
ప్రజల్లో పర్యావరణ స్పృహ పెరిగిపోయింది.. మంచిదే..! శబ్ద, వాయు కాలుష్యంతో మానవాళికి ఉపద్రవంగా మారుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వినియోగించాలని వినియోగదారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ఈవీ వాహనాల కొనుగోళ్లు, వినియోగంపై ప్రత్యేక రాయితీలు అందిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈవీ పాలసీని సైతం తీసుకొచ్చింది. అయితే వాహనాల కొనుగోళ్లకు రాయితీలు ఇస్తేనే సరిపోదు.. ఆయా వాహనాల చార్జింగ్ పాయింట్లు, స్టేషన్ల ఏర్పాటుపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ డెవలపర్లకు వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యత కూడా కాస్త ఎక్కువే. ప్రభుత్వం ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్న తరుణంలో.. బిల్డర్లు కూడా తమవంతు బాధ్యతగా భవన సముదాయాల్లోనే ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇక్కడే స్పష్టత లోపించింది. భవన సముదాయాల్లో ఎక్కడ ఈవీ స్టేషన్లు, పాయింట్లను ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టత కొరవడింది. బేస్‌మెంట్, సెల్లార్‌లోనా లేదా బయట ఓపెన్ స్పేస్‌లో ఈవీ స్టేషన్ ఏర్పాటు చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో ఈవీ పాలసీ అమలులో ఉన్నా.. స్పష్టత లేకపోవడంతో స్టేషన్ల ఏర్పాటుకు బిల్డర్లు వెనుకంజ వేస్తున్నారు.
బిల్డర్‌ను బాధ్యుడిని చేస్తే ఎలా?
ప్రస్తుతం గృహ కొనుగోలుదారులు వారి అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా నివాస సముదాయాల్లో వసతులను కోరుకుంటున్నారు. పర్యావరణ స్పృహ పెరిగిన నేపథ్యంలో కస్టమర్లు వారు ఉండే చోటే ఈవీ చార్జింగ్ స్టేషన్ ఉండాలని అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో బిల్డర్లు పునరాలోచనలో పడుతున్నారు. ఒకవేళ సెల్లార్‌లో ఈవీ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు సంభవిస్తే దానికి బిల్డర్‌ను బాధ్యులు చేస్తే ఎలా? అని సంశయంలో పడిపోతున్నారు.
ఈవీపై స్పష్టత అవసరమే..
సాధారణంగా బిల్డర్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాత నివాస సముదాయాన్ని అసోసియేషన్‌కు అప్పచెబుతాడు. వారు ఈవీ చార్జింగ్ స్టేషన్‌ను సరిగా నిర్వహణ చేయపోయినా, ఇతరత్రా కారణాల వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా? అని పలువురు డెవలపర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నివాస సముదాయాల్లో ఈవీ స్టేషన్ల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు జారీ చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఉదాహరణకు గతంలో ప్రాజెక్ట్‌కు అగ్ని ప్రమాద శాఖ నిరభ్యంతర ధృవీకరణ పత్రం(ఎన్‌ఓసీ) వచ్చిందంటే ఇక ఆ ప్రాజెక్ట్ వంక అధికారులు చూసేవారు కాదు. కానీ, ఇప్పుడు ప్రతీ మూడేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకోవాలని కొత్త నిబంధనలను జోడించారు. ఇదే ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ప్రాజెక్ట్‌ను అసోసియేషన్‌కు అప్పజెప్పిన తర్వాత నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ ఉపకరణలు పనిచేయవు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా నిబంధనలతో నిర్వహణ సక్రమంగా ఉండటంతో పాటు క్రమంతప్పకుండా మాక్ డ్రిల్స్ చేస్తుంటారు. దీంతో ప్రమాదాలను నియంత్రించే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment