హ్యుందాయ్ సీవోవో తరుణ్ గార్గ్
చెన్నై: దేశీయంగా ఈ రెండేళ్లలో (2025, 2026) విద్యుత్ ప్యాసింజర్ వాహనాల వినియోగం మరింత వేగవంతమవుతుందని హ్యుందాయ్ మోటర్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్) సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు.
ప్రస్తుతం భారత్‌లో విద్యుత్ వాహనాల వినియోగం ప్రారంభ స్థాయిలో 2.4 శాతం స్థాయిలో ఉందని, 2030 నాటికి ఇది 17 శాతానికి చేరవచ్చనే అంచనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పెద్ద బ్రాండ్లు మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపారు.
విద్యుత్ వాహనాల వినియోగ వృద్ధికి తమ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తోడ్పడగలదన్నారు. హ్యుందాయ్ సంస్థ భవిష్యత్తులో నాలుగు ఈవీలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దీని ధర రూ. 15–25 లక్షల శ్రేణిలో ఉండొచ్చని అంచనా. అటు మారుతీ సుజుకీ ఇండియా తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ’ఈ–విటారా’ను ఆవిష్కరించనుంది.
మరోవైపు, చార్జింగ్ సదుపాయాలకు సంబంధించి 10,000 చార్జింగ్ పాయింట్ల వివరాలతో ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, దీన్ని ఇతర వాహనదారులు కూడా వినియోగించుకోవచ్చని గార్గ్ చెప్పారు. వీటిలో 7,500 పాయింట్లలో యాప్ ద్వారా నేరుగా చెల్లింపులు జరిపే సదుపాయం ఉందన్నారు. ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్–విజయవాడ, ముంబై–పుణె తదితర హైవేల్లోని 30 చార్జింగ్ స్టేషన్లలో 80 ఫాస్ట్ చార్జర్లను ఇన్‌స్టాల్ చేసినట్లు గార్గ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment