
సాక్షి, హైదరాబాద్: నగర మెట్రో ప్రాజెక్టులో రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టు కింద పంజగుట్ట, హైటెక్ సిటీల్లో నిర్మించిన భారీ మెట్రో మాల్స్‌ను మార్చి 1వ తేదీన లాంఛనంగా ప్రారంభించేందుకు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పంజగుట్టలోని మెట్రో మాల్‌లో 13 తెరల పీవీఆర్ సినిమాస్, హైటెక్ సిటీ మెట్రో మాల్‌లో 4 తెరల పీవీఆర్ సినిమా హాళ్లు ఇటీవలే ప్రారంభమయ్యాయి. అలాగే ఇతర ఫుడ్ కోర్టులు, బ్రాండెడ్ దుస్తులు, షూస్, వైద్య సేవలందించే పలు రకాల సంస్థలు మాల్స్ ప్రారంభమైన తర్వాత కార్యకలాపాలు మొదలుపెడతాయని సంస్థ తెలిపింది.
ఈ మేరకు ఆయా సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ మాల్స్‌కు జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని తెలిపాయి. ప్రస్తుతం మాల్స్‌లోని పీవీఆర్ సినిమా హాళ్లకు ప్రేక్షకుల రద్దీ అధికంగా ఉందని పేర్కొన్నాయి. మరో 2 నెలల్లో ఎర్రమంజిల్, మూసారాంబాగ్‌ల్లోనూ మెట్రో మాల్స్‌ను ప్రారంభిస్తామని చెప్పాయి. మొత్తంగా 4 చోట్ల కలిపి 18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రో మాల్స్‌ను నిర్మించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment