Rating agency icra
-
ఏసీల డిమాండ్ ఎలా ఉండనుందంటే..
కోల్‌కతా: ఉష్ణోగ్రతల్లో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో దేశంలో రూమ్ ఏసీల వినియోగం ఏటా గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) పరిశ్రమ అసాధారణ వృద్ధిని చూడనుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 20–25 శాతం అధికంగా 1.2–1.25 కోట్ల రూమ్ ఏసీ యూనిట్లు అమ్ముడుపోవచ్చని పేర్కొంది. అంతేకాదు వచ్చే ఆర్థిక సంత్సరంలోనూ (2025–26) రూమ్ ఏసీల అమ్మకాలు 10–12 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడం, ఒక ఇంట్లోనే ఒకటికి మించిన గదుల్లో ఏసీలను ఏర్పాటు చేసుకుంటుండటం, పట్టణీకరణ, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, సులభతర కన్జ్యూమర్ ఫైనాన్స్ (రుణాలపై కొనుగోలు) సదుపాయాలు... ఇవన్నీ వచ్చే కొన్నేళ్ల పాటు రూమ్ ఏసీల డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. ‘‘దేశీ రూమ్ ఏసీ పరిశ్రమ కరోనా ముందు నాటి విక్రయాల పరిమాణాన్ని 2023–24లోనే అధిగమించింది. వాతావారణంలో వచి్చన మార్పులు, సానుకూల వినియోగ ధోరణులు మద్దతుగా నిలిచాయి’’అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకుమార్ కృష్ణమూర్తి వివరించారు. ఏడాదిలో అధిక వేడి ఉండే సగటు రోజులు గడిచిన మూడు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది వేసవి సీజన్లో అయితే రూమ్ ఏసీలకు సంబంధించి కొన్ని కంపెనీలు (ఓఈఎంలు) 40–50 శాతం వరకు అధిక అమ్మకాలను నమోదు చేయడం గమనార్హం. సామర్థ్యాల పెంపుపై దృష్టి.. ‘‘సరఫరా వైపు చూస్తే దేశీ రూమ్ ఏసీ సామర్థ్యం వచ్చే మూడేళ్లలో 40 శాతం పెరగనుంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఓఈఎంలు, కాంట్రాక్టు తయారీదారులు రూమ్ ఏసీల తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు’’అని కృష్ణమూర్తి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కన్జ్యూమర్ డ్యూరబుల్ విడిభాగాలకు పీఎల్ఐ పథకం కింద ప్రకటించిన ప్రయోజనాల ప్రభావాన్ని సైతం ఇక్రా నివేదిక గుర్తు చేసింది. రూమ్ ఏసీ పరిశ్రమలో స్థానిక తయారీ పెరగడానికి పీఎల్ఐ పథకం దోహదం చేసినట్టు తెలిపింది. మూడు లిస్టెడ్ రూమ్ ఏసీ కంపెనీలు జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో 53 శాతం మేర ఆదాయ వృద్ధిని నమోదు చేయడాన్ని ప్రస్తావించింది. వేసవి సీజన్లో డిమాండ్ గరిష్ట డిమాండ్‌కు నిదర్శనంగా పేర్కొంది. ఈ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం మేర ఆదాయంలో వృద్ధిని సాధించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 25 శాతం అధిక ఆదాయాన్ని నమోదు చేస్తాయని ఇక్రా అంచనా వేసింది. తీవ్ర పోటీ, తయారీకి వినియోగించే విడిభాగాల ధరల్లో అస్థితరలు ఉన్నప్పటికీ.. రూమ్ ఏసీ కంపెనీల లాభాల మార్జిన్లు రానున్న కాలంలో క్రమంగా మెరుగుపడతాయని పేర్కొంది. -
తుక్కుగా మార్చాల్సిన వాణిజ్య వాహనాలు ఎన్నంటే..
ముంబై: దేశంలో ఈ ఏడాది మార్చి నాటికి 15 ఏళ్ల జీవిత కాలం పూర్తయిన మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు (ఎంఅండ్హెచ్సీవీలు) 11 లక్షల మేర ఉంటాయని, నిబంధనల ప్రకారం ఇవన్నీ తుక్కు కిందకు వెళ్లాల్సి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. కానీ, గడువు ముగిసిన తర్వాత కూడా వాటిని నడిపిస్తుండడం వల్ల తుక్కు కిందకు మారేవి వాస్తవంగా ఇంతకంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది.వీటిల్లో కొంత మేర తుక్కుగా మారినా కానీ, వాణిజ్య వాహన అమ్మకాల డిమాండ్‌కు కొంత మేర మద్దతుగా నిలవొచ్చని పేర్కొంది. ‘వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడరేషన్ ప్రోగ్రామ్’ లేదా స్క్రాపేజీ పాలసీని 2021 మార్చిలో ప్రకటించగా.. 2023 ఏప్రిల్ 1 నుంచి దశలవారీగా అమలు చేస్తుండడం గమనార్హం. మొదటి దశలో 15 ఏళ్ల జీవిత కాలం ముగిసిన ప్రభుత్వ వాహనాలను తుక్కుగా మార్చనున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి అమల్లోకి వచి్చన రెండో దశలో భాగంగా.. వాహనం వయసుతో సంబంధం లేకుండా ఫిట్నెస్ ఆధారంగా తుక్కుగా మార్చడం తప్పనిసరి చేశారు. అంటే నిబంధనలకు మించి కాలుష్యం విడుదల చేసే వాహనాలను కాలంతో సంబంధం లేకుండా తుక్కుగా మార్చనున్నారు.మరో 5.7 లక్షల వాహనాలు.. 2027 మార్చి నాటికి మరో 5.7 లక్షల వాహనాలు 15 ఏళ్ల జీవిత కాలం పూర్తి చేసుకుంటాయని ఇక్రా తెలిపింది. మొదటి దశలో భాగంగా 9 లక్షల ప్రభుత్వ వాణిజ్య వాహనాలు తుక్కుగా మార్చడం వంటివి కొత్త వాహన కొనుగోళ్ల డిమాండ్‌ను పెంచనున్నట్టు అంచనా వేసింది. ఇక ప్యాసింజర్ వాహనాలు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల వినియోగం తక్కువగా ఉన్నందున ఈ విభాగాల నుంచి తుక్కుగా మారేవి తక్కువగానే ఉండొచ్చని ఇక్రా తెలిపింది. స్క్రాపేజీ పాలసీ అమల్లోకి వచ్చినప్పటికీ వాహన యజమానుల నుంచి స్పందన పరిమితంగానే ఉన్నట్టు ఇక్రా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024 ఆగస్ట్ 31 నాటికి వాహన తుక్కు కేంద్రాలు కేవలం 44,803 ప్రైవేటు వాహనాలు, 41,432 ప్రభుత్వ వాహనాలకు సంబంధించిన స్క్రాప్ దరఖాస్తులనే అందుకున్నట్టు ఇక్రా నివేదిక తెలిపింది.దీర్ఘకాలంలో ప్రయోజనాలు.. ‘‘వాహన తుక్కు విధానంతో దీర్ఘకాలంలో పలు ప్రయోజనాలున్నాయి. పాత వాహనాలను తుక్కు గా మార్చడం వల్ల వాయు కాలుష్యం తగ్గుతుంది. ఫ్లీట్ ఆధునికీకరణ (కొత్త వాహన కొనుగోళ్లు) కార్యక్రమానికి ఇది దారితీస్తుంది. మొత్తం మీద ఆటో పరిశ్రమలో అమ్మకాలకు మద్దతుగా నిలుస్తుంది. ఆటోమోటివ్ ఓఈఎంలకు ముడి సరుకుల వ్యయాలను గణనీయంగా తగ్గిస్తుంది’’అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కింజాల్ షా వివరించారు. -
ఔషధ సంస్థల ఆదాయ వృద్ధి 8–10 శాతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ రంగంలోని టాప్–25 సంస్థల ఆదాయ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. ఇక్రా ప్రకారం.. భారతీయ మొత్తం ఔషధ పరిశ్రమలో 60 శాతం వాటా కలిగిన ఈ కంపెనీల ఆదాయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 13–14 శాతం పెరిగింది. 2023–24 నాటి అధిక అమ్మకాలను అనుసరించి 2024–25లో యుఎస్ 8–10 శాతం, యూరప్ మార్కెట్ల నుండి 7–9 శాతం ఆదాయ వృద్ధి నమోదుకు ఆస్కారం ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది యూఎస్ 18–20, యూరప్ 16–18 శాతం ఉండవచ్చు. దేశీయ మార్కెట్ 6–8 శాతం స్థిర వృద్ధిని చూడగలదు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు 2024–25లో 8–10 శాతం, 2023–24లో 16–18 శాతం పెరుగుదలను నమోదు చేయవచ్చు. పెరిగిన కొత్త ఉత్పత్తులు.. 2023–24లో పెరిగిన కొత్త ఉత్పత్తుల విడుదల, ఎంపిక చేసిన చికిత్స విభాగాల్లో ఉత్పత్తి కొరత, సంక్లిష్ట జనరిక్స్ ఆరోగ్యకర పనితీరు యూఎస్ విపణిలో టాప్–25 భారతీయ కంపెనీల ఆదాయ వృద్ధికి కారణం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అధిక వృద్ధి ఉన్నప్పటికీ 2024–25లో వృద్ధి తగ్గుతుందని అంచనా. యుఎస్ మార్కెట్లో స్వల్ప ధరల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, భారతీయ ఫార్మా సంస్థలు యుఎస్ మార్కెట్లోని కాంప్లెక్స్ జెనరిక్స్ నుండి తమ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాయి. గత సంవత్సరంలో భారతీయ ఔషధ సంస్థలకు యూఎస్ఎఫ్డీఏ జారీ చేసిన హెచ్చరిక లేఖలు, దిగుమతి హెచ్చరికల సంఖ్య పెరిగింది. దీంతో నూతన ఉత్పత్తుల విడుదలలో జాప్యానికి దారితీసింది. కన్సల్టెంట్లను నియమించుకోవడం, అదనపు వనరులను వినియోగించడం వంటి పరిష్కార చర్యలకు గణనీయంగా వ్యయ భారం పడుతోంది. తద్వారా లాభాల మార్జిన్లపై ప్రభావం చూపుతోంది. పొంచి ఉన్న ముప్పు.. కొనసాగుతున్న ఎర్ర సముద్ర సంక్షోభం ప్రస్తుతానికి భారతీయ ఔషధ కంపెనీలపై ప్రభావం చూపనప్పటికీ.. సరఫరా అంతరాయాలు, రవాణా వ్యయాల పెరుగుదల రూపంలో ఏదైనా ప్రతికూల ప్రభావం ఎదురైతే అవి కీలకంగా మారతాయి. ధరల పెరుగుదల కీలక ఆదాయ మార్గంగా ఉన్నందున జెనరిక్స్‌కు అనుకూలమైన ఏవైనా పరిణామాలు లేదా ముఖ్యమైన మందుల జాబితా (ఎన్ఎల్ఈఎం) కింద మరిన్ని ఉత్పత్తులను చేర్చినట్టయితే తయారీ సంస్థలకు నష్టాలు వాటిల్లే ముప్పు పొంచి ఉంది. -
ఐటీ ఆదాయాల్లో 3–5 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3–5 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్ తెలిపింది. ‘వృద్ధి వేగం పుంజుకునే వరకు ఈ రంగంలో నియామకాలు సమీప కాలంలో స్తబ్ధుగా ఉంటాయి. ఆదాయ వృద్ధిపై ఆందోళనల మధ్య కంపెనీల లాభదాయకత స్థితిస్థాపకంగా ఉంటుంది. 250 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ రంగానికి 2024–25లో నిర్వహణ లాభాల మార్జిన్లు 21–22 శాతానికి వస్తాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో పరిశ్రమ కేవలం 2 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. వాస్తవానికి 3–5 శాతం ఆదాయ వృద్ధి ఉంటుందని పరిశ్రమ గతంలో అంచనా వేసింది. 2022–23 ఏప్రిల్–డిసెంబర్లో ఇది 9.2 శాతం సాధించింది. యూఎస్, యూరప్‌లోని కీలక మార్కెట్లలో స్థిర, స్థూల ఆర్థికపర ఎదురుగాలుల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు ఐటీపై తక్కువ వ్యయం చేయడంతో 2024–25లో కూడా స్వల్ప ఆదాయ వృద్ధి అంచనాలకు దారితీసింది’ అని తెలిపింది. సగటు అట్రిషన్ 12–13 శాతం.. ‘క్లిష్ట వ్యయాలు, వ్యయ నియంత్రణ ఒప్పందాలు కొనసాగనున్నాయి. ఇది భారతీయ ఐటీ సేవల కంపెనీల వృద్ధి అవకాశాలకు కొంతవరకు మద్దతునిస్తుంది. బలమైన ఆర్డర్ బుక్స్, వివిధ దశల్లో ఉన్న డీల్స్.. స్థూల ఆర్థికపర ఎదురుగాలులు తగ్గిన తర్వాత ఊపందుకుంటాయి. కార్పొరేట్ సంస్థలకు మహమ్మారి తర్వాత మొత్తం మూలధన కేటాయింపులకు టెక్ ఖర్చులు మరింత సమగ్రంగా మారాయి. నియామక కార్యకలాపాలు స్తబ్ధుగా ఉంటాయని అంచనా వేస్తున్నప్పటికీ అట్రిషన్ స్థాయిలు సమీప కాలంలో స్థిరపడతాయి. -
హోటల్ పరిశ్రమలో కొనసాగనున్న జోరు
కోల్‌కతా: దేశ హోటల్ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మంచి వృద్ధిని చూడనుంది. 2024–25లో హోటల్ పరిశ్రమ ఆదాయం మొత్తం మీద 7–9 శాతం మధ్య పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయ విహార పర్యటనలు కొనసాగుతుండడం, సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలనుకు (ఎంఐసీఈ) డిమాండ్ ఉండడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని ఇక్రా తెలిపింది. సాధారణ ఎన్నికల ప్రభావం స్వల్పకాలమేనని పేర్కొంది. హోటల్ పరిశ్రమ డిమాండ్‌లో ఆధాత్మిక పర్యాటకం, టైర్–2 సిటీలు కీలక చోదకంగా నిలుస్తాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హోటళ్లలో గదుల భర్తీ రేటు (ఆక్యుపెన్సీ) దశాబ్ద గరిష్టమైన 70–72 శాతానికి చేరుకుందని, 2022–23లో ఇది 68–70 శాతమే ఉన్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా హోటల్ గదుల రేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.7,200–7,400 మధ్య ఉండొచ్చని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7,800–8,000కు పెరగొచ్చని అంచనా వేసింది. దేశ ఆతిథ్య రంగంపై సానుకూల అవుట్‌లుక్‌ను ప్రకటించింది. -
ICRA: డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 6 శాతం
న్యూఢిల్లీ: భారత్ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (2023 అక్టోబర్–డిసెంబర్) 6 శాతానికి తగ్గుతుందని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2023జూలై–సెపె్టంబర్)లో 7.6 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. వ్యవసాయం, పరిశ్రమల పనితీరు స్తబ్దుగా ఉన్నట్టు తెలిపింది. పారిశ్రామిక రంగంలో వృద్ధి తగ్గుముఖం పట్టడానికి గతంలో బేస్ ప్రభావం అధికంగా ఉండడానికితోడు, అమ్మకాల పరిమాణం తగ్గడాన్ని ప్రస్తావించింది.. భారత ప్రభుత్వం, 25 రాష్ట్రాల వ్యయాలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 0.2 శాతం మేర తగ్గడం జీవీఏ వృద్ధిని వెనక్కి లాగడానికి కారణాల్లో ఒకటిగా పేర్కొంది. ‘‘పారిశ్రామిక రంగంలో అమ్మకాల పరిమాణం తగ్గడం, పెట్టుబడులపైనా కొంత స్తబ్దత, ప్రభుత్వ వ్యయాలు తగ్గడం, రుతుపవనాలు అసాధారణం ఉండడం వంటివి జీడీపీ వృద్ధిని 2023–24లో మూడో త్రైమాసికంలో 6 శాతానికి తగ్గిస్తాయి’’అని వివరించింది. ఇక సేవల రంగానికి సంబంధించి జీవీఏ (స్థూల అదనపు విలువ) మాత్రం 2023–24లో రెండో త్రైమాసికంలో ఉన్న 5.8 శాతం నుంచి మూడో త్రైమాసికంలో 6.5 శాతానికి వృద్ధి చెందుతుందని ఇక్రా అంచనా వేసింది. హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. -
ఆభరణాల డిమాండ్ ఎలా ఉందంటే..
ముంబై: ధరలు పెరిగినప్పటికీ పసిడి ఆభరణాలకు డిమాండ్ తగ్గడం లేదని తాజా నివేదిక ఒకటి పేర్కొంది. బంగారం ఆభరణాల వినియోగం.. విలువ పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 10 నుంచి 12 శాతం పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా– నివేదిక పేర్కొంది. ఇంతక్రితం వేసిన 8 నుంచి 10 శాతం అంచనాలను ఈ మేరకు ఎగువముఖంగా సవరించింది. పసిడి ధరల పెరుగుదలే దీనికి కారణమని వివరించింది. 2023–24 మొదటి ఆరునెలల కాలాన్ని (ఏప్రిల్–సెప్టెంబర్) 2022–23 ఇదే కాలంతో పరిశీలిస్తే ఆభరణాల వినియోగం విలువ 15 శాతానికి పైగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. బంగారం కొనుగోళ్లకు శుభప్రదంగా భావించే ’అక్షయ తృతీయ’ సమయంలో స్థిరమైన డిమాండ్, అధిక బంగారం ధరలు దీనికి కారణంగా పేర్కొంది. అయితే ద్వితీయార్థంలో ఈ శాతం 6 నుంచి 8 శాతమే ఉంటుందని అభిప్రాయపడింది. గ్రామీణ డిమాండ్ మందగమనం, ద్రవ్యోల్బణం తీవ్రత తమ అంచనాలకు కారణమని పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► డిసెంబర్ 2022–ఏప్రిల్ 2023 మధ్య అస్థిరత కొనసాగిన బంగారం ధరలు, 2023–24 మొదటి అర్థభాగంలో (ఏప్రిల్–సెపె్టంబర్) స్థిరంగా ఉన్నాయి. అయితే క్రితం సంవత్సరం సగటు ధరలతో పోలిస్తే 14 శాతం పెరిగాయి. ► పెరిగిన ధరలు.. పలు ఆభరణాల రిటైలర్ల ఆదాయ పటిష్టతకు దోహదపడ్డాయి. ► మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ప్రపంచ స్థూల ఆర్థిక అనిశి్చత పరిస్థితులతో సమీప కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయి. ► అక్టోబర్ 2023 ప్రారంభం నుండి బంగారం ధరల పెరుగుదల, స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం తీవ్రతవల్ల యల్లో మెటల్ ఆభరణాల డిమాండ్ కొంత తగ్గవచ్చు. -
పారిశ్రామిక రంగం పరపతి మెరుగుపడుతుంది
న్యూఢిల్లీ: భారత పరిశ్రమల పరపతి డిసెంబర్ త్రైమాసికంలో మెరుగుపడుతుందని, రుణాలపై వడ్డీ చెల్లింపుల కవరేజీ 4.5–5 రెట్లు పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కార్పొరేట్ ఇండియా ఆదాయాలు మెరుగుపడడాన్ని ఇందుకు అనుకూలించే అంశంగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంత్సరం ద్వితీయ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) 601 లిస్టెడ్ కంపెనీల (ఫైనాన్షియల్ సరీ్వసులు మినహా) బ్యాలన్స్ షీట్లను విశ్లేíÙంచిన అనంతరం ఇక్రా ఈ వివరాలు వెల్లడించింది. కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 3.98 శాతం, అంతకుముందు త్రైమాసికంతో పోల్చిచూస్తే 0.64 శాతం మెరుగుపడినట్టు తెలిపింది. కమోడిటీల ధరలు శాంతించడాన్ని సానుకూలంగా పేర్కొంది. ముడి పదార్థాల ధరలు ఇటీవలి కాలంలో తగ్గడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ ఇవి చారిత్రకంగా చూస్తే, ఇంకా ఎగువ స్థాయిల్లోనే ఉన్నట్టు పేర్కొంది. భారత కంపెనీల నిర్వహణ మార్జిన్లు ఇంకా చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకోవాల్సి ఉందని వివరించింది. -
సిమెంట్ అమ్మకాల్లో బలమైన వృద్ధి
న్యూఢిల్లీ: సిమెంట్ అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 9–10 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. మౌలిక సదుపాయాలు, పట్టణ గృహాల రంగాల నుండి డిమాండ్ ఇందుకు కారణమని తెలిపింది. ‘ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో (ఏప్రిల్–సెపె్టంబర్) పరిశ్రమ విక్రయాలు 12 శాతం అధికం అయ్యాయి. మొత్తం పంటల ఉత్పత్తిపై సాధారణం కంటే తక్కువ రుతుపవనాల కారణంగా వ్యవసాయ ఆదాయాలపై, అలాగే కొన్ని మార్కెట్లలో గ్రామీణ గృహాల డిమాండ్‌పై ప్రతికూల ప్రభావంతో అక్టోబర్–మార్చి కాలంలో మితమైన వృద్ధి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల కారణంగా కొనసాగుతున్న ఇన్ఫ్రా ప్రాజెక్టులకు నిధుల విడుదల మందగించవచ్చు. దీని ప్రభావంతో రెండవ అర్ధ భాగంలో సిమెంట్ విక్రయాల పరిమాణం తగ్గవచ్చు. సిమెంట్ పరిశ్రమ నిర్వహణ లాభాలు ప్రస్తుత ఆర్థిక సంంత్సరంలో 260–310 బేసిస్ పాయింట్లు పెరిగి 16–16.5 శాతానికి మెరుగుపడతాయని అంచనా’ అని ఇక్రా వివరించింది. 63–70 మెట్రిక్ టన్నులు.. ‘పునరుత్పాదక ఇంధన వనరులపై సిమెంట్ పరిశ్రమ ఆసక్తి పెరిగింది. అధిక ధరలో లభించే థర్మల్ పవర్, విద్యుత్ అవసరాల కోసం గ్రిడ్‌పై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఉంది. తద్వారా నిర్వహణ ఖర్చులు 15–18 శాతం తగ్గుతాయని అంచనా. ఆరోగ్యకర డిమాండ్ అవకాశాలతో సిమెంట్ పరిశ్రమ సామర్థ్య విస్తరణను కొనసాగిస్తుంది. 2025 మార్చి నాటికి సిమెంట్ పరిశ్రమలో 63–70 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం తోడవుతుందని అంచనా. ఇందులో దాదాపు 33–37 మిలియన్ మెట్రిక్ టన్నులు 2024 మార్చి నాటికి జతకూడనుంది. గత ఐదేళ్లలో ఇదే అత్యధికం. తూర్పు, మధ్య భారత ప్రాంతాల్లో అధిక విస్తరణ జరుగనుంది. 2022–23లో పరిశ్రమకు 27 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం తోడైంది’ అని ఇక్రా వివరించింది. సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ) ప్రకారం భారత్‌లో సిమెంట్ కంపెనీల స్థాపిత సామర్థ్యం మొత్తం 541 మిలియన్ టన్నులు. -
కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతుల్లో క్షీణత
ముంబై: కట్, పాలిష్డ్ వజ్రాల (సీపీడీ) ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22 శాతం తగ్గి 17.2 బిలియన్ డాలర్లుగా (రూ.1.42 లక్షల కోట్లు) ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అమెరికా, యూరప్ వంటి కీలక వినియోగ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం ప్రభావంతో డిమాండ్ తగ్గిన విషయాన్ని ప్రస్తావించింది. ‘‘2022–23 ద్వితీయ ఆరు నెలల నుంచి సీపీడీల ఎగుమతులు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో చూసినా (ఏప్రిల్–ఆగస్ట్) ఎగుమతులు 31 శాతం తక్కువగా నమోదయ్యాయి’’ అని ఇక్రా నివేదిక వెల్లడించింది. పండుగల సీజన్ నేపథ్యంలో రానున్న నెలల్లో ఎగుమతులు సీక్వెన్షియల్‌గా (క్రితం నెలతో పోలి్చనప్పుడు) పెరగొచ్చని పేర్కొంది. మొత్తం మీద పూర్తి ఆర్థిక సంవత్సరానికి 22 శాతం తక్కువగా నమోదు అవుతాయని తెలిపింది. ఈ రంగం అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి నెగెటివ్‌కు మార్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా డైమండ్ల డిమాండ్‌లో చైనా వాటా 10–15 శాతంగా ఉంటుంది. చైనా మార్కెట్లో ఈ డిమాండ్ ఇంకా చెప్పుకోతగినంతగా పుంజుకోలేదు‘‘అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సాక్షి సునేజా తెలిపారు. సహజ వజ్రాలతో పోలిస్తే ల్యాబ్‌లో తయారైన వజ్రాలు చాలా తక్కువ ధరలో లభిస్తుండడం కూడా అధిక పోటీకి కారణమవుతున్నట్టు చెప్పారు. గరిష్ట స్థాయిలో ముడి వజ్రాల ధరలు ముడి వజ్రాల ధరలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గరిష్ట స్థాయిలోనే కొనసాగుతాయని ఇక్రా నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత ధరలు 15 ఏళ్ల మధ్యస్థ స్థాయిలో ఉన్నాయని తెలిపింది. కరోనా తర్వాత ఒక్కసారిగా పెరిగిన డిమాండ్, మైనింగ్ కంపెనీల నుంచి సరఫరా తగ్గడం వల్లే గడిచిన రెండేళ్ల కాలంలో ధరలు పెరగడానికి దారితీసినట్టు వివరించింది. ప్రస్తుతం డిమాండ్ తగ్గినప్పటికీ రష్యా నుంచి ముడి వజ్రాల సరఫరా తగ్గడంతో ధరలు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నట్టు పేర్కొంది. రష్యాకు చెందిన అల్రోసా పీజేఎస్సీ మైనింగ్ సంస్థపై అమెరికా ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తు చేసింది. అదే సమయంలో ఇతర మైనింగ్ సంస్థల నుంచి అదనపు సరఫరా రాకపోవడం ధరలకు రెక్కలు వచి్చనట్టు వివరించింది. పాలిష్డ్ వజ్రాల ధరలపై ఒత్తిడి ఉన్నట్టు తెలిపింది. 15 ఏళ్ల మధ్యస్థ స్థాయి కంటే 15–20 శాతం తక్కువగా ఉన్నట్టు తెలిపింది. దీనికి తోడు డిమాండ్‌పై ఒత్తిళ్లు, కస్టమర్లకు ధరల పెంపును బదిలీ చేసే సామర్థ్యం తక్కువగా ఉండడంతో, వజ్రాల కంపెనీల లాభాల మార్జిన్లు 0.4 శాతం వరకు తగ్గిపోవచ్చని అంచనా వేసింది. నిల్వలు కూడా పెరుగుతాయని పేర్కొంది. ఎగుమతిదారులకు వెసులుబాటు 2024 జూన్ వరకూ ఆర్ఓడీటీఈపీ స్కీమ్ వర్తింపు ఎగుమతిదారుల ప్రయోజనాలకు ఉద్దేశించిన ఆర్ఓడీటీఈపీ స్కీమ్ (స్కీమ్ ఫర్ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్‌పోర్టెడ్ ప్రొడక్ట్స్) పథకాన్ని 2024 జూన్ వరకూ పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 సెపె్టంబర్ నుంచి ఈ పథకం అమల్లో ఉంది. ఈ నెలతో ముగియనుంది. ప్రస్తుతం, 10,342 పైగా ఎగుమతి వస్తువులు ఈ పథక ప్రయోజనాల కిందకు వస్తున్నాయి. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల ఉపశమన పథకం ఇది. వస్తువుల తయారీ– పంపిణీ ప్రక్రియలో ఎగుమతిదారులు చెల్లించే పన్నులు, సుంకాలు, లెవీల వాపసు కోసం ఉద్దేశించినది. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో ఎగుమతిదారులకు కేంద్రం తాజా నిర్ణయం ఊరటనివ్వనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ఫార్మా ఆదాయాల్లో 7–9 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీ ఫార్మా కంపెనీల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24)లో 7–9 శాతం మధ్య పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయ మార్కెట్ 8–10 శాతం మేర, అమెరికా మార్కెట్ 6–8 శాతం మేర విస్తరించడం ఆదాయ వృద్ధికి అనుకూలిస్తుందని పేర్కొంది. ఇక ఐరోపా మార్కెట్ల నుంచి ఆదాయం 3–5 శాతం వరకు, వర్ధమాన మార్కెట్ల నుంచి 8–10 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది. 25 దేశీ ఔషధ కంపెనీల గణాంకాలను ఇక్రా విశ్లేషించింది. దేశ ఫార్మా మార్కెట్లో ఈ కంపెనీల వాటా 60 శాతంగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) దేశీ ఫార్మా కంపెనీల ఆదాయాలు 10 శాతం మేర పెరగడం గమనార్హం. కాంప్లెక్స్ జనరిక్స్, స్పెషాలిటీ ఫార్ములేషన్లను యూఎస్ మార్కెట్లలో విడుదల చేయడంపై కంపెనీలు ప్రత్యేక దృష్టి సారించడం పరిశ్రమ మార్జిన్లకు అనుకూలిస్తుందని వివరించింది. దేశ ఫార్మా కంపెనీల పరపతి ప్రొఫైల్ (రుణ స్థితిగతులు) ఆరోగ్యకరంగా ఉన్నట్టు తెలిపింది. ‘‘జాతీయ ముఖ్య ఔషధాల జాబితాలోని వాటి ధరలను టోకు ద్రవ్యోల్బణం ఆధారితంగా 12.1 శాతం పెంచడం, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, ముఖ్య ఔషధ జాబితాలో లేని వాటి ధరలను వార్షికంగా కంపెనీలు పెంచడం అనేవి దేశీ మార్కెట్లో 8–10 శాతం ఆదాయ వృద్ధికి మద్దతుగా నిలుస్తాయి’’అని ఇక్రా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మైత్రి మాచర్ల తెలిపారు. యూఎస్ఎఫ్డీఏ తనిఖీల రిస్క్. యూఎస్ మార్కెట్లో వృద్ధి అనేది ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో 6–8 శాతం మధ్య ఉంటుందని ఇక్రా తెలిపింది. యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు ఇటీవల మళ్లీ పెరిగాయని, కనుక నియంత్రఫరమైన రిస్క్‌ను పర్యవేక్షించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇటీవల కొన్ని ఫార్మా కంపెనీలపై సైబర్ దాడులను ప్రస్తావిస్తూ, ఇవి కార్యకలాపాలకు తాత్కాలిక అవరోధం కలిగించొచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా కంపెనీల మూలధన వ్యయాలు రూ.20,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. -
మాల్స్ అద్దె ఆదాయంలో వృద్ధి
ముంబై: రిటైల్ మాల్ ఆపరేటర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకు అధికంగా అద్దె ఆదాయం పొందొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రెంటల్ ఆదాయం, మాల్స్‌కు విచ్చేసే కస్టమర్ల సంఖ్యలో బలమైన వృద్ధిని ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ మాల్స్ అద్దె ఆదాయం కరోనా ముందు నాటితో పోలిస్తే 27 శాతం పెరగడం గమనార్హం. కస్టమర్ల రాక, విక్రయాల్లో మెరుగైన వృద్ధి కనిపిస్తోందని, ఫలితంగా నికర నిర్వహణ ఆదాయం పెరుగుతుందని ఇక్రా నివేదిక తెలిపింది. ‘‘అద్దె ఆదాయం 2022–23లో 78 శాతం అధికంగా వచ్చింది. కరోనా ముందు నాటితో పోల్చి చూసినా 25–27 శాతం అధికంగా వచ్చింది. రిటైల్ వాణిజ్యం అధికంగా జరగడం, కస్టమర్ల రాక పెరగడం తోడ్పడింది’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అనుపమారెడ్డి తెలిపారు. మాల్స్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య కరోనా మహమ్మారి పూర్వం ఉన్న స్థాయిలో 95 శాతానికి చేరుకుందని ఇక్రా నివేదిక తెలిపింది ట్రేడింగ్ విలువ 125–127 శాతానికి పుంజుకుంది. ఖర్చు చేసే ఆదాయం పెరగడం, ప్రీమియం ఉత్పత్తులకు కస్టమర్లు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి కారణమని అనుపమా రెడ్డి తెలిపారు. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొనసాగుతుందని, ఫలితంగా మెరుగైన ఆదాయం ఆపరేటర్లకు వస్తుందన్నారు. అద్దెల పెంపు 3–4 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అద్దెల పెంపు 3–4 శాతంగా ఉండొచ్చని ఇక్రా తెలిపింది. రిటైల్ మాల్స్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య అధికంగా ఉండడడంతో అధిక రేట్లపై రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రస్తావించింది. జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, ఆహారం, పానీయాలు, వినోదం కోసం కస్టమర్లు ఖర్చు చేసే ధోరణి పెరుగుతుందని.. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యం 4–5 శాతం అధికంగా నమోదు కావచ్చని ఇక్రా పేర్కొంది. దీంతో మాల్స్ ఆపరేటర్లకు 8–10 శాతం మేర అధికంగా అద్దెల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. ఈ రంగానికి ఇక్రా స్థిరమైన అవుట్‌లుక్ ఇచ్చింది. ఆరు మెట్రోల్లో 7 మిలియన్ చదరపు అడుగులు గత ఆర్థిక సంవత్సరంలో అధికంగా సరఫరా అయినట్టు పేర్కొంది. దీంతో మాల్స్‌లో ఖాళీల రేటు 2022–23లో 19 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖాళీల రేటు 18–19 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కొత్తగా 9–10 మిలియన్ చదరపు అడుగుల సరఫరా ఉండొచ్చని పేర్కొంది. కొత్తగా వచ్చే మాల్స్‌లో 60 శాతం ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై నుంచే ఉంటాయని వివరించింది. -
ఐటీ రంగంలో తగ్గనున్న నియామకాలు
ముంబై: భారత ఐటీ కంపెనీల ఆదాయంలో వృద్ధి మరింత తగ్గి, మధ్య స్థాయి సింగిల్ డిజిట్‌కు (4–6) పరిమితం అవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నందున నియామకాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో కంపెనీలు సమీప కాలంలో కొత్త నియామకాలను తక్కువకు పరిమితం చేసుకోవచ్చని తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల్లో (2022 అక్టోబర్ నుంచి 2023 మార్చి వరకు) నికర నియామకాలు ప్రతికూలంగా ఉన్న విషయాన్ని ఇక్రా తన నివేదికలో ప్రస్తావించింది. ఐటీ కంపెనీల అసోసియేషన్ నాస్కామ్ మార్చిలో విడుదల చేసిన నివేదికను పరిశీలించినప్పుడు 2022–23లో వృద్ధి 8.4 శాతానికి తగ్గిపోయినట్టు తెలుస్తోంది. 2021–22లో ఇది 15 శాతంగా ఉండడం గమనార్హం. ఆర్డర్ బుక్, డీల్స్ బలంగానే ఉనప్పటికీ 2023–24లో ఆదాయం వృద్ధి 4–6 శాతం మించకపోవచ్చని ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలోని కంపెనీల పట్ల స్థిరమైన దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపింది. రుణాలకు సంబంధించి ఇవి మెరుగైన స్థితిలో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అమెరికా, యూరప్‌లో స్థూల ఆర్థిక సమస్యలు ఉండడంతో గత రెండు త్రైమాసికాల్లో వృద్ధి ధోరణి తగ్గుముఖం పట్టినట్టు ఇక్రా తెలిపింది. భారత ఐటీ కంపెనీల ఆదాయంలో 90 శాతం యూఎస్, యూరప్ నుంచే వస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, ఇన్సూరెన్స్ విభాగం నుంచే మూడింట ఒకటో వంతు ఆదాయం ఐటీ కంపెనీలకు వస్తుంటుంది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో ఈ రంగాల నుంచి వచ్చే ఆదాయం తగ్గొచ్చని.. కస్టమర్లు నిర్ణయాలను జాప్యం చేయవచ్చని ఇక్రా తెలిపింది. మార్జిన్లు స్థిరం.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల మార్జిన్లు 1.90 శాతం తగ్గి 22.9 శాతానికి పరిమితమైనట్టు ఇక్రా తెలిపింది. ఆదాయంలో వృద్ధి నిదానించినా, నిర్వహణ మార్జిన్లు ఇదే స్థాయిలో కొనసాగొచ్చని అంచనా వేసింది. ఐటీ రంగంలోని టాప్–5 కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 83,906 మందిని నియమించుకున్నట్టు ప్రస్తావించింది. స్థూల ఆర్థిక అనిశ్చితులు కొనసాగినంత కాలం నియామకాలు తక్కువగానే ఉండొచ్చని పేర్కొంది. -
ఆభరణాల మార్కెట్లో సంఘటిత రంగం పట్టు!
ముంబై: ఆభరణాల మార్కెట్లో సంఘటిత రంగం వాటా ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12–15 శాతం మేర పెరగొచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. పెద్ద సంస్థలన్నీ విస్తరణ ప్రణాళికలతో ముందుకు వెళుతున్న విషయాన్ని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా గుర్తు చేసింది. దీంతో స్థూల ఆర్థిక సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ సంఘటిత రంగం వాటా పెంచుకోగలదని ఇక్రా అంచనా వేస్తోంది. ఆభరణాల మార్కెట్ 2023–24లో విలువ పరంగా 8–10 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని తెలిపింది. బంగారం ధరల్లో అస్థిరతల నేపథ్యంలో పరిమాణాత్మకంగా మార్కెట్లో పెద్ద వృద్ధి నమోదు కాకపోవచ్చన్న అంచనాతో ఉంది. కాకపోతే బంగారానికి ఉన్న బలమైన సాంస్కృతిక అనుబంధం నేపథ్యంలో పండుగలు, వివాహాల సందర్భంగా బంగారం ఆభరణాలకు డిమాండ్ మద్దతుగా నిలుస్తుందని వివరించింది. ‘‘చాలా మంది జ్యుయలరీ రిటైలర్లు 2023 అక్షయ తృతీయ సందర్భంగా ఆదాయంలో 15 శాతానికి పైగా వృద్ధిని చూసినట్టు పేర్కొన్నారు. బంగారం ధరలు పెరగడం, ఎక్కువ సంస్థలు దూకుడుగా రిటైల్ స్టోర్లను పెంచడం ఆదాయ వృద్ధికి మద్దతునిస్తుంది’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కౌశిక్ దాస్ పేర్కొన్నారు. జ్యుయలర్ల ఆపరేటింగ్ మార్జిన్ సౌకర్య స్థాయిలో 7.5–8 శాతం మేర వచ్చే రెండేళ్లు ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. -
ఈ ఏడాదీ వాణిజ్య వాహనాల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా వాణిజ్య వాహన పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–10 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘పాత వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోళ్లు, గనులు, మౌలిక రంగంలో నిర్మాణ కార్యకలాపాలు, ఆరోగ్యకర స్థాయిలో వినియోగం ఈ వృద్ధికి దోహదం చేస్తుంది. వాస్తవానికి గత నెలలో విక్రయాలు 2022 ఏప్రిల్‌తో పోలిస్తే 5 శాతం, ఈ ఏడాది మార్చితో పోలిస్తే 41 శాతం క్షీణించాయి. 2022–23లో పరిశ్రమ పరిమాణం 33 శాతంపైగా దూసుకెళ్లింది. అనుకూల విక్రయాల స్థాయితో పాటు స్థూల ఆర్థిక కార్యకలాపాలలో బలమైన వృద్ధి ఇందుకు దోహదం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన ఆరోగ్యకర డిమాండ్‌ను 2023–24 అనుసరిస్తుంది. మార్చి 2021లో ప్రకటించిన స్క్రాపేజ్ విధానం 2023 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. కొత్త వాణిజ్య వాహనాల అమ్మకాల పెరుగుదలకు ఈ పాలసీ దోహదపడే అవకాశం ఉంది’ అని ఇక్రా వివరించింది. -
విమానయానం భవిష్యత్ సుస్థిరం
న్యూఢిల్లీ: రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా దేశీ విమానయాన రంగం ఔట్‌లుక్‌ను స్థిరత్వానికి ఎగువముఖంగా సవరించింది. గతంలో ప్రకటించిన ప్రతికూల రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య(ట్రాఫిక్) వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ రంగం భవిష్యత్‌పట్ల ఆశావహంగా స్పందించింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో విమానయాన రంగం నష్టాల అంచనాలు రూ. 11,000 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లకు తగ్గించింది. వచ్చే ఏడాది(2023–24)కి సైతం తొలుత వేసిన నష్టం రూ. 7,000 కోట్ల అంచనాలలోనూ రూ. 5,000 కోట్లకు కోత పెట్టింది. వచ్చే ఏడాదిలోనూ ప్రయాణికుల ట్రాఫిక్ కొనసాగనున్నట్లు తాజా నివేదికలో ఇక్రా అభిప్రాయపడింది. దీంతో విమానయాన కంపెనీలు టికెట్ ధరల నిర్ణయంలో మరింత శక్తివంతంగా వ్యవహరించేందుకు వీలు చిక్కగలదని పేర్కొంది. ఇది మెరుగుపడుతున్న ఈల్డ్స్ ద్వారా ప్రతిఫలిస్తున్నట్లు తెలియజేసింది. 2022 జూన్‌లో గరిష్టానికి చేరిన వైమానిక ఇంధన(ఏటీఎఫ్) ధరలు క్రమంగా తగ్గుతుండటం, విదేశీ మారక రేట్లు స్థిరంగా ఉండటం లాభదాయకతకు సహకరించనున్నట్లు అంచనా వేసింది. 8–13 శాతం వృద్ధి: ఏప్రిల్ నుంచి ప్రారంభంకానున్న వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీ ప్యాసింజర్ ట్రాఫిక్ 8–13 శాతం స్థాయిలో పురోగమించనున్నట్లు నివేదికలో ఇక్రా అభిప్రాయపడింది. ఈ ఏడాది 55–60 శాతం వృద్ధి తదుపరి వచ్చే ఏడాదిలో ప్రయాణికుల సంఖ్య 14.5–15 కోట్లకు చేరగలదని అంచనా వేసింది. కరోనా మహమ్మారికి ముందుస్థాయికంటే ఇది అధికంకావడం గమనార్హం! దేశీ విమానయాన కంపెనీల ద్వారా విదేశీ ప్రయాణికుల సంఖ్య సైతం వృద్ధి బాటలో సాగుతున్నట్లు ఇక్రా పేర్కొంది. 2022 మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు తిరిగి మొదలుకావడంతో ఈ ఏడాది తొలి 9 నెలల్లో (ఏప్రిల్–డిసెంబర్) కోవిడ్–19 ముందుస్థాయికంటే కేవలం 2.4 శాతం తక్కువగా ఇంటర్నేషనల్ ట్రాఫిక్ నమోదైనట్లు వెల్లడించింది. వార్షికంగా చూస్తే దేశీ కంపెనీల అంతర్జాతీయ ట్రాఫిక్ 10–15 శాతం ఎగసినట్లు తెలియజేసింది. గతేడాది 125–130 వృద్ధి తదుపరి ఇది అధికమేనని స్పష్టం చేసింది. -
డేటా సెంటర్లపై రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు
ముంబై: డేటా సెంటర్ల పరిశ్రమలోకి వచ్చే ఆరేళ్ల కాలంలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దీంతో మరో 5,000 మెగావాట్ల సామర్థ్యం డేటా సెంటర్ల పరిశ్రమలో ఏర్పాటవుతుందని తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామర్థ్యంతో పోలిస్తే ఆరు రెట్లు పెరగనుందని, మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. డేటా సెంటర్లలో విప్లవాత్మక మార్పునకు స్థానికంగానే డేటా నిల్వ నిబంధనను కారణంగా పేర్కొంది. గడిచిన కొన్నేళ్లలో అదానీ గ్రూప్, భారతీ ఎయిర్టెల్ సహా ఎన్నో కంపెనీలు డేటా సెంటర్ల వ్యాపారంపై ప్రకటనలను ఈ నివేదిక ప్రస్తావించింది. దేశంలో డిజిటల్ విప్లవానికి ఇంటర్నెట్, మొబైల్ వినియోగం విస్తరణ, ప్రభుత్వ ఈ గవర్నెన్స్, డిజిటల్ ఇండియా, నూతన టెక్నాలజీల అమలు, సోషల్ మీడియా, ఈకామర్స్, ఓటీటీల విస్తరణ తదితర అంశాలు దోహదపడినట్టు ఇక్రా తెలిపంది. దీనికితోడు డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై విద్యుత్ అందించడం, స్టాంప్ డ్యూటీలో రాయితీలు తదితర నియంత్రణపరమైన అనుకూల విధానాలు పెట్టుబడులు రావడానికి దోహదం చేస్తున్నట్టు వివరించింది. ప్రస్తుతం దేశంలో డేటా సెంటర్ల స్థాపిత సామర్థ్యంలో 70–75 శాతం ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్‌లోనే ఉన్నట్టు తెలిపింది. డేటా సెంటర్ల పరిశ్రమ ఆదా యం 2024–25 వరకు వార్షికంగా 17–19 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. -
1.25 కోట్ల మంది విమాన ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2023 జనవరిలో 1.25 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. గతేడాది జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 96 శాతం అధికమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘కోవిడ్ ముందస్తు 2020 జనవరితో పోలిస్తే దేశీయ ప్రయాణికుల సంఖ్య గత నెలలో 2 శాతం తగ్గింది. దేశీయ ప్రయాణికుల రద్దీలో రికవరీ మెరుగ్గా ఉన్నప్పటికీ.. భారతీయ విమానయాన సంస్థల ఆర్థిక పనితీరు సమీప కాలంలో ఒత్తిడిలో ఉండే అవకాశం ఉంది. 2022–23లో ప్రయాణికుల రద్దీలో అర్థవంతమైన మెరుగుదల ఆశించినప్పటికీ పరిశ్రమ ఆదాయాల్లో రికవరీ వేగం క్రమంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.23,500 కోట్ల నికర నష్టంతో పోలిస్తే 2022–23లో నికర నష్టం తక్కువగా ఉంటుందని అంచనా. ప్రధానంగా ప్రయాణికుల రద్దీ, ఛార్జీల పెంపుదల, తక్కువ వడ్డీ భారం ఇందుకు కారణం. 2022 జనవరితో పోలిస్తే గత నెలలో సామర్థ్య విస్తరణ 42 శాతం ఎక్కువ. కోవిడ్ ముందస్తుతో పోలిస్తే 6 శాతం తక్కువ’ అని ఇక్రా తెలిపింది. త్వరగా రికవరీ.. ‘కార్యకలాపాలలో సాధారణ స్థితి, మహమ్మారి ప్రభావం తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణికుల రద్దీలో త్వరిత పునరుద్ధరణ ఉంటుందని అంచనా. పెరిగిన పోటీ వాతావరణం మధ్య యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి క్షీణతకుతోడు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు పెరగడం వల్ల దేశీయ విమానయాన సంస్థలకు ఆదాయాల రికవరీ క్రమంగా ఉంటుంది. ప్రస్తుత ఏటీఎఫ్ ధరలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 32 శాతం అధికం. పెరిగిన ఏటీఎఫ్ ధరలు సమీప, మధ్య కాలానికి విమానయాన సంస్థల ఆదాయాలు, నగదు నిల్వలకు పెద్ద ముప్పుగా కొనసాగుతాయి. అలాగే లీజు అద్దెలు, నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులను ప్రతికూలంగా ప్రభావితం చేసే యూఎస్ డాలర్‌తో భారత రూపాయి విలువ క్షీణించడం విమానయాన సంస్థల వ్యయ నిర్మాణంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. అధికం అయిన వ్యయాలకు అనుగుణంగా ఛార్జీల పెంపుదల ఉండేలా ఎయిర్‌లైన్స్ చేసే ప్రయత్నాలు వారి లాభదాయకతలో కీలకం కానున్నాయి’ అని ఇక్రా వివరించింది. -
సంఘటిత ఆభరణాల పరిశ్రమకు స్వర్ణయుగం
ముంబై: సంఘటిత రంగంలోని జ్యుయలరీ వర్తకుల వ్యాపారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో 20 శాతం వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. నియంత్రణలు కఠినంగా మారుతుండడం, బ్రాండెడ్ జ్యుయలరీకి కస్టమర్ల ప్రాధాన్యం పెరగడం, కంపెనీల విస్తరణ ఈ వృద్ధికి దోహదపడే అంశాలుగా పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. మధ్య కాలానికి జ్యుయలరీ పరిశ్రమలో సంఘటిత రంగం వాటా మెరుగైన వృద్ధిని చూపిస్తుందని పేర్కొంది. అసంఘటిత రంగం నుంచి క్రమంగా మార్కెట్ సంఘటితం వైపు మళ్లుతోందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం జ్యుయలరీ పరిశ్రమ ఆదాయం 15 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని, ఇదే కాలంలో ఈ రంగంలోని సంఘటిత విభాగం 20 శాతం వృద్ధిని చూస్తుందని వివరించింది. బంగారం ఆభరణాల రిటైల్ విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 15 శాతం పెరుగుతాయని అంచనా వే సింది. మొదటి ఆరు నెలల్లో అక్షయ తృతీయ, పండుగలతో 35 శాతం వృద్ధిని చూడడం ఇందుకు దోహదం చేస్తుందని ఇక్రా పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో అధిక వృద్ధి కారణంగా, చివరి త్రైమాసికంలో (2023 జనవరి–మార్చి) డిమాండ్ స్తబ్ధుగా ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఆరోగ్యకరంగానే ఉందంటూ.. అధిక ద్రవ్యోల్బణం, గ్రామీణ ఆర్థిక రికవరీ నిదానంగా ఉండడం, వినియోగదారుల సెంటిమెంట్ బలంగా లేకపోవడం అవరోధాలుగా పేర్కొంది. 2023–24లో 5 శాతానికి పరిమితం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023–24) జ్యుయలరీ రంగంలో వృద్ధి కేవలం 5 శాతానికి పరిమితం అవుతుందని ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధిక విక్రయాల బేస్ నమోదు కావడం, స్థూల ఆర్థిక అంశాలను కారణంగా చూపించింది. అయినప్పటికీ వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులతో సంఘటిత జ్యులయరీ విభాగం 10 శాతం ఆదాయం వృద్ధిని చూపిస్తుందని ఇక్రా అంచనా వేస్తోంది. జ్యుయలరీ స్టోర్ల విస్తరణను రుణాలతో చేపడుతున్నప్పటికీ, పెద్ద సంస్థల రుణ భారం సౌకర్యవంతంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘చాలా వరకు సంస్థాగత జ్యుయలరీ కంపెనీలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మార్కెట్ వాటాను సొంతం చేసుకునే విధంగా 2022–23 మొదటి ఆరు నెలల్లో అడుగులు వేశాయి. వచ్చే 12–18 నెలల్లో స్టోర్ల సంఖ్య 10 శాతం పెరగనుంది’’ అని ఇక్రా తన నివేదికలో వివరించింది. -
7.2 శాతం వృద్ధికే ఇక్రా ఓటు
ముంబై: ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) జీడీపీ వృద్ధి అంచనాను 7.2 శాతంగానే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు మూలధన వ్యయాలు, కాంటాక్ట్ సేవలు పుంజుకోవడం సానుకూలతలుగా పేర్కొంది. నిలిచిన డిమాండ్ కూడా తోడు కావడంతో వృద్ధి కరోనా ముందు నాటికి స్థాయికి పుంజుకుంటుందని అంచనా వేసింది. ఏప్రిల్–జూన్ (క్యూ1) త్రైమాసికంలో దేశ జీడీపీ 13.5 శాతం వృద్ధిని చూడగా, సెప్టెంబర్ త్రైమాసికంలో దీనికంటే తగ్గుతుందని, తదుపరి రెండు త్రైమాసికాల్లోనూ ఇంకాస్త తక్కువ వృద్ధిని చూస్తుందని తెలిపింది. ఎక్కువ రేటింగ్ ఏజెన్సీలు జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతం, అంతకంటే దిగువకు ప్రకటించడం గమనార్హం. ఈ రకంగా చూస్తే ఇక్రా వృద్ధి అంచనాలు కొంచెం మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఆగస్ట్ నెలలో రోజువారీ రికార్డు స్థాయి జీఎస్టీ ఈవే బిల్లుల జారీ, పండుగలకు ముందస్తు భారీగా ఉత్పత్తుల నిల్వలను పెంచుకోవడం, కమోడిటీ ధరలు క్షీణించడం రానున్న పండుగల సీజన్‌కు ఎంతో సానుకూలమని.. అయితే, ఖరీఫ్‌లో కీలకమైన వరి దిగుబడి తగ్గనుండడం, వెలుపలి డిమాండ్ బలహీనపడడం వృద్ధికి ఉన్న సవాళ్లు అని, వీటిని పరిశీలించాల్సి ఉంటుందని ఇక్రా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. త్రైమాసికం వారీగా.. ‘‘సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.5–7 శాతానికి పరిమితం కావచ్చు. డిసెంబర్ త్రైమాసికం (క్యూ3), 2023 జనవరి–మార్చి త్రైమాసికంలో (క్యూ4)లో 5–5.5 శాతంగా ఉండొచ్చు. బేస్ ప్రభావం వల్లే ఇలా ఉంటుంది’’అని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. 2022 చివరికి ప్రైవేటు రంగంలో పూర్తి స్థాయిలో మూలధన వ్యయాలు పుంజుకుంటాయని, కంపెనీల తయారీ సామర్థ్య వినియోగం పెరుగుతుందని ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీవీఏ 7 శాతంగా, రిటైల్ ద్రవ్యోల్బణం 6.5 శాతంగా, టోకు ద్రవ్యోల్బణం 10.1 శాతంగా, కరెంటు ఖాతా లోటు జీడీపీలో 3.5 శాతం (మూడు రెట్లు పెరిగి 120 బిలియన్ డాలర్లు) ఉంటుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్ బలంగా ఉండడంతో, దిగుమతులు పెరిగి కరెంటు ఖాతా లోటు విస్తరిస్తుందని అభిప్రాయపడింది. రూపాయి మరీ దారుణ పరిస్థితుల్లో డిసెంబర్ నాటికి డాలర్‌తో 83కు పడిపోవచ్చని, పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్ 7.3–7.8 శాతం స్థాయిలో ఉంటాయని అంచనా వేసింది. స్థూల ద్రవ్యలోటు 15.87 లక్షల కోట్లు (జీడీపీలో 6.7 శాతం) ఉంటుందని పేర్కొంది. -
నష్టాల బాటలోనే ఎయిర్‌లైన్స్
ముంబై: కరోనా సంక్షోభం నుంచి బయటపడినా ఎయిర్‌లైన్స్ పరిశ్రమకు ఈ ఏడాది నష్టాలు తప్పేలా లేవు. కరోనా వైరస్ నియంత్రణ ఆంక్షల నడుమ పరిమిత సర్వీసులతో, విమానయాన సంస్థలు గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద ఎత్తున నష్టపోయాయి. దీనికితోడు విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు కూడా గరిష్ట స్థాయలో చలిస్తున్నాయి. ఇంధన ధరలు గరిష్ట స్థాయిలోనే ఉన్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎయిర్‌లైన్స్ సంస్థలు రూ.15,000–17,000 కోట్ల నష్టాలను నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ మేరకు మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌లైన్స్ రంగం నష్టాలు రూ.23,000 కోట్లుగా ఉంటాయని పేర్కొంది. పరిశ్రమ మొత్తం రుణ భారం 2023 మార్చి నాటికి రూ.లక్ష కోట స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువలో అస్థిరతలు, ఏటీఎఫ్ ధరల్లో హెచ్చు తగ్గుల ప్రభావం ఎయిర్‌లైన్స్ వ్యయాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ కోసం ఖర్చు చేసేది 45 శాతంగా ఉంటుందని తెలిసిందే. ఇది కాకుండా ఎయిర్‌లైన్స్ మొత్తం ఖర్చుల్లో 35–50 శాతం మేర డాలర్ మారకంలోనే ఉంటాయని ఇక్రా గుర్తు చేసింది. ప్రయాణికుల్లో వృద్ధి.. లిస్టెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థలు అయిన ఇండిగో ప్రస్తుత ఆర్థిక సంవ్సరం మొదటి మూడు నెలల కాలానికి (జూన్ క్వార్టర్) రూ.1,064 కోట్లు, స్పైస్‌జెట్ రూ.789 కోట్ల చొప్పున నష్టాలను ప్రకటించాయి. రూపాయి బలహీనత, ఏటీఎఫ్ ధరలు అధికంగా ఉండడమే ఇందుకు కారణం. దేశీ విమాన ప్రయాణికుల రద్దీలో గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదైనట్టు ఇక్రా తెలిపింది. ప్రయాణికుల సంఖ్య 57.7 శాతం పెరిగి 8.42 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ప్రయాణికుల్లో మెరుగైన వృద్ధి ఉన్నప్పటికీ 2022–23లో రూ.17,000 కోట్ల వరకు నష్టాలు తప్పుకపోవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ అన్నారు. జూన్ త్రైమాసికంలో ప్రయాణికుల సంఖ్య, వార్షికంగా అంతకుముందు ఇదే ఏడాదితో పోలిస్తే రెండు రెట్లు పెరిగి 3.25 కోట్లుగా ఉన్నట్టు ఇక్రా తెలిపింది. కాకపోతే కరోనా ముందు 2019 ఏప్రిల్–జూన్‌లోని ప్రయాణికుల గణాంకాలతో పోలిస్తే 7 శాతం తక్కువని వివరించింది. కరోనా వైరస్ సమసిపోవడంతో దేశీయంగా ప్రయాణికుల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 52–54 శాతం మేర ఉండొచ్చని అంచనా వేసింది. లీజర్, వ్యాపార పర్యటనలకు డిమాండ్ ఉండడం ఇందుకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ఆగస్ట్ 31 నుంచి విమాన టారిఫ్‌లపై నియంత్రణలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో ధరలు 25–30 శాతం పెరిగినట్టు ఇక్రా తెలిపింది. దీంతో తీవ్ర పోటీ తగ్గొచ్చని అంచనా వేసింది. -
బ్యాటరీ సెల్ తయారీపై భారీ పెట్టుబడులు
ముంబై: బ్యాటరీ సెల్ తయారీలో పెట్టుబడులు 2030 నాటికి 9 బిలియన్ డాలర్లను (రూ.72వేల కోట్లు) అధిగమిస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ డిమాండ్ 2030 నాటికి 60 గిగావాట్‌హవర్‌కు (జీడబ్ల్యూహెచ్) చేరుకుంటుందని తెలిపింది. ఈవీ ఎకోసిస్టమ్ అభివృద్ధిలో బ్యాటరీ తయారీ అన్నది అత్యంత కీలకమైనదిగా పేర్కొంది. బ్యాటరీల తయారీ పెద్ద ఎత్తున విస్తరించాల్సి ఉందని, ఈవీల ధరలు తగ్గేందుకు, ధరల వ్యత్యాసం తొలగిపోయేందుకు ఇది ముఖ్యమైనదిగా గుర్తు చేసింది. ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గుతాయన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించింది. చార్జింగ్ సదుపాయాలు అన్నవి క్రమంగా విస్తరిస్తాయని, ఇంధన సామర్థ్యంలో పురోగతి తప్పనిసరి అని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఒకే చోటకు చేరడం.. ఎలక్ట్రిక్ వాహనాల ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ (ఓఈఎంలు) కంపెనీలకు సమీపంలోనే సెల్ తయారీ కంపెనీలు కూడా ఉండాలని.. అప్పుడు పరిశోధన, ఆవిష్కరణల ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని ఇక్రా నివేదిక తెలియజేసింది. అప్పుడు మెరుగైన ఇంధన సామర్థ్యం, భారత వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన బ్యాటరీల తయారీ సాధ్యపడుతుందని సూచించింది. ‘‘ఎలక్ట్రిక్ వాహనంలో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ బ్యాటరీలు ఎంతో ముఖ్యమైనవే కాదు, చాలా ఖరీదైనవి. వాహనం ధరలో సుమారు 40 శాతం బ్యాటరీకే అవుతోంది. ప్రస్తుతం బ్యాటరీ సెల్స్ భారత్‌లో తయారు కావడం లేదు. ఓఈఎంలు చాలా వరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ కార్యకలాపాలు దేశీయంగా పరిమితంగానే ఉన్నాయి. ఈవీల విస్తరణ, పోటీ ధరలకే వాటిని తయారు చేయాలంటే బ్యాటరీ సెల్స్ అభివృద్ధికి స్థానికంగా ఎకోసిస్టమ్ ఏర్పాటు కావాల్సిందే’’అని ఇక్రా గ్రూపు హెడ్ శంషేర్ దివాన్ అన్నారు. -
ఆటో విడిభాగాల సంస్థలకు డిమాండ్ ఊతం
ముంబై: డిమాండ్ స్థిరంగా ఉండటం, సరఫరా వ్యవస్థపరమైన అడ్డంకులు తొలగిపోతుండటం తదితర అంశాలు ఆటో విడిభాగాల సంస్థలకు ఊరటనివ్వనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి ఆదాయాలు 8–10 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక ప్రకటనలో ఈ అంచనాలు వెల్లడించింది. దీని ప్రకారం 31 ఆటో విడిభాగాల కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద రూ. 1,75,000 కోట్ల పైగా ఆదాయాలు ఆర్జించాయి. వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. దేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థలు (ఓఈఎం), రిప్లేస్మెంట్, ఎగుమతులు, కమోడిటీల ధరల పెరుగుదలను బదలాయించగలగడం తదితర అంశాలు ఇందుకు తోడ్పడ్డాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లో బేస్‌తో పోలిస్తే వృద్ధి అధిక స్థాయిలో నమోదైందని, అయినప్పటికీ పరిశ్రమ ఆదాయాలు తమ అంచనాలు మించాయని ఇక్రా పేర్కొంది. ఊహించిన దాని కన్నా ఎగుమతులు మెరుగ్గా ఉండటం, కమోడిటీల ధరలు.. రవాణా వ్యయాల పెరుగుదల భారాన్ని వినియోగదారులకు బదలాయించడం కంపెనీలకు కలిసొచ్చిందని వివరించింది. తగ్గిన మార్జిన్లు.. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు పెరిగినప్పటికీ ముడి వస్తువుల ఖర్చులు, రవాణా వ్యయాల భారాన్ని ద్వితీయార్థంలో (అక్టోబర్–మార్చ్) కంపెనీలు పూర్తి స్థాయిలో, సకాలంలో బదలాయించలేకపోయాయని ఇక్రా తెలిపింది. దీనితో లాభాల మార్జిన్లపై ప్రభావం పడినట్లు పేర్కొంది. 31 ఆటో విడిభాగాల కంపెనీల నిర్వహణ మార్జిన్లు గత ఆర్థిక సంవత్సరంలో అయిదేళ్ల కనిష్ట స్థాయికి తగ్గాయని ఇక్రా తెలిపింది. సెమీకండక్టర్ కొరత సమస్యలు, ద్విచక్ర వాహనాలు .. ట్రాక్టర్లకు డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం, అంతర్జాతీయ వ్యాపారాలపై భౌగోళికరాజకీయ పరిణామాల వంటి అంశాలు ఆదాయాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపినట్లు పేర్కొంది. ‘30 కంపెనీల (ఒక పెద్ద ఆటో విడిభాగాల సరఫరా సంస్థ కాకుండా) నిర్వహణ మార్జిన్లు 10.6 శాతంగా నమోదయ్యాయి. వార్షికంగా చూస్తే ఇది 10 బేసిస్ పాయింట్లు, మా అంచనాలతో పోలిస్తే 40 బేసిస్ పాయింట్లు తక్కువ‘ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుతా ఎస్ తెలిపారు. సరఫరా వ్యవస్థపరమైన అనిశ్చితులు, ధరల పెరుగుదల భయాల కారణంగా ఆటో యాన్సిలరీలు గత ఆర్థిక సంవత్సరంలో తమ నిల్వలను భారీగా పెంచుకున్నాయని పేర్కొన్నారు. అంతక్రితం నాలుగేళ్లలో ఇదే అత్యధికమని వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి సంస్థల దగ్గర లిక్విడిటీ (నగదు లభ్యత) మెరుగ్గా ఉండటం సానుకూలాంశమని వినుత తెలిపారు. పీఎల్ఐ స్కీముతో దన్ను.. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముతో మధ్యకాలికంగా ఆటో యాన్సిలరీల విభాగంలో పెట్టుబడులకు ఊతం లభించగలదని ఇక్రా తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో కొత్తగా మరిన్ని పెట్టుబడులు రాగలవని వివరించింది. ఇక పరిశ్రమకు రుణ అవసరాలు కూడా ఎక్కువగా ఉండకపోవచ్చని పేర్కొంది. ఆటో యాన్సిలరీల రుణాల భారం పరిస్థితి మెరుగ్గా ఉందనేందుకు సూచనగా చాలా మటుకు సంస్థలకు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం .. ఆటో యాన్సిలరీలకు సానుకూలంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. -
3–4 ఏళ్లలో భారీగా ఈవీ చార్జింగ్ స్టేషన్లు
ముంబై: దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహన విక్రయాలకు (ఈవీలు) మద్దతుగా చార్జింగ్ స్టేషన్లు కూడా భారీగా ఏర్పాటు కానున్నాయి. వచ్చే మూడు నాలుగేళ్లలో అదనంగా 48,000 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలోకి రూ.14,000 కోట్ల పెట్టుబడులు వస్తాయంటూ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర, బస్ విక్రయాలు పుంజుకుంటాయని, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కీలకమవుతుందని పేర్కొంది. ‘‘ఈవీ ద్విచక్ర వాహనాల విక్రయాలు 2024–25 సంవత్సరం నాటికి మొత్తం విక్రయాల్లో 13–15 శాతంగా ఉండొచ్చు. అదే సమయంలో త్రిచక్ర వాహనాలు 30 శాతానికి పైగా, ఈ బస్సుల విక్రయాలు 8–10 శాతానికి చేరుకోవచ్చు’’ అని అంచనా వేసింది. ప్రస్తుతానికి మనదేశంలో బహిరంగ ఈవీ చార్జింగ్ కేంద్రాలు 2,000 వరకు ఉండగా.. ఇవి కూడా కేవలం కొన్ని రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలకే పరిమితం కావడం గమనార్హం. విధానపరమైన ప్రోత్సాహం.. ‘‘ఈవీ చార్జింగ్ సదుపాయాల విషయంలో భారత్ వెనుకనే ఉంది. కాకపోతే విధానపరమైన ప్రోత్సాహం బలంగా ఉంది. ఈ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు చార్జింగ్ ఇన్‌ఫ్రాలోకి అడుగుపెడుతున్నట్టు ప్రణాళికలు ప్రకటించాయి’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ శంషేర్ దేవాన్ తెలిపారు. ఈవీ చార్జింగ్ సదుపాయాల ఏర్పాటుకు ప్రత్యామ్నాయం బ్యాటరీ స్వాపింగ్ (ఖాళీ బ్యాటరీ ఇచ్చి చార్జింగ్ నింపి ఉన్నది తీసుకెళ్లడం) అని, కాకపోతే ఇది ఆరంభంలోనే ఉన్నట్టు దివాన్ చెప్పారు. ఫేమ్ పథకం కింద ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు రూ.1,300 కోట్లను కేటాయించడాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. -
లాజిస్టిక్స్‌కు సానుకూలం..
ముంబై: లాజిస్టిక్స్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం మేర వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. అయితే చమురు, కమోడిటీల ధరలు పెరుగుతున్న దృష్ట్యా ఈ రంగంలోని కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి ఉంటుందని పేర్కొంది. లాజిస్టిక్స్ రంగంపై ఒక నివేదికను ఇక్రా గురువారం విడుదల చేసింది. 2021–22లో ఈ రంగంలో వృద్ధి కరోనా ముందు నాటితో పోలిస్తే 14–17 శాతం అధికంగా ఉంటుందని తెలిపింది. మధ్య కాలానికి ఆదాయంలో వృద్ధి అన్నది ఈ కామర్స్, ఎఫ్ఎంసీజీ, రిటైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ నుంచి వస్తుందని పేర్కొంది. జీఎస్టీ, ఈవేబిల్లు అమలు తర్వాత లాజిస్టిక్స్ సేవల్లో సంస్థాగత వాటా పెరుగుతున్నట్టు వివరించింది. బహుళ సేవలను ఆఫర్ చేస్తుండడం కూడా ఆదరణ పెరగడానికి కారణంగా పేర్కొంది. పైగా ఈ రంగంలోని చిన్న సంస్థలతో పోలిస్తే పెద్ద సంస్థలకు ఉన్న ఆర్థిక సౌలభ్యం దృష్ట్యా, వాటికి ఆదరణ పెరుగుతోందని.. ఈ రంగంలో రానున్న రోజుల్లో మరింత వ్యాపారం సంస్థాగతం వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. క్రమంగా పెరుగుతున్న డిమాండ్ కొన్ని నెలలుగా రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నట్టు ఇక్రా తెలిపింది. పలు రంగాల్లో డిమాండ్ పుంజుకోవడం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. కరోనా మూడో విడత వేగంగా సమసిపోవడంతో ఆంక్షలను ఎత్తేయడం కలిసి వచ్చినట్టు వివరించింది. కమోడిటీల ధరలు పెరిగిపోవడం, రవాణా చార్జీలన్నవి స్వల్పకాలంలో సమస్యలుగా ప్రస్తావించింది. వినియోగ డిమాండ్‌పై మార్జిన్లు ఆధారపడి ఉంటాయని అంచనా వేసింది. ‘‘త్రైమాసికం వారీగా లాజిస్టిక్స్ రంగం ఆదాయం 2021–22 రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి వెళ్లింది. పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం కలిసొచ్చింది’’అని ఇక్రా తన నివేదికలో తెలిపింది. 2022 జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈవే బిల్లుల పరిమాణం, ఫాస్టాగ్ వసూళ్లలో స్థిరత్వం ఉన్నట్టు ఇక్రా నివేదిక వివరించింది.