ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్న వారికి గొప్ప రిలీఫ్. ఈవీ కొనాలనుకునేవారికి శుభవార్త! ఫోన్ల తరహాలోనే బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోకుండా ఉంచుకునేందుకు వీలుగా పవర్ బ్యాంకు రెడీ అయ్యింది.
ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్ఘారాలను తగ్గించాలనే డిమాండ్ ఊపు మీద ఉంది. ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించాలంటూ అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రజలకు చెబుతున్నాయి. మన దగ్గరయితే పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్‌కి షిఫ్ట్ అయ్యేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. అయితే ఛార్జింగ్ స్టేషన్లు, వెహికల్ మైలేజీ రేంజ్ అనే అంశాలు అవరోధాలుగా ఉన్నాయి.
పవర్ బ్యాంక్
ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు మొబైల్ ఫోన్లలో నిరంతరం ఛార్జింగ్ ఉండేలా బ్యాటరీ డ్రయిన్ కాకుండా చూసుకునేందుకు వీలుగా పవర్ బ్యాంకులు వెంట తీసుకెళ్తాం. ఇప్పుడు ఈవీ వెహికల్స్‌కి కూడా అత్యవసర సమయంలో వాడుకునేందుకు వీలుగా పవర్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి.
సీఓపీ26లో
బ్రిటన్‌కి చెందిన జిప్‌ఛార్జ్ అనే స్టార్టప్ కంపెనీ గో పేరుతో పవర్ బ్యాంకును తయారు చేసింది. గ్లాస్కోలో జరుగుతున్న కాన్ఫడరేషన్ ఆఫ్ పార్టీస్ 26 (సీవోపీ 26) సదస్సులో ఈ పవర్ బ్యాంకుని ఆవిష్కరించింది. వచ్చే ఏడాది చివరి త్రైమాసికం నాటికి మార్కెట్‌లోకి ఈ పవర్ బ్యాంక్‌ని తెస్తామని జిప్‌ఛార్జ్ ప్రకటించింది.
ఈజీగా
ఫోన్ పవర్ బ్యాంక్ అయితే చేతిలో పట్టుకెళ్లొచ్చు, బ్యాగులో తీసుకెళ్లొచ్చు. కార్ పవర్ బ్యాంక్ అంటే పెద్దదిగా ఉండి ఉపయోగించడం కష్టంగా ఉంటుందనే భావన రానీయకుండా డిజైన్ చేశారు. గరిష్టంగా 20 కేజీల బరువు ఉండే ఈ పవర్ బ్యాంకు చిన్న సూట్‌కేస్ అంత ఉంటుంది. వీల్స్‌పై దీన్ని తీసుకెళ్లడం సులభం. కారు డిక్కీలో ఈజీగా పడుతుంది.
గరిష్టంగా 70 కి.మీ
ఈ పవర్ బ్యాంక్‌ని ఉపయోగించి కారుని ఛార్జ్ చేస్తే కనిష్టంగా 35 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని జిప్‌ఛార్జ్ చెబుతోంది. ఇంట్లో సైతం కరెంటు లేని సమయంలో పవర్ బ్యాంక్‌ను బ్యాకప్‌గా ఉపయోగించుకునే వీలుంది. స్మార్‌యాప్‌ల ద్వారా దూరంగా ఉండి కూడా ఈ పవర్ బ్యాంక్ ఛార్జింగ్‌ను పర్యవేక్షించే వీలుంది.
రెండు వేరియంట్లలో
జిప్‌ఛార్జ్ సంస్థ 20 కిలోవాట్స, 40 కిలోవాట్స్ వేరియంట్లలో తయారు చేసింది. అయితే వీటి ధరను ఇంకా నిర్ణయించలేదు. మార్కెట్‌లోకి వచ్చేప్పుడు ధరలను ఫైనల్ చేస్తామని చెబుతున్నారు.
చదవండి:ఐఓసీఎల్ బాటలోనే బీపీసీఎల్.. బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లు!
Comments
Please login to add a commentAdd a comment