
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓ విద్యార్థి సహచర విద్యార్థి ఇంట్లో ఖరీదైన పెన్సిల్ మర్చిపోయాడు. తెల్లవారితే డ్రాయింగ్ కాంపిటీషన్. ఆ స్టూడెంట్ పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగులు. పెన్సిల్ తెచ్చే సమయం లేక డెలివరీ యాప్ ‘విజ్జీ’ని ఆశ్రయించారు. స్కూల్‌కు వెళ్లే సమయానికి విద్యార్థి చేతిలోకి ఆ పెన్సిల్ వచ్చి చేరింది. ఇలాంటి అవసరాలే కాదు.. లంచ్ బాక్స్ ఇంటి నుంచి తేవాలన్నా, ఇంట్లో మర్చిపోయిన పెన్ డ్రైవ్, పేపర్స్, పాస్‌పోర్ట్ వంటివి దరి చేరాలన్నా మేమున్నాం అని అంటోంది విజ్జీ. ఫుడ్, గ్రాసరీ డెలివరీ కంపెనీలకు భిన్నంగా ఈ స్టార్టప్ సేవలను విస్తరిస్తోంది. కస్టమర్ కోరితే రూ.10,000 వరకు క్యాష్ సైతం విజ్జీ ఉద్యోగి తీసుకొచ్చి ఇస్తారు. పేటీఎం ద్వారా వినియోగదారుడు ఆ మొత్తాన్ని కంపెనీకి చెల్లించాలి. పేటీఎం లావాదేవీ చార్జీతోపాటు డెలివరీ చార్జీ ఉంటుంది.
ఏడాదిలో 1,000 మందికి ఉపాధి...
ఎన్నారైలు రవి బత్తి, రవి గొల్లపూడి నాలుగు నెలల కిందట విజ్జీని ప్రారంభించారు. ప్రస్తుతం 15 మంది డెలివరీ బాయ్స్ ఉన్నారు. డిసెంబరుకల్లా ఈ సంఖ్యను 1,000కి చేర్చాలని లకి‡్ష్యంచుకున్నట్లు రవి బత్తి తెలిపారు. ఇప్పటి వరకు 1,300 మంది కస్టమర్లు 3,000 పైచిలుకు ఆర్డర్లు ఇచ్చారని చెప్పారు. మూడు కిలోమీటర్ల వరకు డెలివరీ చార్జీ రూ.20. ప్రతి అదనపు కిలోమీటరుకు రూ.10 ఉంటుందని రవి గొల్లపూడి పేర్కొన్నారు. డెలివరీ బాయ్స్‌కు రోజుకు 8 గంటలకు గాను నెలకు రూ.14,000 వేతనం, రూ.3,000 పెట్రోల్ అలవెన్స్ ఇస్తున్నామని చెప్పారు. ‘ఆహారోత్పత్తుల తయారీదార్లకు డెలివరీ పెద్ద సమస్య. విజ్జీ ఆ బాధ్యతను తీసుకుంటుంది. వారి వ్యాపార వృద్ధికి మా సేవలు ఉపయోగపడుతున్నాయి. వారు తయారు చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేస్తాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment