ముంబై: దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహన విక్రయాలకు (ఈవీలు) మద్దతుగా చార్జింగ్ స్టేషన్లు కూడా భారీగా ఏర్పాటు కానున్నాయి. వచ్చే మూడు నాలుగేళ్లలో అదనంగా 48,000 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలోకి రూ.14,000 కోట్ల పెట్టుబడులు వస్తాయంటూ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర, బస్ విక్రయాలు పుంజుకుంటాయని, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కీలకమవుతుందని పేర్కొంది.
‘‘ఈవీ ద్విచక్ర వాహనాల విక్రయాలు 2024–25 సంవత్సరం నాటికి మొత్తం విక్రయాల్లో 13–15 శాతంగా ఉండొచ్చు. అదే సమయంలో త్రిచక్ర వాహనాలు 30 శాతానికి పైగా, ఈ బస్సుల విక్రయాలు 8–10 శాతానికి చేరుకోవచ్చు’’ అని అంచనా వేసింది. ప్రస్తుతానికి మనదేశంలో బహిరంగ ఈవీ చార్జింగ్ కేంద్రాలు 2,000 వరకు ఉండగా.. ఇవి కూడా కేవలం కొన్ని రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలకే పరిమితం కావడం గమనార్హం.
విధానపరమైన ప్రోత్సాహం..
‘‘ఈవీ చార్జింగ్ సదుపాయాల విషయంలో భారత్ వెనుకనే ఉంది. కాకపోతే విధానపరమైన ప్రోత్సాహం బలంగా ఉంది. ఈ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు చార్జింగ్ ఇన్‌ఫ్రాలోకి అడుగుపెడుతున్నట్టు ప్రణాళికలు ప్రకటించాయి’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ శంషేర్ దేవాన్ తెలిపారు. ఈవీ చార్జింగ్ సదుపాయాల ఏర్పాటుకు ప్రత్యామ్నాయం బ్యాటరీ స్వాపింగ్ (ఖాళీ బ్యాటరీ ఇచ్చి చార్జింగ్ నింపి ఉన్నది తీసుకెళ్లడం) అని, కాకపోతే ఇది ఆరంభంలోనే ఉన్నట్టు దివాన్ చెప్పారు. ఫేమ్ పథకం కింద ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు రూ.1,300 కోట్లను కేటాయించడాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment