డబ్బావాలా ధర పెరిగింది
ఒక్కో లంచ్ బాక్స్‌పై రూ.100, వాటర్ బాటిల్‌పై రూ.50 పెంపు
సాక్షి, ముంబై: ఆటో.. ట్యాక్సీ.. బస్సు.. రైలు.. ఇలా అన్నింటి చార్జీలు పెరగడంతో ముంబై డబ్బావాలాలు కూడా తమ ధర(వేత నం)ను పెంచేశారు. కార్యాలయాలకు సరఫరా చేస్తున్న ఒక్కో లంచ్ బాక్స్‌పై రూ. 100 పెంచుతున్నట్లు ముంబై డబ్బావాలా యూనియన్ అధ్యక్షుడు భావుసాహెబ్ కరవందే ప్రకటించారు.
ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. లంచ్ బాక్స్‌తోపాటు వాటర్ బాటిల్ కూడా ఉంటే అదనంగా రూ.50 వసూలు చేయనున్నారు. ఇదివరకు ఒక్కో లంచ్ బాక్స్‌కు దూరాన్ని బట్టి రూ.500-800 వరకు వసూలు చేసేవారు. అలాగే వాటర్ బాటిల్ ఉంటే రూ.15-20 చొప్పున వసూలు చేసేవారు. ఇక నుంచి అదనంగా రూ.100, వాటర్ బాటిల్ ఉంటే రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రైవేటు, ప్రభుత్వ, ఇతర కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్లో అనేక మందికి అక్కడి క్యాంటీన్ భోజనం నచ్చకపోవడంతో కొందరు ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లను తెప్పించుకుంటారు. ఇలా ప్రతీరోజూ రెండు లక్షలకుపైగా ఉద్యోగులకు లంచ్ బాక్స్‌లను భోజన సమయానికి వారివారి కార్యాలయాలకు చేర వేయడం డబ్బావాలాల వృత్తి. వీరికి మేనేజ్‌మెంట్ గురు (సమయ పాలన కచ్చితంగా పాటిస్తారని)లనే పేరుంది. ఇటీవల అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడంతో గత్యంతరం లేక డబ్బావాలాలు కూడా చార్జీలు పెంచారు.
రెండు రోజుల సెలవు...
ఆషాడ ఏకాదశి పురస్కరించుకొని ఏటా పండరీపూర్‌లో పెద్ద ఎత్తున జరిగే ఉత్సవాలకు హాజరయ్యేందుకు డబ్బావాలాలందరూ అక్కడికి వెళ్లనున్నారు. అందుకు ఈ నెల 9, 10 తేదీల్లో విధులకు హాజరు కాలేమని ప్రకటించారు. ఏటా ఆషాడ ఏకాదశి పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పండరీపూర్‌లోని చంద్రబాగా నదిలో స్నానాలు చేయడం అనంతరం విఠలేశ్వరుడు, రుక్మిణీలను దర్శించుకోవడం వీరికి ఆనవాయితీగా వస్తోంది.