హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహనాలు కలిగిన భాగ్యనగర వాసులకు శుభవార్త. త్వరలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో యాభై వరకు ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇంటి దగ్గరే కాకుండా నగరంలో మరికొన్ని చోట్ల అత్యవసర పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు కలగనుంది.
50 ఛార్జింగ్ స్టేషన్లు
దేశవ్యాప్తంగా మొత్తం 350 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ‘ఫేమ్’ ఫేజ్ 2లో భాగంగా నెలకొల్పబోతున్నట్టు పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం మంత్రి కిషన్‌పాల్ గుర్జార్ తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను పార్లమెంటుకు సమర్పించారు. ఇందులో హైదరాబాద్‌లో 50 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నట్టుగా తేలింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ (94), ఛండీగడ్ (48), జైపూర్ (49), బెంగళూరు (45), రాంచీ (29), లఖ్‌నౌ(1), గోవా (17), ఆగ్రా (10), షిమ్లా (7) ఉన్నాయి.
ఫేమ్ ద్వారా
రోజురోజుకి పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌కి తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్రం ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్, ఈవీ) పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. 2015లో ఫేమ్ అమలులోకి రాగా ఇప్పటికే ఫేజ్ 1 పూర్తయ్యింది. తాజాగా ఫేజ్ 2లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పలు రాయితీలు అందిస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పనుంది.
పెరుగుతున్న మార్కెట్
పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఈవీ సెగ్మెంట్‌కు భారీ రాయితీలు ప్రకటిస్తోంది. దీంతో క్రమంగా దేశంలో ఈవీ మార్కెట్ విస్తరిస్తోంది. వాహన తయారీ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తెస్తున్నాయి. అయితే ఛార్జింగ్ స్టేషన్లు/ పాయింట్లదే ప్రధాన సమస్యగా ఉంది. ఇప్పుడు ఈ సమస్య కూడా తీరబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment