ఒకప్పుడు రైలు బండ్లు బొగ్గుతో నడిచేవి, తర్వాత డీజిల్ ఇంజన్లు వచ్చాయి.. ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ ఇంజన్ల ఆధారంగా నడుస్తున్నాయి. ఇక బైకులు, స్కూటర్లు, కార్లు, బస్సులు దాదాపు అన్ని వాహనాలకు పెట్రోలు, డీజిలే ఆధారం. అయితే భవిష్యత్తులో ఇవన్నీ ఎలక్ట్రిక్ బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఎలా ఉంటుంది. ఈవీలకు సంబంధించి మౌలిక సదుపాయలకు సంబంధించి రాబోతున్న మార్పులపై టాటా పవర్ సీఈవో ప్రవీర్ సిన్హా ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయలు తెలిపారు. అందులో ప్రధాన విషయాలు మీ కోసం..
విస్తరిస్తున్న ఈవీ
ఇండియాలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీకి ప్రణాళికలు సిద్ధం చేశాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే మార్కెట్‌లో అడుగు పెట్టాయి. రెండేళ్ల కిందటి నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే ఇప్పుడు ఈవీ టూవీలర్స్ అమ్మకాలు బాగా పెరిగాయి. అంతేకాదు ఒకప్పుడు ఈవీ వెహికల్స్ ధరలు లక్షకు పైగానే ఉండేవి. ఇప్పుడు వాటి ప్రారంభ ధర రూ. 60,000ల దగ్గరకు వచ్చింది.
ధరలే ముఖ్యం
మిగిలిన దేశాలతో పోల్చితే భారతీయుల ఆలోచణ ధోరణి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఫీచర్లు, ఆప్షన్లు ఎన్ని ఉన్నా ధర ఎంత అన్నదే ప్రధానం. వస్తువు కొనుగోలులో ధర కీలకంగా మారుతుంది. పది లక్షల రూపాయల లోపు ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లోకి తీసుకురాగలిగితే పెను మార్పులు వస్తాయి. ఈవీ కార్ల అమ్మకాలు భారీ స్థాయిలో పెరుగుతాయి. ఆ దిశగా టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది. రాబోయే మూడునాలుగేళ్లలో మార్కెట్‌లో ఉన్న మిగిలిన కంపెనీలు కూడా ఇదే తరహాలో విభిన్న శ్రేణిల్లో ఈవీ కార్లు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి.
టాటావే ఎక్కువ
ఈవీ వెహికల్స్‌కి ఛార్జింగ్ అనేది ప్రధాన సమస్య. ప్రస్తుతం ఈ సమస్యపై మార్కెట్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం మన దగ్గరున్న పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో టాటావే అధికం. వంద నగరాలతో పాటు జాతీయ రహదారుల వెంట టాటా ఆధ్వర్యంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు సేవలు అందిస్తున్నాయి. దీనికితోడు ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ భాగస్వామ్యంలో భారీ ఎత్తున ఛార్జింగ్ స్టేషన్లు తేబోతున్నాం. అంతేకాదు షాపింగ్‌మాల్స్, కాఫీ షాప్స్, పార్కులు... తదితర జనాలు వచ్చి పోయే చోట్ల కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశాం.
ఛార్జింగ్ స్టేషన్లు
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌తో కలిసి దేశవ్యాప్తంగా 18,000 పెట్రోల్ బంకులలో ఈవీ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను టాటా పవర్ నిర్మించబోతుంది. వీటికి సంబంధించిన పనులు త్వరలో మొదలవుతాయి. ఇక దేశవ్యాప్తంగా 75 వేలకు పైగా పెట్రోలు బంకులు ఉన్నాయి. మిగిలిన కంపెనీలు కూడా ఇదే దిశగా ప్రయత్నాలు చేస్తాయి. తద్వారా పబ్లిక్ ప్లేస్‌లలో ఛార్జింగ్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
సమస్య రానివ్వం
మన దగ్గర పవర్ కట్ సమస్య ఉంది. ముఖ్యంగా రూరల్ ఇండియాలో కరెంటో కోత సర్వసాధారణమైన సమస్య. దీనిపై అవగాహన ఉంది. పవర్ కట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పని తీరుపై ప్రభావం పడకుండా అందుబాటులో కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తాం. పవర్ కట్ వచ్చినా ఛార్జింగ్ స్టేషన్ పని చేసేలా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాం,.
- సాక్షి, వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment