విద్యుత్ వాహనాలకు గత ప్రభుత్వంలోనే ప్రత్యేక పాలసీ
ఇవే విధానాలు తమవని చెప్పుకునేందుకు టీడీపీ సర్కారు యత్నం
కానీ, చార్జింగ్ స్టేషన్లలో వసూలుచేసే చార్జీలు పెంచేందుకు కసరత్తు
అప్పట్లో యూనిట్‌కు కేవలం రూ.12 చొప్పున వసూలుకు నిర్ణయం
ఇప్పుడు రూ.15 చొప్పున బాదుడు?
అలాగే, ముందొచ్చిన కొందరికే రాయితీలంట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్ల విధి విధానాలనే అమలుచేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ విధానాలను తమవని చెప్పుకునేందుకు పాకులాడుతోంది. కానీ, చార్జింగ్ కేంద్రాలను ప్రత్యేక కేటగిరి టారిఫ్ కిందకు తీసుకొచ్చి తక్కువ ధరకే విద్యుత్ అందించాలన్న వైఎస్ జగన్ నిర్ణయానికి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. యూనిట్ ఛార్జీలను పెంచాలని భావిస్తోంది.
ఇప్పుడు రాయితీలు కొందరికే..
చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకయ్యే ఖర్చులో 25 శాతం అంటే గరిష్టంగా రూ.10 లక్షల వరకూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. వాహనదారులు కొనుగోలు చేసే చార్జర్లపైనా 25 శాతం డిస్కౌంట్ అందించింది. అలాగే.. విద్యుత్ వాహనాలు, బ్యాటరీ తయారీ కేంద్రాలు, హైడ్రోజన్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భారీ ప్రోత్సాహకాలను గత ప్రభుత్వం ప్రకటించింది. మూలధన వ్యయంలో 25 శాతం వరకూ రాయితీ కల్పించింది. అది గరిష్టంగా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ ఉంది. విద్యుత్ సుంకాన్ని, స్టేట్ జీఎస్టీని వంద శాతం తిరిగిచ్చేసింది. అన్నిటికీ మించి ఈ–మొబిలిటీలో సరికొత్త పరిశోధనల కోసం రూ.500 కోట్ల నిధులను కేటాయించింది. కానీ, టీడీపీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ముందువచ్చిన కొందరికే రాయితీలు ఇచ్చేలా విధానాన్ని రూపొందిస్తోంది. అంతేకాక.. చార్జింగ్ కేంద్రాల్లో యూనిట్‌కు రూ.15 చొప్పున వసూలుచేయాలని భావిస్తోంది. తద్వారా విద్యుత్ వాహనదారులపై పెనుభారం మోపనుంది.
పాత పాలసీకే మెరుగులు..
ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త పాలసీని తీసుకొచి్చంది. ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున విద్యుత్ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది. అందుకు అవసరమైన నాలుగు వేల స్థలాలను అప్పట్లోనే గుర్తించింది. విజయవాడ, అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలను మోడల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నగరాలుగా గుర్తించింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల (పీసీఎస్)ను ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటుచేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనికి ఎటువంటి లైసెన్స్ అక్కర్లేదని చెప్పింది.
అయితే, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, బీఈఈ సూచించినట్లుగా అన్ని రకాల భద్రత, నాణ్యత ప్రమాణాలు ఈవీ స్టేషన్‌లో ఉండాలని సూచించింది. టెండర్లు ఆహ్వనించగా.. యూనిట్‌కు రూ.12 చొప్పున వసూలుచేసి, దాన్నుంచి డిస్కంలకు విద్యుత్ చార్జీ రూ.6, స్థల యజమానికి రూ.2.55 చెల్లిస్తామంటూ ఢిల్లీ, గుజరాత్, తమిళనాడుకు చెందిన సంస్థలు టెండర్లు వేశాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా కేవలం 1,028 చార్జింగ్ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో మన రాష్ట్రంలో 266 స్టేషన్లను జగన్ ప్రభుత్వం నెలకొల్పింది. మరో 115 స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధంచేసింది. ఈ నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్త పాలసీని రూపొందిస్తున్నామని చెబుతూ గత ప్రభుత్వ పాలసీకే మెరుగులు దిద్దుతోంది.
Comments
Please login to add a commentAdd a comment