సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ వాహనాల(ఈవీ)కు ఆదరణ పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ఇప్పటికే దేశంలో 6,586 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటికి అదనంగా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థతో కలిసి ఇంధన సంస్థలు మరో 22 వేల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది 7,432 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల వెంట 400 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు తెలిపాయి. అన్ని మోడల్ వాహనాలకు ఉపకరించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సరికొత్త ఈవీ చార్జింగ్ స్టేషన్ నమూనాను రూపొందించగా.. కేంద్రం ఆమోదించింది. వీటిని ఏర్పాటు చేసే ఇంధన కంపెనీలకు 70 శాతం రాయితీలను అందించనుంది.
ప్రస్తుతం దేశంలో ఉన్న చార్జింగ్ స్టేషన్ల కంటే.. కొత్త మోడల్ స్టేషన్ల ఏర్పాటుకు 40 శాతం తక్కువ వ్యయం అవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత్, జపాన్, కొరియన్, యూరోపియన్ తదితర ప్రాంతాల కంపెనీలు ఉత్పత్తి చేసే విద్యుత్ వాహనాలకు తక్కువ సమయంలోనే పూర్తి చార్జింగ్ చేసుకునేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల వాహనదారులకు సమయం కూడా ఆదా అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment