాక్స్ తెరిస్తే చల్లారి పోయిన ఆహారం మనల్ని వెక్కిరిస్తుంది. అయినా ఆకలి కేకలను ఆపడానికి ఆరగించక తప్పదు. ఈ బాధ తప్పించడానికే వచ్చింది... ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్. చల్లారిన భోజనం తినాల్సిన పని లేకుండా ఈ బాక్సు మనకు భలే ఉపయోగపడుతుంది. ఈ బాక్సుకి వైరును కనెక్ట్ చేసుకోవడానికి ఓ పిన్ ఉంటుంది. బాక్సుతో పాటు వచ్చే వైరును దీనికి అమర్చి, ప్లగ్‌ను కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే చాలు... ఐదు పది నిమిషాల్లో ఆహారం వేడిగా అయిపోతుంది. దాంతో ఎక్కడున్నా, ఏ సమయంలో అయినా వేడి వేడి భోజనం చేయవచ్చు. దాదాపు అన్ని ప్రముఖ కంపెనీలూ వీటిని తయారు చేసి మార్కెట్లో దింపాయి. సైజు, డిజైన్ని బట్టి రేటు. ఆన్లైన్లో ఐదారు వందలకే లభిస్తున్నాయి. -
రజనీ ఇంటి నుంచే లంచ్
చెన్నై కొస్తే నాకు రజనీ ఇంటి నుంచే లంచ్ వస్తుందని గొప్పగా చెప్పుకుంటోంది బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే. వరుస విజయాలతో సహ హీరోయిన్లకు దడ పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల తన తాజా చిత్రం హ్యాపీ న్యూ ఇయర్‌కు ప్రచారంలో భాగంగా చెన్నై కొచ్చారు. ఈ సందర్భంగా కోచ్చడయాన్ చిత్రం తరువాత తమిళంలో నటించకపోవడానికి కారణం ఏమిటన్న విలేకర్ల ప్రశ్నకు బదులిస్తూ ఏ భాషా చిత్రంలోనయినా నటించడానికి తాను రెడీ అంది. హీరో ఎవరన్నది కూడా చూడనని స్పష్టం చేసింది. తన పాత్రకు ప్రాముఖ్యత ఉందా? అన్న విషయం గురించే ఆలోచిస్తానని చెప్పింది. రజనీకాంత్ సరసన కోచ్చడయాన్ చిత్రంలో నటించడం మధురమయిన అనుభవంగా పేర్కొంది. అదేవిధంగా దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ఆశగా ఉందని చెప్పింది. ఇంతకు ముందొకసారి ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చిందని అయితే అనివార్య కారణాల వల్ల అది జరగలేదని తెలిపింది. మరో విషయం ఏమిటంటే తానెప్పుడు చెన్నైకి వచ్చినా రజనీకాంత్ కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్యలతో మాట్లాడతానని చెప్పింది. వారు తన కుటుంబ సభ్యుల్లా కలిసిపోయూరని చెప్పింది. ఐశ్వర్య గానీ, సౌందర్య గానీ ముంబాయి వస్తే తనను కలుసుకుంటారని చెప్పింది. తానెప్పుడు చెన్నై వచ్చినా రజనీ ఇంటి నుంచే లంచ్ బాక్స్ వస్తుందని దీపిక వెల్లడించింది. -
డబ్బావాలా ధర పెరిగింది
ఒక్కో లంచ్ బాక్స్‌పై రూ.100, వాటర్ బాటిల్‌పై రూ.50 పెంపు సాక్షి, ముంబై: ఆటో.. ట్యాక్సీ.. బస్సు.. రైలు.. ఇలా అన్నింటి చార్జీలు పెరగడంతో ముంబై డబ్బావాలాలు కూడా తమ ధర(వేత నం)ను పెంచేశారు. కార్యాలయాలకు సరఫరా చేస్తున్న ఒక్కో లంచ్ బాక్స్‌పై రూ. 100 పెంచుతున్నట్లు ముంబై డబ్బావాలా యూనియన్ అధ్యక్షుడు భావుసాహెబ్ కరవందే ప్రకటించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. లంచ్ బాక్స్‌తోపాటు వాటర్ బాటిల్ కూడా ఉంటే అదనంగా రూ.50 వసూలు చేయనున్నారు. ఇదివరకు ఒక్కో లంచ్ బాక్స్‌కు దూరాన్ని బట్టి రూ.500-800 వరకు వసూలు చేసేవారు. అలాగే వాటర్ బాటిల్ ఉంటే రూ.15-20 చొప్పున వసూలు చేసేవారు. ఇక నుంచి అదనంగా రూ.100, వాటర్ బాటిల్ ఉంటే రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు, ప్రభుత్వ, ఇతర కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్లో అనేక మందికి అక్కడి క్యాంటీన్ భోజనం నచ్చకపోవడంతో కొందరు ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లను తెప్పించుకుంటారు. ఇలా ప్రతీరోజూ రెండు లక్షలకుపైగా ఉద్యోగులకు లంచ్ బాక్స్‌లను భోజన సమయానికి వారివారి కార్యాలయాలకు చేర వేయడం డబ్బావాలాల వృత్తి. వీరికి మేనేజ్మెంట్ గురు (సమయ పాలన కచ్చితంగా పాటిస్తారని)లనే పేరుంది. ఇటీవల అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడంతో గత్యంతరం లేక డబ్బావాలాలు కూడా చార్జీలు పెంచారు. రెండు రోజుల సెలవు... ఆషాడ ఏకాదశి పురస్కరించుకొని ఏటా పండరీపూర్‌లో పెద్ద ఎత్తున జరిగే ఉత్సవాలకు హాజరయ్యేందుకు డబ్బావాలాలందరూ అక్కడికి వెళ్లనున్నారు. అందుకు ఈ నెల 9, 10 తేదీల్లో విధులకు హాజరు కాలేమని ప్రకటించారు. ఏటా ఆషాడ ఏకాదశి పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పండరీపూర్‌లోని చంద్రబాగా నదిలో స్నానాలు చేయడం అనంతరం విఠలేశ్వరుడు, రుక్మిణీలను దర్శించుకోవడం వీరికి ఆనవాయితీగా వస్తోంది. -
నోటికి రుచిగా...ఒంటికి ఆరోగ్యంగా...
స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాయి. ఉదయాన్నే ఇల్లంతా హడావిడి... తినడానికి ఏం పెట్టినా సరే, పిల్లలు రెండు ముద్దలు గబగబా మింగేసి... టైమ్ లేదంటూ స్కూల్‌కి పరుగులు తీసేస్తారు. తీరా, మధ్యాహ్నమయ్యేసరికి కడుపులో ఎలకల కలకలం... ఆవురావురుమంటూ లంచ్ బాక్స్ తెరుస్తారు. అందుకే, ఆకలితో ఉన్న చిన్నారులు ‘అబ్బా! ఎంత బావుందో...’ అనేలా, నోటికి రుచిగా, ఒంటికి ఆరోగ్యంగా ఉండే... ఈ చిట్టి చిట్టి వంటలు తయారుచేయండి. అర నిమిషంలో లంచ్‌బాక్స్ ఖాళీ చేయించేయండి. రోజూ లంచ్‌బాక్స్ కోసం ఎదురుచూసేలా చేయండి. సేమ్యాపులిహోర కావలసినవి: సేమ్యా - 200 గ్రా; పచ్చి బఠాణీ - అర కప్పు; జీడిపప్పు పలుకులు - 15; పచ్చి మిర్చి - 1; నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు - 4 టేబుల్ స్పూన్లు; పసుపు - పావు టీ స్పూను; కరివేపాకు - నాలుగు రెమ్మలు; సెనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు - అర టీ స్పూను; నూనె - 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత తయారీ: బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక సేమ్యా వేసి, గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి. (మరీ ఎక్కువసేపు వేయించకూడదు) పెద్ద గిన్నెలో నీళ్లు పోసి మరిగాక, ఉప్పు, కొద్దిగా నూనె, సేమ్యా వేసి ఉడికించి, నీళ్లు మిగిలి ఉంటే ఒంపేసి, వెంటనే చన్నీళ్లలో ఒకసారి ఉంచి తీసి పూర్తిగా చల్లారనియ్యాలి పచ్చి బఠాణీలు కొద్దిసేపు నీళ్లలో నానిన తర్వాత తీసేయాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి సెనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి పచ్చి బఠాణీ, పచ్చి మిర్చి తరుగు జత చేసి నాలుగైదు నిమిషాలు వేయించాలి కరివేపాకు, పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి దించేసి ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి వేయించి ఉంచుకున్న పోపులో, ఉడికించి ఉంచుకున్న సేమ్యా వేసి బాగా కలపాలి నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి మరోమారు కలపాలి లంచ్ బాక్స్‌లో ఈ రంగురంగుల సేమ్యాను చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. వెనీలా ఎగ్‌లెస్ స్పాంజ్ కేక్ కావలసినవి: మైదా పిండి - ఒకటిన్నర కప్పులు; పంచదార - ముప్పావు కప్పు; చిలికిన పెరుగు - కప్పు; టూటీ ఫ్రూటీ - పావుకప్పు; నూనె - అర కప్పు; బేకింగ్ పౌడర్ - టేబుల్ స్పూను; బేకింగ్ సోడా - అర టీ స్పూను; ఉప్పు - చిటికెడు; వెనీలా ఎసెన్స్ - 2 టీ స్పూన్లు; టూటీ ఫ్రూటీ కోటింగ్ కోసం - 2 టీ స్పూన్ల మైదా పిండి. తయారీ: కేక్ ట్రే కి ముందుగా నూనె పూయాలి టీ స్పూను మైదా పిండి పైన చ ల్లాలి అవెన్‌ను 200 డిగ్రీల దగ్గర సుమారు పది నిమిషాలు ప్రీ హీట్ చేయాలి మైదాపిండిని రెండు సార్లు జల్లించి, ఉండలు లేకుండా జాగ్రత్త పడాలి పంచదారను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక పాత్రలో పెరుగు, పంచదార పొడి వేసి మరోమారు గిలక్కొట్టాలి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా జత చేసి బాగా కలిపి పెరుగు మిశ్రమం మెత్తగా అయ్యేలా చూడాలి వెనీలా ఎసెన్స్, నూనె వేసి మరోమారు కలపాలి మైదాపిండి కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి చిన్న పాత్రలో టూటీ ఫ్రూటీ, టీ స్పూను మైదాపిండి వేసి కలిపి, పైన తయారుచేసి ఉంచుకున్న మైదాపిండి మిశ్రమానికి జత చేయాలి ఈ మొత్తం మిశ్రమాన్ని ప్రీ హీట్ చేసి ఉంచుకున్న ట్రేలో వేసి 40 నిమిషాలు బేక్ చేయాలి (30 నిమిషాలు అవగానే ఒకసారి కేక్ ఎంతవరకు తయారైందో గమనించాలి) బయటకు తీసి ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి చాకుతో కట్ చేయాలి మీ పిల్లల బాక్సులో ఈ కేక్ ఉంచండి, కొద్దిగా కూడా మిగల్చకుండా చక్కగా తినేస్తారు. ఓట్స్ ఖారాబాత్ కావలసినవి: ఓట్లు - కప్పు; ఉల్లిపాయ - 1 (సన్నగా తురమాలి); టొమాటోలు - 2 (సన్నగా తరగాలి); క్యారట్ తురుము - అర కప్పు; క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను; అల్లం - వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను; కారం - అర స్పూను; గరం మసాలా - పావు స్పూను; పసుపు - పావు స్పూను; కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం - టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు - 10; ఉప్పు - తగినంత; నెయ్యి - టేబుల్ స్పూను; సెనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; నూనె - 2 టీ స్పూన్లు; నెయ్యి - 2 టీ స్పూన్లు తయారీ: బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక (నూనె వేయకూడదు) ఓట్లు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి సెనగపప్పు, మినప్పప్పు జతచేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి ఉల్లితరుగు వేసి వేయించాక, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి క్యారట్ తురుము, టొమాటో తరుగు జత చేసి అన్నీ బాగా మెత్తగా అయ్యేవరకు కలపాలి క్యాప్సికమ్ తరుగు, పసుపు, కారం, గరం మసాలా వేసి అన్నీ కలిసేవరకు వేయించాలి వేరొక పాత్రలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగాక ఉప్పు వేయాలి (ఓట్లు, నీళ్లు రెండున్నర: 3 నిష్పత్తిలో) వేయించి ఉంచుకున్న ఓట్లు, టొమాటో మిశ్రమం వేసి ఆపకుండా కలపాలి వేరొక బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు వేయించాలి కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి కలపాలి జీడిపప్పులు, నెయ్యి వేసి కలిపి దించి మూత పెట్టాలి సుమారు ఐదు నిమిషాలయ్యాక లంచ్ బాక్స్‌లో పెట్టాలి ఆలూ చిప్స్‌తో తింటే బాగుంటాయి. కొబ్బరి అటుకులు కావలసినవి: అటుకులు - 2 కప్పులు; కొబ్బరి తురుము - కప్పు; పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు పలుకులు - 2 టేబుల్ స్పూన్లు; పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు; సెనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - 2 టీ స్పూన్లు; ఆవాలు - అర టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; నిమ్మరసం - టేబుల్ స్పూను; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత తయారీ: అటుకులను శుభ్రంగా కడిగి నీళ్లు తీసేయాలి బాణలిలో నూనె కాగాక ఆవాలు వేయించాలి పల్లీలు రంగు మారే వరకు వేయించాలి జీడిపప్పు పలుకులు, సెనగపప్పు, మినప్పప్పు వేసి వేగాక కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి వేయించాలి కొబ్బరి తురుము (సగం) జత చేసి మరో మారు వేయించాలి అటుకులు, మిగిలిన కొబ్బరి తురుము, ఉప్పు వేసి బాగా కలిపి మూత ఉంచాలి రెండు నిమిషాలయ్యాక మూత తీసి నిమ్మ రసం, కొత్తిమీర తరుగు జత చేసి దించేయాలి. చిక్కుడు గింజల మిక్స్చర్ కావలసినవి: చిక్కుడు గింజలు - 4 కప్పులు; స్పైసీ బాల్స్ - కప్పు; పల్లీలు - అర కప్పు; ఎండు కొబ్బరి ముక్కలు - అర కప్పు; జీడిపప్పు పలుకులు - అర కప్పు; కరివేపాకు - అర కప్పు; కారం - టేబుల్ స్పూను; జీలకర్ర - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - డీప్ ఫ్రైకి తగినంత; పోపు కోసం - పావు కప్పు నూనె తయారీ: చిక్కుడు గింజలను సుమారు 5 గంటలు నానబెట్టి, పైన తొక్క తీయాలి తొక్క తీసిన చిక్కుడు గింజలను పల్చటి వస్త్రంపై ఆరబోయాలి బాణలిలో నూనె కాగాక చిక్కుడు గింజలను అందులో వేసి కరకరలాడేలా వేయించాలి మరొక బాణలిలో పావు కప్పు నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి పల్లీలు వే సి రంగు మారేవరకు వేయించాలి జీడిపప్పు, ఎండుకొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి కరివేపాకు వేసి వేయించి దింపేయాలి కారం, ఉప్పు వేసి కలపాలి వేయించి ఉంచుకున్న చిక్కుడు గింజలు, స్పైసీ బాల్స్ వేసి బాగా కలపాలి బాగా చల్లారాక, గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలా రోజులు పాడవకుండా ఉంటాయి వీటిని బాక్స్‌లో పెడితే పిల్లలు ఆత్రంగా లంచ్ టైమ్ వరకైనా ఆగకుండా తినేస్తారు. స్పైసీ బాల్స్ తయారీ... కప్పుడు నీళ్లను మరిగించి, అందులో ఒకటిన్నర కప్పుల బియ్యప్పిండి, కొద్దిగా ఉప్పు, పావు టీ స్పూను ధనియాల పొడి, పావు టీ స్పూను జీలకర్ర పొడి వేసి కలిపి చల్లారనివ్వాలి చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి బాణలిలో నూనె మరిగాక ఈ ఉండలను అందులో వేసి వేయిస్తే, స్సైసీ బాల్స్ సిద్ధమయినట్లే.