బుడిబుడి అడుగులు వేసే చిన్నారులను బడిలో వేసేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతారు. చిన్న పలక, అందమైన దుస్తులు ధరించి, అడుగులో అడుగేస్తూ బుజ్జాయిలు బడికి వెళ్తుంటే తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. వారి ఆనందానికి అవధులే ఉండవు. కొందరు పిల్లల విషయంలో మాత్రం తిప్పలు తప్పవు. బడి పేరెత్తితే చాలు వణికిపోతుంటారు. ఏడుపు లంకించుకుని అమ్మ కొంగును చుట్టేస్తుంటారు. ఇక బడి గంట వినబడితే చాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లు భయపడుతుంటారు. ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం.
జగ్గయ్యపేట: గతంలో పిల్లలకు ఐదారేళ్ల వయసు వచ్చే వరకు పాఠశాలలకు పంపే వారు కాదు. బాల్యం హాయిగా ఇంట్లోనే పెద్దల మధ్య గడిచిపోయేది. ఉమ్మడి కుటుంబాల సంస్కృతి చాలా వరకు పోయింది. ఏక కుటుంబ సంస్కృతి పెరిగింది. ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలను వీలైనంత తక్కువ వయసులోనే పాఠశాలలకు పంపటానికి ఇష్టపడుతున్నారు. ఇంట్లో ఉంటే అల్లరి చేస్తారని, బడికి పంపితే మంచి అలవాట్లు అలవడుతాయని మూడేళ్ల పిల్లలను సైతం బడిబాట పట్టిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మొదలు గ్రామాల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. మూడేళ్లు నిండితే చాలు పిల్లలు స్కూల్లో కనిపిస్తున్నారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అంటూ చిన్నారులకు పాఠాలు మొదలువుతున్నాయి. ఎంతో డబ్బు పోసి పిల్లలను పాఠశాలలకు పంపితే వారు వెళ్లకుండా మారాం చేయడం వెనుక ఉన్న కారణాలను గుర్తించాలి.
తల్లిదండ్రుల పాత్ర కీలకం..
చిన్నారుల్లో భయాన్ని పొగొట్టడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం. కారణాలు ఏవైనా స్కూలుకు వెళ్లబోమని పేచీ పెట్టే పిల్లలను సరైన రీతిలో బుజ్జగించాలి. వారిని కొట్టి, తిట్టి భయపెట్టడం మంచిది కాదు. బలవంతంగా పంపడం వలన వారిలో పాఠశాలపై వ్యతిరేక భావన కలిగే అవకాశం ఉంది. పాఠశాలలో చేరిన కొత్తలో తల్లిదండ్రులు ఎవరో ఒకరు స్కూలులో దింపి, పాఠశాల పూర్తి కాగానే తీసుకురావటం వలన పిల్లల్లో మనోధైర్యం ఏర్పడుతుంది.
ఉపాధ్యాయుల ప్రభావం..
తల్లిదండ్రుల సంరక్షణ నుంచి స్కూలుకు వెళ్లగానే ఉపాధ్యాయుల వ్యవహార శైలి పిల్లల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అందుకే పిల్లల విషయంలో ఉపాధ్యాయుల పాత్ర కూడా ఎంతో కీలకం. పిల్లల్లో స్కూలు ఫోబియాను పోగొట్టాలంటే ఉపాధ్యాయుల సహకారం ఎంతో అవసరం. పిల్లలు ఉపాధ్యాయులను చూడగానే భయపడాలనే భావనతో ఉండకూడదు. సన్నిహితంగా, స్నేహపూర్వకంగా మెలగాలి. ఒక స్నేహితుని మాదిరిగా మాట్లాడి దగ్గరకు తీసుకోవాలి. పిల్లల మనసులో ఉపాధ్యాయులు కొడతారనే భావన తొలగించే ప్రయత్నం చేయాలి. ఉపాధ్యాయుల తీరు పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. నర్సరీ పిల్లలకు వీలైనంత వరకు హోంవర్కు లేకుండా చూడాలి. వారిని అనవసర ఒత్తిడికి గురి చేయకూడదు. స్కూలుకు రోజూ రావడం వలన ప్రయోజనాలను ఉపాధ్యాయులు చెప్పాలి. చిన్నప్పుడే గొప్ప వారి జీవిత చరిత్రలను చెబితే వారికి జీవితాంతం గుర్తుంటాయి. ఓ మంచి లక్ష్యం ఏర్పడటానికి దోహదం చేస్తాయి.
పాఠశాల ఫోబియానే కారణం..
సాధారణంగా పిల్లలు పాఠశాల అంటే భయపడటాన్ని సైన్స్ పరిభాషలో స్కూల్ ఫోబియా అంటారు. ఇది ఉన్న పిల్లలు బడి గేటు దగ్గరకు రాగానే బిగ్గరగా ఏడవడం, వాంతులు చేసుకోవడం, తలనొప్పి, కళ్లు తిరగడం, కడుపునొప్పి వంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తుంటాయి. తల్లిదండ్రులు పిల్లాడు నటిస్తున్నాడు అనుకోకుండా జాగ్రత్తగా చూడాలి. వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లటం మంచిది. బడి అంటే భయపడే పిల్లలను బలవంతంగా పంపడం సరికాదు. వారి భయానికి కారణాన్ని కనుగొని దాన్ని తొలగించాలి. ఆ తర్వాతే పాఠశాలకు పంపాలి. దాదాపు నూటికి 90 శాతం మంది పిల్లలు స్కూలుకు ఎలాంటి పేచీ పెట్టకుండా వెళతారు. మిగిలిన పది శాతం మందితోనే సమస్య. వీరు స్కూలంటేనే భయపడిపోతుంటారు. బడికి వెళ్లమంటూ మారాం చేస్తుంటారు.
భయం పోగొట్టాలి: వెంకటేశ్వరరావు, పిల్లల వైద్యుడు
స్కూలు ఫోబియాతో పిల్లలకు లేనిపోని సమస్యలు వస్తుంటాయి. కొందరు వాంతులు చేసుకొంటారు. మరి కొందరు కడుపులో నొప్పి అంటూ మారాం చేస్తారు. వారిని ఆ ఫోబియా నుంచి బయటకు తీసుకురావాలి. వారికి మంచి వాతావరణం కల్పిస్తే ఫోబియా నుంచి బయట పడతారు. ఒకసారి ఆ ఫోబియా నుంచి పిల్లలు బయటకు వస్తే మరలా ఇలాంటి సమస్య ఉత్పన్నం కాదు.
Comments
Please login to add a commentAdd a comment