పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను ఛార్జింగ్ చేస్తే 18 శాతం చొప్పున జీఎస్టీ వర్తిస్తుందని కర్ణాటక అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసే విషయాన్ని ఓ విద్యుత్ పంపిణీ సంస్థ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ సంస్థ ముందుకు తీసుకెళ్లింది. ఇందు కోసం వాహనదారుల నుంచి పన్నుతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఫీజును వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇందులో ఎనర్జీ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు అనే రెండు భాగాలు ఉంటాయి. ఎనర్జీ ఛార్జ్ అనేది వాహనదారులు వినియోగించే ఎనర్జీ యూనిట్ల సంఖ్యను సూచిస్తుంది.
ఈ సందర్భంగా ఇంధన ఛార్జీలను వస్తువుల సరఫరాగా పరిగణిస్తారా లేదా సేవల సరఫరాగా పరిగణిస్తారా అనే సమస్య ప్రాథమికంగా తలెత్తింది. ఇందులో మొదటిది అయితే జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌ని విద్యుత్ సరఫరా కేటగిరి కింద పరిగణించాలా వద్దా అన్నది అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ముందున్న ప్రధాన సమస్య.
ఇదీ చదవండి ➤ FAME 3: ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం!
ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీని ఛార్జ్ చేయడం అంటే విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చే ప్రక్రియ అని రూలింగ్ అథారిటీ తెలిపింది. విద్యుత్ అనేది వస్తువుగా వర్గీకరించిన చరాస్తి. దాన్ని అలాగే కాకుండా బ్యాటరీల్లో రసాయన శక్తిగా మార్చి వినియోగదారులకు అందిస్తున్నారని అడ్వాన్స్ రూలింగ్ సంస్థ పేర్కొంది.
ఈ సందర్భంగా అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక వివరణను కూడా ప్రస్తావిస్తూ.. ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ అనేది విద్యుత్ విక్రయం కిందకు రాదని, దాన్ని సర్వీస్ కిందే పరిగణించాలని స్పష్టం చేసింది. విద్యుత్ సరఫరా, సర్వీస్ ఛార్జీలను సర్వీస్ సప్లయిగా పరిగణించాలని, కాబట్టి 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తీర్మానించింది.
Comments
Please login to add a commentAdd a comment