చౌక ధరకే ఒంటరి జీవితాల ఆకలి తీరుస్తున్న
‘కృష్ణాస్ లంచ్ బాక్స్’ ఇంటికే పంపిణీ చేస్తున్న వైనం
రోజుకు రూ.100 చొప్పున నెల ప్యాకేజీతో..
దయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం కూరలు సరఫరా
రూ.వందకు ఈ రోజుల్లో ఒక పూట భోజనం రావడమే కష్టం.. కర్రీ పాయింట్లలో మూడు రకాల కూరలు తీసుకుంటేనే రూ.50 నుంచి రూ.70 వరకు అవుతుంది. అలాంటిది ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం ఐదు రకాల కూరలు ఇంటికే సరఫరా చేస్తున్నారు ‘కృష్ణాస్ లంచ్ బాక్స్’ నిర్వాహకులు. వంట చేసుకోలేని ఒంటరివాళ్లు, వృద్ధులకు ఇది వరంగా మారుతోంది.
తెనాలి: ఆయనో డెబ్భై ఏళ్ల వృద్ధుడు. భార్య మరణించింది. బిడ్డలు ఎక్కడో నగరంలో ఉద్యోగాల్లో ఉన్నారు. సొంతూరు వదిలి వెళ్లాలని లేని ఆయన ఓపిగ్గా తిరుగుతున్నా ఇంట్లో వంట చేసుకోలేని అశక్తత.. భార్యాభర్తలిద్దరూ వృద్ధులు.. బిడ్డలు ఈ దేశంలోనే లేరు. అక్కడకు వెళ్లలేరు. ఇక్కడ తిండితిప్పలూ సొంతంగా చేసుకొనే ఓపిక లేదు.. ఇలాంటివారు ఎందరికో ఆంధ్రాప్యారిస్ తెనాలిలో ‘కృష్ణాస్ లంచ్ బాక్స్’ అక్షయపాత్రగా మారింది. కేవలం వంద రూపాయలకు ప్రతిరోజూ ఠంఛనుగా సమయానికి మూడు పూటలా వండిన ఆహారాన్ని ఇంటికే సరఫరా చేస్తోంది.
రెండున్నరేళ్ల క్రితం ఒక్కరితో ఆరంభం
తెనాలి చెంచుపేటలోని అమరావతి ప్లాట్స్‌లో సాధారణ డాబా ఇంటిలో నడుస్తోందీ ‘కృష్ణాస్ లంచ్ బాక్స్’ సోమవారం 11 గంటల ప్రాంతంలో ఆ ఇంటికి వెళ్లగానే ఒక పక్క వంటలు వండుతున్నారు. వండిన వంటలను క్యారేజి బాక్సుల్లో సర్దుతున్నారు. వాటిని తీసుకెళ్లేందుకు డెలివరీ బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. లంచ్ బాక్స్ నిర్వాహకురాలు పరుచూరి లక్ష్మి. విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా చేస్తున్న ఆమె కుమారుడు పవన్‌కుమార్, కోడలు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి శ్రీలేఖ ఆమెకు సహకారం అందిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం ఒక సహాయకుడితో కేవలం ఒక్కరికి భోజనం పంపటంతో ఆరంభించిన ఈ లంచ్ బాక్స్.. ఇప్పుడు 125 మందికిపైగా ఖాతాదారులకు రోజూ అందుతోంది. ఈ వినూత్నమైన ఆలోచన ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 మందికిపైగా ఉపాధి కలి్పస్తోంది.
ఓ వృద్ధుడి అభ్యర్థనతో నాంది
2022లో కంటి శుక్లం తీయించుకున్న పెద్దాయన ఒకరు ‘తెలిసినవాళ్లు ఎవరైనా రెండువారాలు భోజనం పంపుతారేమో చూసిపెట్టండి’ అని చేసిన అభ్యర్థన కృష్ణాస్ లంచ్ బాక్స్‌కు నాంది పలికింది. దగ్గర్లోనే ఉండే పెద్దాయనకు మనం వండుకుందే పంపితే సరిపోతుందని అనుకున్నారు. ఆ విధంగా రోజూ తాము చేసుకున్న బ్రేక్‌ఫాస్ట్, భోజనం, రాత్రికి మరోసారి అల్పాహారం పంపుతూ వచ్చారు. కరోనాతో తల్లి చనిపోయిన ఇద్దరు అన్నదమ్ములు ఈ విషయం తెలిసి, ‘మాక్కూడా ఇవ్వొచ్చు కదా’ అని అడిగారు. దగ్గర్లోని వేర్‌హౌసింగ్ గిడ్డంగి దగ్గరకు వ్యాహ్యాళి కోసం వచ్చే పెద్దలు మేం కూడా తీసుకుంటాం అంటూ ముందుకొచ్చారు. ఆ విధంగా కృష్ణాస్ లంచ్ బ్యాక్స్‌ను విస్తరించినట్టు లక్ష్మి వెల్లడించారు.
మెనూ ప్రకారమే..
ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల్లోపు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం 12.30 గంటలలోగా కూరలు, రాత్రి 7.30గంటల కల్లా టిఫిన్ ఖాతాదారులకు పంపుతున్నారు. పట్టణంతోపాటు పరిసరాల్లోని 125 మందికిపైగా లంచ్ బాక్స్ మూడుపూటలా వెళుతోంది. ఏరోజు ఏ బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేదీ మెనూలో ఉంది. వారంలో మూడురోజులు ఇడ్లీ, మిగిలిన నాలుగురోజులు దోసె, వడ, పూరీ, పెసరట్టు, సాయంత్రం రెండు రోజులు చపాతి, మిగిలిన ఐదు రోజులు గోధుమరవ్వ ఉప్మా, సెట్ దోశ, సాంబారు ఇడ్లీ, ఊతప్పం పంపుతున్నారు. మధ్యాహ్నం రోటి పచ్చడి, ఇగురుకూర, గుజ్జుకూర/పప్పు, పప్పుచారు, రసం చొప్పున ఐదు రకాలను అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఆదివారం కూరలతోపాటు చికెన్ కూర, ఎగ్ పులుసు, చేపల పులుసులో ఏదో ఒకటి పంపుతారు.
సమయానికి డెలీవరి..
ఆహారం సరఫరాకు ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలను సమకూర్చుకున్నారు. వాటిపై డెలివరీ బాయ్స్ ఇళ్లకు వెళ్లి ఇచ్చి వస్తుంటారు. బండి చెడిపోయి ఎక్కడన్నా ఆగిపోతే ఆ బాక్స్‌ను చేర్చటానికి ఇంట్లో మరో ఇద్దరు ప్రత్యామ్నాయంగా సిద్ధంగా ఉంటున్నారు. పెద్దవయసు వాళ్లు ఆకలికి ఆగలేరు. షుగర్, బీపీ వంటి మందులు వేసుకుంటారు. అందుకనే డెలివరీకి సమయపాలన పాటిస్తున్నట్టు నిర్వాహకురాలు లక్ష్మి వివరించారు.
లాభార్జన కోసం చేయటం లేదు
మేం వ్యాపారం చేస్తున్నామని అనుకోవటం లేదు. మానవత, సేవా దృష్టితోనే చేస్తున్నాం. పెద్దలను దృష్టిలో ఉంచుకుని వంటకాల్లో మసాలాలు వాడటం లేదు. ఉప్పూ, కారం తక్కువగానే ఉంటాయి. పెద్దలు రైస్‌ను ఇంట్లోనే కుక్కర్‌లో వండుకుంటున్నారు. తప్పనిసరి అంటే రైస్ కూడా పంపుతున్నాం.
– పరుచూరి లక్ష్మి, నిర్వాహకురాలు
Comments
Please login to add a commentAdd a comment