సాక్షి, ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్నారు. బోనకల్ మండలంలోని రామపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల జిల్లాలో కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించారు.
అయితే, ఖమ్మం పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ బస్సులోనే ఆహారం తీసుకున్నారు. హెలిప్యాడ్ వద్ద బస్సులో కూర్చున్న సీఎం కేసీఆర్.. పులిహోర తిన్నారు. పర్యటన సందర్భంగా షెడ్యూల్ బిజీగా ఉండటం కారణంగా సమయం వృథా కాకుడదనే ఉద్దేశ్యంతో కేసీఆర్ సహా మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు బస్సులోనే భోజనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు సీట్లో కూర్చుని పులిహోర, పెరుగన్నం, అరటిపండు తిన్నారు. ఆయన వెనుక సీట్లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్‌ఎస్ నేతలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి, సెక్రటరీ టు సీఎం స్మితా సబర్వాల్ సహా ఇతర అధికారులు భోజనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బస్సులో ఉన్న నేతలకు, అధికారులకు పులిహోర వడ్డించారు. ఈ క్రమంలో సరదాగా ముచ్చటించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లా పర్యటన సందర్బంగా రైతులకు సీఎం కేసీఆర్ కీలక హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రైతులతో సమావేశం నిర్వహించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా.. ఇటీవల కురిసిన వడగంట్ల వానల కారణంగా నాలుగు జిల్లాల్లోని పంటలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment