
నీరు ఎత్తు నుంచి పల్లం వైపునకు పారినట్లే.. రియల్ ఎస్టేట్ అవకాశాలు, అభివృద్ధి కూడా మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న ప్రాంతం వైపే విస్తరిన్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో మొదలైన స్థిరాస్తి అభివృద్ధి ఐటీ హబ్ రాకతో గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ ప్రాంతాల వైపు పరుగులు పెట్టింది. కొత్త ప్రాంతంలో అభివృద్ధి విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ హైదరాబాద్ వైపు దృష్టిసారించింది. విద్య, వైద్యంతో పాటు ఏఐ సిటీ, ఎలక్ట్రానిక్స్, లైఫ్‌సైన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లతో కూడిన నాల్గో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనుంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మితం కానున్న ఈ కొత్త నగరంతో స్థిరాస్తి అవకాశాలు పశ్చిమం నుంచి దక్షిణ హైదరాబాద్ వైపు మళ్లనుంది. – సాక్షి, సిటీబ్యూరో
మన దేశంలో నోయిడా, గ్రేటర్ నోయిడా, దక్షిణ కొరియాలో ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ సక్సెస్‌లను స్ఫూర్తిగా తీసుకొని.. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. నగరం సమీపంలోని మీర్‌ఖాన్‌పేట, బేగరికంచె, ముచ్చర్ల గ్రామాల పరిధుల్లో 814 చదరపు కిలో మీటర్లు, 2,01,318 ఎకరాల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీ విస్తరించి ఉంటుంది. కడ్తాల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, మంచాల్, యాచారం, ఆమన్‌గల్ 7 మండలాల్లోని 56 గ్రామాలు ఫోర్త్ సిటీ పరిధిలోకి వస్తాయి.
ఈ నగరం సాకారమైతే 30–35 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 60–70 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ విస్తరణ ప్రణాళిక హైదరాబాద్ రియల్ రంగానికి ఊతంగా నిలవనుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేలలో స్థిరాస్తి పెట్టుబడి అవకాశాలు మరింత మెరుగవుతాయి. నివాస, వాణిజ్య, పారిశ్రామిక స్థలాలకు డిమాండ్ ఏర్పడనుంది. ప్రాపర్టీ విలువలు గణనీయంగా పెరుగుతాయి. నెట్‌జీరో సిటీగా నిర్మితం కానున్న ఈ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది.
ఫ్యూచర్ సిటీ స్వరూపమిదీ
ఎలక్ట్రానిక్స్ అండ్ సాధారణ పరిశ్రమలు: 4,774 ఎకరాలు
లైఫ్ సైన్స్ హబ్: 4,207 ఎకరాలు
నివాస, మిశ్రమ భవనాలు: 1,317 ఎకరాలు
నివాస భవనాల జోన్: 1,013 ఎకరాలు
స్పోర్ట్స్ హబ్: 761 ఎకరాలు
ఎడ్యుకేషనల్ అండ్ వర్సిటీ జోన్: 454 ఎకరాలు
ఎంటర్‌టైన్‌మెంట్: 470 ఎకరాలు
హెల్త్ సిటీ: 370 ఎకరాలు
ఫర్నీచర్ పార్క్: 309 ఎకరాలు
ఏఐ సిటీ: 297 ఎకరాలు
నెట్‌జీరో సిటీగా..
చుట్టూ పచ్చదనం, విశాలమైన రహదారులు, ప్రణాళికబద్ధంగా నివాస ప్రాంతాలు, వాణిజ్య క్లస్టర్లు, ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు ఒక చోట వీటన్నింటికీ దూరంగా పరిశ్రమలు, ఇలా పర్యావరణహితంగా కాలుష్యరహితంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. నెట్‌జీరో సిటీగా ఏర్పాటుకానున్న ఈ నగరానికి సంబంధించి ప్రభుత్వం వేర్వేరు ప్రణాళికలను తయారు చేసింది. వచ్చే యాభైఏళ్లలో అక్కడ మారనున్న పరిస్థితులను అనువుగా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించారు.

వ్యర్థాల నిర్వహణ..
పర్యావరణాన్ని కాపాడేందుకు నెట్‌జీరో సిటీలో 33 శాతం గ్రీనరీ ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. చెట్లు, వాణిజ్య పంటలు, రహదారుల వెంట నీడనిచ్చే వృక్షాలు ఉంటాయి. వీటి ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కంటే ఇక్కడ 2–3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇళ్లు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు, ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేకమైన వ్యవస్థను రూపకల్పన చేస్తున్నారు. వ్యర్థ జలాలను శుద్ధీకరించి మళ్లీ వినియోగించేందుకు వీలుగా మారుస్తారు. దీంతో పాటు పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణకు ఇంధనం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సౌర విద్యుత్ వాడేలా చూస్తారు. పరిశ్రమలు, ఐటీ సంస్థలు, నివాసాలు నిర్మించేటప్పుడు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కాలుష్యరహిత వస్తువులను వినియోగించేలా చూస్తారు.
ఎలక్ట్రానిక్స్, లైఫ్‌సైన్స్‌కు ప్రాధాన్యం..
ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, లైఫ్‌సైన్స్ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ రెండు రంగాలకే ఏకంగా 64 శాతం భూమిని కేటాయించారు. ఎలక్ట్రానిక్స్, సాధారణ పరిశ్రమలకు 4,774 ఎకరాలు, లైఫ్‌సైన్స్ హబ్‌కు 4,207 ఎకరాలను కేటాయించారు. కొంగరకలాన్‌లో యాపిల్ ఫోన్ విడిభాగాలను తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ జోన్‌లో తన శాఖలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. లైఫ్‌సైన్ జోన్‌లో ప్రాణాధార మందుల తయారీ, పరిశోధన సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించనుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థలు వాటి విస్తరణ ప్రాజెక్ట్‌లను ఇక్కడ ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

రోడ్డు, రైలు, విమానం.. అన్నీ..
» ఫ్యూచర్ సిటీకి రోడ్డు, రైలు, విమాన మార్గాలతో అనుసంధానించేలా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పించనున్నారు.
» ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ నుంచి సులభంగా చేరుకునేందుకు విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్‌కు, అలాగే ఔటర్ నుంచి ప్రతిపాదిత ప్రాంతాలు బేగరికంచె, మీర్‌ఖాన్‌పేట్, ముచ్చర్ల వరకూ 330 అడుగుల వెడల్పు రహదారులు, ఇతర అంతర్గత రహదారులను నిర్మించనున్నారు.
» రావిర్యాల ఓఆర్‌ఆర్ నుంచి మీర్‌ఖాన్‌పేట మీదుగా ముచ్చర్ల, ఆమన్‌గల్ మండలంలోని ఆకుతోటపల్లె వద్ద రీజినల్ రింగ్ రోడ్‌ను కలుపుతూ 40 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు.
» దీంతో పాటు రాజేంద్రనగర్‌లో రానున్న కొత్త హైకోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment