![EV charging stations:India needs 39 lakh charging stations by 2030](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/CHARGING-STATION.jpg.webp?itok=HaJ5Zm9s)
2030 నాటికి దేశంలో 39 లక్షల ఈవీ చార్జింగ్ స్టేషన్లు అవసరం
ప్రస్తుతం ఉన్నది 12,146 మాత్రమే..
‘గేమ్ చేంజర్ లా అడ్వైజర్స్ అండ్ స్పెషల్ ఇన్వెస్ట్’ నివేదికలో వెల్లడి
రాష్ట్రంలో విద్యుత్ వాహనాలపై గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక పాలసీ
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ వాహనాల(Electric vehicles)(ఈవీ) విప్లవం మొదలైంది. భవిష్యత్తులో రోడ్లపై పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్, హైడ్రోజన్‌తో పరుగులు తీసే వాహనాలే కనిపిస్తాయని ఇప్పటికే అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. అమెరికా వంటి దేశాల్లో డ్రైవర్ రహిత ఈవీలు క్యాబ్‌లుగా కూడా అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో ఇంకా ఆ స్థాయిలో ఈవీల వినియోగం పెరగలేదు. దీనికి ప్రధాన కారణం సరిపడా చార్జింగ్ స్టేషన్లు (EV charging)లేకపోవడమే. ఇదే విషయాన్ని ‘గేమ్ చేంజర్ లా అడ్వైజర్స్ అండ్ స్పెషల్ ఇన్వెస్ట్’ తాజాగా విడుదల చేసిన ‘చార్జింగ్ ఎహెడ్–2’ నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2030 నాటికి పెరిగే ఈవీలకు సరిపడా 39 లక్షల చార్జింగ్ స్టేషన్లు అవసరమని ప్రకటించింది.
కాలుష్యాన్ని తగ్గించాలంటే తప్పదు
⇒ దేశంలో 2024 మార్చి 31 నాటికి 41 లక్షల విద్యుత్ వాహనాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి మరో ఐదు లక్షల ఈవీలు పెరుగుతాయని అంచనా.
⇒ ప్రపంచంలో అత్యధిక కాలుష్యం గల దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి సంప్రదాయ వాహనాల స్థానంలో 30శాతం ఈవీ కార్లు, 80శాతం ఈవీ బైక్‌లు, 70శాతం ఈవీ కమర్షియల్ వాహనాలు ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
⇒ రానున్న ఐదేళ్లలో 8కోట్ల విద్యుత్ వాహనాలు రోడ్లమీద నడవాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా 2030 నాటికి ఒక గిగా టన్ కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా వేసింది.
⇒ దేశంలో ప్రస్తుతం 12,146 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. కేంద్రం లక్ష్యం నెరవేరాలంటే ఈవీల వినియోగం పెరగాలి. అందుకోసం 2030 నాటికి దేశ వ్యాప్తంగా పెరిగే ఈవీలకు సరిపడా 39 లక్షల చార్జింగ్ స్టేషన్లు అవసరమని ‘చార్జింగ్ ఎహెడ్–2’ నివేదిక ప్రకటించింది.
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలోనే ప్రోత్సాహం
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక పాలసీ రూపొందించింది. నగరాలు, పట్టణాల్లో ప్రతి మూడు కిలో మీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల వెంబడి 25 కిలోమీ టర్లకు ఒకటి చొప్పున విద్యుత్ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పా లని నిర్ణయించింది. ఇందుకోసం 4 వేల స్థలాలను గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 266 ఈవీ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పింది. మరో 115 స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. విజయవాడ, అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాలను మోడల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నగరాలుగా గుర్తించింది.
పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల(పీసీఎస్)ను లైసెన్స్ తీసుకోకుండానే ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈవీ చార్జర్లపై 25 శాతం డిస్కౌంట్ అందించింది. ఈ–మెబిలిటీలో సరికొత్త పరిశోధనల కోసం రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ఈవీ పాలసీని రద్దు చేసింది. ఇంధన పాలసీలోనే దానిని కలిపేసింది. ఐదు వేల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయ డం తమ లక్ష్యమని కూటమి ప్రభుత్వం ప్రకటించినా... గత తొమ్మిది నెలల్లో ఒక్కటీ ఏర్పాటు చేయలేదు. కాగా, విద్యుత్ సంస్థలు విడుదల చేసిన స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లాన్‌లో 2030 నాటికి రాష్ట్రంలో 7,82,600 ఈవీలు ఉంటాయని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment