నీళ్లు ఎత్తు నుంచి పల్లెం వైపునకు ప్రవహించినట్లే.. రోడ్లు, విద్యుత్, రవాణా వంటి మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న చోటుకే అభివృద్ధి విస్తరిస్తుంది. ఐటీ ఆఫీస్ స్పేస్, నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి (Real estate Development) క్రమంగా దక్షిణ హైదరాబాద్ (South Hyderabad) మార్గంలో శరవేగంగా విస్తరిస్తోంది. విమానాశ్రయంతో పాటు ఔటర్ మీదుగా వెస్ట్‌తో సౌత్ అనుసంధానమై ఉండటం ఈ ప్రాంతం మెయిన్ అడ్వాంటేజ్. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఏఐ, ఫ్యూచర్ సిటీలను దక్షిణ హైదరాబాద్‌లోనే అభివృద్ధి చేయనుంది. పుష్కలంగా భూముల లభ్యత, అందుబాటు ధర, మెరుగైన రవాణా, మౌలిక వసతులు ఉండటంతో దక్షిణ ప్రాంతంలో రియల్ మార్కెట్ అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని శ్రీఆదిత్య హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదిత్యరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూలోని మరిన్ని అంశాలివీ.. – సాక్షి, సిటీబ్యూరో
నగరం నాలుగు వైపులా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాన నగరంలో మూసీ సుందరీకరణ, శివార్లలో ఫ్యూచర్ సిటీ, మెట్రో రెండో దశ విస్తరణ వంటి బృహత్తర ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాజెక్ట్‌లతో గృహ కొనుగోలుదారుల భావోద్వేగాలు మారుతాయి. జనసాంద్రత, రద్దీ ప్రాంతాల్లో ఉండే బదులు ప్రశాంతత కోసం దూరప్రాంతాలను ఎంచుకుంటారు. ఇదే సమయంలో మెట్రో విస్తరణతో కనెక్టివిటీ పెరగడంతో పాటు ఆయా మార్గాలలో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఓల్డ్‌సిటీ, చాంద్రయాణగుట్ట మీదుగా శంషాబాద్‌కు మెట్రో అనుసంధానంతో ఆయా ప్రాంతాల్లో కూడా గేటెడ్ కమ్యూనిటీలు జోరుగా వస్తాయి. దీంతో బడ్జెట్ హోమ్స్‌తో సామాన్యుడి సొంతింటి కల మరింత చేరువవుతుంది.
ట్రిపుల్ ఆర్‌తో ఉద్యోగ అవకాశాలు
హైదరాబాద్ అభివృద్ధి దశను మార్చేసిన ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల 30 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్)ను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఔటర్ లోపల ప్రాంతం ఇప్పటికే రద్దీ అయిపోయింది. ఓఆర్‌ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్‌కు, ట్రిపుల్ ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఇలా వేర్వేరు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్లను చేపట్టాలి. ట్రిపుల్ ఆర్‌తో నగరంతోనే కాదు రాష్ట్రంలోని ఇతర జిల్లాలూ అనుసంధానమై ఉంటాయి. కనెక్టివిటీ పెరిగి రవాణా మెరుగవుతుంది. దీంతో ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గడంతో పాటు శివారు, పట్టణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ట్రిపుల్ ఆర్ ప్రాంతాల్లో కేవలం నివాస, వాణిజ్య సముదాయాలే కాదు గిడ్డంగులు, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
సిటీ వ్యూతో బాల్కనీ కల్చర్..
లగ్జరీ హౌసింగ్ అంటే కనిష్టంగా 2,500 చ.అ. విస్తీర్ణం ఉండాలి. అయితే విస్తీర్ణం మాత్రమే లగ్జరీని నిర్వచించలేదు. బెంగళూరు, ముంబైలలో 3 వేల చ.అ. ఫ్లాట్లనే ఉబర్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు. కానీ, మన దగ్గర 6, 8, 10 వేల చ.అ.ల్లో కూడా అపార్ట్‌మెంట్లు కూడా నిర్మిస్తున్నారు. అయినా కూడా ఇతర మెట్రోలతో పోలిస్తే మన దగ్గరే ధరలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు.. హైదరాబాద్‌లో 5–10 వేల చ.అ. ఫ్లాట్ రూ.6–12 కోట్లలో ఉంటే.. బెంగళూరు, ముంబై నగరాల్లో 3 వేల చ.అ. ఫ్లాటే రూ.12 కోట్లు ఉంటుంది. పుష్కలమైన స్థలం, వాస్తు, కాస్మోపాలిటన్ కల్చర్, ఆహ్లాదకరమైన వాతావరణం, జీవనశైలి బాగుండటం వల్లే హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. మన నగరంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి విశాలమైన, డబుల్ హైట్ బాల్కనీలను వాడుతుంటారు. అదే ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో వాతావరణం పొల్యూషన్ కాబట్టి బాల్కనీలు అంతగా ఇష్టపడరు.
ఇంటి అవసరం పెరిగింది
గతంలో ఇండిపెండెంట్ హౌస్‌లు ఎక్కువగా ఉండేవి. అందుకే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అబిడ్స్ వంటి పాత నగరంలో ఈ తరహా ఇళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ కమ్యూనిటీ లివింగ్‌ల ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాత ఇంటి ప్రాముఖ్యత, అవసరం తెలిసొచ్చింది. వర్క్ ఫ్రం హోమ్‌తో 50–60 శాతం సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పిల్లలు సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. బయటకు వెళ్లి ఆడుకోవాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు, భద్రత ఉండదు. అదే గేటెడ్ కమ్యూనిటీల్లో ఇబ్బందులు ఉండవు. కమ్యూనిటీ లివింగ్‌లలో గృహిణులు, పిల్లలకు రక్షణ ఉండటంతో పాటు ఒకే తరహా అభిరుచులు ఉన్నవాళ్లు ఒకే కమ్యూనిటీలో ఉంటారు. అలాగే ఒకే ప్రాంతంలో అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి. దీంతో టెన్షన్ ఉండదు. చోరీలు, ప్రమాదాల వంటి భయం ఉండదు. సీసీటీవీ కెమెరాలు, 24/7 సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఉంటుంది. నిరంతరం నిర్వహణతో కమ్యూనిటీ పరిశుభ్రంగా, హైజీన్‌గా ఉంటుంది. థర్డ్ పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వంద శాతం పవర్ బ్యాకప్, నిరంతరం నీటి సరఫరా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment