గుంటూరు నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో ఎన్‌టీఎస్ పరీక్షకు హాజరైన విద్యార్థులు
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతన పరీక్షలకు హాజరైన విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో చోటు చేసుకున్న ఘటనలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో ఆదివారం 53 పరీక్షా కేంద్రాల్లో జరిగిన జాతీయ ప్రతిభా ఉపకార వేతన (ఎన్‌ఎంఎస్‌ఎస్), జాతీయ ప్రతిభాన్వేషణ (ఎన్‌టీఎస్‌ఈ) పరీక్షలకు 11,020 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం 31 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తు చేసిన 6,835 మంది విద్యార్థుల్లో 6,682 మంది హాజరయ్యారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన ఎన్‌టీఎస్ పరీక్షకు గుంటూరు నగర పరిధిలో 22 పరీక్షా కేంద్రాల పరిధిలో 4,559 మంది విద్యార్థులకు గానూ 4338 మంది హాజరయ్యారు.
ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు తెలుగు పేపర్!
గుంటూరు నగర పరిధిలోని రెండు పరీక్షా కేంద్రాల్లో చోటు చేసుకున్న ఘటనలతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పాత గుంటూరులోని యాదవ ఉన్నత పాఠశాలలో ఉదయం జరిగిన ఎన్‌టీఎస్ పేపర్–1 పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంకు బదులుగా తెలుగు మీడియం పేపర్ ఇవ్వడంతో ఆందోళనకు గురయ్యారు. ఎన్‌టీఎస్ పరీక్షను ఓఎంఆర్ షీట్ విధానంలో నిర్వహించడంతో ఓఎంఆర్, క్వశ్చన్ పేపర్ బండిల్ వేర్వేరుగా ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. దీంతో విషయాన్ని ఇన్విజిలేటర్ ద్వారా తెలుసుకున్న చీఫ్ సూపరింటెండెంట్ డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న డీఈవో ఆర్‌ఎస్ గంగా భవానీ పాఠశాలకు వచ్చి విచారించారు. ఈ లోగా పరీక్షా కేంద్రంలో ప్రశ్నాపత్రం తప్పుగా ఇచ్చారని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గుంటూరులోని ఒక కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం తమ విద్యార్థులతో ఎన్‌టీఎస్ పరీక్షకు దరఖాస్తు చేసే సమయంలో ఇంగ్లిష్ మీడియంకు బదులుగా తెలుగు మీడియంను నమోదు చేయడంతో అందుకు అనుగుణంగానే ప్రశ్నాపత్రం వచ్చిం దని, ఇందుకు విద్యాశాఖ తప్పిదం లేదని డీఈవో గంగా భవానీ తేల్చిచెప్పారు.
కాగా విద్యార్థులు నష్టపోతున్నారనే కోణంలో ఈ విషయాన్ని ప్రభు త్వ పరీక్షల విభాగ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వారి అనుమతితో అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించడంతో విద్యార్థులు యథావిధిగా పరీక్ష రాశారు. అదే విధంగా సంగడిగుంటలోని చలమయ్య హైస్కూల్లో ఓఎంఆర్ షీట్‌తో సంబంధం లేకుండా వేర్వేరు కోడ్‌లతో ఉన్న ప్రశ్నాపత్రాలు ఇచ్చిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో జరిగిన పొరపాటును గుర్తించిన నిర్వాహకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్‌పైన ప్రశ్నాపత్రం కోడ్ నమోదు చేసి పరీక్ష రాయించాలని డీఈవో సూచించడంతో పరిస్థితి సద్దుమణిగింది. జరిగిన సంఘటనపై డీఈవో గంగా భవానీ ఆదేశాలతో ప్రభుత్వ పరీక్షల విభాగ జిల్లా సహాయ కమిషనర్ మాణిక్యాంబ చలమయ్య హైస్కూల్‌కు వెళ్లి విచారించారు. ఎన్‌టీఎస్ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు చేసిన తప్పిదాలతో ఇటువంటి సమస్యలు చోటు చేసుకున్నాయని డీఈవో గంగా భవానీ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment