ముంబై: రిటైల్ మాల్ ఆపరేటర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకు అధికంగా అద్దె ఆదాయం పొందొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రెంటల్ ఆదాయం, మాల్స్‌కు విచ్చేసే కస్టమర్ల సంఖ్యలో బలమైన వృద్ధిని ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ మాల్స్ అద్దె ఆదాయం కరోనా ముందు నాటితో పోలిస్తే 27 శాతం పెరగడం గమనార్హం. కస్టమర్ల రాక, విక్రయాల్లో మెరుగైన వృద్ధి కనిపిస్తోందని, ఫలితంగా నికర నిర్వహణ ఆదాయం పెరుగుతుందని ఇక్రా నివేదిక తెలిపింది.
‘‘అద్దె ఆదాయం 2022–23లో 78 శాతం అధికంగా వచ్చింది. కరోనా ముందు నాటితో పోల్చి చూసినా 25–27 శాతం అధికంగా వచ్చింది. రిటైల్ వాణిజ్యం అధికంగా జరగడం, కస్టమర్ల రాక పెరగడం తోడ్పడింది’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అనుపమారెడ్డి తెలిపారు. మాల్స్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య కరోనా మహమ్మారి పూర్వం ఉన్న స్థాయిలో 95 శాతానికి చేరుకుందని ఇక్రా నివేదిక తెలిపింది ట్రేడింగ్ విలువ 125–127 శాతానికి పుంజుకుంది. ఖర్చు చేసే ఆదాయం పెరగడం, ప్రీమియం ఉత్పత్తులకు కస్టమర్లు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి కారణమని అనుపమా రెడ్డి తెలిపారు. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొనసాగుతుందని, ఫలితంగా మెరుగైన ఆదాయం ఆపరేటర్లకు వస్తుందన్నారు.
అద్దెల పెంపు 3–4 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అద్దెల పెంపు 3–4 శాతంగా ఉండొచ్చని ఇక్రా తెలిపింది. రిటైల్ మాల్స్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య అధికంగా ఉండడడంతో అధిక రేట్లపై రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రస్తావించింది. జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, ఆహారం, పానీయాలు, వినోదం కోసం కస్టమర్లు ఖర్చు చేసే ధోరణి పెరుగుతుందని.. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యం 4–5 శాతం అధికంగా నమోదు కావచ్చని ఇక్రా పేర్కొంది. దీంతో మాల్స్ ఆపరేటర్లకు 8–10 శాతం మేర అధికంగా అద్దెల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. ఈ రంగానికి ఇక్రా స్థిరమైన అవుట్‌లుక్ ఇచ్చింది. ఆరు మెట్రోల్లో 7 మిలియన్ చదరపు అడుగులు గత ఆర్థిక సంవత్సరంలో అధికంగా సరఫరా అయినట్టు పేర్కొంది. దీంతో మాల్స్‌లో ఖాళీల రేటు 2022–23లో 19 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖాళీల రేటు 18–19 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కొత్తగా 9–10 మిలియన్ చదరపు అడుగుల సరఫరా ఉండొచ్చని పేర్కొంది. కొత్తగా వచ్చే మాల్స్‌లో 60 శాతం ఢిల్లీ ఎన్‌సీఆర్, చెన్నై నుంచే ఉంటాయని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment