న్యూఢిల్లీ: పెద్ద యెత్తున దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం విద్యుత్ వాహన సేవల సంస్థ బ్లూస్మార్ట్‌తో జియో–బీపీ జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం బ్లూస్మార్ట్ కార్యకలాపాలు ఉన్న నగరాల్లో ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రణాళికలు, అభివృద్ధి, నిర్వహణ తదితర అంశాల్లో రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన బీపీ కలిసి సంయుక్తంగా జియో–బీపీని జాయింట్ వెంచర్‌గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ముందుగా దేశ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సీఆర్) వీటిని ఏర్పాటు చేయనున్నట్లు జియో–బీపీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో నెలకొల్పే ఈ స్టేషన్ల కనీస చార్జింగ్ సామర్థ్యం 30 వాహనాలుగా ఉంటుందని వివరించింది. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా రవాణా సేవలు అందించే బ్లూస్మార్ట్ తమ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో కూడా విస్తరించే ప్రణాళికల్లో ఉంది. బ్రిటన్, జర్మనీ దేశాల్లో ఈవీ చార్జింగ్ నెట్‌వర్క్ విషయంలో బీపీకి గల అనుభవం .. దేశీయంగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో జియోకి తోడ్పడగలదని జియో–బీపీ సీఈవో హరీష్ సి మెహతా తెలిపారు. దేశీయంగా ప్రపంచస్థాయి ఈవీ చార్జింగ్ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ అందించడంలో తమ సామర్థ్యాలకు జియో–బీపీతో ఒప్పందమే నిదర్శనమని బ్లూస్మార్ట్ సహ వ్యవస్థాపకుడు,సీఈవో అన్‌మోల్ జగ్గీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment