charging stations
-
రెండేళ్లలో ఈవీల వినియోగం వేగవంతం..
చెన్నై: దేశీయంగా ఈ రెండేళ్లలో (2025, 2026) విద్యుత్ ప్యాసింజర్ వాహనాల వినియోగం మరింత వేగవంతమవుతుందని హ్యుందాయ్ మోటర్ ఇండియా (హెచ్ఎంఐఎల్) సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో విద్యుత్ వాహనాల వినియోగం ప్రారంభ స్థాయిలో 2.4 శాతం స్థాయిలో ఉందని, 2030 నాటికి ఇది 17 శాతానికి చేరవచ్చనే అంచనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పెద్ద బ్రాండ్లు మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపారు. విద్యుత్ వాహనాల వినియోగ వృద్ధికి తమ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తోడ్పడగలదన్నారు. హ్యుందాయ్ సంస్థ భవిష్యత్తులో నాలుగు ఈవీలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దీని ధర రూ. 15–25 లక్షల శ్రేణిలో ఉండొచ్చని అంచనా. అటు మారుతీ సుజుకీ ఇండియా తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ’ఈ–విటారా’ను ఆవిష్కరించనుంది. మరోవైపు, చార్జింగ్ సదుపాయాలకు సంబంధించి 10,000 చార్జింగ్ పాయింట్ల వివరాలతో ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, దీన్ని ఇతర వాహనదారులు కూడా వినియోగించుకోవచ్చని గార్గ్ చెప్పారు. వీటిలో 7,500 పాయింట్లలో యాప్ ద్వారా నేరుగా చెల్లింపులు జరిపే సదుపాయం ఉందన్నారు. ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్–విజయవాడ, ముంబై–పుణె తదితర హైవేల్లోని 30 చార్జింగ్ స్టేషన్లలో 80 ఫాస్ట్ చార్జర్లను ఇన్స్టాల్ చేసినట్లు గార్గ్ వివరించారు. -
బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర విద్యుత్ శాఖ బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు (బీసీఎస్), బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల (బీఎస్ఎస్) ఓనర్లు, మార్చుకోతగిన బ్యాటరీలను చార్జ్ చేసేందుకు ప్రస్తుతమున్న విద్యుత్ కనెక్షన్‌నే ఉపయోగించుకోవచ్చు. కనెక్టెడ్ లోడ్‌ను పెంచుకున్నా, పెంచుకోకపోయినా ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. మెరుగైన స్వాపింగ్, చార్జింగ్ కోసం ట్రక్కులు, బస్సులు లాంటి భారీ వాహనాలు లిక్విడ్–కూల్డ్ స్వాపబుల్ బ్యాటరీలను వినియోగించవచ్చు. -
చార్జింగ్ వసతులకు రూ.16,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) కోసం దేశంలో పెరుగుతున్న పబ్లిక్ చార్జింగ్ డిమాండ్‌ను తీర్చడానికి.. అలాగే 2030 నాటికి 30 శాతానికి పైగా ఈవీలు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి భారత్‌కు రూ.16,000 కోట్ల మూలధన వ్యయం అవసరమని ఫిక్కీ సోమవారం విడుదల చేసిన నివేదిక తెలిపింది. ‘ప్రస్తుతం ఈవీ చార్జింగ్ స్టేషన్ల వినియోగం 2 శాతం లోపే ఉంది. దీంతో ఇవి లాభసాటిగా లేవు. ఇవి లాభాల్లోకి రావడానికి, మరింత విస్తరణ చెందేందుకు 2030 నాటికి వీటి వినియోగాన్ని 8–10 శాతానికి చేర్చే లక్ష్యంతో పనిచేయాలి. ఇంధన వినియోగంతో సంబంధం లేకుండా స్థిర ఛార్జీలతో విద్యుత్ టారిఫ్ ఉండడం, అలాగే పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో తక్కువ వినియోగం కారణంగా బ్రేక్ ఈవె న్ సాధించడం సవాలుగా మారింది. యూపీ, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాలు సున్నా లేదా తక్కు వ స్థిర సుంకాలను కలిగి ఉన్నాయి. అయితే స్థిర సుంకాలు ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో మనుగడ సవాలుగా మారింది’ అని నివేదిక తెలిపింది. అనుమతి అవసరం లేని.. స్వచ్ఛ ఇంధనం, సుస్థిరత వైపు భారత పరివర్తనను ప్రారంభించడానికి విధాన రూపకర్తలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలతో సహా కీలక వాటాదారులు రంగంలోకి దిగాలి. పబ్లిక్ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచడానికి పరిమిత ఆర్థిక సాధ్యత, డిస్కమ్ లేదా విద్యుత్ సంబంధిత సమస్యలు, భూమి సమస్యలు, కార్యాచరణ సవాళ్లు, ప్రామాణీకరణ మరియు ఇంటర్–ఆపరేబిలిటీ వంటి కీలక సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈవీ వ్యవస్థ అంతటా పన్నుకు అనుగుణంగా చార్జింగ్ సేవలకు జీఎస్టీ రేట్లను 18 నుండి 5 శాతానికి ప్రామాణీకరించాలి. అన్ని రాష్ట్రాలలో స్థిర ధరలతో రెండు–భాగాల టారిఫ్ నుండి సింగిల్–పార్ట్ టారిఫ్‌కు మార్చాలి. ఎలక్ట్రిక్ త్రీవీలర్ కొనుగోలు కోసం ఎటువంటి అనుమతి అవసరం లేని విధానాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. అలాగే సీఎన్జీ త్రీ–వీలర్ నుండి ఎలక్ట్రిక్‌కు మారడానికి అదే అనుమతిని ఉపయోగించేలా వెసులుబాటు ఇవ్వాలి’ అని నివేదిక పేర్కొంది. టాప్–40 నగరాల్లో..చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్‌మ్యాప్ అమలును ప్రారంభించడానికి, పర్యవేక్షించడానికి పరిశ్రమల వాటాదారులు, రాష్ట్ర, కేంద్ర అధికారుల ప్రాతినిధ్యంతో రాష్ట్ర–స్థాయి సెల్‌ను ఏర్పాటు చేయాలి. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను సకాలంలో స్థాపించేందుకు రాష్ట్ర డిస్కమ్‌ల కోసం ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల యొక్క సంస్థాపన, నిర్వహణకై విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఉండాలి. 2015 నుండి 2023–24 వరకు ఈవీ విక్రయాల ఆధారంగా విశ్లేషించిన 700లకుపైగా నగరాలు, పట్టణాల్లోని టాప్–40, అలాగే 20 హైవేల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుత ఈవీ స్వీకరణ రేటు, అనుకూల రాష్ట్ర విధానాలను బట్టి ఈ ప్రధాన 40 నగరాలు, పట్టణాలు రాబోయే 3–5 సంవత్సరాలలో అధిక ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తిని కలిగి ఉంటాయని అంచనా. ఈ 20 హైవేలు 40 ప్రాధాన్యత నగరాలను కలుపుతున్నాయి. మొత్తం వాహనాల్లో ఈ నగరాల వాటా 50 శాతం’ అని నివేదిక వివరించింది. -
హైవేల పక్కనే ఈవీ స్టేషన్లు
జాతీయ రహదారులను ఆనుకుని ఈవీ చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పే ప్రణాళికను వేగవంతం చేయాలని జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ(ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్–2024’ కార్యక్రమం కింద వాటిని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దేశంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే దిశగా మౌలిక సదుపాయాల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రెండు పెట్రోలియం కంపెనీల భాగస్వామ్యంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికను ఆమోదించారు. – సాక్షి, అమరావతి దేశంలో జాతీయ రహదారులను ఆనుకుని మొత్తం 7,432 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఇందుకోసం భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలతో కలసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ పెట్రోలియం కంపెనీలకు రూ.800 కోట్లు సబ్సిడీగా ఇచ్చేందుకు ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలిపింది. మొదటి దశలో 5,833 ఈవీ స్టేషన్లు ఏర్పాటుకు ఎన్హెచ్ఏఐ కార్యాచరణకు ఉపక్రమించింది. రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఎంపిక చేసిన జాతీయ రహదారులను ఆనుకుని ప్రతి 50 కి.మీ.కు ఒకటి చొప్పున ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.వచ్చే ఏడాది జూన్ నాటికి ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం.దేశంలో ఏర్పాటు చేయనున్న మొత్తం ఈవీ చార్జింగ్ స్టేషన్లు 7,432మొదటి దశలోఏర్పాటు చేయనున్న ఈవీ స్టేషన్లు 5,833 మన రాష్ట్రంలో మొదటి దశలో చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారిలో ఏర్పాటు చేసే స్టేషన్లు 230 -
‘ఈ–ప్రోత్సాహం’ కొందరికే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్ల విధి విధానాలనే అమలుచేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ విధానాలను తమవని చెప్పుకునేందుకు పాకులాడుతోంది. కానీ, చార్జింగ్ కేంద్రాలను ప్రత్యేక కేటగిరి టారిఫ్ కిందకు తీసుకొచ్చి తక్కువ ధరకే విద్యుత్ అందించాలన్న వైఎస్ జగన్ నిర్ణయానికి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. యూనిట్ ఛార్జీలను పెంచాలని భావిస్తోంది.ఇప్పుడు రాయితీలు కొందరికే.. చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకయ్యే ఖర్చులో 25 శాతం అంటే గరిష్టంగా రూ.10 లక్షల వరకూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. వాహనదారులు కొనుగోలు చేసే చార్జర్లపైనా 25 శాతం డిస్కౌంట్ అందించింది. అలాగే.. విద్యుత్ వాహనాలు, బ్యాటరీ తయారీ కేంద్రాలు, హైడ్రోజన్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భారీ ప్రోత్సాహకాలను గత ప్రభుత్వం ప్రకటించింది. మూలధన వ్యయంలో 25 శాతం వరకూ రాయితీ కల్పించింది. అది గరిష్టంగా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ ఉంది. విద్యుత్ సుంకాన్ని, స్టేట్ జీఎస్టీని వంద శాతం తిరిగిచ్చేసింది. అన్నిటికీ మించి ఈ–మొబిలిటీలో సరికొత్త పరిశోధనల కోసం రూ.500 కోట్ల నిధులను కేటాయించింది. కానీ, టీడీపీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ముందువచ్చిన కొందరికే రాయితీలు ఇచ్చేలా విధానాన్ని రూపొందిస్తోంది. అంతేకాక.. చార్జింగ్ కేంద్రాల్లో యూనిట్‌కు రూ.15 చొప్పున వసూలుచేయాలని భావిస్తోంది. తద్వారా విద్యుత్ వాహనదారులపై పెనుభారం మోపనుంది.పాత పాలసీకే మెరుగులు.. ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త పాలసీని తీసుకొచి్చంది. ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున విద్యుత్ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది. అందుకు అవసరమైన నాలుగు వేల స్థలాలను అప్పట్లోనే గుర్తించింది. విజయవాడ, అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలను మోడల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నగరాలుగా గుర్తించింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల (పీసీఎస్)ను ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటుచేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనికి ఎటువంటి లైసెన్స్ అక్కర్లేదని చెప్పింది.అయితే, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, బీఈఈ సూచించినట్లుగా అన్ని రకాల భద్రత, నాణ్యత ప్రమాణాలు ఈవీ స్టేషన్లో ఉండాలని సూచించింది. టెండర్లు ఆహ్వనించగా.. యూనిట్‌కు రూ.12 చొప్పున వసూలుచేసి, దాన్నుంచి డిస్కంలకు విద్యుత్ చార్జీ రూ.6, స్థల యజమానికి రూ.2.55 చెల్లిస్తామంటూ ఢిల్లీ, గుజరాత్, తమిళనాడుకు చెందిన సంస్థలు టెండర్లు వేశాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా కేవలం 1,028 చార్జింగ్ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో మన రాష్ట్రంలో 266 స్టేషన్లను జగన్ ప్రభుత్వం నెలకొల్పింది. మరో 115 స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధంచేసింది. ఈ నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్త పాలసీని రూపొందిస్తున్నామని చెబుతూ గత ప్రభుత్వ పాలసీకే మెరుగులు దిద్దుతోంది. -
జియో-బీపీ 500వ ఈవీ చార్జింగ్ స్టేషన్ ప్రారంభం
న్యూఢిల్లీ: జియో–బీపీ 500వ పల్స్ ఈవీ–చార్జింగ్ స్టేషన్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ ముకేశ్ అంబానీ, బీపీ సీఈవో ముర్రే ఆషిన్‌క్లాస్ గురువారం ప్రారంభించారు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ ప్లాజా, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కి వచ్చే వారికి ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.రిలయన్స్–బీపీ కలిసి ఇంధనాల విక్రయం, చార్జింగ్ ఇన్ఫ్రా కోసం జాయింట్ వెంచర్‌గా జియో–బీపీని ఏర్పాటు చేశాయి. కంపెనీ అత్యంత వేగంగా ఈవీ చార్జింగ్ పాయింట్లను విస్తరించింది. ఏడాది వ్యవధిలోనే 1,300 నుంచి 5,000కు పెంచుకుంది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతమయ్యేందుకు జియో–బీపీ కృషి చేస్తున్నాయని అనంత్ అంబానీ తెలిపారు. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు వ్యూహాత్మక ప్రాంతాల్లో వేగవంతమైన చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడంపై దృష్టి పెడుతున్నట్లు ముర్రే వివరించారు. -
ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఊరట
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రివర్గం కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. ఈ కొత్త స్కీమ్ పేరు ''పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్'' (PM E-DRIVE). ఇది మార్చి వరకు తొమ్మిదేళ్లపాటు అమలులో ఉన్న ప్రస్తుత 'ఫేమ్' ప్రోగ్రామ్‌ను భర్తీ చేస్తుంది.ఈ కొత్త పథకం ద్వారా ఎలక్ట్రిక్ కార్లకు ఎటువంటి సబ్సిడీలు లభించదు. కానీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, బస్సులకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. దీనికోసం కేంద్రం రెండేళ్లకు రూ. 10900 కోట్లు కేటాయించారు. ఇందులో హైబ్రిడ్ అంబులెన్స్‌లు, ఎలక్ట్రిక్ ట్రక్కులకు కూడా కొంత ప్రోత్సాహాలు లభిస్తాయి.పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ కింద 88500 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్' ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు వైష్ణవ్ విలేకరులతో చెప్పారు.రాష్ట్ర రవాణా సంస్థలు & ప్రజా రవాణా సంస్థల ద్వారా 14,028 ఎలక్ట్రిక్ బస్సుల సేకరణకు రూ.4,391 కోట్లు అందించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, పూణె, హైదరాబాద్‌ల వంటి 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న తొమ్మిది నగరాల్లో CESL ద్వారా డిమాండ్ అగ్రిగేషన్ చేయనున్నారు. రాష్ట్రాలతో సంప్రదించిన తరువాత ఇంటర్సిటీ, ఇంటర్‌స్టేట్ ఎలక్ట్రిక్ బస్సులకు కూడా మద్దతు లభిస్తుంది.ఎలక్ట్రిక్ అంబులెన్స్‌ల ఏర్పాటు చేయడానికి కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. రోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రిక్ ట్రక్కుల ప్రోత్సహించేందుకు కూడా రూ.500 కోట్లు అందించారు.ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాలేషన్స్భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పటికి కూడా చాలామంది కొనుగోలు చేయకపోవడానికి ప్రధాన కారణం.. ఛార్జింగ్ సదుపాయాలు లేకపోవడమే. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయనుంది. ఎంపిక చేసిన నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేయనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ కోసం 22,100 ఫాస్ట్ ఛార్జర్లు, ఈ-బస్సుల కోసం 1,800 ఫాస్ట్ ఛార్జర్లు, టూ వీలర్ & త్రీ వీలర్స్ కోసం 48400 ఫాస్ట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు సమాచారం. దీనికోసం రూ. 2000 కోట్లు వెచ్చించారు. -
గూగుల్ ‘మ్యాప్’ వార్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఓలా మ్యాప్స్ నుంచి పోటీ తీవ్రతరం కావడంతో గూగుల్ జోరు పెంచింది. భారత్‌లో యూజర్లను ఆకట్టుకోవడం కోసం గురువారం పలు సరికొత్త ఫీచర్లను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ స్టేషన్లు, ఫ్లైఓవర్లతో పాటు కారు డ్రైవర్లు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా ఏఐ ఆధారిత రూటింగ్ సమాచారం వంటివి ఇందులో ఉన్నాయి. ఓలా ఫౌండర్, సీఈఓ భవీశ్ అగర్వాల్ దేశీ డెవలపర్ల కోసం ఓలా మ్యాప్స్‌ను అందుబాటులోకి తీసుకొచి్చన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, గూగుల్ మ్యాప్స్‌ను వాడొద్దని కూడా ఆయన పిలుపునివ్వడంతో మ్యాప్స్ వార్‌కు తెరలేచింది. దేశీ డెవలపర్లకు గాలం వేయడానికి ఏడాది పాటు ఓలా మ్యాప్స్‌ను ఉచితంగా వాడుకునే సదుపాయాన్ని కూడా అగర్వాల్ ప్రకటించడం విశేషం. దీంతో గూగుల్ కూడా వెంటనే రంగంలోకి దిగింది. గూగుల్ మ్యాప్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే డెవలపర్లకు ఆగస్ట్ 1 నుంచి 70 శాతం వరకు ఫీజులను తగ్గిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దేశీ యూజర్లకు మేలు చేసేందుకే... ఓలా పోటీ కారణంగానే ధరల కోత ప్రకటించాల్సి వచి్చందా అన్న ప్రశ్నకు గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్, జీఎం మిరియమ్ డేనియల్ స్పందిస్తూ... వాస్తవానికి పోటీ సంస్థలపై మేము దృష్టి సారించమని, తమ యూజర్లు, డెవలపర్ల ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘మా పార్ట్నర్స్ చాన్నాళ్లుగా ధరలను తగ్గించాలని కోరుతున్నారు. మా యూజర్లతో పాటు డెవలపర్లకు మేలు చేయడంపై దృష్టి సారించాం. అందులో భాగంగానే రేట్ల కోతను ప్రకటించాం. వ్యాపార సంస్థలు, డెవలపర్లు, ప్రజలకు డిజిటల్ మ్యాపింగ్‌ను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడం కోసమే ఏఐ ఆధారిత రూటింగ్ తదితర కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాం’ అని వివరించారు. భారత్‌లో ఇరుకు రోడ్లు అనేవి కారు డ్రైవర్ల సహనానికి పరీక్ష పెడుతుంటాయని, అందుకే వాటిని తప్పించుకునే విధంగా ఏఐ ఆధారిత రూటింగ్ ఆల్గారిథమ్ వ్యవస్థను తీర్చిదిద్దామని చెప్పారు. శాటిలైట్ చిత్రాలు, స్ట్రీట్ వ్యూతో పాటు భవనాల మధ్య దూరం, రోడ్ల రకాల వంటి సమాచారంతో రోడ్ల కచి్చతమైన వెడల్పును మ్యాప్స్‌లో చూడొచ్చని, తద్వారా సాధ్యమైనంత వరకు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా తప్పించుకునేందుకు వీలవుతుందని బ్లాగ్ పోస్ట్‌లో వివరించారు. మరోపక్క, బైకర్లు, పాదచారులు, ఇతర ప్రయాణికులు ఇప్పుడు ఈ ఇరుకు రోడ్లలో మరింత సురక్షితంగా, నమ్మకంగా వెళ్లొచ్చని చెప్పారు. అలాగే సంబంధిత రూట్లో ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు ఉన్నాయో కూడా ముందుగానే తెలియజేసే ఫీచర్ కూడా భారత్‌లో యూజర్లకు చాలా బాగా ఉపయోగపడుతుందన్నారు.ముందుగా ఎనిమిది నగరాల్లో... హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, ఇండోర్, భోపాల్, భువనేశ్వర్, గౌహతి మొత్తం 8 నగరాల్లో ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్ పరికరాల్లో ఈ వారంలోనే అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని నగరాలతో పాటు ఐఓఎస్, కార్ప్లే సపోర్ట్‌ను కూడా త్వరలో తీసుకొస్తామని గూగుల్ పేర్కొంది. టూవీలర్ ఈవీ యూజర్లు చార్జింగ్ స్టేషన్ల సమాచారాన్ని అందించేందుకు ఎలక్ట్రిక్ పే, అథర్, కాజామ్, స్టాటిక్ వంటి దిగ్గజ చార్జింగ్ ప్రొవైడర్లతో గూగుల్ జట్టు కట్టింది. తద్వారా 8,000 చార్జింగ్ స్టేషన్ల సమాచారం దేశీయంగా గూగుల్ మ్యాప్స్‌తో పాటు గూగుల్ సెర్చ్‌లో కూడా లభిస్తుంది. కాగా, ఈ ఫీచర్‌ను తొలిసారిగా భారత్‌లోనే ప్రవేశపెట్టడం గమనార్హం. -
ఇక నిశ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేయొచ్చు!.. ఎందుకో తెలుసా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ కారణంగా కొంత మంది ఇప్పటికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో ఎంజీ మోటార్ ఇండియా.. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌తో చేతులు కలిపింది.ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడానికి ఎంజీ మోటార్.. హెచ్పీసీఎల్లో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది. రెండు కంపెనీలు హైవేలపై, ప్రధాన నగరాల్లోని ఎంపిక చేసిన ప్రదేశాలలో 50 kW, 60 kW DC ఫాస్ట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేయనున్నారు. ఫలితంగా ఇకపై ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునేవారు నిశ్చింతగా కొనేయొచ్చు.‘‘భారతదేశంలో హెచ్‌పీసీఎల్ భారీగా విస్తరిస్తోంది. ఈ సంస్థతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతాయి. బ్యాటరీ రీసైక్లింగ్ & బ్యాటరీల పునర్వినియోగం వంటి అంశాలపై కొత్తగా సమర్థమైన చర్యలు తీసుకోవచ్చు.’’ అని ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు.దేశమంతటా 15,000 ఛార్జింగ్ స్టేషన్స్ఇప్పటికే ఎంజీ మోటార్ కంపెనీ.. టాటా పవర్ డెల్టా ఎలక్ట్రానిక్స్, ఫోర్టమ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో భారతదేశం అంతటా 15,000 పబ్లిక్, ప్రైవేట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేసింది. పబ్లిక్ EV ఛార్జర్ల ఇన్స్టాలేషన్ కోసం ఈ కార్ల తయారీ సంస్థ భారత్ పెట్రోలియం, జియో-బీపీతో భాగస్వామ్యాన్ని కూడా ప్రకటించింది.హెచ్‌పీసీఎల్ 3600 ఛార్జింగ్ స్టేషన్స్హెచ్పీసీఎల్ కంపెనీ కూడా అనేక కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు, ఛార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లు దేశవ్యాప్తంగా పెట్రోల్ స్టేషన్లలో ఈవీ ఛార్జీల నెట్‌వర్క్‌ను విస్తరించాయి. హెచ్‌పీసీఎల్ దేశవ్యాప్తంగా 3600 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ కలిగి ఉంది. ఈ సంఖ్యను 2024 చివరి నాటికి 5000కు పెంచాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. -
ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఛార్జింగ్ సమస్యకు చెక్!
వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) కీలక ప్రకటన చేసింది. తమిళనాడు కేంద్రంగా మొత్తం 100 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. భారత్‌లో హ్యుందాయ్ మోటార్స్ 28 వసంతాలు పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా 180 కిలోవాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను చైన్నై అంతటా ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఐఎల్ ఎక్జిక్యూటీవ్ డైరెక్టర్ జే వాంగ్ ర్యూ తెలిపారు.హ్యుందాయ్ ‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’ విజన్‌కు అనుగుణంగా మేం వాహనదారుల సౌకర్యాన్ని మెరుగు పరిచే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాం. కాబట్టే తమిళనాడు అంతటా 100 ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేయడానికి, ఈవీ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచడానికి, రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు ఈవీలను వినియోగించేలా ప్రోత్సహించేలా ప్రయత్నిస్తున్నట్లు జే వాంగ్ ర్యూ వెల్లడించారు. ఫాస్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌తో పాటు, ప్రస్తుతం తమిళనాడులో అందుబాటులో ఉన్న 170 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లు కస్టమర్ సౌలభ్యం కోసం మై హ్యుందాయ్ యాప్‌లోని ఈవీ ఛార్జ్ విభాగంలో మ్యాప్ చేసింది. తద్వారా ఈవీ వాహనదారులు ఛార్జింగ్ పాయింట్లలో తమ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. హ్యుందాయ్ ఈవీ వినియోగదారులే కాకుండా ఇతర వాహన యజమానులు ఛార్జింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు అని హ్యుందాయ్ స్పష్టం చేసింది. -
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ప్రముఖ కంపెనీ.. ధర ఎంతంటే..
విద్యుత్ వాహనాల వినియోగదారులు ఛార్జింగ్ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 11 అల్ట్రా ఫాస్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. హైదరాబాద్‌తోపాటు ముంబై, పుణె, అహ్మదాబాద్, గురుగావ్, బెంగళూరులో ఈ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితోపాటు జాతీయ రహదారులైన దిల్లీ-ఛండీగఢ్, దిల్లీ-జైపూర్, హైదరాబాద్-విజయవాడ, ముంబై-సూరత్, ముంబై-నాసిక్ రోడ్లపై ఐదు అల్ట్రా ఫాస్ట్ డీసీ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పింది. ఈ ఛార్జింగ్ స్టేషన్లు రోజంతా తెరిచివుండనున్నాయని సంస్థ తెలిపింది. ఒక్కో స్టేషన్లలో డీసీ 150 కిలోవాట్లు, డీసీ 60 కిలోవాట్లు, డీసీ 30 కిలోవాట్ల సామర్థ్యంతో మూడు ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయిని చెప్పింది. హ్యుందాయ్ కస్టమర్లతోపాటు ఇతర కస్టమర్లు కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ స్టేషన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లాంగ్‌డ్రైవ్ చేసేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయని పేర్కొంది. ఇదీ చదవండి: డ్రాగన్‌మార్ట్‌కు పోటీగా ‘భారత్‌మార్ట్’.. ఎక్కడో తెలుసా.. కేవలం 21 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం ఛార్జింగ్ అవుతుండడంతో సమయం ఆదాకానుందని పేర్కొంది. 30 కిలోవాట్ల ఛార్జర్ ఒక్కో యూనిట్‌పై రూ.18, 60 కిలోవాట్ల ఛార్జర్ యూనిట్‌పై రూ.21, 150 కిలోవాట్ల ఛార్జర్ యూనిట్‌కు రూ.24 ధర నిర్ణయించారు. ఛార్జింగ్ స్లాట్‌ను ముందస్తు బుకింగ్‌తోపాటు చెల్లింపులు జరుపుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది. ఈ ఏడాదిలో మరో 10 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ వివరించింది. -
విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు ఇంధన పొదుపులో భాగంగా మార్కెట్లోకి వస్తున్న విద్యుత్ వాహనాలకు చార్జింగ్ అందించడానికి అన్ని ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. రాష్ట్రంలో అమలవుతున్న సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో విద్యుత్ కొరత రాకుండా సౌర విద్యుత్‌ను పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావడానికి రాష్ట్రంలోని జలాశయాలపై సోలార్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ రూఫ్‌టాప్ సిస్టం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సంప్రదాయేతర ఇంధన విద్యుదుత్పాదనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వాటిని తక్షణమే పరిశీలించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆ రాయితీలను ప్రజలకు వివరించండి రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి గృహ వినియోగదారులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై అవగాహన కల్పించి ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గృహ వినియోగదారులు ఒక కిలో వాట్ సౌర విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే..రూ. 18 వేలు రాయితీ ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. మూడు కిలో వాట్స్ నుంచి పది కిలో వాట్స్ వరకు కిలో వాట్ కు రూ. 9 వేలు లెక్కన ప్రభుత్వం రాయితీ ఇస్తోందనీ, దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. -
ఎలక్ట్రిక్ బస్సుల అమ్మకాలు రెండింతలు
ముంబై: చార్జింగ్ స్టేషన్లపరమైన కొరత, ఇతరత్రా రిస్కులు ఉన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ బస్సుల (ఈ–బస్సులు) అమ్మకాలు రెండింతలు పెరగవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. పాలసీలు, వ్యయాలపరంగా సానుకూలత దన్నుతో మొత్తం బస్సుల విక్రయాల్లో వాటి వాటా 8 శాతానికి చేరవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఇది 4 శాతంగా ఉంది. ప్రజా రవాణా వ్యవస్థలో కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుండటం విద్యుత్ బస్సులకు సానుకూలమని క్రిసిల్ వివరించింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ పథకం కింద టెండర్ల ద్వారా రాష్ట్రాల ప్రజా రవాణా సంస్థలు ఈ–బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు, సాంప్రదాయ ఇంధనాలు, సీఎన్జీతో నడిచే బస్సులతో పోలిస్తే ఈ–బస్సుల కొనుగోలు వ్యయం ప్రాథమికంగా ఎక్కువగానే ఉన్నప్పటికీ స్థానికంగా తయారీ, బ్యాటరీ ఖరీదు తగ్గుదల, విస్తృతంగా తయారీ తదితర అంశాల కారణంగా వ్యయాలు తగ్గొచ్చని క్రిసిల్ డైరెక్టర్ సుశాంత్ సరోదే తెలిపారు. ఈ–బస్సుల ఓనర్íÙప్ వ్యయాలు పెట్రోల్/డీజిల్ లేదా సీఎన్జీ బస్సులతో పోలిస్తే 15–20 శాతం తక్కువగానే ఉంటాయన్నారు. వాటి జీవితకాలం 15 ఏళ్లు ఉండగా.. ఆరు–ఏడేళ్లలోనే బ్రేక్ఈవెన్ (లాభనష్ట రహిత స్థితి) సాధించవచ్చని (సగటున 330 రోజుల పాటు రోజుకు 250 కి.మీ. రన్ రేట్‌తో) సుశాంత్ వివరించారు. సవాళ్లూ ఉన్నాయి.. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి సానుకూలాంశాలు ఉన్నా, దానికి తగ్గట్లే సవాళ్లు కూడా ఉన్నాయని క్రిసిల్ వివరించింది. రాష్ట్రాల రవాణా సంస్థల ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటం వల్ల అంతిమంగా ఈ–బస్ ప్రాజెక్టులకు రుణదాతలు రుణాలివ్వడానికి వెనుకాడేలా చేస్తోందని పేర్కొంది. బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత రెండో సవాలని వివరించింది. నగరాల మధ్య బస్సులు నడిపే ఆపరేటర్లకు చార్జింగ్ సదుపాయాలే కీలకం. ఇటీవల ప్రకటించిన పీఎం–ఈ–బస్5 సేవా స్కీముతో చెల్లింపులపరంగా రుణదాతలకు కాస్త భరోసా లభించగలదని క్రిసిల్ రేటింగ్స్ టీమ్ లీడర్ పల్లవి సింగ్ తెలిపారు. ఈ–బస్ ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు రుణదాతలు సానుకూలంగా ఉండొచ్చని పేర్కొన్నారు. పీఎం–ఈబస్ సేవా స్కీము కింద కేంద్రం 169 నగరాల్లో 10,000 పైచిలుకు ఈ–బస్సులను వినియోగంలోకి తేవడం, 181 నగరాల్లో చార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది. -
15 నిమిషాల ఛార్జ్‌తో 500 కిమీ ప్రయాణం.. ఈవీ సెక్టార్లో సంచలన ఆవిష్కరణ
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఛార్జింగ్ సమస్య ఓ పెనుభారంగా మారుతోంది. దీనిని పరిష్కరించడానికి చైనీస్ ఆటోమేకర్ గీలీ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ 'జీకర్' (Zeekr) సరికొత్త ఛార్జింగ్ సొల్యూషన్ పరిచయం చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓ పెను మార్పును తీసుకువచ్చే క్రమంలో కంపెనీ జెజియాంగ్ ప్రావిన్స్‌లోని గీలీ హోల్డింగ్ గ్రూప్‌కు చెందిన బ్యాటరీ ప్లాంట్‌లో వినూత్న టెక్నాలజీ ఆవిష్కరించింది. దీని ద్వారా కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ చేసుకుంటే ఏకంగా 500 కిమీ (300 మైల్స్) ప్రయాణం చేయవచ్చని తెలుస్తోంది. జీకర్ ఆవిష్కరించిన ఈ టెక్నాలజీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ వేసుకునే సమయం కూడా చాలా ఆదా అవుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. చైనాలో జీకర్ ప్రత్యర్థి నియో( Nio) కూడా ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇలాంటి టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు CATL కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలలో పురోగతి సాధించింది. కంపెనీ Li Auto మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ మల్టీపర్పస్ వెహికిల్ MEGA కోసం ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలను పరిచయం చేసింది. ఇది కేవలం 12 నిమిషాల ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్ల (300 మైళ్ళు) డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఇదీ చదవండి: ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఇండియాలో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ భారతదేశంలో లేదు, కానీ కొన్ని కంపెనీల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్‌లో మాత్రం సుమారు 20 నుంచి 30 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం లేదా 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఎప్పుడూ ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించి ఛార్జ్ చేసుకోవడం వల్ల బ్యాటరీలో ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
‘ఈవీ’ ఇళ్లు..!
సాక్షి, హైదరాబాద్: ఇంధన వనరుల ధరలు రోజుకో రేటు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో చార్జింగ్ స్టేషన్ల అవసరం పెరిగింది. ఒకవైపు పెట్రోల్ బంక్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతుంటే.. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలలోనూ వీటిని నెలకొల్పుతున్నారు. జిమ్, స్విమ్మింగ్ పూల్ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్ పాయింట్ అనే ప్రత్యేకంగా ప్రకటించే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమేమీ లేదు. దీంతో ప్రస్తుతమున్న సాధారణ నివాస భవనాలలో ధరలు 1 శాతం మేర పెరిగితే.. ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన నివాస భవనాలలో ధరలు 2–5 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వాటా 40 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. దీంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్న భవనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్‌లోనే కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా ఈవీ పాయింట్ల ఏర్పాటు వ్యవస్థ 2026 నాటికి భారీగా పెరుగుతుంది. భవనాల రకం, సహజ వనరుల పునర్వినియోగ (రెట్రోఫిట్) ప్రాజెక్ట్‌ల నివాస తరగతులను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం నివాస ప్రాంతాలలో యజమానులు సరీ్వస్ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. పెద్ద స్థాయి ప్రాజెక్ట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిరీ్ణత రుసుములను వసూలు చేస్తున్నారు. రానున్న కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్ స్థలాన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్ల కోసం కేటాయించబడతాయని జేఎల్ఎల్ ఇండియా స్ట్రాటర్జిక్ కన్సల్టింగ్ అండ్ వాల్యువేషన్ అడ్వైజరీ హెడ్ ఏ శంకర్ తెలిపారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) చార్జింగ్ ఉపకరణాలు, ఇంటర్నెట్ లభ్యత కూడా అందుబాటులో ఉండాలి గనక.. ఇప్పటికే ఉన్న పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల భవనాలలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు వ్యయం, పరిమిత విద్యుత్ సరఫరా సామర్థ్యాలను బట్టి 1 శాతం ప్రీమియం ఉంటుందని పేర్కొన్నారు. 60 శాతం కంటే ఎక్కువ నివాసితులు ఈవీ చార్జింగ్ పాయింట్ల అవసరాన్ని కోరుకుంటుంటే ఈ ప్రీమియం 2–5 శాతం వరకు ఉంటుందని తెలిపారు. ఆఫీస్ స్పేస్‌లలో కూడా.. ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్ స్పేస్‌లకు కూడా డిమాండ్ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్ సరీ్వస్ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవెన్యూ షేర్ మోడల్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆఫీస్ పార్కింగ్‌లలో ఖాళీ ప్లేస్‌లు లేకపోవటమే అసలైన సవాలు. ఇప్పటికే ఉన్న కొన్ని కార్యాలయాలలోని పార్కింగ్‌లలో ఇలాంటి అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాయి. ప్రభుత్వ విభాగాలు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేట్ ఆపరేటర్లకు లీజుకు ఇవ్వొచ్చు లేదా దీర్ఘకాలానికి సంబంధిత భూమిని సరీ్వస్ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వొచ్చని జేఎల్ఎల్ సూచించింది. -
టాటా పవర్, ఐవోసీ జట్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 500 ఫాస్ట్, అల్ట్రా ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసే దిశగా టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్, ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చేతులు కలిపాయి. ఇందుకు సంబంధించి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం (ఎంవోయూ) ఐవోసీ రిటైల్ అవుట్‌లెట్స్‌లో టాటా పవర్ చార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేస్తుంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి పెద్ద నగరాలతో పాటు గుంటూరు–చెన్నై హైవే, సేలం–కొచ్చి హైవే వంటి జాతీయ రహదారుల వెంట వీటిని నెలకొల్పుతుంది. దీనితో సుదూర ప్రయాణాలు చేసే ఎలక్ట్రిక్ వాహనదారులు రేంజి (మైలేజి)పరంగా ఆందోళన చెందాల్సిన అవసరం తప్పుతుందని టాటా పవర్ హెడ్ (బిజినెస్ డెవలప్మెంట్ – ఈవీ చార్జింగ్) వీరేంద్ర గోయల్ తెలిపారు. చార్జర్ల లభ్యత గురించి టాటా పవర్ ఈజెడ్ చార్జ్, ఇండియన్ఆయిల్ ఈ–చార్జ్ మొబైల్ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. 2024 నాటికి 10,000 పైచిలుకు ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఐవోసీ ఈడీ సౌమిత్ర శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
ఇంజన్ల మోత ఉండదిక!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కర్బన ఉద్గారాలపై ఆందోళన ఎక్కువవుతోన్న నేపథ్యంలో విద్యుత్ వాహనాలు (ఈవీ)లకు ఆదరణ పెరుగుతోంది. ఏటా 10 లక్షలకు పైగా ఈవీలను వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. గతేడాది 10.4 లక్షల వాహన విక్రయాలు జరగ్గా..ఈ ఏడాది అది 13.8 లక్షలకు, 2030 నాటికి 30 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ ఏడాది అమ్ముడవుతోన్న మొత్తం ద్విచక్ర వాహనాల్లో 4.5% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో వాటికి అవసరమైన చార్జింగ్ స్టేషన్లూ భారీగా ఏర్పాటవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 6 వేల చార్జింగ్ స్టేషన్లు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నివేదిక ప్రకారం.. దేశంలో 9,113 పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు 15,493 ఈవీ చార్జర్లలో పనిచేస్తున్నాయి. వాహనాలకనుగుణంగా ఈవీ చార్జర్ల విక్రయాలూ పెరుగుతున్నాయి. అది ఎంతగా అంటే 2030 నాటికి దేశంలో ఈవీ చార్జర్ల డిమాండ్ ప్రస్తుతం ఉన్నదానికంటే 65% పెరుగుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ లెక్కన ఏడేళ్లలో 30 లక్షల చార్జర్లు అవసరమని కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ (సీఈఎస్), ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) సంయుక్త నివేదిక తెలిపింది. అప్పగించే పని మొదలైంది ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని రాష్ట్రంలో తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్‌లో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం, ఎన్ఆర్ఈడీసీఏపీ స్థలాలను గుర్తించాయి. నమోదు చేసుకున్న నిర్వాహకులకు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు బాధ్యతలను అప్పగించే పని మొదలైంది. – ఎస్ రమణారెడ్డి, వీసీ, ఎండీ, ఎన్ఆర్ఈడీసీఏపీ ప్రత్యేక పాలసీ..స్థిరమైన లక్ష్యం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ (వాయిదా)ప్రాతిపదికన లక్ష ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేస్తోంది. రోడ్డు పన్ను, రిజి్రస్టేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇంధన ఖర్చులు భారంగా మారిన నేటి కాలంలో దిగువ/మధ్య తరగతి ప్రజలకు సాయపడేలా సుస్థిర రవాణాను అభివృద్ధి చేయడానికి రాష్ట్రమంతటా చార్జింగ్ మౌలిక సదుపాయాలను న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) ఆధ్వర్యంలో 266 ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరో 115 స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ వాహనాల సంఖ్య 65,000 దాటింది. 2030 నాటికి పెట్రోల్ వాహనాలను దశల వారీగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా జాతీయ రహదారుల వెంబడి 25 కి.మీ ఒకటి చొప్పున, నగర పరిధిలో ప్రతి 3 కీలోమీటర్ల గ్రిడ్ లోపల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 4 వేల స్థలాలను గుర్తించింది. -
615 ‘ఎలక్ట్రిక్ ’ చార్జింగ్ కేంద్రాలు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లా, మండల కేంద్రాలు, హైవేలపై 615 ప్రాంతాల్లో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన సంస్థ(రెడ్కో) దరఖాస్తులను ఆహ్వానించింది. రెడ్కో చూపించిన స్థలాల్లోనే ఫాస్ట్, స్లో చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, విధివిధానాల కోసం హైదరాబాద్‌లోని తమ కేంద్ర కార్యాలయం/స్థానిక జిల్లా కార్యాలయాలను సందర్శించాలని రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ వెబ్సైట్ https:// tsredco.telangana.gov.in/ లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో పీపీపీ విధానంలో చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే యాదాద్రిలో ఏర్పాటు చేసిన తొలి చార్జింగ్ కేంద్రం విజయవంతంగా నడుస్తోందని సతీష్ రెడ్డి తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా రాష్ట్రమంతటా చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2025 కల్లా 3000 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెడ్కో స్వయంగా 150 ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని.. ఇందులో 90 కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయని వివరించారు. -
200 ఈవీ చార్జింగ్ పాయింట్ల సూపర్ హబ్.. ఎక్కడ?
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలకు చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే దిశగా ఎలక్ట్రిక్ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ప్రకృతి ఈ–మొబిలిటీ (ఎవెరా)తో చేతులు కలిపినట్లు అదానీ టోటల్ఎనర్జీస్ ఈ–మొబిలిటీ (ఏటీఈఎల్) తెలిపింది. దీనితో ఢిల్లీలో 200 ఈవీ చార్జింగ్ పాయింట్ల సూపర్ హబ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దేశవ్యాప్తంగా కూడా విస్తరించనున్నట్లు ఏటీఈఎల్ వివరించింది. అదానీ టోటల్ ఎనర్జీస్ ఈ-మొబిలిటీ లిమిటెడ్ అనేది అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్‌కు చెందిన విభాగం. ఇది భారతదేశంలో ఛార్జ్ పాయింట్లను నిర్వహిస్తోంది. -
షాకింగ్ న్యూస్: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ చేస్తే..
పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను ఛార్జింగ్ చేస్తే 18 శాతం చొప్పున జీఎస్టీ వర్తిస్తుందని కర్ణాటక అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే విషయాన్ని ఓ విద్యుత్ పంపిణీ సంస్థ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ సంస్థ ముందుకు తీసుకెళ్లింది. ఇందు కోసం వాహనదారుల నుంచి పన్నుతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఫీజును వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇందులో ఎనర్జీ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు అనే రెండు భాగాలు ఉంటాయి. ఎనర్జీ ఛార్జ్ అనేది వాహనదారులు వినియోగించే ఎనర్జీ యూనిట్ల సంఖ్యను సూచిస్తుంది. ఈ సందర్భంగా ఇంధన ఛార్జీలను వస్తువుల సరఫరాగా పరిగణిస్తారా లేదా సేవల సరఫరాగా పరిగణిస్తారా అనే సమస్య ప్రాథమికంగా తలెత్తింది. ఇందులో మొదటిది అయితే జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌ని విద్యుత్ సరఫరా కేటగిరి కింద పరిగణించాలా వద్దా అన్నది అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ముందున్న ప్రధాన సమస్య. ఇదీ చదవండి ➤ FAME 3: ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం! ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీని ఛార్జ్ చేయడం అంటే విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చే ప్రక్రియ అని రూలింగ్ అథారిటీ తెలిపింది. విద్యుత్ అనేది వస్తువుగా వర్గీకరించిన చరాస్తి. దాన్ని అలాగే కాకుండా బ్యాటరీల్లో రసాయన శక్తిగా మార్చి వినియోగదారులకు అందిస్తున్నారని అడ్వాన్స్ రూలింగ్ సంస్థ పేర్కొంది. ఈ సందర్భంగా అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక వివరణను కూడా ప్రస్తావిస్తూ.. ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ అనేది విద్యుత్ విక్రయం కిందకు రాదని, దాన్ని సర్వీస్ కిందే పరిగణించాలని స్పష్టం చేసింది. విద్యుత్ సరఫరా, సర్వీస్ ఛార్జీలను సర్వీస్ సప్లయిగా పరిగణించాలని, కాబట్టి 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తీర్మానించింది. -
‘ఈవీ’ ఏటీఎం.. ఏపీలో 12 సౌర విద్యుత్ చార్జింగ్ కేంద్రాలు
సాక్షి, అమరావతి: విద్యుత్ వాహనాల (ఈవీల) కోసం రాష్ట్రంలో అత్యాధునిక సౌర విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. వాహనాల యజమానులు ఈ సౌర చార్జింగ్ కేంద్రాల్లో కార్డు ద్వారా వారే డబ్బులు చెల్లించి, వారే వాహనానికి చార్జింగ్ పెట్టుకోవచ్చు. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఈ చార్జింగ్ కేంద్రాలకు అనుమతినిచ్చింది. తొలుత అనంతపురం, విజయవాడ, తిరుపతి నగరాల్లో 12 కేంద్రాలకు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. ఈ నగరాల్లో సౌర విద్యుత్ ప్యానళ్లతో చార్జింగ్ కియోస్‌్కలను రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) ఏర్పాటు చేస్తుంది. ఏటీఎం కార్డు ద్వారా డబ్బు చెల్లించి వాహనదారుడే చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) చేస్తుంది. రానున్న కాలం ‘ఈవీ’లదే దేశంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు 2030 నాటికి 30% విద్యుత్ కార్లు, 80 శాతం విద్యుత్ టూ వీలర్లు, 70 శాతం విద్యుత్ కమర్షియల్ వెహికల్స్ ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా 1 గిగా టన్ కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా వేసింది. దీంతోపాటు ఇంధనం దిగుమతులు తగ్గించటం ద్వారా 330 బిలియన్ డాలర్ల ఖర్చు తగ్గుతుంది. రానున్న ఎనిమిదేళ్లల్లో 66 శాతం వాహనదారులు విద్యుత్ వాహనాలనే వాడతారని ఈవీ మార్కెట్‌పై తాజా అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ వినూత్న చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఏడాదిలో 250 కేంద్రాలు దేశంలో 2070 నాటికి ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక ప్రయోజనాల కోసం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లాలని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పెట్రోల్, డీజిల్ చార్జీలు భారంగా ఉన్న దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలకు సహాయం చేయడానికి, స్థిరమైన రవాణాను అభివృద్ధి చేయడానికి రాష్ట్రం అంతటా చార్జింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 110 చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు, నగరాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తెచ్చేందుకు నెడ్‌క్యాప్ ప్రణాళికలు తయారు చేసింది. ప్రైవేట్ భూ యజమానులతో కలిసి 4 వేల లొకేషన్లను గుర్తించింది. రాష్ట్రంలో ఏడాదిలో 250 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వాయిదా పద్థతిలో లక్ష ఈ–వాహనాల పంపిణీతో పాటు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రోత్సాహకాలనిస్తోంది. ఖర్చు తక్కువ విద్యుత్ వాహనాలకు బ్యాటరీ చార్జింగ్, మెయింటెనెన్స్, ఆపరేషన్ ఖర్చులు తక్కువ. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఈవీలు సురక్షితమైనవి కూడా. రాష్ట్రంలో సుమారు 40 వేల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి. వాటితో పాటు భవిష్యత్‌లో పెరగనున్న ఈవీలన్నిటి కోసం చార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నాం. – కె విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
హ్యుందాయ్, షెల్ జోడీ.. ఎలక్ట్రిక్ వాహనదారులకు వెసులుబాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా ఎనర్జీ రంగంలో ఉన్న షెల్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హ్యుందాయ్‌కి చెందిన 36 డీలర్షిప్ కేంద్రాల వద్ద 60 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్లను షెల్ ఏర్పాటు చేస్తుంది. దేశంలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణను పెంచడం ఈ వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యం అని కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్‌న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన ‘కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడాన్ని వేగవంతం చేయడంలో ఇటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యాలు ప్రాథమికమైనవి’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. హ్యుందాయ్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల కోసం దేశవ్యాప్తంగా 45 నగరాల్లో 72 కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం, మరో 100 ఛార్జింగ్ స్టేషన్లకు కసరత్తు
సాక్షి, విజయవాడ: ఇంధన భద్రతను పెంచడానికి కర్బన ఉద్గారాలను తగ్గించడానికి వాతావరణంలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అత్యంత ఆశాజనక మార్గాలలో ఒకటైన ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని రాష్ట్రంలో తీసుకురావాలనే లక్ష్యంతో న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) రాష్ట్రంలో 250 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి వీలు కల్పించిందని ఇంధన, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక, గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. గురువారం విజయవాడ భవానీపురంలోని రీజినల్ సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్ ద్వారా పనిచేసే సైన్స్ ఎగ్జిబిడ్స్ కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరైనారని ఏపీసమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అంతకుముందు రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆవరణలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఆప్కోస్ట్) సహకారంతో ఎన్ఆర్ఈడీసీఏపీ ఏర్పాటు చేసిన పునరుత్పాదక ఇంధన వనరుల కేంద్రాన్ని(ఆర్ఈఆర్సీ) మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ లో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ఈ-మొబిలిటీకి ఒక నమూనాగా, పునరుత్పాదక ఇంధనానికి నాలెడ్జ్ హబ్ గా మారాలని మంత్రి ఆకాంక్షించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే పాలసీ రూపకల్పన, ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ ప్రాతిపదికన లక్ష ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేయడం, రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి ఈ -మొబిలిటీ కార్యకలాపాలను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. ఇంధన ఖర్చులు భారంగా మారిన నేటి కాలంలో దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలకు సాయపడేలా సుస్థిర రవాణాను అభివృద్ధి చేయడానికి రాష్ట్రమంతటా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్న న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ను మంత్రి అభినందించారు. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందన్నారు. భారతదేశం బయో ఇంధనాలు, సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ద్వారా ఇంధన దిగుమతులపై ఆధారపడకుండా తదుపరి స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుందని గుర్తుచేశారు. ఈ -మొబిలిటీని స్వీకరించడానికి దోహదపడే ఛార్జింగ్ స్టేషన్ల యొక్క బలమైన ఇంధన నెట్ వర్క్ ను నిర్మించే లక్ష్యంతో 2030 నాటికి పెట్రోల్ వాహనాలను దశలవారీగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందులో భాగంగా నగర పరిధిలో 3 కి.మీ x 3 కి.మీ గ్రిడ్ లోపల మరియు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ మరియు ఎనర్జీ కన్జర్వేటివ్ కాన్సెప్ట్ ల గురించి సందర్శించే విద్యార్థులకు సౌలభ్యంగా సుమారు 30 పునరుత్పాదక ఇంధన గాడ్జెట్ లను ప్రదర్శించడానికి ఆర్ఈఆర్ సీ ఏర్పాటుకు చొరవ చూపినందుకు ఈ సందర్భంగా ఎన్ఆర్ఈడీసీఏపీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. నెట్ జీరో ఎమిషన్స్ టూరిస్ట్ ప్లేస్ గా తిరుపతిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. తిరుపతిలో ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఇప్పటివరకు తిరుపతి పట్టణంలో సుమారుగా 100 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నా యన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయన్నారు. సంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రయోజనకరంగా ఉండటమేగాకుండా స్థానిక పర్యావరణాన్ని రక్షించి కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాయని సూచించారు. ఆర్ ఈఆర్ సీ సెంటర్ గురించి మాట్లాడుతూ అన్ని వయసుల విద్యార్థులకు అభ్యసన అవకాశాలను పెంపొందించేందుకు ఆర్ఈఆర్సీ దోహదపడుతుందన్నారు. అంతకుముందు విద్యుత్ వాహనాలను వాడుదాం-స్వావలంబన సాధిద్దాం, దేశ ప్రగతికి తోడ్పడుదాం లాంటి ఫ్లకార్డుల ప్రదర్శనతో మంత్రి పెద్దిరెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే సైన్స్ వరల్డ్ లో ఏర్పాటు చేసిన సర్ సీవీ రామన్, జగదీష్ చంద్రబోస్, ఆర్కిమెడిస్, ఆల్ బర్ట్ ఐన్ స్టీన్, చార్లెస్ డార్విన్, మేరీ క్యూరీ, బెంజ్ మెన్ ఫ్రాంక్లిన్,ఐజాక్ న్యూటన్, విక్రమ్ సారాబాయి, హోమీ జహంగీర్ బాబా తదితర శాస్త్రవేత్తలు వారు చేసిన కృషిని వివరిస్తూ ఉన్న ఎగ్జిబిషన్ ను, రీజినల్ సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు ఏర్పాటు చేసిన మినియేటర్ న్యూక్లియర్ గ్యాలరీని మంత్రి తిలకించారు. అనంతరం మారుతున్న కాలానికి అనుగుణంగా, డిజిటల్ టెక్నాలజీ యుగంలో వస్తున్న మార్పులను స్వాగతిస్తూ ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. రీజినల్ సైన్స్ సెంటర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయడంతో పాటు కాంపౌండ్ వాల్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, పర్యావరణం, అడవులు, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మ జనార్థన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఏ.చంద్రశేఖర్ రెడ్డి, సభ్య కార్యదర్శి డాక్టర్ వై. అపర్ణ, జనరల్ మేనేజర్లు కె.శ్రీనివాస్, జగదీశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.శ్రీనివాస్ రావు, ఎన్ఆర్ ఈడీసీఏపీ అధికారులు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
మరో 22 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లు
సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ వాహనాల(ఈవీ)కు ఆదరణ పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ఇప్పటికే దేశంలో 6,586 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటికి అదనంగా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థతో కలిసి ఇంధన సంస్థలు మరో 22 వేల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది 7,432 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల వెంట 400 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎన్హెచ్ఏఐ వర్గాలు తెలిపాయి. అన్ని మోడల్ వాహనాలకు ఉపకరించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సరికొత్త ఈవీ చార్జింగ్ స్టేషన్ నమూనాను రూపొందించగా.. కేంద్రం ఆమోదించింది. వీటిని ఏర్పాటు చేసే ఇంధన కంపెనీలకు 70 శాతం రాయితీలను అందించనుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న చార్జింగ్ స్టేషన్ల కంటే.. కొత్త మోడల్ స్టేషన్ల ఏర్పాటుకు 40 శాతం తక్కువ వ్యయం అవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత్, జపాన్, కొరియన్, యూరోపియన్ తదితర ప్రాంతాల కంపెనీలు ఉత్పత్తి చేసే విద్యుత్ వాహనాలకు తక్కువ సమయంలోనే పూర్తి చార్జింగ్ చేసుకునేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల వాహనదారులకు సమయం కూడా ఆదా అవుతుంది. -
చార్జింగ్ స్టేషన్లకు రూ.800 కోట్లు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ రంగంలోని మూడు చమురు కంపెనీలకు రూ.800 కోట్లు మంజూరు చేసినట్టు భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్–2 కింద ఈ మొత్తాన్ని సమకూరుస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీలు దేశవ్యాప్తంగా ఫిల్లింగ్ సెంటర్లలో 7,432 చార్జింగ్ కేంద్రాలను 2024 మార్చి నాటికి ఏర్పాటు చేస్తాయి. ఈ స్టేషన్స్‌లో ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, చిన్న బస్‌లకు చార్జింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఈ మూడు కంపెనీలకు తొలి విడతగా రూ.560 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,586 చార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కొత్తగా జోడించనున్న కేంద్రాలతో ఎలక్ట్రిక్ వాహన రంగానికి మంచి బూస్ట్‌నిస్తుందని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది.