సాక్షి, అమరావతి: విద్యుత్ వాహనాల (ఈవీల) కోసం రాష్ట్రంలో అత్యాధునిక సౌర విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. వాహనాల యజమానులు ఈ సౌర చార్జింగ్ కేంద్రాల్లో కార్డు ద్వారా వారే డబ్బులు చెల్లించి, వారే వాహనానికి చార్జింగ్ పెట్టుకోవచ్చు. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఈ చార్జింగ్ కేంద్రాలకు అనుమతినిచ్చింది.
తొలుత అనంతపురం, విజయవాడ, తిరుపతి నగరాల్లో 12 కేంద్రాలకు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. ఈ నగరాల్లో సౌర విద్యుత్ ప్యానళ్లతో చార్జింగ్ కియోస్‌్కలను రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) ఏర్పాటు చేస్తుంది. ఏటీఎం కార్డు ద్వారా డబ్బు చెల్లించి వాహనదారుడే చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) చేస్తుంది.
రానున్న కాలం ‘ఈవీ’లదే
దేశంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు 2030 నాటికి 30% విద్యుత్ కార్లు, 80 శాతం విద్యుత్ టూ వీలర్లు, 70 శాతం విద్యుత్ కమర్షియల్ వెహికల్స్ ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా 1 గిగా టన్ కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా వేసింది. దీంతోపాటు ఇంధనం దిగుమతులు తగ్గించటం ద్వారా 330 బిలియన్ డాలర్ల ఖర్చు తగ్గుతుంది.
రానున్న ఎనిమిదేళ్లల్లో 66 శాతం వాహనదారులు విద్యుత్ వాహనాలనే వాడతారని ఈవీ మార్కెట్‌పై తాజా అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ వినూత్న చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది.
ఏడాదిలో 250 కేంద్రాలు
దేశంలో 2070 నాటికి ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక ప్రయోజనాల కోసం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లాలని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పెట్రోల్, డీజిల్ చార్జీలు భారంగా ఉన్న దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలకు సహాయం చేయడానికి, స్థిరమైన రవాణాను అభివృద్ధి చేయడానికి రాష్ట్రం అంతటా చార్జింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 110 చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు, నగరాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తెచ్చేందుకు నెడ్‌క్యాప్ ప్రణాళికలు తయారు చేసింది. ప్రైవేట్ భూ యజమానులతో కలిసి 4 వేల లొకేషన్లను గుర్తించింది. రాష్ట్రంలో ఏడాదిలో 250 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వాయిదా పద్థతిలో లక్ష ఈ–వాహనాల పంపిణీతో పాటు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రోత్సాహకాలనిస్తోంది.
ఖర్చు తక్కువ
విద్యుత్ వాహనాలకు బ్యాటరీ చార్జింగ్, మెయింటెనెన్స్, ఆపరేషన్ ఖర్చులు తక్కువ. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఈవీలు సురక్షితమైనవి కూడా. రాష్ట్రంలో సుమారు 40 వేల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి. వాటితో పాటు భవిష్యత్‌లో పెరగనున్న ఈవీలన్నిటి కోసం చార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నాం. – కె విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment