రోడ్ల పక్కన వైన్ కేఫ్‌లు.. మాల్స్‌లో బార్లు!
రాష్ట్రంలో ఏపీ తరహా మద్యం పాలసీ?
•నూతన ఎక్సైజ్ విధానంపై విస్తృత చర్చ
•60 దుకాణాల నిర్వహణకు సర్కారు నిర్ణయం
•పాలసీపై 3 రకాల ఆప్షన్లు సిద్ధం చేస్తున్న అధికారులు
•జిల్లాలవారీగా డీసీలు, ఈఎస్‌లతో
•ఎక్సైజ్ కమిషనర్ భేటీ
•నేడు టీఎస్‌బీసీఎల్ అధికారులతో సమావేశం
హైదరాబాద్: రోడ్ల పక్కన వైన్ కేఫ్‌లు... షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్‌లలో బార్లు, మద్యం షాపులు! అక్టోబర్ నుంచి రాష్ట్రంలో కనిపించనున్న దృశ్యాలివే!! మహారాష్ట్రను అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ‘అందరికీ అందుబాటులో మద్యం’ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌తోపాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి కార్పొరేషన్ల పరిధిలో వైన్ కేఫ్‌లు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లలో బార్లు, వైన్ షాపులు ఏర్పాటు చేసే దిశగా కొత్త మద్యం విధానానికి మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాల్లో జనాభా, స్థానిక ఆర్థిక వనరులు, సామాజిక స్థితిగతులను బేరీజు వేసుకొని వైన్‌షాపులు పెంచాలని, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలతోపాటు హైవేలపై బార్లకు అనుమతులు ఇవ్వాలని భావిస్తోంది.
రాష్ట్రంలో అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానాన్ని రూపకల్పనపై ఎక్సైజ్ యంత్రాంగం గురువారం నుంచి కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగా మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ఎక్సైజ్ అధికారులు అక్కడి విధానాలపై మేలోనే ఎక్సైజ్ కమిషనర్‌కు నివేదికలు అందజేశారు. మహారాష్ట్రలో అమలవుతున్న మద్యం విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు.
అయితే జూన్‌లో సీఎం సూచనల మేరకు సమగ్ర విధానం రూపకల్పన కోసం మూడు నెలలు గడువు కోరిన అధికారులు ప్రస్తుతం అదే పనిలోపడ్డారు. ఈ మేరకు గురువారం ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ జిల్లాల్లోని డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. ఆయా జిల్లాల్లో ప్రస్తుతమున్న మద్యం దుకాణాలు, కొత్త వాటికిగల అవకాశాలు, వైన్ కేఫ్‌లు, మాల్స్‌లో బార్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న వైన్స్, బార్ల వివరాలను పరిశీలించారు. ఆయా జిల్లాల్లోని పట్టణాలు, మండలాలవారీగా కొత్తగా వైన్స్ ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలపై సమగ్ర నివేదికలు అందజేయాలని ఆదేశించారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వైన్ కేఫ్‌లు, మాల్స్‌లలో బార్లు ఏర్పాటు చేయించే బాధ్యతలను అధికారులకు అప్పగించినట్లు సమాచారం. శుక్రవారం టీఎస్‌బీసీఎల్ అధికారులతో చంద్రవదన్ సమావేశం కానున్నారు.
గ్రామీణ స్థాయికి మద్యం
మహారాష్ట్రలో మూడు రకాల మద్యం లెసైన్సులు మంజూరు చేస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఐఎంఎఫ్‌ఎల్, ఐఎంఎల్ మద్యంతోపాటు బీర్లు, వైన్, కంట్రీ లిక్కర్ అమ్మకాలకు అనుమతి ఉంది. తాలూకా స్థాయిల్లో ఐఎంఎల్‌తోపాటు బీర్లు, వైన్, కంట్రీలిక్కర్ అందుబాటులో ఉంటుంది. మేజర్ గ్రామ పంచాయితీలు, ప్రధాన రోడ్ల పక్కన వైన్, బీర్లనే విక్రయిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలో కూడా కార్పొరేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి వైన్ కేఫ్‌లను ఏర్పాటు చేయాలని, ఇందులో వైన్, బీర్లనే విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం తమ ప్రతిపాదనల్లో పేర్కొంది. గ్రామాల్లో కంట్రీ లిక్కర్(చీప్ లిక్కర్)తోపాటు బీర్లు అందుబాటులో ఉండేలా పాలసీలో మార్పులు చేయాలని, రాష్ట్రంలోని అన్ని వైన్‌షాపులు, బార్లలో చీప్ లిక్కర్‌ను 90 ఎంఎల్,180 ఎంఎల్ సీసాల ద్వారా విక్రయించాలని సూచించింది.
సర్కారీ షాపులు 60కిపైగానే..
కొన్ని జిల్లాల్లో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలతో కుమ్ముక్కయిన మద్యం వ్యాపారులు కొన్ని చోట్ల వైన్‌షాపులు ఏర్పాటు చేయకుండా అడ్డుపడుతున్నారని కమిషనర్ చంద్రవదన్ భావిస్తున్నారు. ఇటీవల వైన్‌షాపుల లెసైన్స్‌లను మూడు నెలలు పొడిగించగా 60 షాపుల వాళ్లు లెసైన్సులను రెన్యూవల్ చేయించుకోలేదు. దానికితోడు గ్రేటర్ హైదరాబాద్, దాని సరిహద్దుకు 5 కి.మీ. పరిధిలోని పెరిఫెరల్ ఏరియాల్లో వైన్‌షాపుల లెసైన్స్ ఫీజు రూ. 90 లక్షలు ఉండగా 103 దుకాణాలను ఎవరూ తీసుకోలేదు. ఇది కూడా వైన్‌షాపుల యజమానులు, ఎక్సైజ్ స్థానిక అధికారుల కుమ్ముక్కు ఫలితమేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఎక్సైజ్ పాలసీలో కనీసం 60 దుకాణాలను బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు.