
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వాహనాల(ఈవీల)కు డిమాండ్ ఊపందుకోవడంతో వాటి చార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా ఇప్పుడు దేశమంతటా పెరుగుతూ పోతున్నాయి. కేవలం గత నెల నాలుగు నెలల్లోనే మెట్రో సిటీల్లో వీటి సంఖ్య రెండున్నర రెట్లు పెరగడమే ఇందుకు ఒక ఉదాహరణ. సూరత్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో చార్జింగ్ స్టేషన్లు గణనీయంగా పెరిగాయని సెంట్రల్ పవర్ మినిస్ట్రీ తెలిపింది. ఈ 9 నగరాల్లో అక్టోబర్ 2021 నుంచి జనవరి 2022 మధ్య కాలంలోనే అదనంగా 678 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
భారతదేశంలోని 1,640 పబ్లిక్ ఈవీ ఛార్జర్‌లలో దాదాపు 940 ఈ నగరాల్లోనే ఉన్నాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రిపోర్టు వెల్లడించింది. 4 మిలియన్లకు పైగా జనాభా ఉన్న 9 మెగా నగరాలపై ప్రభుత్వం మొదట్లో తన దృష్టిని పెంచింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇటీవల జనవరి 14, 2022న ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం ఏకీకృత మార్గదర్శకాలు, ప్రమాణాలను జారీ చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రైవేటు కంపెనీలతో పాటు బీఈఈ, ఈఈఎస్ఎల్, పీజీసీఐఎల్, ఎన్టీపీసీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలూ ఈ వ్యాపారంలోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది.
వినియోగదారుల విశ్వాసాన్ని పొందడానికి సౌకర్యవంతమైన ఛార్జింగ్ నెట్ వర్క్ గ్రిడ్ అభివృద్ధి చేయడానికి ఈవి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అనేక ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. మెట్రో సిటీల్లో ఈవీ చార్జింగ్ నెట్వర్క్ బలంగా ఉన్నందున, ప్రభుత్వం దశలవారీగా ఇతర నగరాలకు కవరేజీని విస్తరించాలని యోచిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలు, జాతీయ రహదారులపై 22,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు గతంలో ప్రకటించాయి. వీటిలో10 వేల స్టేషన్లను ఐఓసీఎల్ ద్వారా.. 7000 స్టేషన్లు బీపీసీఎల్ ద్వారా.. మిగిలిన 5000 స్టేషన్లు హెచ్పీసీఎల్ ద్వారా ఇన్స్టాల్చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment