ఆన్‌లైన్ క్విక్ కామర్స్ సర్వీసులు అందించే డంజో మొబైల్ యాప్, వెబ్‌సైట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఇప్పటి వరకు కంపెనీ సీఈఓగా వ్యవహరించిన కబీర్ బిశ్వాస్ డంజోకు రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఇలా సర్వీసులు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయి. తాను ఫిప్‌కార్ట్ క్విక్ కామర్స్ విభాగంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే ఇంకా దీనిపై స్పష్టత రాలేదు.
గత ఏడాది కాలంగా డంజో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులే ఇలా సర్వీసులు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లేందుకు కారణమని కొందరు చెబుతున్నారు. జనవరి 2022లో రిలయన్స్ రిటైల్ నుంచి గణనీయంగా 200 మిలియన్ డాలర్ల(రూ.1,600 కోట్లు) పెట్టుబడితో సహా 450 మిలియన్ డాలర్లకు(సుమారు రూ.3500 కోట్లు) పైగా నిధులు సమీకరించినప్పటికీ డంజో తన మార్కెట్ స్థానాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేసింది. ఇప్పటికే సమీకరించిన నిధులతో కంపెనీ కార్యకలాపాల నిర్వహణ భారంగా మారింది. అదనపు ఈక్విటీని సమీకరించలేకపోవడంతో కంపెనీ మరింత నష్టాల్లో జారుకుంది. తీసుకున్న బకాయిలు చెల్లించకపోవడంతో డంజో రుణదాతలు కంపెనీని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్టీ)కు తీసుకెళ్లాయి. దాంతో పరిస్థితి మరింత దిగజారింది. డంజోలో 26% వాటాను కలిగి ఉన్న రిలయన్స్ రిటైల్, గూగుల్‌తో సహా ఇతర పెట్టుబడిదారులు అదనపు నిధుల సమీకరణకు సంబంధించిన చర్చల నుంచి దూరంగా ఉన్నారు.
ఇదీ చదవండి: ‘మీ లాభాల కోసం మేం చావలేం’
ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ బిశ్వాస్ సంస్థను వీడడం పెద్దదెబ్బగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇకమీదట డంజోను నిర్వహించడానికి బోర్డు లేదా నాయకత్వం లేకుండా పోయింది. పెండింగ్ జీతాలు, ఇన్వెస్టర్ల నిష్క్రమణ కారణంగా కంపెనీలోని చాలా మంది ఉద్యోగులు సంస్థను వీడారు. తమకు జీతాలు చెల్లించడం లేదంటూ కొందరు ఉద్యోగులు బిశ్వాస్‌పై ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో ఆయన ఫ్లిప్‌కార్ట్ క్విక్ కామర్స్ విభాగంలో చేరుతున్నారనే వార్తలు రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment