ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యన్ 90 గంటల పనిదినాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను కర్ణాటక స్టేట్ ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) తీవ్రంగా తప్పుబట్టింది. కార్మికుల శ్రేయస్సును పణంగా పెట్టి లాభాపేక్షతో అలుపెరగకుండా పని చేయించడం సరికాదని చెప్పింది. కంపెనీల లాభాల కోసం చావడానికి సిద్ధంగా లేమని కేఐటీయూ ప్రకటించింది. భారతీయ శ్రామిక శక్తిని అమానవీయంగా దోపిడీ చేయడం ద్వారా సుబ్రహ్మణ్యన్ సారథ్యం వహిస్తున్న కంపెనీ లాభాలు పొందుతుందని యూనియన్ ఆరోపించింది.
కేఐటీయూ కార్యదర్శి సూరజ్ నిడియాంగా మాట్లాడుతూ..‘యూనియన్ ఈ అంశాన్ని ఒంటరి ప్రకటనగా పరిగణించడం లేదు. గతంలో నారాయణమూర్తి వారానికి 70 గంటల పని విధానం కావాలని సూచించినప్పుడు కర్ణాటకలో అమలు చేసే ప్రయత్నం జరిగింది. కేఐటీయూ జోక్యం, ఉద్యోగుల ప్రతిఘటన కారణంగానే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎల్ అండ్ టీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి లాభాల కోసం మా ప్రాణాలను పణంగా పెట్టలేం’ అని చెప్పారు.
ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు ఇవే..
‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? భార్యను ఎంత సేపు చూడగలరు? భర్తలను భార్యలు ఎంత సేపు చూస్తారు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ఆదివారాలు కూడా ఆఫీసుకురండి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆయన కామెంట్లపై ప్రముఖులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ సంస్థల్లో పనిగంటలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, హెచ్‌సీఎల్ మాజీ సీఈఓ వినీత్ నాయర్ వంటి వ్యక్తులు పని గంటల పరిమాణం కంటే పని నాణ్యతపై దృష్టి పెట్టే అంశాన్ని నొక్కి చెప్పారు.
ఇదీ చదవండి: మెటా క్షమాపణలు చెప్పాలి.. పార్లమెంటరీ కమిటీ సమన్లు..?
అసలు ఉద్దేశంపై వివరణ
సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతని గమనించిన ఎల్ అండ్ టీ ఇటీవల దిద్దుబాటు చర్యలకు దిగింది. ‘ఇది భారతదేశపు దశాబ్దమని ఛైర్మన్ సుబ్రమణ్యన్ విశ్వసిస్తున్నారు. అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం. కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్‌ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ ఛైర్మన్ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయి’ అని ప్రకటన జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment