సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ సదుపాయాల కల్పనకు జీహెచ్‌ఎంసీ మరోమారు సిద్ధమైంది. వాహనాలకు ఇంధన ఖర్చు తక్కువ, పర్యావరణహితం కావడంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో వీటిని వినియోగించేవారు పెరుగుతున్నారు. అందుకనుగుణంగా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు(పీసీఎస్)లు పెంచుతున్నారు. మూడేళ్ల క్రితమే నగరవ్యాప్తంగా వంద పీసీఎస్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ.. అనంతరం వాటిని అటకెక్కించింది.తాజాగా తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో)తో కలిసి 14 ప్రాంతాల్లో ఏర్పాటుకు సిద్ధమవుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 278 ప్రాంతాల్లో ఫీజిబిలిటీ స్టడీ జరుగుతున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. స్టడీ నివేదికను బట్టి 230 ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యోచనలో అధికారులున్నారు.
దిగువ ప్రాంతాల్లో..
ఇందిరాపార్కు, కేబీఆర్ పార్కు వద్ద 3, ట్యాంక్‌బండ్ రోడ్, బషీర్‌బాగ్, గన్‌ఫౌండ్రి, ఆబిడ్స్, నానక్‌రామ్‌గూడ, మహవీర్ హరిణ వనస్థలి, ఉప్పల్, ఒవైసీ హాస్పిటల్, తాజ్ త్రీస్టార్ హోటల్(సికింద్రాబాద్)ల వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నారు.
అటకెక్కిన గత ఒప్పందం..
దాదాపు మూడేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్æ(ఈఈఎస్‌ఎల్)తో వంద స్టేషన్ల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ..అనంతరం దాన్ని అటకెక్కించింది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ రెడ్కోతో ఒప్పందం కుదుర్చుకోనుంది. 2030 నాటికి రోడ్ల మీదకు వచ్చే వాహనాలన్నీ ఎలక్ట్రిక్‌వే ఉండాలని కేంద్రప్రభుత్వం ‘నేషనల్ మిషన్ ఆన్ ఎలక్ట్రికల్ మొబిలిటీ’ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం 2030 నాటికి ప్రజారవాణా బస్సులన్నీ ఎలక్ట్రిక్‌వే ఉండాలని భావిస్తోంది. అందుకనుగుణంగా రూపొందించిన పాలసీ మేరకు 2022 నాటికి 25 శాతం, 2025 వరకు 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలనేది లక్ష్యం. ఈ లక్ష్యం సాధించాలంటే ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించాలి.
వాహనాలను చార్జింగ్ చేసుకునేందుకు తగినన్ని పీసీఎస్‌లు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతమున్న ప్రైవేట్ స్టేషన్లు పెరిగే వాహనాల అవసరాలకు సరిపోవు. ఈ సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రధానంగా స్థానిక సంస్థలపై ఉండటంతో జీహెచ్‌ఎంసీ అందుకు సిద్ధమైంది.ఫీజిబిలిటీ స్టడీని బట్టి ఆయా ప్రాంతాల్లో పీసీఎస్‌లు ఏర్పాటు చేస్తారు. హెచ్‌ఎండీఏ పరిధిలో మరో వంద ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఏర్పాటు కానున్న ప్రతి చార్జింగ్ స్టేషన్ లో ఫాస్ట్ స్పీడ్ ఛార్జింగ్, స్లో స్పీడ్ ఛార్జింగ్ సదుపాయాలుంటాయని అధికారులు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ స్థలాలు ఇస్తున్నందున పీసీఎస్‌లు వినియోగంలోకి వచ్చాక యూనిట్ కు 1 రూపాయి చొప్పున ప్రతి మూడు నెలలకోసారి జీహెచ్‌ఎంసీకి చెల్లింపులు చేయాలనేది ప్రతిపాదన. ఆమేరకు ఒప్పందం కుదరాల్సి ఉంది.
(చదవండి: నిర్వాసితులకు బేడీలా?)
Comments
Please login to add a commentAdd a comment