Malls
-
1 నుంచి మాల్స్‌లో పార్కింగ్ ఫీజు రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో వాహనాల పార్కింగ్ ఫీజును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకొస్తుందని పేర్కొన్నారు.మొదటి అర గంటకు ఎవరి నుంచీ పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని, అనంతరం గంట వరకు వాహనం ఉంచితే సదరు మాల్లో వస్తువుల కొనుగోలు బిల్లు చూపిన వారి నుంచి ఫీజు వసూలు చేయరాదని, గంటకు పైగా ఉన్న వాహనదారులకు సినిమా టికెట్ లేదా పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ బిల్లు చూపినా ఉచిత పార్కింగ్ అవకాశం వినియోగించుకోవచ్చునన్నారు. -
NielsenIQ: ‘మాల్స్’ విక్రయాల్లో భారత్ టాప్
న్యూఢిల్లీ: ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారా విక్రయాల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్నట్టు నీల్సన్ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక అంగళ్లలో ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ డ్యూరబుల్స్ విక్రయాల పరంగా రెండంకెల వృద్ధి చూపిస్తున్న ఏకైక దేశం భారత్ అని.. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ, పండుగల విక్రయాలు ఇందుకు సాయపడుతున్నట్టు పేర్కొంది. 40 శాతం ఎఫ్ఎంసీజీ అమ్మకాలు, 30 శాతం టెక్నాలజీ డ్యూరబుల్స్ విక్రయాలు ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారానే నమోదవుతున్నట్టు వెల్లడించింది. ఇది భారత వినియోగదారుల ప్రాధాన్యతలను తెలియజేస్తున్నట్టు నీల్సన్ ఐక్యూ నివేదిక పేర్కొంది. ఆన్లైన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నా కానీ, భారత వినియోగదారులకు ఆధునిక అంగళ్లు (సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు, డిపార్ట్మెంట్ స్టోర్లు) ప్రాధాన్య మార్గాలుగా ఉన్నట్టు తెలిపింది. ‘‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆధునిక వాణిజ్యం బలంగానే నమోదైంది. ధరల అస్థిరతలు ఉన్నప్పటికీ రండంకెల వృద్ధి నమోదైంది. ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది’’అని ఈ నివేదిక వివరించింది. ఎఫ్ఎంసీజీ, టెక్ డ్యూరబుల్స్ విక్రయాలకు పండగల సీజన్ కీలకమని పేర్కొంది. ఈ కాలంలోనే ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో 20 శాతం, టెక్నాలజీ డ్యూరబుల్స్ అమ్మక్లాలో 60 శాతం నమోదవుతున్నట్టు తెలిపింది. ఆహారోత్పత్తుల కంటే వీటి అమ్మకాలే ఆయా సీజన్లలో 1.8 రెట్లు అధికంగా ఉంటున్నట్టు పేర్కొంది. చిన్న తయారీ సంస్థల ఉత్పత్తులతోపాటు, రిటైలర్లు సొంతంగా నిర్వహించే ప్రైవేటు లేబుల్స్ రూపంలో పెద్ద కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ప్రైవేటు లేబుళ్ల అమ్మకాలు పెద్ద తయారీ సంస్థల ఉత్పత్తులతో పోలి్చతే ప్రవేటు లేబుళ్ల అమ్మకాలు (రిటైల్ సంస్థల సొంత ఉత్పత్తులు) 1.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక చిన్న తయారీ సంస్థలు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో 70 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి’’అని నీల్సన్ ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక చానళ్లలో సంప్రదాయంగా ఎఫ్ఎంసీజీలకు సంబంధించి పెద్ద ప్యాక్‌లకు ఆదరణ ఉంటుండగా, ఇది క్రమంగా చిన్న ప్యాక్‌ల వైపు మళ్లుతున్నట్టు వివరించింది. -
మాల్స్‌లో పార్కింగ్ ఫీజుపై స్పందించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్‌లో వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్‌లో వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమంటూ విజయవాడకు చెందిన చందన మోహనరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ చార్జీల వసూలుకు ఆస్కారం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపించారు. మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్‌లో వినియోగదారుల నుంచి విచక్షణారహితంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారన్నారు. ఎలాంటి పార్కింగ్ ఫీజులు వసూలు చేయరాదని హైకోర్టు గతంలో స్పష్టమైన తీర్పుని చ్చిందని తెలిపారు. ఈ తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో 35 జారీ చేసిందన్నారు. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తరఫున హాజరవుతున్న న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. జీవో 35 స్థానంలో జీవో 13 తీసుకురావడం జరిగిందన్నారు. ఆ జీవోను కోర్టు ముందుంచారు. దానిని పరిశీలించిన ధర్మాసనం.. జీవో 13 సినిమా టికెట్లకు సంబంధించిందని, అందులో పార్కింగ్ ఫీజుల ప్రస్తావన లేదని తెలిపింది. -
‘మల్టీ’ఫుల్
–సినీ వీక్షణం.. కొత్త పుంతలు–అత్యాధునిక సాంకేతికత..–సీట్ వద్దకే ఫుడ్.. మొబైల్ ఛార్జింగ్–అతిపెద్ద తెరలు.. అదిరే సౌండ్నగరంలోని మాల్స్‌లో బిగ్ స్క్రీన్స్.. బిగ్ జోష్టికెట్స్ ఉన్నాయా? ఇప్పుడెళ్తే దొరుకుతాయా? తీరా థియేటర్ దగ్గరకు వెళ్లాక టెకెట్లు లేకపోతే..సమయం, ట్రాన్స్పోర్ట్ ఖర్చు అంతా వృథా.. ఇలాంటి సందేహాలు... ఇది ఒకప్పటి పాత జనరేషన్. ప్రస్తుత జనరేషన్ ఉన్నచోట నుంచే అంతా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడంతో మొదలుపెట్టి అన్నీ తామున్న చోటకే రావాలనేది ఆధునికుల బాట. అంతేకాదు థియేటర్ తెర సైజ్ దగ్గర నుంచి ఆడియో సౌండ్ క్వాలిటీ దాకా ప్రతిదీ అద్భుతంగా ఉండాలని వారు ఆశిస్తున్నారు. ఓటీటీల యుగంలో హోమ్ థియేటర్ల నుంచి ఆడియన్స్‌ని సినిమా థియేటర్లకు రప్పించడానికి మల్టీఫ్లెక్స్‌లు వారి ఆకాంక్షల్ని తీర్చడానికి కాదేదీ మార్పునకు అనర్హం అన్నట్టుగా రోజుకో కొత్త ఫెసిలిటీనీ పరిచయం చేస్తున్నాయి. దేశంలోని ప్రధాన మల్టీఫ్లెక్స్ సంస్థలన్నీ ఇప్పటికే పెద్ద సంఖ్యలో సిటీకి రాగా మేము సైతం అంటూ స్థానిక సంస్థలు కూడా పోటీకి తెరలేపాయి. ఈ నేపఽథ్యంలో మహా నగరంలో 2 దశాబ్ధాల మల్టీఫ్లెక్స్ జర్నీపై ప్రత్యేక కథనం..జొమాటోతో భాగస్వామ్యం...👉 త్వరలో జొమాటోతో భాగస్వామ్యం ద్వారా థియేటర్లలో ఉండే ఫుడ్ ఆర్డర్ చేసుకునే సౌలభ్యాన్నీ కొన్ని మల్టీప్లెక్స్‌లు కల్పించనున్నట్లు సమాచారం.👉 మరింత లగ్జరీ సీటింగ్, లేజర్ ప్రొజెక్షన్, 4డిఎక్స్ ఫార్మేట్స్ వంటివి జోడించనున్నారు.👉 4డిఎక్స్, మైక్రో ఎక్స్ఈ...లతో పాటు ఐసీఈ థియేటర్ కాన్సెప్ట్‌ను పరిచయం చేయనున్నట్టు ఓ ప్రముఖ మల్టీప్లెక్స్ గ్రూప్‌కు చెందిన దేవాంగ్ సంపత్ అంటున్నారు.👉 పాకశాస్త్రంలో చేయి తిరిగిన చెఫ్స్తో పీవీఆర్–ఐనాక్స్ చేతులు కలిపాయి.భాగ్యనగరంలో మల్టీప్లెక్స్ ట్రెండ్ నడుస్తోంది... ఎప్పటికప్పుడు నగరవాసులను ఆకర్షించేందుకు కొత్త మార్పులు చేస్తున్నారు. వినోదం, షాపింగ్, గేమింగ్, ఫుడ్‌కోర్ట్స్ వంటి అనేక హంగులను ఒక చోటే కల్పిస్తున్నారు..ఓటీటీల రాకతో వెలవెలబోతున్న వెండితెరలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారు. అనేక పోటీలను తట్టుకుని అత్యాధునిక హంగులతో వీక్షకులకు అపురూప అనుభూతిని కల్పిస్తున్నారు.తొలి మల్టీప్లెక్స్...దేశంలో తొలి మల్టీప్లెక్స్‌ను 1997లో పీవీఆర్ సినిమాస్ ఆధ్వర్యంలో సౌత్ ఢిల్లీలో నెలకొల్పారు. కాగా దేశంలో మూడో అతిపెద్ద ఐమ్యాక్స్ థియేటర్‌ను నగరంలో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ పేరిట 2003లో నెలకొల్పారు. ఎయిర్‌పోర్ట్స్‌లో తొలి మల్టీప్లెక్స్‌ను చైన్నెలో గతేడాది పీవీఆర్ ఏర్పాటు చేయగా, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం.113 నగరాల్లో..దేశపు అతిపెద్ద మల్టీప్లెక్స్ గ్రూప్స్ అయిన పీవీఆర్, ఐనాక్స్ 2022లో చేతులు కలిపి పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్‌గా మారాయి. వీరికి దేశవ్యాప్తంగా 113 నగరాల్లో 1,715 స్క్రీన్స్ ఉన్నాయి. ఇందులో దక్షిణాదిలో 550, కేవలం తెలంగాణలో 106 ఉన్నాయి. నగరంలో 11 చోట్ల 62 స్క్రీన్స్ ఉన్నాయి. దేశపు తొలి అంతర్జాతీయ, ప్రపంచపు అతిపెద్ద మూవీ థియేటర్ సర్క్యూట్‌గా పేరొందిన సినీపోలీస్కి అత్తాపూర్‌లోని మంత్ర మాల్లో ఆరు స్క్రీన్ల మల్టీఫ్లెక్స్, మంజీరా ట్రినిటీ మాల్లో ఐదు, సిసిపిఎల్ మాల్లో ఐదు చొప్పున స్క్రీన్స్ ఉన్నాయి.నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో...ఓటీటీ తరహాలో మల్టీప్లెక్స్కూ నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్రవేశపెడుతున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం రూ.699 చెల్లించి 10 సినిమాలు చూసే స్కీమ్‌ను పీవీఆర్ ప్రవేశపెట్టింది.‘భారీ’ మార్పులు...దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు జతచేస్తూ..నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయి. ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో తొలి స్క్రీన్ 29 మీటర్ల వెడల్పు, 21.93 మీటర్ల ఎత్తు కాగా...స్క్రీన్ 6లో గత డిసెంబర్లో 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో అతిపెద్ద స్క్రీన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఎండిఎ స్క్రీన్ దేశంలోనే పెద్దదిగా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మల్టీప్లెక్స్ మార్పుల్లో ఇదో ‘భారీ’ ఉదాహరణ.సరికొత్త టెక్నాలజీ...స్క్రీన్ల దగ్గర నుంచి ప్రొజెక్టర్ల వరకూ చివరికి సీటింగ్‌లోనూ సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. సీట్ల మధ్య స్పేస్ పెంచి.. రిక్లెయినర్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 4కే–60 ఎల్ స్క్రీన్, 3డీ ప్రొజెక్టర్, డాల్బీ క్యూఎస్సీ ఆడియో, 53 స్పీకర్ల డాల్బీ సీపీ 950 వంటి ఎన్నో సౌకర్యాలు వీక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. ఇక 7.1 సరౌండ్ సౌండ్ పేరిట కొత్త సాంకేతికతను త్వరలోనే పరిచయం చేయనుంది. ప్రతీ చిన్న శబ్దాన్ని ప్రేక్షకుల వీనులకు విందు చేసేలా ఈ ఆడియో పనిచేస్తుంది. మరికొన్ని రోజుల్లో ఈ అప్‌గ్రేడేషన్ పూర్తవనుంది. గచ్చిబౌలిలోని ఆట్రియమ్ మాల్లో ఏర్పాటు చేసిన పీవీఆర్ స్క్రీన్స్‌లో 4కె ప్రొజెక్టర్స్, డాల్బీ అట్మోస్ సౌండ్ ప్రత్యేకత.బటన్ నొక్కితే చాలు..అపర్ణా మల్టీప్లెక్స్‌లో సరికొత్తగా ఎంట్రీని ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 1208 సీటింగ్ కాగా ఇందులో 135 గోల్డ్ క్లాస్ సీట్స్ ఏర్పాటు చేశారు. వేరే మల్టీప్లెక్స్‌లో లేని విధంగా సీట్‌కే ఛార్జింగ్ పోర్ట్ ఏర్పాటు చేశారు. ఇక బటన్ నొక్కితే సొంత కిచెన్‌లో వండిన ఫుడ్ సర్వ్ చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అడ్వాన్స్డ్లేజర్ ప్రొజెక్టర్ బార్కో సిరీస్ 4ను జత చేశారు. లెగ్ స్పేస్ కూడా మిగిలిన మల్టీప్లెక్స్‌లతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండేలా సెట్ చేశారు.కాఫీ షాప్స్...తొలి అంతర్జాతీయ, ప్రపంచపు అతిపెద్ద మూవీ థియేటర్ సర్క్యూట్‌గా పేరొందిన సినీపోలీస్కి అత్తాపూర్ మంత్ర మాల్లో 6, మంజీరా ట్రినిటీ మాల్లో 5, సీసీపీఎల్ మాల్లో 5 చొప్పున స్క్రీన్స్ ఉన్నాయి. నగరంలో మొత్తం 16 స్క్రీన్స్ కలిగిన సినీపోలిస్ డిజిటల్ ప్రొజెక్షన్స్, డి3డీ టెక్నాలజీ అందిస్తోంది. కాఫీషాప్స్, కాఫీ ట్రీ వంటివి ఈ గ్రూప్స్ ప్రత్యేకత అని డైరెక్టర్ ఆశిష్ శుక్లా తెలిపారు. కాగా మల్టీప్లెక్స్ టిక్కెట్ ధరలు అత్యాధునిక టెక్నాలజీ, విలాసవంతమైన అనుభవాలను అందుబాటులోకి తేవడంలో అడ్డంకిగా మారాయని మిరాజ్ సినిమాస్ ప్రతినిధి అమిత్ శర్మ చెబుతున్నారు.బ్రాండ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా..నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థ అపర్ణ తొలిసారిగా మల్టీప్లెక్స్‌లో అడుగుపెట్టింది. నల్లగండ్లలోని అపర్ణా మాల్లో ఏడు స్క్రీన్స్ అందుబాటులోకి తెచ్చాం. సంస్థ బ్రాండ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని థియేటర్స్‌లో అత్యాధునిక హంగులకు పెద్ద పీట వేశాం. అత్యుత్తమమై స్క్రీన్స్, ఆడియో సిస్టమ్స్.. వీటితో పాటు విశాలమైన సీటింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాం. రిక్లెయినర్ సీట్లలో మొబైల్ ఛార్జింగ్, సీట్ వద్దకే ఫుడ్ ఆర్డర్, డెలివరీ తీసుకొచ్చాం. దీని కోసం చేయి తిరిగిన చెఫ్స్తో ఓ అత్యాధునిక కిచెన్ ఏర్పాటు చేశాం. మరిన్ని మల్టీప్లెక్స్‌లను రాష్ట్రవ్యాప్తంగా సంస్థ ఏర్పాటు చేయనుంది. – మధుకర్, మేనేజర్, అపర్ణా సినిమాస్ మల్టీప్లెక్స్ -
మాల్స్ అద్దె ఆదాయంలో వృద్ధి
ముంబై: రిటైల్ మాల్ ఆపరేటర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకు అధికంగా అద్దె ఆదాయం పొందొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రెంటల్ ఆదాయం, మాల్స్‌కు విచ్చేసే కస్టమర్ల సంఖ్యలో బలమైన వృద్ధిని ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ మాల్స్ అద్దె ఆదాయం కరోనా ముందు నాటితో పోలిస్తే 27 శాతం పెరగడం గమనార్హం. కస్టమర్ల రాక, విక్రయాల్లో మెరుగైన వృద్ధి కనిపిస్తోందని, ఫలితంగా నికర నిర్వహణ ఆదాయం పెరుగుతుందని ఇక్రా నివేదిక తెలిపింది. ‘‘అద్దె ఆదాయం 2022–23లో 78 శాతం అధికంగా వచ్చింది. కరోనా ముందు నాటితో పోల్చి చూసినా 25–27 శాతం అధికంగా వచ్చింది. రిటైల్ వాణిజ్యం అధికంగా జరగడం, కస్టమర్ల రాక పెరగడం తోడ్పడింది’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అనుపమారెడ్డి తెలిపారు. మాల్స్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య కరోనా మహమ్మారి పూర్వం ఉన్న స్థాయిలో 95 శాతానికి చేరుకుందని ఇక్రా నివేదిక తెలిపింది ట్రేడింగ్ విలువ 125–127 శాతానికి పుంజుకుంది. ఖర్చు చేసే ఆదాయం పెరగడం, ప్రీమియం ఉత్పత్తులకు కస్టమర్లు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి కారణమని అనుపమా రెడ్డి తెలిపారు. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొనసాగుతుందని, ఫలితంగా మెరుగైన ఆదాయం ఆపరేటర్లకు వస్తుందన్నారు. అద్దెల పెంపు 3–4 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అద్దెల పెంపు 3–4 శాతంగా ఉండొచ్చని ఇక్రా తెలిపింది. రిటైల్ మాల్స్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య అధికంగా ఉండడడంతో అధిక రేట్లపై రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రస్తావించింది. జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, ఆహారం, పానీయాలు, వినోదం కోసం కస్టమర్లు ఖర్చు చేసే ధోరణి పెరుగుతుందని.. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యం 4–5 శాతం అధికంగా నమోదు కావచ్చని ఇక్రా పేర్కొంది. దీంతో మాల్స్ ఆపరేటర్లకు 8–10 శాతం మేర అధికంగా అద్దెల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. ఈ రంగానికి ఇక్రా స్థిరమైన అవుట్‌లుక్ ఇచ్చింది. ఆరు మెట్రోల్లో 7 మిలియన్ చదరపు అడుగులు గత ఆర్థిక సంవత్సరంలో అధికంగా సరఫరా అయినట్టు పేర్కొంది. దీంతో మాల్స్‌లో ఖాళీల రేటు 2022–23లో 19 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖాళీల రేటు 18–19 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కొత్తగా 9–10 మిలియన్ చదరపు అడుగుల సరఫరా ఉండొచ్చని పేర్కొంది. కొత్తగా వచ్చే మాల్స్‌లో 60 శాతం ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై నుంచే ఉంటాయని వివరించింది. -
తప్పదు భరించాల్సిందే.. పాకిస్తాన్ సంచలన నిర్ణయం
దాయాది దేశంలో పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న తరుణంలో ఇంధన పొదుపు(విద్యుత్, చమురు)పై ఫోకస్ పెంచింది. ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ.. మార్కెట్లు, మాల్స్, కళ్యాణ మండపాల్లో ఇంధన పొదుపుకు చర్యలు తీసుకుంది. వివరాల ప్రకారం.. పాకిస్తాన్ సర్కార్ సబ్సిడీల భారాన్ని మోయలేక చాలా వాటికి ప్రభుత్వం కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంధన పొదుపు ప్రణాళికలను ప్రకటించింది. ఇంధన ఆదాతోపాటు చమురు దిగుమతులను తగ్గించేందుకుగానూ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీలో భాగంగా జాతీయ ఇంధన పరిరక్షణ ప్రణాళికను ఆమోదించింది. ఈ ప్రణాళికలో భాగంగా మార్కెట్లు, వివాహ వేదికలను సాధారణ సమయానికి ముందుగానే మూసివేస్తున్నట్లు తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు, రాత్రి 10 గంటలకు ఫంక్షన్ హాల్స్‌ను మూసివేయాలి. దీంతో 60 బిలియన్ల పాకిస్థానీ రూపాయలు ఆదా అవుతాయి. ఫిబ్రవరి నుంచి సాధారణ బల్బుల తయారీని నిలిపివేస్తాం. జులై నుంచి నాసిరకం ఫ్యాన్ల ఉత్పత్తిని ఆపేస్తాం. దీంతో.. మరో 37 బిలియన్లు ఆదా అవుతాయి. ఏడాదిలోపు కేవలం కొనికల్ గీజర్ల వాడకాన్ని తప్పనిసరి చేస్తాం. ఫలితంగా.. తక్కువ గ్యాస్ వినియోగంతో 92 బిలియన్లు మిగులుతాయి. వీధి దీపాల్లో మార్పులతో మరో 4 బిలియన్లు ఆదా అవుతాయి. నేడు జరిగిన కేబినెట్ భేటీ కూడా పగటి పూట వెలుతురులోనే జరిగింది. భేటీలో లైట్లను ఉపయోగించలేదు అని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో.. 2023 ఏడాది చివరి నాటికి దేశంలో ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకువస్తామని వెల్లడించారు. వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి కూడా ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందన్నారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, చమురు నిల్వలు తగ్గిపోవడం, కరెన్సీ విలువ పతనం, ద్రవ్యోల్బణం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. -
టీకా వేసుకున్న వాళ్లకే అనుమతి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారికే భవిష్యత్‌లో హోటళ్లు, మాల్స్‌లోకి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుందని ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన కోఠిలోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని, ఇరువురూ కోలుకున్నారని, వారి కాంటాక్ట్‌లను కూడా టెస్ట్ చేస్తే నెగటివ్ వచ్చిందన్నారు. డెల్టా రకం ప్రమాదకరమని, ఇంటాబయటా ప్రజలు మాస్కు తప్పకుండా ధరించాలని సూచించారు. థర్డ్‌వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్, సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. పిల్లల కోసం జిల్లా ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశామని, వందకు పైగా బెడ్లు ఉన్న అన్నీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆగస్ట్ నెలాఖరు నాటికి ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు పెట్టుకోవాలని ఆదేశించారు. డెల్టా రకం భారత్ సహా 135 దేశాల్లో తీవ్రత చూపుతోందన్నారు. దేశంలోని 50% కేసులు కేరళ నుంచే వచ్చాయని, డెల్టా వైరస్ శరీరంపై ఎక్కువ కాలం తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యాన్ని శాస్త్రవేత్తలు గుర్తించినట్లు వివరించారు. సేకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదని.. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ వంటి చోట్ల కేసులు అధికంగానే ఉన్నాయని చెప్పారు. కూసుమంచి గ్రామంలో ఒకేసారి భారీగా కేసులు నమోదైన ఘటనలు చూశామని, పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్‌లో ఉండకుండా బయట తిరుగుతున్నారన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, జీహెచ్ఎంసీ, ఖమ్మం వంటి చోట్ల అత్యధికంగా కేసులు చూస్తున్నామని, దాదాపు 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగానే ఉన్నాయన్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు నిరంతరం కొనసాగిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 2.2 కోట్ల మంది టీకాలకు అర్హులని, వీరిలో 1.12 కోట్ల మందికి ఇప్పటి వరకు సింగల్ డోస్ ఇచ్చామని, 33.79 లక్షల మందికి రెండు డోస్‌లు పూర్తి చేశామన్నారు. ఈ నెలలో ఇప్పటివరకు 30.04 లక్షల డోసులు పంపిణీ చేశామని, కేటాయించిన దానికన్నా 9.5 లక్షల డోసులు అదనంగా రాష్ట్రానికి వచ్చాయన్నారు. కోవిషీల్డ్ 22.32 లక్షల మందికి రెండో డోస్ ఇవ్వాల్సి ఉంటే అందులో 12 లక్షల మందికి అందించినట్లు చెప్పారు. కోవాక్సిన్ 3 లక్షల మందికి పైగా రెండో డోస్ ఇవ్వాల్సి ఉందన్నారు. రానున్న రెండు వారాల్లో రెండో డోసుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. -
సిటీలో పార్కింగ్ దందా.. ఇక బంద్!
సాక్షి, సిటీబ్యూరో: మాల్స్, మల్టీప్లెక్సులు, తదితర వాణిజ్య సంస్థల్లో అడ్డగోలు పార్కింగ్ ఫీజులను కట్టడి చేసేందుకు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు తొలినాళ్లలో అమలైనప్పటికీ.. క్రమేణా తిరిగి పార్కింగ్దందా మొదలైంది. ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో పెద్దయెత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈవీడీఎం(ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం నిబంధనల ఉల్లంఘనులపై చర్యలకు సిద్ధమైంది. అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీల తరహాలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది. అక్రమంగా ఫీజు వసూలు చేసినట్లు తగిన ఆధారంతో ఫొటోను ఆన్లైన్ ద్వారా ఈవీడీఎంలోని ‘సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌సెల్’కు షేర్ చేస్తే పరిశీలించి ఉల్లంఘనులకు పెనాల్టీ విధించనుంది. వీటితోపాటు తగిన పార్కింగ్ సదుపాయం కల్పించని వాణిజ్యసంస్థల పైనా చర్యలు తీసుకోనుంది. ఈ చర్యల అమలుకు ముందుగా మాల్స్, మల్టీప్లెక్సులు, వాణిజ్యసంస్థలకు శుక్రవారం నుంచి నోటీసులు జారీ చేయనుంది. నోటీసు మేరకు.. అన్ని వాణిజ్య సంస్థలు నిర్ణీత నమూనాలో పార్కింగ్ టిక్కెట్లను ముద్రించాలి. టిక్కెట్లపై పార్కింగ్ నిర్వహణ ఏజెన్సీ పేరు, చిరునామా, మొబైల్నెంబర్ ఉండాలి. పార్కింగ్ ఫీజు చెల్లించనవసరం లేని వారికి సైతం పార్కింగ్ టిక్కెట్ ఇవ్వాలి. ఫీజు వసూలు చేస్తే ‘పెయిడ్’ అని, ఉచితమైతే ‘ఎగ్జెంపె్టడ్’ అని స్టాంపు వేయాలి. పార్కింగ్ ఇన్చార్జి సంతకంతో కూడిన పార్కింగ్ టిక్కెట్లను వాహనాలు నిలిపిన అందరికీ ఇవ్వాలి. ఈవీడీఎం విభాగం నుంచి నోటీసు అందిన 15రోజుల్లోగా ఈమేరకు ఏర్పాట్లు చేసుకోవాలి. అనంతరం ఈవీడీఎం విభాగం తనిఖీలు చేపడుతుంది. ఉల్లంఘనలు గుర్తిస్తే, ఉల్లంఘనకు రూ. 50వేల వంతున పెనాల్టీ విధిస్తుంది. ప్రజలనుంచి అందే ఫిర్యాదులను పరిశీలించి పెనాల్టీలు విధిస్తుంది. పార్కింగ్ టికెట్ ఇలా.. నోటీసుతోపాటు పార్కింగ్ టిక్కెట్ ఎలా ఉండాలో నమూనాను కూడా పంపుతారు. నమూనా మేరకు.. టిక్కెట్‌పై వాహనం నెంబరు, పార్కింగ్ చేసిన సమయం, తిరిగి వెళ్లే సమయం రాయాలి. ఎంతసేపు పార్కింగ్చేసింది (30ని లోపు, 30 ని–1గం.లోపు, 1గం.కంటే ఎక్కువ) టిక్ చేయాలి. షాపింగ్ చేసిన బిల్లు మొత్తం ఎంతో వేయాలి. ఏజెన్సీ పేరు, తదితర వివరాలు. టికెట్ వెనుక వైపు.. పార్కింగ్ టిక్కెట్ వెనుకవైపు 20 మార్చి 2018న ప్రభుత్వం జారీ చేసిన జీఓ మేరకు ఫీజు ఉచితం, చెల్లింపు ఎలానో ఆ వివరాలు ముద్రించాలి. అవి.. 30 నిమిషాల వరకు: ఎలాంటి పార్కింగ్ ఫీజు లేదు. 30 నిమిషాల నుంచి గంట వరకు: మాల్, వాణిజ్యప్రదేశంలో ఏమైనా కొనుగోలు చేసినట్లు బిల్లు చూపిస్తే ఫ్రీ. లేని పక్షంలో అక్కడ వసూలు చేసే నిర్ణీత పార్కింగ్ ఫీజు చెల్లించాలి. గంట కంటే ఎక్కువ సేపు వాహనాన్ని పార్కింగ్‌లో ఉంచే వారు కొనుగోలు చేసిన బిల్లును కానీ, మూవీ టిక్కెట్‌ను కానీ చూపించాలి. బిల్లు, మూవీ టిక్కెట్ ధర పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువగా ఉంటే ఎలాంటి ఫీజు వసూలు చేయరు. పార్కింగ్ ఫీజు కంటే తక్కువుండే పక్షంలో నిరీ్ణత పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిందే. చదవండి: బెంగళూరు తరహాలో పార్కింగ్ పాలసీ 2.o బెటరేమో! -
తాళాలు తెరవాలి.. ఉద్యోగాలు కాపాడాలి
తెర మీద బొమ్మ ఆడేప్పుడు మాత్రమే సినిమా హాలు చీకటిగా మారుతుంది. ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా థియేటర్స్‌ను చీకటి ఆవహించింది. మార్చి నెలలో థియేటర్స్‌కు తాళం పడింది. థియేటర్ బిజినెస్‌కు గండి పడింది. అప్పటినుంచి థియేటర్స్‌లో ఒక్క బొమ్మా పడ్లేదు. దీన్ని నమ్ముకున్న చాలామందికి జీతాలు పడ్లేదు. చీకట్లో మగ్గిపోయింది చాలు తాళాలు తెరవనివ్వండి అంటోంది థియేటర్స్ యాజమాన్యం. సినిమా థియేటర్స్ ఓపెన్ చేయండి. దీని చుట్టూ ఉన్న ఉపాధిని కాపాడండి అంటున్నారు. ఎందుకు తెరవాలో చెబుతున్నాయి ‘మల్టీప్లెక్స్ అసోసియేషను'. ఆ వివరాలు. లాక్డౌన్ పూర్తయ్యాక దశలవారీగా అన్‌లాక్ ప్రారంభం అయింది. ఒక్కో అన్‌లాక్‌లో ‘ఈసారి థియేటర్స్ ఓపెన్ అవుతాయి’ అని ఆశపడ్డ ప్రతిసారీ నిరాశే ఎదురయింది థియేటర్స్ నిర్వాహకులకు. సెప్టెంబర్ నెల అన్‌లాక్ 4.0లో థియేటర్ల తాళాలు తెరవడానికి అనుమతి పక్కా అనుకున్నారు. అయితే నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ‘థియేటర్స్‌లో ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తాం. ప్రేక్షకుడికి ఎలాంటి భద్రత కల్పిస్తాం’ అనే విషయాలతో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఓ లేఖ అందించింది ‘మల్టీప్లెక్స్ అసోసియేషన్’. ఆగస్ట్ చివరి వారంలో ‘సపోర్ట్ థియేటర్స్ – సేవ్ సినిమా’ అంటూ సోషల్ మీడియాలో ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. తాజాగా మరోసారి థియేటర్స్‌ను తెరవాలంటూ ప్రభుత్వాన్ని కోరింది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈసారి ‘అన్‌లాక్ సినిమాస్ – సేవ్ జాబ్స్’ అంటూ వినతిపత్రాన్ని అందించారు. థియేటర్స్ బిజినెస్ చూస్తున్న నష్టాలు, పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించింది మల్టీప్లెక్స్ అసోసియేషన్. ఆ వివరాలు ► దేశానికి సినిమాలు సాఫ్ట్ పవర్. ఇప్పటికీ సినిమాయే మన దేశంలో ఎక్కువమందికి ప్రాధమిక వినోదం. మన దేశంలో సుమారు 10,000 సినిమా స్క్రీన్లు ఉన్నాయి. థియేటర్స్ బిజినెస్ సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. పరోక్షంగా ఇంకొన్ని లక్షల మందికి ఉపాధి ఇస్తోంది. లాక్డౌన్ వల్ల సినిమా థియేటర్స్‌నే ముందు మూసేశారు. అన్నింటికంటే ఆలస్యంగా తెరవనున్నారు. ► మాల్స్, ఎయిర్‌లైన్స్, రైల్వేస్, జిమ్స్, బార్స్, మెట్రో వంటివి తెరిచారు.. సినిమా హాళ్లు జనాన్ని కంట్రోల్ చేసే సామర్థ్యం ఉన్నవి. పరిశుభ్రత పాటించగలిగే ఆస్కారం ఉన్నవి. భౌతిక ధూరం పాటించగల వీలున్నవి. అయినా ఎందుకు తెరవడానికి అనుమతించడంలేదు? ► మిగతావాటిలో ఎంతమంది అయినా వెళ్తుంటారు. కానీ సినిమా హాళ్లలో టికెట్ కొనుక్కుని వచ్చే వాళ్లు మాత్రమే ఉంటారు. ► ఎక్కువ జనాభా ఒకేచోట చేరకుండా షో టైమింగ్స్ అన్నీ మార్చుకోగలం. ► అందరికీ దూరం దూరంగా వేచి చూసే స్థలం ఉంటుంది. ► సినిమా థియేటర్స్ది ప్రొఫెషనల్ బిజినెస్. కాబట్టి ప్రభుత్వం ఆదేశించే జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ► చైనా, కొరియా, ఫ్రాన్స్, జపాన్ వంటి 85 దేశాలు థియేటర్స్‌ను అన్ని జాగ్రత్తలతో తిరిగి ఓపెన్ చేశాయి. థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా ఆశాజనకంగా ఉంది. ► లాక్డౌన్ నుంచి నెలకు 1500 కోట్లు నష్టాన్ని చూశాం. ఇప్పటికే దాదాపు 9వేల కోట్ల రూపాయిలు నష్టపోయాం. ఈ నష్టాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం వీలైనంత త్వరగా సినిమా థియేటర్స్ తెరవాలనే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. సినీ ప్రముఖుల సపోర్ట్ థియేటర్స్ తెరవాలన్న విన్నపానికి పలువురు సినిమా ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. బాలీవుడ్ దర్శకులు శేఖర్ కపూర్, అనురాగ్ కశ్యప్, అనుభవ్ సిన్హా, కరణ్ జోహార్, నటులు మనోజ్ బాజ్‌పాయ్ వంటి వారు తమ ట్వీటర్ ద్వారా ‘అన్‌లాక్ సినిమాస్ – సేవ్ జాబ్స్’ అంటూ ట్వీట్ చేశారు. దసరాకి థియేటర్లు తెరవాలి థియేటర్లు తెరవడానికి ఆమోదించాలి. ప్రేక్షకులు వస్తారా? లేదా? అనేది తర్వాతి విషయం. ముందు తెరవడానికి అనుమతించాలి. హోటల్స్‌నే తీసుకుందాం. ఈ కోవిడ్ టైమ్‌లో ఎవరు వస్తారు? అనుకున్నారు. హోటల్స్ తెరుచుకున్నాయి. ముందు తక్కువ సంఖ్యలోనే వచ్చారు. మెల్లి మెల్లిగా జనాలు పెరుగుతున్నారు. థియేటర్లు కూడా అంతే. ముందు తక్కువమంది వచ్చినా తర్వాత పెరుగుతారు. దసరాకి థియేటర్లు తెరిస్తే సంక్రాంతి వచ్చేసరికి ప్రేక్షకులు పెరుగుతారు. ‘స్టెబిలైజ్’ (స్థిరీకరణ) అవుతాయి. ఏ వ్యాపారం కూడా ఒకే రోజులో నిలదొక్కుకోదు. టైమ్ పడుతుంది. థియేటర్లు కూడా అంతే. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓ మూడు నాలుగు నెలల్లో స్టెబిౖలైజ్ అవుతాయి. పైగా మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. మల్టీప్లెక్స్‌లో చాలా స్క్రీన్లు ఉంటాయి. అన్ని షోలకూ ఒకేసారి ఇంటర్వెల్ కాకుండా వేరే టైమింగ్స్ నిర్ణయిస్తాం. అలాగే మొత్తం ఐదు షోలంటే కొంత కాలం ఒక షో తగ్గించి, నాలుగు షోలే ఆడిస్తాం. థియేటర్లోని చెడు గాలిని ‘ఎగ్జాస్టర్ ఫ్యాన్స్’ బయటకు లాగేస్తాయి. అయితే ఇప్పుడు మరో అధునాతమైన మిషన్ రాబోతోంది. వచ్చే వారం టెస్ట్ చేయబోతున్నాం. అది చెడు గాలిని పూర్తిగా బయటకు లాగేస్తుంది. ఇలా ప్రేక్షకుల సేఫ్టీ కోసం మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. థియేటర్లు ఓపెన్ చేయడానికి అనుమతించాలని కోరుతున్నాం. – పంపిణీదారుడు, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ వ్యాపారం ఆగకూడదు థియేటర్లు తెరవాలని కొందరు మల్టీప్లెక్స్ అధినేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిజానికి వాళ్లంత యాక్టివ్‌గా నేను లేను. కానీ థియేటర్లు తెరవడానికి అనుమతించాలి. ఏ వ్యాపారమూ ఆగకూడదు. ఎవరి వ్యాపారం వాళ్లు చేసుకోవాలి. థియేటర్లు మూసి ఉంచడం సమస్యకు పరిష్కారం కాదన్నది నా అభిప్రాయం. పైగా థియేటర్ల అధినేతలుగా ప్రేక్షకుల క్షేమం విషయంలో మాకు చాలా బాధ్యత ఉంటుంది. జాగ్రత్తగా శానిటైజేషన్ చేయించడం, ప్రతి స్క్రీన్‌కి వేరు వేరు టైమ్‌లో ఇంటర్వెల్ ఇవ్వడం.. ఇలా మా జాగ్రత్తలు మేం తీసుకుంటాం. ప్రేక్షకులు రారనే సందేహం అక్కర్లేదు. ముందు తక్కువమందే వచ్చినా తర్వాత తర్వాత పెరుగుతారనే నమ్మకం ఉంది. – నిర్మాత, ప్రసాద్ మల్టీప్లెక్స్ అధినేత రమేష్‌ప్రసాద్ -
మాల్స్ తెరచినప్పుడు కోర్టులు తెరవడం తప్పా?
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్–19 మహమ్మారి ప్రభావం సమాజంలోని ప్రతి రంగంపై పడింది. చివరకు న్యాయ వ్యవస్థ కూడా తప్పించుకోలేక పోయింది. కోవిడ్ మహమ్మారి నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా హైకోర్టుల్లో 50 శాతం కేసులను పెండింగ్‌లో వేయాల్సిరాగా, జిల్లా కోర్టుల్లో 70 శాతం కేసులను వాయిదా వేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో కీలకమైన కేసుల విచారణను వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో విచారిస్తూ వస్తున్నారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం ఇప్పట్లో పోయే అవకాశం కనించక పోవడంతో కేసుల భౌతిక విచారణను పునరుద్ధారించాలంటూ న్యాయవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. సుప్రీం కోర్టు గత ఆగస్టు నెలలోనే పరిమితంగానైనా కొన్ని కేసుల విచారణను చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం ఓ వెయ్యి కేసుల జాబితాను రూపొందించింది. (త్వరలోనే ప్రత్యక్ష విచారణ చేపట్టనున్న కోర్టులు?) వాటి విచారణకు ప్రాతినిథ్యం వహించాల్సిందిగా న్యాయవాదులను కోర్టు కోరింది. అందుకు ఆశ్చర్యంగా ఒక్క శాతం న్యాయవాదులు మాత్రమే కేసుల వాదనకు కోర్టుకు హాజరయ్యేందుకు అంగీకరించారు. కేసుల పునరుద్ధరణ కు సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చినప్పటికీ ఇంత తక్కువ సఖ్యలో న్యాయవాదులు స్పందించడం శోచనీయంగా కనిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు, దాని దిగువ కోర్టులు గత వారం నుంచి పని చేస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో హైకోర్టులతోపాటు వాటి దిగువ కోర్టుల్లో ఇంకా కేసుల విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. జిల్లా సబార్డినేట్ కోర్టుల్లోనే ఎక్కువ లిటిగేషన్ కేసుల విచారణ కొనసాగుతాయి. అవే న్యాయవాదులకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉపయోగపడుతూ వస్తున్నాయి. సబార్డినేట్ కోర్టుల్లో ఇంకా కేసుల విచారణ ప్రారంభం కాకపోవడంతో జిల్లా, గ్రామీణ స్థాయిలో న్యాయవాదులు ఆర్థిక సంక్షోభం చిక్కుకు పోయారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి కేసుల విచారణను పునరుద్ధరిస్తున్నట్లు మద్రాస్ హైకోర్టు ఇటీవలనే ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రోజుకు మూడు నుంచి ఐదు కేసులను విచారించాలని నిర్ణయించింది. (న్యాయస్థానాలు మూడో సభ కానున్నాయా?) కొత్త కేసులను దాఖలు చేసేందుకు కోర్టు ఆవరణలో డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇతర ప్రభుత్వ యంత్రాంగాలన్నీ తమ కార్యకలాపాలను పునరుద్ధరించినప్పుడు న్యాయవర్గాలు మాత్రం ఎందుకు తమ కార్యకలాపాలను పునరుద్ధరించరన్నది ప్రశ్న. హైకోర్టు కార్యకలాపాలను ప్రారంభించాలంటూ అస్సాంలో న్యాయవాదులంతా ధర్నాలు చేయగా, కొన్ని ప్రాంతాల్లో సరైన సదుపాయాలు లేనందున ఇప్పుడే కేసుల విచారణ చేపట్టరాదని న్యాయవాదులు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా న్యాయవర్గాల్లో పరస్పర భిన్నమైన వాదనలు వినిపిస్తుండడంతో అనిశ్చిత పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు, మాల్స్‌ను తెరచారని, మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా వాటిని తెరవబోతున్నారని, అలాంటప్పుడు కోర్టుల కార్యకలాపాలను పునరుద్ధరిస్తే తప్పేమిటని న్యాయవాదుల్లో ఓ వర్గం వాదిస్తోంది. -
అన్‌లాక్–2 మార్గదర్శకాలు ఇవే..
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, జిమ్‌లు, మెట్రో రైలు సర్వీసుల పునఃప్రారంభాన్ని మరో నెలపాటు వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించింది. దశలవారీగా ఆంక్షలను సడలించేందుకు విధించిన అన్‌లాక్–1 గడువు మంగళవారంతో ముగియనుండగా ఈ మేరకు సోమవారం రాత్రి హోం శాఖ అన్‌లాక్–2 మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి అందిన సమాచారం మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపింది. కంటైన్మెంట్ జోన్లలో జూలై 31వ తేదీ వరకు లాక్డౌన్ కఠినంగా అమలవుతుంది. కోవిడ్–19 వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా ఈ జోన్ల పరిధిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే నిర్ణయించాల్సి ఉంటుందని, ఈ విషయంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో అత్యవసర సేవలకే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. ► స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు జూలై 31వ తేదీ వరకు మూసివేసి ఉంటాయి. ► సినిమాహాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశమందిరాలను కూడా తెరవరాదు. ► సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత సంబంధ ఉత్సవాలు, భారీ సమావేశాలపై నిషేధం కొనసాగుతుంది. పరిస్థితులను బట్టి వీటిని తెరిచే విషయమై తేదీలను తర్వాత ప్రభుత్వం ప్రకటిస్తుంది. ► దేశీయ, అంతర్జాతీయ(వందేభారత్ మిషన్)విమానాలు, ఇప్పటికే పరిమిత సంఖ్యలో నడుస్తున్న ప్యాసింజర్ రైలు సర్వీసులను పరిస్థితులను బట్టి పెంచనుంది. నేడు మోదీ ప్రసంగం ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు జాతి నుద్దేశించి ప్రసంగించనున్నారు. గల్వాన్ లోయలో జూన్ 15వ తేదీన జరిగిన భారీ ఘర్షణల అనంతరం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగించనుండటం గమనార్హం. -
కరోనా : మూసివేత దిశగా 25 వేల దుకాణాలు
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా లాక్డౌన్ కారణంగా దుకాణాల మూత, పరిమిత సేవల ఆంక్షల నేపథ్యంలో రీటైల్ పరిశ్రమ కుదేలైంది. దీంతో ఈ ఏడాదిలో సుమారు 25 వేల దుకాణాలు శాశ్వతంగా మూత పడనున్నాయని ఒక నివేదిక వెల్లడించింది. దేశంలోని మాల్స్, డిపార్టమెంటల్ స్టోర్లపై వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపనుందని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న మాల్ ఆధారిత చిల్లర వ్యాపారులు మరింత కుదేలవుతారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో పరిస్థితి 2019 నాటికంటే దారుణంగా వుంటుందని పేర్కొంది. రిటైల్ అండ్ టెక్ డేటా సంస్థ కోర్ సైట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం ప్రధానంగా మాల్స్‌లో చాలావరకు దుకాణాలు మూత పడనున్నాయి. వీటితోపాటు డిపార్ట్మెంట్ స్టోర్లు, బట్టల దుకాణాలు తీవ్రంగా దెబ్బతింటాయని అంచనా వేసింది. 2019లో 9,800కి పైగా దుకాణాలను మూసివేసిన రికార్డును బద్దలు కొట్టేంత తీవ్రంగా ఇది ఉంటుందని నివేదించింది. అలాగే మాల్లోని ప్రధాన అద్దెదారులు స్టోర్లను మూసివేస్తే, ఇతర అద్దె దారులు కూడా తమ షాపులు మూసివేయాల్సి వస్తుందని కోర్ సైట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డెబోరా వీన్స్ విగ్ తన నివేదికలో తెలిపారు. ఈ ప్రభావంతో మూతపడే దుకాణాల సంఖ్య 20-25 వేల వరకు ఉంటుందన్నారు. మూసివేతలతో పాటు, రుణ భారంతో మరికొంతమంది చిల్లర వ్యాపారులు దివాలా అంచుల్లోకి జారుకుంటారని హెచ్చరించారు. ఈ సంవత్సరం ఇప్పటికే పదిహేను ప్రధాన రిటైలర్లు దివాలా పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. (పరిస్థితి మరింత దిగజారుతోంది: డబ్ల్యూహెచ్ఓ) కోవిడ్-19 వ్యాప్తి కారణంగా మార్చి మధ్యలో అమెరికన్ రిటైలర్లు నష్టాల పాలయ్యారు. పలు షాపులు మూత పడ్డాయి. ప్రస్తుతం కొన్ని పరిమితులతో షాపులు తిరిగి తెరుచుకున్నప్పటికీ , లాక్డౌన్ ప్రతిష్టంభనతో చిల్లర వ్యాపారులు జూన్ 5 నాటికి సుమారు 4 వేల దుకాణాలను శాశ్వతంగా మూసివేతకు నిర్ణయించడం గమనార్హం. వందల సంఖ్యలో దుకాణాలను మూసివేసిన వరుసలో జె.సి. పెన్నీ, విక్టోరియా సీక్రెట్ , పీర్1 ఇంపోర్ట్స్ సంస్థలు ఉన్నాయి. లాక్ డౌన్ ప్రభావం స్పష్టంగా తెలియకముందే, 2020 లో 15,000 దుకాణాలు మూతపడతాయని కోర్ సైట్ మార్చిలో అంచనా వేసింది. -
విజయవాడలో తెరుచుకున్న మాల్స్, రెస్టారెంట్లు
-
తెరుచుకున్న మాల్స్, రెస్టారెంట్లు..
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన చోట్ల సోమవారం నుంచి పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ నగరంలో మాల్స్,రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. కోవిడ్ నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని మాల్స్, రెస్టారెంట్లకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్లకు ప్రవేశద్వారం వద్ద సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ తో పాటు శానిటైజేషన్ చేస్తున్నారు. హోటల్ లో పని చేసే సిబ్బంది ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్, గ్లౌజులు వేసుకోవాలని, టేబుల్‌కు టేబుల్‌కు మధ్య దూరం ఉండే విధంగా చూడటం వంటి నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. (నేటి నుంచి అన్నీ ఓపెన్) విధులకు వచ్చే సిబ్బందితోపాటు వినియోగదారులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని.. జ్వరం, దగ్గు తదితర లక్షణాలతో వచ్చే వారి గురించి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి లేదా 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది. కాగా, ఏప్రిల్ 20 నుంచే ‘రీస్టార్ట్’ పేరుతో పరిశ్రమలు ప్రారంభించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా షాపులకు.. ఇప్పుడు దేవాలయాలు, మాల్స్, హోటళ్లకు పచ్చజెండా ఊపడంతో పూర్తిస్థాయిలో వాణిజ్య లావాదేవీలు రాష్ట్రంలో మొదలయ్యాయి. -
మాల్స్, హోటళ్లు, మందిరాలు ఓపెన్
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ దెబ్బతో మూతపడ్డ మాల్స్, హోటళ్లు, ప్రార్థనా మందిరాలన్నీ సోమవారం నుంచి తెరుచుకోన్నాయి. అయితే ఎస్ఎంఎస్ (శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్)ను తప్పనిసరిగా అమలు చేయాలని, అవి ఉల్లంఘించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గడిచిన వారం రోజులుగా నగరంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు–మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో మాల్స్, హోటళ్లు, మందిరాలు తిరిగి ప్రారంభిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఎన్నారైలు, తబ్లిగీల కుటుంబాలు, ఏరియాలు దాటి మహా నగరమంతా వైరస్ స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో భారీగా జనం పోగయ్యే ప్రాంతాలు తిరిగి ప్రారంభిస్తుండటం ఒక విధంగా రిస్క్‌తోనే కూడుకున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘దూరం..దూరం..’ ఏరాట్లు సోమవారం ఉదయం నుంచి కీసర, దిల్సుఖ్నగర్ సాయిబాబా, నౌబత్పహడ్ వెంకటేశ్వరస్వామి దేవాలయాలు మొదలుకుని చారిత్రక మక్కా మసీదు, సెయింట్ ఆన్స్ చర్చి తదితరాలన్నీ యథావిధిగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ కూడా తప్పనిసరిగా మాస్క్, భౌతికదూరం పాటించే నిబంధనతో పాటు అన్ని చోట్ల గేటు బయటే శానిటైజర్ ఇచ్చే ఏర్పాట్లను ఆయా సంస్థలే చేపడుతున్నాయి. ఇక మాల్స్–హోటళ్లకు సంబంధించి నగరంలో 20 వేల వరకు ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, 110 వరకు ఉన్న స్టార్ హోటళ్లలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. రెస్లారెంట్లలో ఇంతకు ముందు సీట్లలో యాభై శాతాన్ని, అంటే..ప్రతి టేబుల్‌పై ఇద్దరిని మాత్రమే అనుమతించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మరో వైపు రెస్టారెంట్లు, హోటళ్లకు నరిపోను సిబ్బంది కూడా లేకపోవటంతో పూర్తి సర్వీసులు అందజేయలేని పరిస్థితి ఉంది. భయపెడుతున్న కోవిడ్ రక్కసి.. కోవిడ్ రక్కసి పంజా జోరుగా విసురుతోంది. నగరంలో ప్రతి నెలా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. మార్చిలో నగరంలో 64 పాజిటివ్ కేసులు, 6 మరణాలు సంభవిస్తే, ఏప్రిల్‌లో 537 కేసులు, 15 మరణాలు, మేలో 1054 కేసులు, 50 మరణాలు, జూన్‌లో తొలి 7 రోజుల్లోనే 635 కేసులు, 39 మరణాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు ఎంత చెప్పినా.. స్వీయ నియంత్రణే అల్టిమేట్ రక్షణ చర్య అని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంటోంది. తాము ఎన్ని ఏర్పాట్లు చేసి, పర్యవేక్షించినా నగర వాసులు తాము వెళుతున్న ప్రదేశాల్లో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సంస్థలు, ప్రాంతాలపై వెంటనే 100 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరింది. ఇదే విషయంలో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తమకు ప్రజల నుండి కూడా సహకారం కావాలని, తాము ఎన్ని ఏర్పాట్లు చేసినా, వచ్చే వారిలో స్వీయ నియంత్రణ ఉండాలని అన్నారు. భౌతిక దూరంతో నమాజ్ పాటించాలని ఫత్వా నగరవ్యాప్తంగా సోమవారం నుంచి మసీదులు పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నమాజ్‌లు చేసుకునేవారు భౌతిక దూరం పాటించాలని జామియా నిజామియా ఫత్వా జారీ చేసింది. అలాగే ప్రతి మసీదును ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. నమాజ్‌ల కోసం పరిచే జానీమాజ్‌లను తీసి..నేల పైనే నమాజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ప్రవేశ ద్వారా వద్ద శానిటేషన్ ఏర్పాట్లు చేపట్టారు. ప్రముఖ మత గురువు ముఫ్తీ అజీముద్దీన్ మాట్లాడుతూ కరోనా వ్యాపించకుండా ఉండాలంటే భౌతిక దూరం తప్పనిసరి అని, మసీదు కమిటీలు కూడా ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ లెక్కలు చూసి..అడుగేయండి.. నగరంలో కోవిడ్ విస్తరణ..జెట్ స్పీడ్ వేగంతో జరుగుతోంది.అందుకే సోమవారం నుండి ఇంటి నుండి బయల్దేరే వారు ఈ లెక్కలు చూసి..జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.. నగరంలో కేసులు, మరణాలు ఇలా.. రోజు పాజిటివ్ కేసులు జూన్ 1 79 జూన్ 2 70 జూన్ 3 108 జూన్ 4 110 జూన్ 5 116 జూన్ 6 152 జూన్ 7 132 -
సాగర తీరంలో షాపింగ్ ఢమాల్!
-
కరోనా: అవి తప్ప అన్ని మాల్స్ మూత
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19(కరోనా వైరస్) విస్తరణకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని అన్ని మాల్స్‌ను మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రకటించారు. అయితే కిరాణా, ఫార్మసీ కూరగాయల దుకాణాలకు దీన్నుంచి మినహాయింపు వుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, అన్ని మాల్స్ (కిరాణా, ఫార్మసీ, కూరగాయల షాపులు మినహా) మూసివేస్తున్నామని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందితే, అలాంటి పరిస్థితులను ఎదుర్కొంనేందుకు ఆస్పత్రులు సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఎంఆర్ఐ,ఇతర మెషీన్లు, వెంటిలేటర్లు, తగినంత మందులు, వినియోగ వస్తువులు, సిబ్బంది మొదలైనవి అందుబాటులో వుండాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు, ఆయా విభాగాల అధిపతులు, కార్యదర్శులతో సమీక్షించినట్టు కేజ్రీవాల్ వెల్లడించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 10031కి చేరింది. బాధితుల సంఖ్య 244 602కి చేరింది. In view of the prevailing situation, we are closing down all Malls (except grocery, pharmacy and vegtable shops in them) — Arvind Kejriwal (@ArvindKejriwal) March 20, 2020 -
తెలంగాణలో థియేటర్స్, మాల్స్ మూసివేత
-
జల్సా మాల్స్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో మెట్రోస్టేషన్లకు అనుసంధానంగా నిర్మించిన మాల్స్‌కు జనాదరణ పెరుగుతోంది. ప్రస్తుతానికి పంజగుట్ట, హైటెక్‌సిటీ మెట్రోమాల్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. డిసెంబరు నుంచి ఎర్రమంజిల్, మూసారాంబాగ్ మెట్రోమాల్స్ సైతం ప్రారంభించనున్నారు. వీటిని సమీప మెట్రో స్టేషన్లలోని స్కైవేల(ఆకాశ మార్గాలు) ద్వారా అనుసంధానించనున్నారు. దీంతో ప్రతి మెట్రో స్టేషన్ నుంచి నిత్యం రాకపోకలు సాగించే వేలాదిమంది ప్రయాణికులు ఈ మాల్స్‌లోకి సులభంగా ప్రవేశించి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసే వీలుంది. అంతేకాదు.. మాల్స్‌లో ఏర్పాటు చేసిన కిడ్స్ గేమ్స్ జోన్, పెద్దల కోసం స్నూకర్ వంటి గేమ్స్ జోన్లు ఆటవిడుపుగా మారాయి. ఇక నూతనంగా పీవీఆర్ సినీప్లెక్స్‌ల ఏర్పాటుతో వినోదాన్ని సైతం ఇక్కడ పొందే అవకాశం లభించింది. వివిధ ప్రాంతాల్లో మెట్రో మాల్స్ ఇలా.. ప్రస్తుతానికి పంజగుట్టలో 4.80 లక్షల చదరపు అడుగులు, ఎర్రమంజిల్‌లో 3.25 లక్షలు, మూసారాంబాగ్‌లో 2.40 లక్షలు, హైటెక్‌సిటీలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్ నిర్మించారు. సమీప భవిష్యత్‌లో రాయదుర్గం మెట్రో టర్మినల్ స్టేషన్ వద్ద 13 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్‌ను మించిన విస్తీర్ణంతో బడా మాల్‌ను నిర్మించేందుకు ఎల్అండ్టీ సిద్ధమైంది. ఇక కూకట్పల్లి, ఉప్పల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద కూడా 4–5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్ ఏర్పాటుకు నిర్మాణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తంగా ప్రభుత్వం ఎల్అండ్టీకి వివిధ ప్రాంతాల్లో కేటాయించిన 269 ఎకరాల స్థలాల్లో ఈ మాల్స్ ఏర్పాటు కానున్నాయి. వచ్చే 15 ఏళ్లలో రూ.2,243 కోట్లతో నగర వ్యాప్తంగా మేట్రో మార్గంలో 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్, ఇతర వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయాలని సదరు సంస్థ నిర్ణయించింది. కాగా మెట్రో ప్రాజెక్టులో ప్రయాణికుల చార్జీల ద్వారా వచ్చే ఆదాయం కేవలం 45 శాతం మాత్రమే. మిగతా 50 శాతం రెవెన్యూ రియల్టీ ప్రాజెక్టులే ఆధారమంటే అతిశయోక్తి కాదు. ఇక మరో ఐదు శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా సమకూర్చుకోవాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. నిర్మాణ ఒప్పందం కుదిరిన 2011 తొలినాళ్లలో 18 చోట్ల మాల్స్ నిర్మించాలనుకున్నప్పటికీ ప్రస్తుతానికి నాలుగు చోట్లనే మాల్స్ నిర్మాణం పూర్తయింది. మాల్స్‌లో ఏముంటాయంటే.. పంజగుట్ట మాల్‌ను నాలుగు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. దీని నిర్మాణ విస్తీర్ణం 4.8 లక్షల చదరపు అడుగులు. ఇందులో ఆరు సినీప్లెక్స్‌లు ఏర్పాటు చేశారు. హైటెక్‌సిటీ మాల్‌ను రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 2 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలం అందుబాటులోకి వచ్చింది. దీనికి అద్దె ప్రతి చదరపు అడుగుకు స్టోర్ లేదా ఆఫీసు విస్తీర్ణం, రకాన్ని బట్టి ప్రతినెలా రూ.75 నుంచి రూ.150 చొప్పున ఎల్అండ్టీ సంస్థ వసూలు చేస్తోంది. ఈ మాల్స్‌లో దేశ, విదేశాలకు చెందిన పలు కంపెనీల స్టోర్స్, సినీ మల్టీప్లెక్స్‌లు ఉంటాయి. ఆఫీసు, వాణిజ్య స్థలాలు, ఫుడ్‌కోర్టులు, చాట్‌బండార్స్, బేకరీలు, కన్ఫెక్షనరీలు సైతం ఉంటాయి. ట్రామాకేర్ సెంటర్లు, డయాగ్నోస్టిక్స్ సెంటర్లు, బ్యాంకులు, ఏటీఎంలు ఏర్పాటు చేస్తారు. వినోదాలు, పిల్లల ఆట పాటలు, గేమ్స్, స్కేటింగ్ వంటి సైతం ఉంటాయి. అంతేగాక సిమ్యులేటర్ డ్రైవింగ్ సెంటర్లు సైతం ఏర్పాటు చేస్తారు. వీటితోపాటు అన్ని రకాల నిత్యావసరాలు దొరికే ఏటు జడ్ స్టోర్స్, కాఫెటీరియాలు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, బ్రాండెడ్ దుస్తులు, పుస్తకాలు, పాదరక్షల దుకాణాలు, కాస్మొటిక్స్, ఫ్యాషన్ మెటీరియల్ సైతం అందుబాటులో ఉంటాయి. ఖాళీగా మెట్రో రిటైల్ స్పేస్.. ప్రస్తుతం మూడు మెట్రో రూట్లలో మొత్తం 72 కి.మీ మార్గంలో 64 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో 27 మెట్రో స్టేషన్లు, నాగోల్–అమీర్‌పేట్ రూట్లో 16 స్టేషన్లు వినియోగంలోకి వచ్చాయి. ఆయా స్టేషన్లలో మధ్యభాగం (కాన్కోర్స్ లెవల్)లో సరాసరిన ఒక్కో స్టేషన్‌కు 9,500–15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య స్థలం(రిటైల్ స్పేస్) అందుబాటులో ఉంది. అయితే ఇప్పటివరకు అమీర్‌పేట్, మియాపూర్ మినహా చాలా చోట్ల స్టేషన్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఆయా స్టేషన్లలో రిటైల్ స్పేస్‌ను బహుళ జాతి సంస్థలు దక్కించుకున్నప్పటికీ ప్రస్తుతానికి స్టేషన్లు అంతగా రద్దీ లేకపోవడంతో స్టోర్లను ఏర్పాటు చేయలేదు. దశలవారీగా అన్ని స్టేషన్లలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. -
ఆగని గోల్ ‘మాల్స్’
సాక్షి,హైదరాబాద్: మల్టీప్లెక్స్ థియేటర్లు, మెగామాల్స్ల్లో నిర్దేశించిన ధరలకే అన్ని రకాల వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయం తొలిరోజు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. నగరంలోని మల్టీప్లెక్స్‌లు, ఇతర మాల్స్ల్లో ఇష్టారీతిన సాగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఎంఆర్పీ ధరలకే అమ్మాలంటూ తూనికలు, కొలతల శాఖ ఆదేశించిన నేపథ్యంలో ‘సాక్షి’బృందాలు బుధవారం నగరంలో వివిధ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని రికార్డు చేశాయి. ప్యాక్ చేసిన కొన్ని వస్తువులపై ఎంఆర్పీ అమలు చేసిన నిర్వాహకులు అనేక ఆహార పదార్థాలపై మాత్రం ఇష్టారీతిన స్టిక్కర్లు వేసి అమ్మకాలకు పెట్టారు. బుధవారం, గురువారం నాటి ధరలకు పెద్దగా తేడా లేదని ఆయా మాల్స్ల్లో సందర్శకులు పెదవి విరిచారు. ఐఎస్ఐ బ్రాండ్ లీటర్ మంచినీళ్ల ధర బహిరంగ మార్కెట్లో రూ.19. కానీ, నెక్లెస్‌రోడ్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో మాత్రం రూ. 25. 400 ఎంఎల్ కోకాకోల ధర రూ.70. ఎగ్‌పఫ్ రూ.50, సమోసా 40. పాప్‌కార్న్ రూ.160లకు విక్రయించారు. కూకట్‌పల్లిలోని మంజీరా మాల్, సినీపోలిస్, ఫోరం మాల్, పీవీఆర్ సినిమాల్లో తినుబండారాల ధరలు పాత పద్ధతిలోనే కొనసాగాయి. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను ఎమ్మార్పీకి విక్రయిస్తూ విడిగా ఆర్డర్ చేసే ఆహార పదార్థాలు, పాప్‌కార్న్ లాంటివి వందల్లో విక్రయించారు. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ కంబైన్డ్ అప్‌సైజ్ కపుల్ కాంబోను జీఎస్టీ ధరలతో కలిపి రూ.495 వసూలు చేశారు. ధరల సూచికలో పేర్కొన్న వాటి కంటే ఎక్కువగానే వసూలు చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. ఫోరం మాల్లో తాగునీరు, కూల్‌డ్రింక్స్ మాత్రమే ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తూ మిగతావి తమ సొంత నిర్ణీత ధరలకు అమ్మారు. ఆహార పదార్థాల పరిమాణం తదితర వివరాలను ప్రత్యేకంగా పేర్కొన్న దాఖలాలులేవు. ఈ విషయమై స్థానికంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మాత్రం అధికారులు ప్రత్యేకంగా ప్యాకేజ్డ్ ఫుడ్ ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని నిబంధనల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ప్యాకింగ్ లేని ఆహార పదార్థాల విషయంలో నిబంధనలు తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరించడం విశేషం. నిబంధనలు ఏం చెబుతున్నాయి తినుబండారాలు, మంచినీటి బాటిళ్లు, కూల్డ్రింకులు నిర్ణీత ధరలకే విక్రయించాలి .విడిగా అమ్మే తినుబండారాలు అందించే కంటైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతోపాటు ఎంఆర్పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్ ఉండాలి. సెప్టెంబర్ 1 నుంచి స్టిక్కర్ స్థానంలో ఎంఆర్పీ, పరిమాణం, బరువు కచ్చితంగా ముద్రించి ఉండాలి. ఇవన్నీ ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించేలా బోర్డుపై ప్రదర్శించాలి. ధర మారితే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలి. ఒకే బ్రాండ్ తినుబండారాలు కాకుండా వివిధ బ్రాండ్స్ అందుబాటులో ఉంచాలి. ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎంఆర్పీ, కస్టమర్ కేర్ వివరాలు ఉంచాలి. అలాగే ఎమ్మార్పీ ధర ఉన్న ఫుడ్స్ మాత్రమే విక్రయించాలి. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042 500333, వాట్సాప్ నంబర్ 7330774444ను విధిగా సినిమా హాళ్లలో ప్రదర్శించాలి. ధరల్లో మార్పు లేదు మల్టీప్లెక్స్‌లో వివిధ వస్తువుల ధరల్లో మాత్రం మార్పు కనిపించలేదు. తిను బండారాలకు ఇష్టానుసారం ధర నిర్ణయించారు. గతంలో స్టిక్కర్ ఉండకపోయేది. ఇప్పుడు కొత్తగా స్టిక్కర్ అంటించి దర్జాగా దోపిడీ చేస్తున్నారు. – మణికుమార్, చింతల్ అడ్డగోలు ధరలతో స్టిక్కర్లు మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లలో విక్రయించే వస్తువులపై అడ్డగోలు ధరల స్టిక్కర్లు అంటించారు. బయట ధరలతో పోలిస్తే రెండు, మూడింతలు అధికమే. శీతల పానీయాల ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. –రవితేజ, కూకట్పల్లి ధరలపై నియంత్రణ లేదు మల్టీప్లెక్స్‌లో ధరలపై నియంత్రణ లేదు. ఎమ్మార్పీ అమలును పక్కదారి పట్టించేవిధంగా ప్రైస్ స్టిక్కర్లు అంటించారు. నాణ్యత పేరుతో ధరల దోపిడీకి పాల్పడుతున్నారు. ధరలపై నియంత్రణ అవసరం. తినుబండారాలపై నిర్ణీత ధర నిర్ణయించాలి. –ఉమర్, విజయనగర్ కాలనీ ఇష్టారాజ్యంగా తినుబండారాల ధరలు... వాటర్ బాటిళ్లు, కూల్డ్రింక్స్పై ఎమ్మార్పీ ముద్రించి ఉంటుంది కనుక గుర్తించగలుగుతున్నాం. తినుబండారాలపై ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ధరలపై అవగాహన ఉండకపోవడంతో అడిగినంత ఇస్తున్నాం. ప్రభుత్వం తినుబండారాల పరిమాణం, ధరలను కూడా నిర్ధారించడం ద్వారా అక్రమ విక్రయాలను అడ్డుకోవాలి. – సంజీవ, మూసాపేట అధిక ధరలు కట్టడి చేస్తాం మల్టీప్లెక్, సినిమా థియేటర్లలో వివిధ వస్తువుల అధిక ధరలను కట్టడి చేస్తాం. ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు నిబంధనల ఉల్లంఘనే. బయట మార్కెట్ ధరలతో సమానంగా మల్టీప్లెక్, సినిమా థియేటర్లలో అమలు చేయాలి. ఎమ్మార్పీ అమలుపై రేపటి నుంచి తనిఖీలు నిర్వహిస్తాం. భారీ జరిమానాలకు వెనుకాడబోం. –జగన్మోహన్, అసిస్టెంట్ కంట్రోలర్,తూనికలు, కొలతల శాఖ -
రేపటి నుంచి థియేటర్లపై దాడులు!
సాక్షి, హైదరాబాద్ : సామాన్యుడు సినిమా హాల్‌కు వెళ్లే పరిస్థితి కనబడటం లేదు. ఇక సినిమాకు వెళ్దామని అనుకుంటే అదెంత ఖర్చుతో కూడుకున్న పనో తెలిసిన విషయమే. థియేటర్లో ఆకలేస్తే తినుబండారాలు కొంటే మోతమోగిపోతుంది. వాటిపై ఉండే ధరలు వేరు.. యాజమాన్యం అమ్మే ధరలు వేరు. ఇలాంటి విక్రయాలు నేరం అంటూ హెచ్చరికలు జారీ చేసినా.. ఫలితం మాత్రం శూన్యమంటూ సినీ ప్రేమికులు వాపోతున్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా, నిబంధనలు ఉన్నా.. ధరల్లో మార్పులేదని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుండి థియేటర్ల లో ఎంఆర్పీ ధరలకే విక్రయాలు జరపాలని తూనికలు, కొలతలశాఖ ఆదేశాలు జారీ చేశారు.ఆగస్టు రెండు, మూడు తేదీల్లో సినిమా హాల్స్ పై దాడులు చేయనున్నట్లు తూనికలు, కొలతల శాఖ అధికారులు తెలిపారు. -
షాపింగ్ మాలే ఆఫీసు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మాల్స్, స్టార్ హోటల్స్.. ఇపుడివి తినడానికో లేదా షాపింగ్ చేయడానికో మాత్రమే కాదు!! ఆఫీసులుగానూ మారుతున్నాయి. గతంలో ప్రత్యేకంగా ఒక వాణిజ్య భవనంలో కో–వర్కింగ్ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీలు... ఇప్పుడు షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లనూ కార్యాలయాలుగా కేటాయిస్తున్నాయి. పనిచేసే చోటే రిటైల్, ఫుడ్ వసతులూ ఉండటాన్ని కంపెనీలు సైతం స్వాగతిస్తుండటంతో కో–వర్కింగ్ సంస్థలు మాల్స్, హోటళ్ల వైపు దృష్టిసారించాయి. దశాబ్ద కాలంగా దేశంలోని కార్యాలయాల్లో పని వాతావరణంలో విపరీతమైన మార్పులొచ్చాయి. ఆఫీసు డిజైన్, వసతులు, రంగులు వంటివి ఉద్యోగి నైపుణ్యం, ఉత్పాదకత, పని సంస్కృతిపై ప్రభావం చూపిస్తున్నాయనేది ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా అభిప్రాయం. కార్యాలయాల్లో గ్రీనరీ, సహజసిద్ధమైన గాలి, వెలుతురు, వాసన వంటి వాటితో ఉద్యోగిపై పని ఒత్తిడి తగ్గుతుందని, దీంతో మరింత క్రియేటివిటీ బయటికొస్తుందని పరిశోధనల్లోనూ తేలింది. ఆయా వసతులను అందుబాటు ధరల్లో కో–వర్కింగ్ స్పేస్ భర్తీ చేస్తుండటంతో ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులకు డిమాండ్ పెరిగింది. దీంతో మధ్య తరహా, చిన్న, స్టార్టప్స్ మాత్రమే కాకుండా బహుళ జాతి సంస్థలు కూడా కో–వర్కింగ్ స్పేస్‌లో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. మెట్రో మాల్స్‌లో కో–వర్కింగ్.. త్వరలోనే హైటెక్ సిటీ, పంజగుట్ట, మలక్‌పేట్ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న హైదరాబాద్ మెట్రో మాల్స్‌లో కో–వర్కింగ్ స్పేస్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ కో–వర్కింగ్ కంపెనీ సంబంధిత సంస్థతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఢిల్లీకి చెందిన ‘ఆఫిస్’ సంస్థకు హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో 167 సీట్లు, కోల్‌కతాకు చెందిన అపీజే గ్రూప్‌కు పార్క్ హోటల్లో 475 సీట్ల కో–వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంది. ఆఫిస్‌కు గుర్గావ్లోని ఆంబియెన్స్ మాల్లో 592 సీట్లు, హీరా పన్నా మాల్లో 241 సీట్లు, పుణెలోని క్యూక్లియస్ మాల్లో 400 సీట్లు, రఘులీలా మాల్లో 1,000 సీట్లు కో–వర్కింగ్ స్పేస్ రూపంలో ఉన్నాయి. ముంబైకి చెందిన రీగస్కు ఢిల్లీలోని వసంత్ స్క్వేర్ మాల్, బెంగళూరులోని లగ్జరీ యూబీ సిటీ, చెన్నైలోని సిటీ సెంటర్లో కో–వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంది. 20 లక్షల చ.అ.కు కో–వర్కింగ్ స్పేస్.. 2010లో ప్రపంచవ్యాప్తంగా 600 సెంటర్లలో 21 వేల కో–వర్కింగ్ సీట్లుండగా.. ఇప్పుడవి 18,900 సెంటర్లలో 17 లక్షల సీట్లకు పెరిగాయి. మన దేశంలో ఏటా 4.1 కోట్ల చ.అ. కార్యాలయాల స్థల లావాదేవీలు జరుగుతుండగా.. ఇందులో 20 లక్షల చ.అ. స్థలం కో–వర్కింగ్ స్పేస్ ఉంటుందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలియజేసింది. 43 శాతం లావాదేవీలతో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా... తర్వాత ఎన్సీఆర్లో 16 శాతం, హైదరాబాద్ 15 శాతం, పుణె 12 శాతం, ముంబై 10 శాతం, అహ్మదాబాద్ 3 శాతం, చెన్నై 2 శాతం ఆక్రమించినట్లు సంస్థ తెలిపింది. ఏటా 30–40 శాతం వృద్ధి నమోదవుతోంది. ప్రస్తుతం దేశంలో రీగస్, వీవర్క్, కోవర్క్స్, ఐకివా, వర్క్ ఏ ఫీలా, టేబుల్ స్పేస్, ఆఫిస్, అపీజే, స్మార్ట్‌వర్క్స్ వంటి సుమారు 200 కో–వర్కింగ్ కంపెనీలు 400 సెంటర్లలో సేవలందిస్తున్నాయి. మౌలిక వసతుల వ్యయం తగ్గుతుంది.. ఐటీ కారిడార్లు, అభివృద్ధి చెందిన వాణిజ్య ప్రాంతాల్లో స్థలాల ధరలు ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసే బదులు కో–వర్కింగ్ స్పేస్‌ను అద్దె తీసుకోవటం కంపెనీలకు సులువవుతోంది. ఇదే కో–వర్కింగ్ డిమాండ్‌కు ప్రధాన కారణమని ఆఫీస్ ఫౌండర్ అండ్ సీఈఓ అమిత్ రమణి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌తో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌లో అద్దెలు 25% వరకు తక్కువ. అంతేకాకుండా సాధారణ ఆఫీసులో సీట్లతో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌లో ఒక్కో సీటుకు 5–15% స్థలం ఆదా అవుతుంది. పైగా ప్రతి కంపెనీ ప్రత్యేకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునే బదులు అన్ని కంపెనీలకు కలిపి ఒకటే పార్కింగ్, హౌస్ కీపింగ్, క్యాంటీన్, రిసెప్షన్ వంటి ఏర్పాట్లుంటాయి. దీంతో కంపెనీలకు మౌలిక వసతుల వ్యయం కూడా తగ్గుతుంది. అయితే ఒకే చోట పలు కంపెనీల పనిచేస్తుండటంతో కంపెనీల డేటా భధ్రత ప్రధాన సమస్యని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. గంట, రోజు, నెల వారీగా చార్జీలు.. ఒకే అంతస్తులో ఒక ఆఫీసు బదులు పలు రకాల చిన్న ఆఫీసులుండటాన్ని కో–వర్కింగ్ స్పేస్‌గా పిలుస్తారు. ప్రతి ఒక్కరికీ కావాల్సిన ప్రైవేట్ ఆఫీసు, ఫిక్స్డ్ డెస్క్‌లు, సమావేశ గది, క్యాబిన్ల వంటి సౌకర్యాలుంటాయి. కొరియర్, ఫుడ్, లాంజ్, ఎల్సీడీ, పార్కింగ్, ప్రింటర్, వైఫై, ప్రొజెక్టర్ వంటి ఆధునిక వసతులూ ఉంటాయి. కో–వర్కింగ్ ఆఫీసుల అద్దెలు గంట, రోజులు, నెల వారీగా ఉంటాయి. హైదరాబాద్‌లో నెలకు ఒక సీటుకు రూ.5–10 వేలు, పుణెలో రూ.4–10 వేలు, గుర్గావ్లో రూ.7–17 వేలు, ముంబైలో రూ.9–30 వేలు, బెంగళూరులో రూ.4–15 వేలు, చెన్నైలో రూ.7–15 వేలుగా ఉన్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, రాయదుర్గం, బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లిహిల్స్‌లో కో–వర్కింగ్ ఆఫీసులున్నాయి. -
మార్చిలో మెట్రో మాల్స్ ప్రారంభం!
సాక్షి, హైదరాబాద్: నగర మెట్రో ప్రాజెక్టులో రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టు కింద పంజగుట్ట, హైటెక్ సిటీల్లో నిర్మించిన భారీ మెట్రో మాల్స్‌ను మార్చి 1వ తేదీన లాంఛనంగా ప్రారంభించేందుకు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పంజగుట్టలోని మెట్రో మాల్లో 13 తెరల పీవీఆర్ సినిమాస్, హైటెక్ సిటీ మెట్రో మాల్లో 4 తెరల పీవీఆర్ సినిమా హాళ్లు ఇటీవలే ప్రారంభమయ్యాయి. అలాగే ఇతర ఫుడ్ కోర్టులు, బ్రాండెడ్ దుస్తులు, షూస్, వైద్య సేవలందించే పలు రకాల సంస్థలు మాల్స్ ప్రారంభమైన తర్వాత కార్యకలాపాలు మొదలుపెడతాయని సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆయా సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ మాల్స్‌కు జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని తెలిపాయి. ప్రస్తుతం మాల్స్‌లోని పీవీఆర్ సినిమా హాళ్లకు ప్రేక్షకుల రద్దీ అధికంగా ఉందని పేర్కొన్నాయి. మరో 2 నెలల్లో ఎర్రమంజిల్, మూసారాంబాగ్ల్లోనూ మెట్రో మాల్స్‌ను ప్రారంభిస్తామని చెప్పాయి. మొత్తంగా 4 చోట్ల కలిపి 18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎల్అండ్టీ సంస్థ మెట్రో మాల్స్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. -
మాల్స్‌కు ‘చంద్ర’ గ్రహణం!
సాక్షి,విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన చంద్రన్న మాల్స్‌కు గ్రహణం పట్టింది. తగినంత ఆదాయం రాదని భావిస్తున్న డీలర్లు వీటిని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం లేదు. ఏదో విధంగా మాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. స్పందన నిల్ జిల్లాలో 2,229 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. చంద్రన్న మాల్స్ వల్ల ఆదాయం బాగా ఉంటుందని డీలర్లు భావిస్తే.. ఇప్పటికే ఈ 2,229 మంది డీలర్లు తమకు చంద్రన్న మాల్ ఇప్పించాలంటూ దరఖాస్తు చేసుకునే వారు. డిమాండ్‌ను బట్టి ప్రజాప్రతినిధుల చేత అధికారులుపై ఒత్తిడి చేయించేవారు. వాటికి అంత సీను లేకపోవడంతో అధికారులే రంగంలోకి దిగి డీలర్ల చేత మాల్స్ పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ జిల్లాలోని డీలర్ల అందరితోనూ పౌరసరఫరాలశాఖాధికారులు సమావేశాలు పెట్టి మాల్ ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనాలను ఏకరువు పెట్టారు. మాల్స్ పెట్టుకోవాలంటూ ప్రోత్సహించినా ఇప్పటివరకు 160 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 10 మండలాల నుంచి కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదని సమాచారం. కనీసం రెండు దుకాణాలు విజయవాడలో రెండు నెలల కిందట మాల్ ఏర్పాటు చేశారు. మిగిలిన చోట్ల మాల్స్ ఏర్పాటు చేయించాలంటూ ప్రభుత్వం నుంచి అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ఒకొక్క నియోజకవర్గంలో కనీసం రెండు దుకాణాలు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటుచేయించేందుకు కసరత్తు జరుగుతోంది. రెండవ విడతలో విజయవాడలో మూడు, ఆగిరిపల్లి, కలిదిండి, జీ.కొండూరులలో ఒకొక్కటి చొప్పున ఏర్పాటు చేయిస్తున్నారు. వీటిని మరో పక్షం రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. దుకాణం చూపిస్తే... డీలర్లు 180 అడుగులు నుంచి 200 అడుగుల దుకాణం చూపిస్తే చాలు.. రిలయన్స్ సంస్థ ఆ దుకాణానికి టైల్స్ ఫ్లోరింగ్, సీలింగ్, ఎలక్ట్రిఫికేషన్, ర్యాక్స్ సమకూర్చుతుంది. ఇందులో విక్రయిం చేందుకు రూ.2లక్షలు సరుకు ఇస్తుంది. చౌకధరల దుకాణం ద్వారా విక్రయించే బియ్యాన్ని, ఇతర వస్తువులు డీలర్ విక్రయించుకోవచ్చు. డీలర్‌కు 8శాతం కమీషన్ ఇస్తారు. ఒకొక్క దుకాణం ఏర్పాటుకు కనీసం 25 రోజులు వ్యవధి పడుతుంది. ప్రతి రెండు మూడు రోజులకు విక్రయించిన సొమ్మును రిలయన్స్ సంస్థకు జమచేయాలి. నెల గడిచిన తరువాత కమీషన్ డీలర్ అకౌంట్‌కు వస్తుంది. ప్రతిబంధకాలు ఇవే.. నగరం, పట్టణాలలోనూ 200 అడుగుల దుకాణం దొరకడం కష్టంగా వుంది. కనీసం రూ. 7 నుంచి రూ.10వేలు అద్దె చెల్లిస్తేనే అంత దుకాణం దొరుకుతుంది. డీలర్ రోజంతా దుకాణంలో కూర్చుని బేరం చూసుకోవాల్సి ఉంటుంది. 8శాతం మాత్రమే కమీషన్ ఇస్తున్నందున నెలకు కనీసం 2.5 లక్షల అమ్మితే రూ.20వేలు ఆదాయం వస్తుంది. అందులోనే దుకాణం అద్దె, కరెంటు బిల్లులు, డీలర్ జీతం చూసుకోవాల్సి ఉంటుంది. నగరాల్లో నెలకు రూ.2.5 లక్షలు అమ్మినా వచ్చే కమీషన్ సరిపోదు. గ్రామాల్లో ప్రతినెల రూ.2.5లక్షలు అమ్మడం కష్టమని డీలర్లు వాపోతున్నారు. అందువల్ల కమీషన్ పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రిటైల్స్ దుకాణాలతో పోల్చితే మాల్స్‌లో ధరలు ఎక్కువగా వుండటంతో ఎక్కువ మొత్తంలో విక్రయించడం కష్టమని అంటున్నారు. చౌకధరల దుకాణాలు నిర్వహించుకుంటే నెలకు 15 రోజులే పని ఉంటుంది. తరువాత ఖాళీయే కావడంతో ఇతర వనరుల ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు. మాల్స్‌లో ఈ సౌకర్యం లేకపోవడంతో డీలర్లు ఆసక్తి చూపడం లేదు. అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయిస్తాం 16 నియోజకవర్గాల్లోనూ 32 చంద్రన్న మాల్స్ పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే డీలర్లతో సమావేశాలు పెట్టాం. మాల్స్ పెట్టమని ఒత్తిడి చేయడం లేదు. అవగాహన కల్పిస్తున్నాం. డీలర్లు ఎంత కష్టపడి పనిచేసుకుంటే అంత ఆదాయం వస్తుంది. పెట్టుబడి అవసరం లేదు. కేవలం దుకాణం ఉంటే చాలని చెబుతున్నాం. –నాగేశ్వరరావుజిల్లా పౌరసరఫరాలశాఖాధికారి -
వినియోగదారులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు
-
ఇక అన్ని షాపులు 24x7
నాగ్‌పూర్ : మహారాష్ట్రలో ఇక నుంచి అన్ని దుకాణాలు, మాల్స్ 24x7 పనిచేయనున్నాయి. రోజంతా దుకాణాలు, మాల్స్ తెరిచి ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం(ఎంఎస్ఈ)లో సవరణలు తీసుకొచ్చింది. దీంతో బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, పెద్ద పెద్ద మాల్స్ రాత్రివేళ కూడా తెరిచే ఉంటాయి. మూడు షిఫ్ట్‌లలో ఉద్యోగులు పనిచేస్తారని,దుకాణాలు, మాల్స్ మాత్రమే కాక హోటల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, కూడా రోజంతా తెరచి ఉండనున్నాయని ప్రభుత్వం తన నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ విషయాన్ని తెలియపరుస్తూ హోటల్స్, రెస్టారెంట్లు, మాల్స్ వద్ద నోటిఫికేషన్‌ను అతికించారు. అయితే, 24x7 నిబంధన నుంచి మద్యం దుకాణాలు, పబ్బులు, డిస్కోటెక్స్‌కు మినహాయింపు ఇచ్చారు. అవి మాత్రం నిర్ణీత గడువు వరకు మాత్రం తెరిచి ఉంటాయి. ఇక అన్ని షాపులు మూడు షిఫ్ట్‌లో 24x7 గంటలు తెరచే ఉండనున్నాయని ఆ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంభాజీ నిలంగేకర్ పాటిల్ తెలిపారు. ఈ నిర్ణయంతో ఎక్కువ మందికి ఉద్యోగవకాశాలు కల్పించనున్నామని పేర్కొన్నారు. ఈ చట్ట సవరణ ప్రకారం ఇక నుంచి కార్మికులందరికీ వీక్లీ ఆఫ్ ఇవ్వడం తప్పనిసరి చేసింది. పాత ఎంఎస్ఈ చట్టం నిబంధనల కిందనే లైసెన్సులను పొందాల్సివసరం లేదు. నేరుగా దుకాణాలకు సంబంధించిన అథారిటీ వద్ద ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 మంది వర్కర్ల కంటే తక్కువగా ఉన్న లేదా ఇంటి వద్ద ఉండే పనిచేసే ఉద్యోగులున్న చిన్న, మధ్య సైజు దుకాణాలకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇలా చేయడం వల్ల దాదాపు 22 లక్షల చిన్న దుకాణాదారులకు లబ్ధి చేకూరనుంది. 10 మంది కంటే తక్కువ మంది వర్క్‌ఫోర్స్ ఉన్న దుకాణాలు 12 లక్షలకుగా పైగా ఉన్నాయి. వీరు తమ సొంత టైమింగ్స్‌ను నిర్ణయించుకోవచ్చు. ఈ సవరణ చట్టం ఐడెంటీ కార్డులను, వీక్లీ ఆఫ్‌లను, కనీస వేతనాన్ని కూడా అందిస్తోంది. దీని వల్ల దాదాపు 35లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు. -
రెస్టారెంట్లకు, మాల్స్‌కు కేంద్రం తాజా ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : రెస్టారెంట్లకు, మాల్స్‌కు, షాపింగ్ అవుట్లెట్లకు కేంద్రం సరికొత్త ఆదేశాలు జారీచేసేందుకు సిద్ధమైంది. వీరు అందించే ఉత్పత్తులపై జీఎస్టీని కలుపుకునే ఎంఆర్పీని ముద్రించే విధంగా ఆదేశాలు జారీచేయబోతుంది. అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ ఆధ్వర్యంలో రాష్ట్రాల ఆర్థికమంత్రుల గ్రూప్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని సీనియర్ అధికారి ధృవీకరించారు. ఇదే విషయాన్ని కేంద్రానికి సూచించినట్టు పేర్కొన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన పూర్తిగా అన్ని ఉత్పత్తులపై ధరలు మారిపోయాయి. జీఎస్టీ అమలుతో ధరలు తగ్గుతాయని ఓ వైపు కేంద్రం చెబుతుంటే, వ్యాపారులు మాత్రం ధరలు బాదేస్తున్నారు. కొంతమంది రిటైలర్లు ఉత్పత్తుల ఎంఆర్పీ కంటే ఎక్కువగా జీఎస్టీ విధిస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన మంత్రుల గ్రూప్ ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఎంఆర్పీ అనేది గరిష్ట చిల్లర ధర అని, ఈ ధరకే రిటైలర్ ఉత్పత్తులను అమ్మాలని, దానికంటే అదనంగా ఏ ఛార్జీలు వేసినా నేరం చేసినట్టు గుర్తించాలని మంత్రుల గ్రూప్ సూచించింది. ఎంఆర్పీ కంటే ఏదీ ఎక్కువ అమ్మకూడని స్పష్టం చేసింది. వస్తువు వాస్తవ ధర ఎంత, దానిపై జీఎస్టీ ఎంత అనేది ఎంఆర్పీ కింద వేర్వేరుగా చూపించాలని వ్యాపార సంస్థలకు సూచించింది. నవంబర్ 10న జరిగే జీఎస్టీ సమావేశంలో మంత్రుల ప్రతిపాదించిన ఈ సిఫారసును జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించనుంది. -
సినిమాహాల్స్, మాల్స్, ఎయిర్‌పోర్టులకు చెక్
న్యూఢిల్లీ: ఒకే దేశం.. ఒకే పన్ను ఎలానో ఒకే ఉత్పత్తి.. ఒకే ఎంఆర్పీ ఉండాలని కూడా కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఒకే ఉత్పత్తిని వివిధ రకాల ప్రాంతాల్లో వివిధ ధరల్లో విక్రయించకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒకే ఉత్పత్తి, ఒకే ఎంఆర్పీ అనే విధానాన్ని తీసుకొస్తోంది. దీంతో ఎయిర్‌పోర్టులో, మాల్స్‌లో, సినిమా హాల్స్‌లో ఇన్నిరోజులు ఎంఆర్పీలో విపరీతంగా చెల్లించే ఛార్జీల నుంచి వినియోగదారులకు విముక్తి లభించనుంది. లీగల్ మెట్రోలాజీ(ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనలు 2011కు మార్పులు చేసిన ప్రభుత్వం 2018 జనవరి1 నుంచి అమల్లోకి తీసుకొస్తోంది. వీటిపై విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాత సమతుల్య విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని డిపార్ట్మెంట్ కన్జ్యూమర్ అఫైర్స్ పేర్కొంది. స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్ పరిగణనలోకి తీసుకుని, వినియోగదారుల రక్షణను లక్ష్యంగా ఈ రూల్స్‌ను సవరణలు తీసుకొచ్చామన్నారు. ఈ నిబంధనల కింద ఎలాంటి వ్యక్తి వివిధ రకాల ఎంఆర్పీలు ఛార్జ్ చేయడానికి వీలులేదని కన్జ్యూమర్స్ అఫైర్స్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. దీంతో సినిమా హాలు, ఎయిర్‌పోర్టులు, మాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కువ మొత్తంలో ఎంఆర్పీలు వేస్తున్నారనే ఫిర్యాదుల నుంచి విముక్తి కలిగి, వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుందని తెలిసింది. అయితే ఈ రూల్స్ తమకు చెందవని రెస్టారెంట్ యజమానులు చెబుతున్నారు. జీఎస్టీ కింద వీటిని తాము అప్లయ్ చేయమని, ఈ తాజా నోటిఫికేషన్ కేవలం కౌంటర్లో కొనుగోలు చేసే రిటైల్ సర్వీసులకు మాత్రమేనని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ రాహుల్ సింగ్ చెప్పారు. స్టెంట్స్, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్లు, సిరంజీలు, ఆపరేషన్స్ టూల్స్ వంటి మెడికల్ సర్వీసుల ఎంఆర్పీలను కూడా బహిర్గతం చేయాలని కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. కచ్చితంగా వీటి ధరలను వినియోగదారులు తెలుసుకోవాల్సి ఉంటుందని డీఓపీ సెక్రటరీ జై ప్రియె ప్రకాశ్ చెప్పారు. దిగుమతి చేసుకునే చాలా వస్తువులపై ఎంఆర్పీలను డిస్ ప్లే చేయరు. -
భాగ్యనగరిలో 26 లక్షల చ.అ.ల్లో మాల్స్!
2017లోనే 8 మాల్స్ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: 2017లో దేశంలో అందుబాటులోకి రానున్న మాల్స్‌లో హైదరాబాద్ తొలిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది 26 లక్షల చ.అ.ల్లో కొత్తగా 8 మాల్స్ రానున్నాయి. నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని.. త్వరలోనే ఒక్కోటి అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ⇒ కొండాపూర్, గచ్చిబౌలి, చందానగర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఈ మాల్స్ వస్తున్నాయి. శాంతా శ్రీరామ్, ఎస్ఎంఆర్, టీఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, అశోకా బిల్డర్స్ వంటి సంస్థలు ఆయా మాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. ⇒ హైదరాబాద్‌లో ఎల్అండ్టీ సంస్థ మెట్రో రైలుతో పాటూ మెట్రో స్టేషన్లు, డిపోలు, సమీప ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్‌ను కూడా నిర్మిస్తోంది. 1.85 కోట్ల చ.అ. రిటైల్ స్థలంలో తొలి దశలో 60.5 లక్షల చ.అ. మేర నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో 10.1 లక్షల చ.అ. స్థలం 2017లో అందుబాటులోకి రానుంది. ఎర్రమంజిల్, పంజగుట్ట, హైటెక్ సిటీల్లో నిర్మిస్తున్న మాల్స్ 2017లో అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ⇒ ఇతర నగరాల్లో అందుబాటులోకి రానున్న మాల్స్ గణాంకాలను పరిశీలిస్తే.. చెన్నైలో 2.5 మిలియన్ చ.అ., ముంబైలో 2.3 మిలియన్ చ.అ., బెంగళూరులో 2 మిలియన్ చ.అ., పుణెలో 0.4 మిలియన్ చ.అ., కోల్‌కతాలో 0.3 మిలియన్ చ.అ., అహ్మదాబాద్‌లో 0.2 మిలియన్ చ.అ., ఎన్సీఆర్లో 0.2 మిలియన్ చ.అ.ల్లో షాపింగ్ మాల్స్ రానున్నాయి. ⇒ మొత్తం మీద దేశంలో 2017 ముగింపు నాటికి 91 లక్షల చ.అ. విస్తీర్ణంలో మాల్స్ రానున్నాయని జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది. బెంగళూరులో వెగా సిటీ, జీటీ మాల్, పుణెలో ది పెవీలియన్, ఎన్సీఆర్–ఢిల్లీలో డీఎల్ఎఫ్ ఎంపోరియా, ముంబైలో గ్రాండ్ సెంట్రల్ సీవుడ్స్ మాల్స్ ఈ ఏడాది అందుబాటులోకి రానున్నాయి. ⇒ హైదరాబాద్‌లో ఎల్అండ్టీ సంస్థ మెట్రో రైలుతో పాటూ మెట్రో స్టేషన్లు, డిపోలు, సమీప ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్‌ను కూడా నిర్మిస్తోంది. 1.85 కోట్ల చ.అ. రిటైల్ స్థలంలో తొలి దశలో 60.5 లక్షల చ.అ. మేర నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో 10.1 లక్షల చ.అ. స్థలం 2017లో అందుబాటులోకి రానుంది. ఎర్రమంజిల్, పంజగుట్ట, హైటెక్ సిటీల్లో నిర్మిస్తున్న మాల్స్ 2017లో అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. -
రోడ్ల పక్కన వైన్ కేఫ్‌లు.. మాల్స్‌లో బార్లు!
-
రోడ్ల పక్కన వైన్ కేఫ్‌లు.. మాల్స్‌లో బార్లు!
రాష్ట్రంలో ఏపీ తరహా మద్యం పాలసీ? •నూతన ఎక్సైజ్ విధానంపై విస్తృత చర్చ •60 దుకాణాల నిర్వహణకు సర్కారు నిర్ణయం •పాలసీపై 3 రకాల ఆప్షన్లు సిద్ధం చేస్తున్న అధికారులు •జిల్లాలవారీగా డీసీలు, ఈఎస్‌లతో •ఎక్సైజ్ కమిషనర్ భేటీ •నేడు టీఎస్‌బీసీఎల్ అధికారులతో సమావేశం హైదరాబాద్: రోడ్ల పక్కన వైన్ కేఫ్‌లు... షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్‌లలో బార్లు, మద్యం షాపులు! అక్టోబర్ నుంచి రాష్ట్రంలో కనిపించనున్న దృశ్యాలివే!! మహారాష్ట్రను అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ‘అందరికీ అందుబాటులో మద్యం’ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌తోపాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి కార్పొరేషన్ల పరిధిలో వైన్ కేఫ్‌లు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లలో బార్లు, వైన్ షాపులు ఏర్పాటు చేసే దిశగా కొత్త మద్యం విధానానికి మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాల్లో జనాభా, స్థానిక ఆర్థిక వనరులు, సామాజిక స్థితిగతులను బేరీజు వేసుకొని వైన్‌షాపులు పెంచాలని, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలతోపాటు హైవేలపై బార్లకు అనుమతులు ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలో అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానాన్ని రూపకల్పనపై ఎక్సైజ్ యంత్రాంగం గురువారం నుంచి కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగా మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ఎక్సైజ్ అధికారులు అక్కడి విధానాలపై మేలోనే ఎక్సైజ్ కమిషనర్‌కు నివేదికలు అందజేశారు. మహారాష్ట్రలో అమలవుతున్న మద్యం విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే జూన్‌లో సీఎం సూచనల మేరకు సమగ్ర విధానం రూపకల్పన కోసం మూడు నెలలు గడువు కోరిన అధికారులు ప్రస్తుతం అదే పనిలోపడ్డారు. ఈ మేరకు గురువారం ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ జిల్లాల్లోని డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. ఆయా జిల్లాల్లో ప్రస్తుతమున్న మద్యం దుకాణాలు, కొత్త వాటికిగల అవకాశాలు, వైన్ కేఫ్‌లు, మాల్స్‌లో బార్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న వైన్స్, బార్ల వివరాలను పరిశీలించారు. ఆయా జిల్లాల్లోని పట్టణాలు, మండలాలవారీగా కొత్తగా వైన్స్ ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలపై సమగ్ర నివేదికలు అందజేయాలని ఆదేశించారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వైన్ కేఫ్‌లు, మాల్స్‌లలో బార్లు ఏర్పాటు చేయించే బాధ్యతలను అధికారులకు అప్పగించినట్లు సమాచారం. శుక్రవారం టీఎస్‌బీసీఎల్ అధికారులతో చంద్రవదన్ సమావేశం కానున్నారు. గ్రామీణ స్థాయికి మద్యం మహారాష్ట్రలో మూడు రకాల మద్యం లెసైన్సులు మంజూరు చేస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఐఎంఎఫ్ఎల్, ఐఎంఎల్ మద్యంతోపాటు బీర్లు, వైన్, కంట్రీ లిక్కర్ అమ్మకాలకు అనుమతి ఉంది. తాలూకా స్థాయిల్లో ఐఎంఎల్తోపాటు బీర్లు, వైన్, కంట్రీలిక్కర్ అందుబాటులో ఉంటుంది. మేజర్ గ్రామ పంచాయితీలు, ప్రధాన రోడ్ల పక్కన వైన్, బీర్లనే విక్రయిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలో కూడా కార్పొరేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి వైన్ కేఫ్‌లను ఏర్పాటు చేయాలని, ఇందులో వైన్, బీర్లనే విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం తమ ప్రతిపాదనల్లో పేర్కొంది. గ్రామాల్లో కంట్రీ లిక్కర్(చీప్ లిక్కర్)తోపాటు బీర్లు అందుబాటులో ఉండేలా పాలసీలో మార్పులు చేయాలని, రాష్ట్రంలోని అన్ని వైన్‌షాపులు, బార్లలో చీప్ లిక్కర్‌ను 90 ఎంఎల్,180 ఎంఎల్ సీసాల ద్వారా విక్రయించాలని సూచించింది. సర్కారీ షాపులు 60కిపైగానే.. కొన్ని జిల్లాల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో కుమ్ముక్కయిన మద్యం వ్యాపారులు కొన్ని చోట్ల వైన్‌షాపులు ఏర్పాటు చేయకుండా అడ్డుపడుతున్నారని కమిషనర్ చంద్రవదన్ భావిస్తున్నారు. ఇటీవల వైన్‌షాపుల లెసైన్స్‌లను మూడు నెలలు పొడిగించగా 60 షాపుల వాళ్లు లెసైన్సులను రెన్యూవల్ చేయించుకోలేదు. దానికితోడు గ్రేటర్ హైదరాబాద్, దాని సరిహద్దుకు 5 కి.మీ. పరిధిలోని పెరిఫెరల్ ఏరియాల్లో వైన్‌షాపుల లెసైన్స్ ఫీజు రూ. 90 లక్షలు ఉండగా 103 దుకాణాలను ఎవరూ తీసుకోలేదు. ఇది కూడా వైన్‌షాపుల యజమానులు, ఎక్సైజ్ స్థానిక అధికారుల కుమ్ముక్కు ఫలితమేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఎక్సైజ్ పాలసీలో కనీసం 60 దుకాణాలను బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు. -
క్యాంపస్‌లో మాల్స్, బ్యూటీ సెలూన్లు!
విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రైవేటు వర్సిటీల వినూత్న పంథా న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలలో చేరేందుకు ఏటా వేలాది మంది విద్యార్థులు ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో విద్యారంగంలో పోటీని తట్టుకునేందుకు దేశంలోని ప్రైవేటు యూనివర్సిటీలు వినూత్న పంథాను అనుసరిస్తున్నాయి. అత్యుత్తమ బోధన, 100 శాతం ప్లేస్మెంట్ హామీలతో ప్రకటనలు గుప్పిస్తూనే మరోవైపు యువత అభిరుచులకు తగ్గట్లు క్యాంపస్‌లను తీర్చిదిద్దుతున్నాయి. క్యాంపస్‌లలో షాపింగ్ మాల్స్, బ్యూటీ సెలూన్లు, స్విమ్మింగ్ పూల్స్, ఏటీఎంలు, ఫిట్నెస్ కేంద్రాలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. 600 ఎకరాల్లో ఏర్పాటైన జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ సుమారు 30 వేల మంది విద్యార్థులకు నివాస ప్రాంతాలను నిర్మించింది. ఓపెన్ ఎయిర్ థియేటర్, సూపర్ మార్కెట్లు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, 40 ఏటీఎంలు, ఆరు బ్యాంకుల బ్రాంచీలను ఏర్పాటు చేసింది. పుణేలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, నోయిడాలోని శారదావర్సిటీ, నోయిడా, జైపూర్, లక్నోలలో భారీ క్యాంపస్లుగల అమిటీ యూనివర్సిటీలు కేఫటేరియాలు, బ్యూటీ సెలూన్లను ఏర్పాటు చేశాయి. మహారాష్ట్రలోని ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, తమిళనాడులోని సత్యభామ వర్సిటీలలోనూ ఇవే తరహా సౌకర్యాలు ఉన్నాయి. నోయిడాలోని గల్గోటియా వర్సిటీలో డ్యాన్స్, మ్యూజిక్ స్టూడియో, బెంగళూరులోని జైన్ వర్సిటీలో కార్డియో ఫిట్నెస్ సెంటర్, స్టీమ్‌బాత్ సౌకర్యాలున్నాయి.