సినిమాహాల్స్, మాల్స్, ఎయిర్‌పోర్టులకు చెక్
సినిమాహాల్స్, మాల్స్, ఎయిర్‌పోర్టులకు చెక్
Published Fri, Jun 30 2017 10:52 AM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM
న్యూఢిల్లీ: ఒకే దేశం.. ఒకే పన్ను ఎలానో ఒకే ఉత్పత్తి.. ఒకే ఎంఆర్పీ ఉండాలని కూడా కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఒకే ఉత్పత్తిని వివిధ రకాల ప్రాంతాల్లో వివిధ ధరల్లో విక్రయించకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒకే ఉత్పత్తి, ఒకే ఎంఆర్పీ అనే విధానాన్ని తీసుకొస్తోంది. దీంతో ఎయిర్‌పోర్టులో, మాల్స్‌లో, సినిమా హాల్స్‌లో ఇన్నిరోజులు ఎంఆర్పీలో విపరీతంగా చెల్లించే ఛార్జీల నుంచి వినియోగదారులకు విముక్తి లభించనుంది. లీగల్ మెట్రోలాజీ(ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనలు 2011కు మార్పులు చేసిన ప్రభుత్వం 2018 జనవరి1 నుంచి అమల్లోకి తీసుకొస్తోంది. వీటిపై విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాత సమతుల్య విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని డిపార్ట్‌మెంట్ కన్జ్యూమర్ అఫైర్స్ పేర్కొంది. స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్ పరిగణనలోకి తీసుకుని, వినియోగదారుల రక్షణను లక్ష్యంగా ఈ రూల్స్‌ను సవరణలు తీసుకొచ్చామన్నారు. ఈ నిబంధనల కింద ఎలాంటి వ్యక్తి వివిధ రకాల ఎంఆర్పీలు ఛార్జ్ చేయడానికి వీలులేదని కన్జ్యూమర్స్ అఫైర్స్ డిపార్ట్ మెంట్ పేర్కొంది.
దీంతో సినిమా హాలు, ఎయిర్‌పోర్టులు, మాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కువ మొత్తంలో ఎంఆర్పీలు వేస్తున్నారనే ఫిర్యాదుల నుంచి విముక్తి కలిగి, వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుందని తెలిసింది. అయితే ఈ రూల్స్ తమకు చెందవని రెస్టారెంట్ యజమానులు చెబుతున్నారు. జీఎస్టీ కింద వీటిని తాము అప్లయ్ చేయమని, ఈ తాజా నోటిఫికేషన్ కేవలం కౌంటర్‌లో కొనుగోలు చేసే రిటైల్ సర్వీసులకు మాత్రమేనని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ రాహుల్ సింగ్ చెప్పారు. స్టెంట్స్, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్లు, సిరంజీలు, ఆపరేషన్స్ టూల్స్ వంటి మెడికల్ సర్వీసుల ఎంఆర్పీలను కూడా బహిర్గతం చేయాలని కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ ఆదేశించింది. కచ్చితంగా వీటి ధరలను వినియోగదారులు తెలుసుకోవాల్సి ఉంటుందని డీఓపీ సెక్రటరీ జై ప్రియె ప్రకాశ్ చెప్పారు. దిగుమతి చేసుకునే చాలా వస్తువులపై ఎంఆర్పీలను డిస్ ప్లే చేయరు.
Advertisement
Advertisement