సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లా, మండల కేంద్రాలు, హైవేలపై 615 ప్రాంతాల్లో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన సంస్థ(రెడ్కో) దరఖాస్తులను ఆహ్వానించింది.
రెడ్కో చూపించిన స్థలాల్లోనే ఫాస్ట్, స్లో చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, విధివిధానాల కోసం హైదరాబాద్‌లోని తమ కేంద్ర కార్యాలయం/స్థానిక జిల్లా కార్యాలయాలను సందర్శించాలని రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ వెబ్‌సైట్ https:// tsredco.telangana.gov.in/ లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు.
దేశంలోనే తొలిసారిగా..
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో పీపీపీ విధానంలో చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే యాదాద్రిలో ఏర్పాటు చేసిన తొలి చార్జింగ్ కేంద్రం విజయవంతంగా నడుస్తోందని సతీష్ రెడ్డి తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా రాష్ట్రమంతటా చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 2025 కల్లా 3000 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెడ్కో స్వయంగా 150 ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని.. ఇందులో 90 కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment