పిల్లలకు ఆహారం తినిపించాలంటే తల్లులకు కత్తిమీద సాములాంటిదే. ఇంటి దగ్గర ఉంటే ఏదోలా బుజ్జగించి తినిపించేస్తారు. అదే స్కూల్‌కి వెళ్లితే.. అక్కడ ఎలా తింటారో, ఏం తింటారో? అసలు తినకుండా లంచ్ బాక్సును ఇంటికి తీసుకొస్తారేమో.. అన్న ఆలోచన వెంటాడుతూ ఉంటుంది. దీనికి తోడు ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు రోజూ బండెడు పుస్తకాలు, తరగని సిలబస్‌తో కుస్తీ పడుతుంటారు. దానికి అవసరమైన ఎనర్జీ అందించాలంటే వారికి మంచి పోషకవిలువలున్న భోజనం అవసరం. పిల్లకు ఇష్టం కదా అని వేపుళ్లు, జంక్‌ఫుడ్ పెట్టకూడదు. బయట తీసుకుంటున్నా.. నిలువరించాలి. చదువుకునే పిల్లల జ్ఞాపకశక్తి, ఆరోగ్యంపై ప్రభావం చూపే జంక్‌ఫుడ్‌ను దూరం చేయాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే చిన్నారుల మంచి ఆరోగ్యానికి మంచి లంచ్‌బాక్సు అవసరం!
తాడేపల్లిరూరల్ : పిల్లలు రోజూ తీసుకెళ్లే లంచ్‌బాక్సులో తల్లిదండ్రులు అనారోగ్యాన్ని పంపిస్తున్నారు. జాతీయ పోషకాహార సంస్థ చేపట్టిన పరిశీలనలో ఈ తరహా నిజాలు చిన్నారు ఆరోగ్యాన్ని కలవరపెడుతున్నాయి. పిల్లలు పాఠశాలలకు తీసుకెళ్లే ఆహారంలో మార్పుల వల్లనే అధిక బరువు సమస్య వస్తోందని నిర్ధారణలో తేలింది. 2016తో పోలిస్తే దాదాపు 30 శాతం పిల్లలు ఇప్పుడు జంక్‌ఫుడ్ తీసుకెళ్తున్నారు. అన్నం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు వంటి ఆహార పదార్థాలు లంచ్‌బాక్స్‌ల్లో కనుమరుగైపోతున్నాయి. ఏ లంచ్‌బాక్స్ చూసినా నూడుల్స్, సమోసా, పఫ్, కేక్‌లు, బర్గర్లు, పిజ్జాముక్కలు, ఫ్రైడ్‌పదార్థాలు, చిప్స్, చాక్‌లెట్స్ వంటి పదార్థాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తక్కువ సమయంలో రెడీ అయ్యే ఇటువంటి పదార్థాలకు తల్లిదండ్రులు అలవాటు పడిపోతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే చిన్నారుల్లో 10 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే చిన్నారుల్లో 3 శాతం మందికి ఊబకాయం సమస్య ఉందని నివేదికలు చెబుతున్నాయి.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి..
జంక్‌ఫుడ్‌లో సరైన పోషకాలు, సరిపడినన్ని కేలరీలు ఉండవు. దీనివల్ల ఊబకాయంతో పాటు మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా కొవ్వు, అధిక చక్కెర, ఉప్పు, అధిక కేలరీలు కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మెదడుపై ప్రభావం చూపుతుందంటున్నారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఎలుకలపై పరిశోధన చేసి ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. జంక్‌ఫుడ్ తిన్న ఎలుకలు తాము వెళ్లేదారిని కూడా మరిచిపోయినట్లు గుర్తించారు.
పిల్లలకు నచ్చజెప్పాలి..
సమతుల ఆహారాన్ని ఎంపికచేసి, ఉదయం లేచిన వెంటనే ఏది పెట్టాలో పిల్లలను అడిగి.. అదే బాక్సుల్లో పెట్టాలి. ఆ విధంగా బాక్స్ ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలు వారంతట వారే ఎంపిక చేసిన ఆహారాన్ని తీసుకెళ్తుంటే.. 85 శాతం మంది పిల్లలు పూర్తిగా లంచ్‌బాక్స్ ఖాళీ చేసేస్తున్నారు.
పోషకాహారమే మేలు..
స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఎక్కువగా ఆకుకూరలు, క్యారెట్, బీట్‌రూట్ వంటి పదార్థాలు అందించాలి. స్కూల్‌లో కంటి చూపును ఎక్కువగా ఉపయోగిచాల్సి ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు ఇవ్వాలి. చదువడం, ఆడటం వల్ల కేలరీలు అధికంగా ఖర్చవుతుంటాయి. అందువల్ల కేలరీలు లభించే ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే వారు నీరసించే అవకాశముండదు. వారంలో నాలుగైదు రోజులు గుడ్లు ఉడికించి ఇవ్వాలి. 18 ఏళ్ల వరకు పిల్లల్ని జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉంచితే.. 40 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.
లంచ్‌బాక్స్ ఎలా ఉండాలి?
⇔ ఆహారం తాజాగా ఉండే మెటీరియల్‌ను ఎంచుకోవాలి.
⇔ లోపల ఎక్కువ భాగాలుండేలా ఎంపిక చేస్తే ఎక్కువ ఐటమ్స్ పెట్టే వీలుంటుంది.
⇔ ప్రతిభాగం శుభ్రపరిచేలా చూడాలి. లేదంటే బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది.
⇔ సైజ్ మరీ పెద్దది కాకుండా చిన్నది కాకుండా మీడియం సైజ్ మంచిది.
⇔ ప్లాస్టిక్ బాక్సులు వాడకూడదు. వేడి వస్తువులను బాక్సుల్లో పెడితే ఆ వేడికి రసాయనాలు ఆహారంలో కలిసి, అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment