Hi-Tech City
-
ఆఫీస్ సంస్కృతి మళ్లీ పెరగాలి
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ పరిణామాల నేపథ్యంలో కొనసాగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలికి ఆఫీస్ సంస్కృతిని పునరుద్ధరించుకోవాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఆఫీస్ వర్క్‌స్పేస్ విభాగంలో అంకుర సంస్థలకు ప్రోత్సాహమందించే ఐస్ప్రౌట్ బిజినెస్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం హైటెక్ సిటీలోని మై హోమ్ వేదికగా ప్రీమియం సెంటర్ ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ... ఇలాంటి వినూత్న వేదికల వల్ల మరిన్ని ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. విభిన్న రీతిలో పౌరాణిక సంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణం ఉద్యోగులకు మళ్లీ ఆఫీస్‌లో పనిచేయాలనే ఆతృతను పెంచుతుందన్నారు. మహాభారత సంప్రదాయ ఇతివృత్తంతో రూపొందించిన సాఫ్ట్వేర్ స్పేస్ ఆకట్టుకుందని, ఇలాంటి వేదికలు మరింత విస్తరించాలని జూపల్లి రామేశ్వర్ రావు పేర్కొన్నారు. ఐస్ప్రౌట్ బిజినెస్ సెంటర్ సీఈవో పాటిబండ్ల సుందరి మాట్లాడుతూ... వ్యాపార రంగంలో వినూత్న ఆలోచనలున్న వారిని మంచి ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చడానికి అవసరమైన అంతర్గత నిపుణుల బృందం తమవద్ద ఉందన్నారు. నగరంలోనే కాకుండా విజయవాడ, చెన్నై, పూణే, బెంగళూరు, నోయిడా, గుర్గావ్, కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబైలలో కూడా తమ వర్కింగ్ స్పేస్‌లను ప్రారంభించనున్నామన్నా రు. కార్యక్రమంలో సహ వ్యవస్థాపకులు శ్రీని, ప్రాజె క్ట్స్ వైస్ ప్రెసిడెంట్ శేషు, మణివణ్ణన్ పాల్గొన్నారు. -
సీఎంగా దిగిపోయేనాటికి హైటెక్ సిటీ మొదటిదశా పూర్తికాలేదు!
హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టింది నేనే.. హైటెక్‌సిటీ కట్టింది నేనే.. ఔటర్ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానశ్రయమూ నా ఘనతే.. సైబరాబాద్ కట్టింది నేనే.. అసలు తెలంగాణకు ఐటీ తీసుకొచ్చిందీ నేనే.. – ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చేసే వ్యాఖ్యలివి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా తనకు అవసరమైన ప్రతి సందర్భంలోనూ సైబరాబాద్ నిర్మాత తానే అంటారు. తనకు ఏమాత్రం సంబంధం లేని ఔటర్ రింగ్ రోడ్డు వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకూ క్రెడిట్ తీసుకుంటారు. తెలంగాణలో కంప్యూటర్ విజ్ఞానాన్ని పరిచేయం చేసింది తానేనని తడుముకోకుండా చెప్పుకుంటారు. బెంగళూరు సిలికాన్ సిటీని అభివృద్ది చేసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ దానికి తానే కారణమని ఏనాడూ చెప్పలేదు. ముంబై దీన్ని వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దడమే కాదు, అక్కడ చక్కెర రైతుల అభివృద్దికి తోడ్పడిన శరద్ పవార్ ఆ ఘనత తనదేనని ఎప్పుడూ గొప్పలు ప్రదర్శించలేదు. తమిళనాడు అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుని తమిళనాడును ముందుకు తీసుకెళ్లిన దివంగత నేత జయలలిత దానికి తానే కారణమని ఏనాడు పొంగిపోలేదు. సాక్షి, హైదరాబాద్: గడిచిన 25 సంవత్సరాల పరిణామక్రమంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ‘సాక్షి ప్రతినిధి’ ప్రయత్నం చేసినప్పుడు ‘ది బర్త్ అండ్ గ్రోత్ అఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ’ అనే గ్రంథం ఒకటి లభ్యమైంది. భారతదేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) అభివృద్దికి తోడయ్యేలా, దానికి కృషి చేసిన మహనీయులను గుర్తుచేసే ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అదలా ఉంచితే, అసలు సైబరాబాద్‌ను చంద్రబాబే నిర్మించారా? ఆయన పదే పదే చెబుతున్నట్టు అక్కడ ఉన్న కట్టడాలన్నీ ఆయన హయాంలో పూర్తయి సైబరాబాద్‌గా రూపాంతరం చెందిందా? ఈ అనుమానం కూడా రావడంతో వాస్తవాలు కనిపెట్టేందుకు ‘సాక్షి’ గూగల్ ఎర్త్‌ను శోధించిననప్పుడు అవన్నీ బూటకమని, బాబు హయాంలో సైబర్ టవర్ మినహా ఎలాంటి కట్టడం లేదని నిర్ధారణ అయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చర్యల కారణంగా 2010 నాటికి సైబరాబాద్ పూర్తి స్థాయిలో నిర్మితమైంది. 1987లోనే హైదరాబాద్‌లో ‘ఇంటర్‌గ్రాఫ్’ సంస్థ... హైదరాబాద్‌లో ఐటీ కంపెనీల ఏర్పాటు 1987లోనే ప్రారంభమైంది. పీవీ నరసింహారావు 1991లో ప్రధానమంత్రి అయ్యాక దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. 1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఐటీ పాలసీని తీసుకొచ్చి అమీర్‌పేటలోని మైత్రీవనంలో ఐటీ కంపెనీలకు స్థలం కేటాయించారు. మొదటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటైంది కూడా మైత్రీవనంలోనే. కంప్యూటర్లు అనగానే గుర్తుకువచ్చే కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ (సీఎంసీ) రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడే ఏర్పాటైంది. అంతకంటే ఐదేళ్ల ముందు 1987 ఆగస్టులో హైదరాబాద్‌లో ఇంటర్‌గ్రాఫ్ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కంపెనీ ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటి. అదే సంవత్సరం రామలింగరాజు తన సమీప బంధువులతో కలిసి సికింద్రాబాద్‌లో ‘సత్యం’ కంప్యూటర్స్‌ను ప్రారంభించారు. అది దినదినాభివృద్ది చెంది 1992లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. తర్వాత దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఆవిర్భవించింది. ఈ తరుణంలోనే హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు పలువురు ముందుకు రావడంతో 1993లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మాదాపూర్‌లో సైబర్ టవర్స్‌తోపాటు అక్కడ ఐటీ పరిశ్రమకు అవసరమైన మేరకు భూములు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకీ ఉత్తుత్తి గొప్పలు? కర్ణాటక రాజధాని బెంగళూరు ఐటీ రంగంలో వాయువేగంతో దూసుకుపోవడానికి తన వంతు సాయపడ్డ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ అందుకు తానే కారణమని ఏనాడు చెప్పలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి తమ వంతు ఐటీ వృద్దికి ఊతమిచ్చినా ఎవరూ చంద్రబాబు మాదిరి గొప్పలు చెప్పుకోలేదు. మరి చంద్రబాబు మాత్రమే పదేపదే ఈ దేశంలో తాను లేకపోతే ఐటీ లేదన్న రీతిలో ఎందుకు మాట్లాడుతున్నారు? వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేనాటికి ఐటీ రంగంలో హైదరాబాద్ దేశంలో 8వ స్థానంలో ఉంది. తెలుగు ప్రజలకు కంప్యూటర్ విజ్ఞానాన్ని తానే నేర్పానని కూడా బాబు పదేపదే చెబుతుంటారు. కానీ అది కూడా ఒట్టిదే అని తేలిపోయింది. దేశాభివృద్దికి సాఫ్ట్వేర్ ఊతమిస్తుందని భావించచడంతో పాటు నిరుద్యోగ నిర్మూలనకు తోడ్పడుతుందన్న భావనతో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మొదటి దశలోనే 1992లో హైదరాబాద్‌కు ఆరు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు మంజూరు చేశారు. కేంద్ర సమాచార పౌర సంబంధాల శాఖకు అనుబంధంగా ఏర్పడ్డ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రిత్వ శాఖ తొలుత అమీర్‌పేటలోనే ఎస్టీపీఐని ఏర్పాటు చేసింది. దేశంలోనే ఇది మొదటిసారి. ఇంత ముందుచూపుతో పీవీ వ్యవహరించినా ఆ తర్వాత మూడేళ్లకు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు దానిని పట్టించుకోలేదు. వారిది దూరదృష్టి.. చంద్రబాబుది ‘రియల్’ దృష్టి 1995లో తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి పొరుగున ఉన్న కర్ణాటక రాజధాని బెంగుళూరు ఐటీ రంగంలో దూసుకుపోతున్నా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. పైగా దూరదృష్టితో భవనాలు నిర్మించాలని, భూములు కేటాయించాలని అంతకుముందు ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి తీసుకున్న నిర్ణయాలను సమీక్షించిన చంద్రబాబు.. మొదట ఐటీ రంగాన్ని అభివృద్ది చేయాలనే విషయాన్ని పక్కనపెట్టి, ‘రియల్ ఎస్టేట్’ కోసం దానిని ఉపయోగించుకున్నారు. ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ స్టడీస్‌కు చెందిన రీసెర్చ్ స్కాలర్ దలేల్ బెన్బలాలీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె ఏడాది పొడవునా మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో పర్యటించి చంద్రబాబు తన కోసం, తన సొంత సామాజికవర్గానికి చెందినవారి కోసం భూములను ఏ విధంగా కొనిపించిందీ, ఆ తర్వాత సైబర్ టవర్స్ నిర్మాణానికి ఎలా పూనుకున్నదీ పూసగుచ్చినట్లు వివరించారు. సైబర్ టవర్స్ శంకుస్థాపనకు ముందే మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నల్లగండ్ల ప్రాంతాల్లో చంద్రబాబు భూములు కొనుగోలు చేయడంతోపాటు తన బినామీల ద్వారా కూడా భారీగా భూములు కొనుగోలు చేయించారు. అక్కడ ఐటీ పరిశ్రమ వస్తుందని తెలియని వందలాది మంది పేదలు తమ భూములను అత్తెసరు ధరకు అమ్ముకున్నారు. పేదల భూములు కాజేయడం ఒక ఎత్తయితే, దశాబ్దాల తరబడి ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారు. అదే క్రమంలో తన, తన బినామీల భూముల ధరలు పెరిగేందుకు వీలుగా సైబర్ టవర్స్ నిర్మాణం చేపట్టారు. టెండర్లు లేకుండా దానిని ఎల్అండ్టీకి కేటాయించి, భారీగా నజరానాలు కూడా పొందారు. సైబరాబాద్ నిర్మాత బాబు కానే కాదు.. బాబు ఆపధర్మ సీఎంగా మారిపోయే నాటికి సైబరాబాద్ ప్రాంతంలో ఒక్క సైబర్ టవర్స్ తప్ప మరో నిర్మాణం లేదు. అలాంటప్పుడు ఆయన సైబరాబాద్ నిర్మాత ఎలా అవుతారు? సైబరాబాద్ ప్రాంతం ఒక నగరంగా రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే. వాయువేగంతో ఆయన తీసుకున్న చర్యల కారణంగా హైటెక్ సిటీ నిర్మాణం 2008 నాటికి తుది దశకు చేరుకుని కంపెనీలు పని చేయడం మొదలుపెట్టాయి. చంద్రబాబు హయాంలో ఫైనాన్సియల్ జిల్లా ప్రతిపాదనేదీ లేదు. అలాంటప్పుడు తానే నిర్మించానని ఎందుకు చెబుతున్నారు? ఇంతకాలంహైదరాబాద్ను తానే కట్టానని చెప్పిన చంద్రబాబుకు అకస్మాత్తుగా తన దృష్టిని సైబరాబాద్ మీదకు ఎందుకు మళ్లించారు? దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన ఓ పంచ్ కారణం. చంద్రబాబు హైదరాబాద్ కడితే కులీఖుతుబ్షా ఏం కట్టారన్న ప్రశ్నకు చంద్రబాబు దిమ్మె తిరిగింది. ఆ వెంటనే సైబరాబాద్ తానే కట్టానన్న పల్లవి అందుకున్నారు. కానీ, చంద్రబాబు దిగిపోయే నాటికి హైటెక్ సిటీ మొదటి దశ కూడా ప్రారంభం కాలేదు. ఫైనాన్షియల్ జిల్లా ఊసే లేదు. దానికి మించి ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా లేదు. ఇవన్నీ వైఎస్సార్ హయాంలో ఊపిరి పోసుకున్నవే. 2003 నాటి గూగుల్ చిత్రాలు చూస్తే ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. వైఎస్సార్ హయాంలో ఊపిరి పోసుకున్న సైబరాబాద్.. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన ఆరేళ్లకు గానీ నగరంగా రూపాంతరం చెందలేదు. - మరి చంద్రబాబు మాత్రమే ఎందుకు పదేపదే అవాస్తవాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు? - తనకు సంబంధం లేని అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో తన ఘనతేనని ఎందుకు డప్పు వేసుకుంటున్నారు? - హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టానని,దానికి హైటెక్ సిటీయే నిదర్శనమని ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు? - సైబరాబాద్‌ను తానే సృష్టించానని చెప్పుకోవడం, ఆ ఘనతను సొంతం చేసుకోవడానికి ఎందుకంత తాపత్రయం చెందుతున్నారు? ఇది 2004 మే నెలలో నానక్‌రామ్‌గూడ ప్రాంతపు గూగుల్ ఫొటో. అప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఇంకా మొదలే కాలేదని తెలుస్తోంది. -
హైటెక్ సిటీని వాజ్‌పేయినే ప్రారంభించారు
-
హైటెక్ సిటీ ప్రారంభించింది ఆయనే!
సాక్షి, హైదరాబాద్ : దేశసేవ కోసమే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి.. భరతమాత ముద్దుబిడ్డ.. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం సాయంత్రం అనంత లోకాలకు వెళ్లిపోయారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయన విలువల కోసమే పోరాడిన యోధుడతను. వాజ్‌పేయికి అన్ని రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల నేతలు, ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగేవి. దేశ ప్రధానిగా వాజ్‌పేయికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో ప్రత్యేక అనుబంధం ఉండేది. ప్రధానిగా హోదాలో ఆయన నాలుగు సార్లు హైదరాబాద్ సందర్శించారు. నగరానికి ఐటీ హబ్‌గా ఉన్న హైటెక్ సిటీ(సైబర్ టవర్స్)ని 1998లో వాజ్‌పేయినే ప్రారంభించారు. ప్రతిష్ఠాత్మక ఈ సిటీ ప్రారంభోత్సవానికి వాజ్‌పేయి ముఖ్యఅతిథిగా రావడం ఎంతో గర్వకారణం. హైటెక్ సిటీనే మన హైదరాబాద్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఐటీ సౌకర్యం. హైటెక్ సిటీ మైక్రోసాఫ్ట్, జీఈ, ఒరాకిల్ వంటి అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు మెట్టునిల్లుగా ఉంటుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా(1980-86) కొనసాగిన సమయంలో వాజ్‌పేయి టాక్సీలో వచ్చి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. కర్ణాటకకు వెళుతూ ఆయన బేగంపేట విమానాశ్రయంలో ఆగారు. ఆ సమయంలో హెగ్డేవార్ శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకుని నేరుగా టాక్సీ తీసుకుని, ఆ ఉత్సవానికి వచ్చారు. ఎన్నికల సమయంలో, ఎమర్జెన్సీ కాలంలో, ప్రధాన మంత్రిగా నగరంలో జరిగిన పలు బహిరంగ సమావేశాలకు వాజ్‌పేయి హాజరయ్యారని బీజేపీ నేతలు గుర్తు చేసుకున్నారు. పేదలకు నివాస యోగ్యం కల్పించేందుకు ఏర్పాటుచేసిన పథకం వాంబే స్కీమ్(వాల్మికి అంబేద్కర్ ఆవాస్ యోజన)ను ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే లాంచ్ చేశారు. ఆ పథకాన్ని లాంచ్ చేసిన అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు కూడా ఆయనే శంకుస్థాపన చేశారు. అంతేకాక 2000 జూన్‌లో హైదరాబాద్‌లోని ప్రముఖ బసవతారక ఇండో-అమెరికన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్, రీసెర్చి సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరై వాజ్‌పేయి తన అభిమానాన్ని చాటుకున్నారు. 2004లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా వాజ్‌పేయి హాజరయ్యారు. అంతకుముందు 1984లో వాజ్‌పేయి రెండుసార్లు హైదరాబాద్ వచ్చారు. అదీ ఎన్టీఆర్‌కు మద్దతుగా. తన ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు నిరసనగా ఎన్టీఆర్ అప్పట్లో నిరసనకు దిగగా, వాజ్‌పేయి అండగా నిలిచారు. ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కాగా.. ప్రమాణస్వీకారానికి వాజ్‌పేయి హాజరయ్యారు. హైదరాబాద్‌తో పాటు, ఏపీలోని గుంటూరు నగరాన్ని కూడా వాజ్‌పేయి పలుసార్లు సందర్శించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన పలు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. వాజ్‌పేయి జన్ సంఘ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, గుంటూరుకు చెందిన అడ్వకేట్ జూపూడి యజ్ఞ నారాయణ జన్ సంఘ్‌కు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో నారాయణ కుటుంబ సభ్యులకు, వాజ్‌పేయి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఎప్పుడూ గుంటూరు వచ్చినా.. నారాయణ ఇంటికి వెళ్లేవారు. నారాయణ ఎంఎల్ఏగా పోటీచేసినప్పుడు, వాజ్‌పేయి ఆయన మద్దతుగా పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇలా పలువురు బీజేపీ నాయకులకు మద్దతుగా వాజ్‌పేయి ప్రచారాల్లో పాల్గొనేవారు కూడా. గుంటూరులో జిన్నా టవర్ నుంచి బీఆర్ స్టేడియంకు వెళ్లే వీరసవకార్ రోడ్డును వాజ్‌పేయినే ప్రారంభించారు. -
మార్చిలో మెట్రో మాల్స్ ప్రారంభం!
సాక్షి, హైదరాబాద్: నగర మెట్రో ప్రాజెక్టులో రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టు కింద పంజగుట్ట, హైటెక్ సిటీల్లో నిర్మించిన భారీ మెట్రో మాల్స్‌ను మార్చి 1వ తేదీన లాంఛనంగా ప్రారంభించేందుకు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పంజగుట్టలోని మెట్రో మాల్లో 13 తెరల పీవీఆర్ సినిమాస్, హైటెక్ సిటీ మెట్రో మాల్లో 4 తెరల పీవీఆర్ సినిమా హాళ్లు ఇటీవలే ప్రారంభమయ్యాయి. అలాగే ఇతర ఫుడ్ కోర్టులు, బ్రాండెడ్ దుస్తులు, షూస్, వైద్య సేవలందించే పలు రకాల సంస్థలు మాల్స్ ప్రారంభమైన తర్వాత కార్యకలాపాలు మొదలుపెడతాయని సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆయా సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ మాల్స్‌కు జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని తెలిపాయి. ప్రస్తుతం మాల్స్‌లోని పీవీఆర్ సినిమా హాళ్లకు ప్రేక్షకుల రద్దీ అధికంగా ఉందని పేర్కొన్నాయి. మరో 2 నెలల్లో ఎర్రమంజిల్, మూసారాంబాగ్ల్లోనూ మెట్రో మాల్స్‌ను ప్రారంభిస్తామని చెప్పాయి. మొత్తంగా 4 చోట్ల కలిపి 18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎల్అండ్టీ సంస్థ మెట్రో మాల్స్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. -
‘ఆటో’ రాంగ్‌రూట్
- యువతిని దారి మళ్లించిన ఆటో డ్రైవర్.. అసభ్య ప్రవర్తనకు యత్నం - తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు - సీసీ పుటేజీ పరిశీలన.. నిందితుడి కోసం గాలింపు హత్నూర: ఆటో ఎక్కిన ఓ యువతిని డ్రైవర్ దారి మళ్లించాడు. ఆమెపై అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించగా తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో శనివారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన బీటెక్ చదివిన ఓ యువతి మార్చి 13న హైదరాబాద్‌కు వచ్చింది. కూకట్పల్లి పీజీ గ్రీన్‌హోంలోని ట్రైనింగ్ సెంటర్లో చేరింది. హైటెక్ సిటీ సమీపంలోని కొండా పూర్లో స్నేహితుల వద్ద ఉంటోంది. సంగా రెడ్డి జిల్లా కందిలోని ఐఐటీలో తన స్నేహితుల వద్దకు వెళ్లేందుకు శనివారం హైటెక్ సిటీ కొండాపూర్ నుంచి క్యాబ్‌లో పటాన్‌చెరుకు వచ్చింది. అక్కడి నుంచి బస్సులో బయలుదేరి కంది బస్టాప్‌లో దిగింది. ఐఐటీ హాస్టల్‌కు వెళ్లేందుకు అక్కడే ఉన్న ఆటోలో కూర్చుంది. కంది బస్టాప్ నుంచి రెండు నిమిషాల వ్యవధిలో ఐఐటీ హాస్టల్‌కు చేరుకునే అవకాశం ఉన్నా డ్రైవర్ దారి మళ్లించాడు. అనుమానం వచ్చి తన సెల్‌ఫోన్ నుంచి రూట్ సెర్చ్ చేయగా రాంగ్రూట్లో వెళ్తున్నట్టు గుర్తించింది. ఇదే విషయాన్ని తన స్నేహితురాలికి సెల్‌ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. రాంగ్రూట్లో వెళుతున్నారని, వెంటనే ఆటోను వెనక్కి మళ్లించాలని సూచించింది. ఈ విషయం డ్రైవర్‌కు చెప్పగా ఐఐటీకేనంటూ నమ్మించి మరో 10 కిలోమీటర్లు ముందుకు తీసుకెళ్లాడు. భయంతో కేకలు వేయగా బెదిరించి చేతిలో నుంచి మొబైల్ లాక్కున్నాడు. అప్రమత్తమైన ఆమె ఆటోలో నుంచి కిందకు దూకి ఓ కారును ఆపింది. తన పరిస్థితిని వివరించి అదే కారులో హత్నూర పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ఫుటేజీ పరిశీలించిన పోలీసులు.. విషయం తెలుసుకున్న జిన్నారం సీఐ వెంకటేశం, హత్నూర ఎస్ఐ రాజేశ్ నాయక్ పెట్రోలు పోయించుకున్న మల్కాపూర్ శివారులోని బంక్ వద్దకు వెళ్లి ఆరా తీశారు. పెట్రోలు పోసుకున్న సమయాన్ని తెలుసుకొని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అందులో డ్రైవర్ ముఖం స్పష్టంగా కన్పించగా ఆటో నంబరు కనిపించలేదు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఫ్లై-ఓవర్‌పై లవ్ ఎటాక్
హైటెక్ సిటీకి కూత వేటు దూరంలో ఉండే ఫ్లై- ఓవర్ అది. ఎప్పుడూ తీరిక లేకుండా ఉండే ఆ ఫ్లై-ఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసలే ట్రాఫిక్... ఒక్క పక్క ఎండ...మరో పక్క హారన్ల మోత.. ఇంత చిరాకులో ఈ సినిమాలో హీరోకి లవ్ ఎటాక్ అయి... హార్ట్ బీట్ కూడా జామ్ అయింది. అంతే ‘ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ ... ఈ అమ్మాయి తప్ప.. అనుకుంటూ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఫ్లై-ఓవర్ మీద మొదలైన ఈ ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగిందో తెలియాలంటే ‘ఒక్క అమ్మాయి తప్ప’ చూడాలంటున్నారు రాజసింహ. సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది. ‘‘సందీప్ కెరీర్లో మంచి సినిమాగా నిలిచిపోతుంది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేస్తాం’’ అని నిర్మాత అన్నారు. ‘‘సినిమాలో ఎక్కువ భాగం ఫ్లై ఓవర్ మీదే జరుగుతుంది. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆళ్ల రాంబాబు, సహ నిర్మాతలు: మాధవి వాసిపల్లి, బోగాది స్వేచ్రెడ్డి. -
దెబ్బకు ఠా.. దొంగల ము ఠా..
-
దెబ్బకు ఠా.. దొంగల ము ఠా..
నీరూస్ జంక్షన్ వద్ద కాల్పుల కలకలం మెట్రో కార్మికుడికి బుల్లెట్ గాయాలు భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసుల అదుపులో దుండగులు సిటీబ్యూరో: హైటెక్ సిటీ... మాదాపూర్... జూబ్లీహిల్స్... ఈ ప్రాంతాలు ప్రముఖ దుకాణాలు, కార్యాలయాలకు నెలవు. ఈ మార్గం వీఐపీలు... సాఫ్ట్వేర్ ఉద్యోగుల రాకపోకలతో ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంటుంది. ఈ ప్రాంతంలోనే ఉన్న జూబ్లీహిల్స్ నీరూస్ జంక్షన్ వద్ద గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. మెట్రో కార్మికుడి ఛాతీలోకి బుల్లెట్ దూసుకపోవడం... మిగతా కార్మికులు ఏకమై దొంగలను పట్టుకునేలోపు పోలీసులు అప్రమత్తమై వారిని అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. రెక్కీకి వచ్చి: చార్మినార్‌లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో భారీ దోపిడీ చేయాలన్నది మీర్జా మహమ్మద్ అబ్దుల్లా ముఠా ప్లాన్. ఈ లక్ష్యంతోనే వారు ఐదు రోజుల క్రితం నగరానికి వచ్చారు. గుల్బర్గాకు వలస వెళ్లిన మీర్జా మహమ్మద్ అబ్దుల్లాకు టోలిచౌకిలో ఇల్లు ఉంది. అక్కడే వీరు ఉంటున్నారు. తొలి మూడు రోజులు నగల దుకాణం వద్దనే రెక్కీ నిర్వహించినట్టు పోలీసులకు సమచారమందింది.ఈ మేరకు వారిపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా వేశారు. మాదాపూర్ బిగ్‌సీ మొబైల్ షాప్ వద్ద గురువారం రెక్కీ నిర్వహించేందుకు మీర్జా మహమ్మద్, అబ్దుల్ ఖదీర్ వస్తున్నారని... గుల ్బర్గాలో ఉంటున్న లంగర్‌హౌస్ వాసి మహమ్మద్ సమీయుద్దీన్‌ను నీరూస్ షాప్ వెనకాల ఉన్న ప్రాంతంలో కలుసుకుంటారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. 12.45: బిగ్‌సీ నుంచి బయలుదేరి నీరూస్ షాప్ సమీపంలో మహమ్మద్ సమీయుద్దీన్‌ను కలిసేందుకు బయలుదేరారు. అప్పటికే మఫ్టీలో ఉన్న పోలీసులు బైక్‌పై వెళుతున్న వీరిని వెంబడించారు. 12.55: మాదాపూర్ పోలీసు స్టేషన్ వద్ద తృటిలో తప్పించుకున్నారు. 12.57: నీరూస్ జంక్షన్ వద్ద సిగ్నల్ పడినా ముందుకెళ్లారు. అప్పటికే అక్కడే ఎదురుగా మాటువేసిన పోలీసులు వాహనాన్ని ఆపడంతో కిందపడ్డారు. మూడు నిమిషాల పాటు వీరి మధ్య భారీ ఘర్షణ జరిగింది. మీర్జా మహమ్మద్ అబ్దుల్లా పోలీసులతో చేసిన పెనుగులాటలో అతడి ఎడమ కాలి షూ ఎగిరి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10 మార్గం వైపు పడింది. 1.00: మీర్జా మహమ్మద్ అబ్దుల్లా నాటు తుపాకీ తీసి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. తొలి బుల్లెట్ డీసీఎం వ్యాన్‌లో ఉన్న మెట్రో కార్మికుడికి తగి లింది. రెండోది గాల్లోకి వెళ్లింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. 1.03: వెంటనే తేరుకున్న పోలీసులు మెట్రో కార్మికుల సహకారంతో మీర్జా మహమ్మద్, అబ్దుల్ ఖదీర్‌లను పట్టుకున్నారు. 1.05: సమీపంలోనే మహమ్మద్ సమీయుద్దీన్‌ను చాకచాక్యంగా పట్టుకున్నారు. ఏం చేశారంటే... మధ్యాహ్నం 12 నుంచి 12.45 గంటల వరకు బిగ్‌సీ మొబైల్ షాప్ వద్ద నిందితులు రెక్కీ నిర్వహించారు. రోడ్డుపై ఉన్న ఓ కొట్టులో టీ తాగారు. మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ అనుమానాస్పదంగా కనిపించారు. ఓ వ్యక్తి రోజూ అక్కడికి వచ్చి... కలెక్షన్ డబ్బులను తీసుకుని జూబ్లీహిల్స్‌లోని ప్రధాన బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్నారు. శుక్రవారం వద్దామనుకుని నిర్ణయించుకున్నారు. -
సీఎం గారూ.. అమృతం వద్దు..మంచినీళ్లు ఇవ్వండి
‘‘హైటెక్ సిటీ నిర్మించాను.. ఒక్కమాటలో చెప్పాలంటే హైదరాబాద్‌ను, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపటంలో నేనే పెట్టాను !’’ .. పదేపదే చంద్రబాబువల్లెవేసే మాటలు ఇవి. సాక్షి, చిత్తూరు: ‘ఇంటిబాగు పట్టనమ్మకు.. ఊరిబాగు కావాలంట!’ అన్న చందంగా ఉంది చంద్రబాబు తీరు! పాతికేళ్ల పైబడి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు.. జిల్లా ప్రజల ఆశీస్సులతో మరోసారి సీఎం పీఠమెక్కారు. రాష్ట్రచరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కానీ విధంగా 9ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కానీ ఏం లాభం సొంత జిల్లాను పట్టిపీడిస్తున్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించలేకపోయారు. ప్రతి ఎన్నికల్లోనూ ‘మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.. ఇది యథార్థం!’ అని మాటలతోనే ఊరించి తీరా గద్దెనెక్కాక ఉసూరుమనిపిస్తున్నారు. గొంతెమ్మకోరికలు కాకుండా మంచినీటి సమస్యను మాత్రం తీర్చండి చాలు అని ప్రతి ఎన్నికల్లో మొరపెట్టుకునే జిల్లావాసులు, ఆ ఒక్క సమస్య నుంచి మూడు దశాబ్దాలుగా బయటపడలేకపోతున్నారు. కాదు.. కాదు.. పాలకులు ఆదిశగా చర్యలకు ఉపక్రమించడంలేదు. ప్రజల్ని మోసం చేసింది పాలకులే! చిత్తూరు జిల్లాను మూడు దశాబ్దాలుగా మంచినీటి సమస్య పట్టిపీడిస్తోంది. చిత్తూరు కార్పొరేషన్, మదనపల్లె, నగరి మునిసిపాలిటీలతోపాటు 1202 గ్రామాల ప్రజలను మంచి నీటి సమస్య వేధిస్తోంది. ఇందులో 1043 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మరో 159 గ్రామాల ప్రజలు వ్యవసాయబోర్లను ఆశ్రయిస్తున్నారు. అలాగే చిత్తూరు మునిసిపాలిటీలో 120 ట్యాంకర్ల ద్వారా రోజూ మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మదనపల్లెలో 29ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటితో పాటుతిరుపతి మినహా దాదాపు ప్రతీ మునిసిపాలిటీలోనూ మంచినీటి సమస్య వేధిస్తోంది. ప్రైవేటుగా వందల ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తున్నాయి. బిందెనీటిని 2-3 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో మంచినీటి సరఫరా కోసం ఏటా ప్రభుత్వం 21.45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు ప్రతి నెలా లక్షల రూపాయలు అర్జిస్తున్నారు. మదనపల్లెలో ప్రతినెలా 2.13 కోట్ల మంచినీటి వ్యాపారం జరుగుతుందంటే సమస్య తీవ్రత ఇట్టే తెలుస్తోంది. అలాగే చిత్తూరు కార్పొరేషన్లో ఇప్పటికీ మెజార్టీ వీధుల్లో మంచినీటి ప్రజలకు మంచినీటి కొళాయి ద్వారా నీరు అందడం లేదు. కార్పొరేషన్ ట్యాంకర్లు వస్తే పట్టుకుంటున్నారు. లేదంటే ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. డబ్బులు వెచ్చించినా దక్కేది ఉప్పునీరే! ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గుర్తించినవి ఇవే.. పూతలపట్టు, తంబళ్లపల్లె, కుప్పం, చంద్రగిరి, సత్యవేడు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో తీవ్ర మంచినీటి సమస్య ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గుర్తించారు. ఇవి కాకుండా అన్ని మునిసిపాలిటీల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య గత 30 ఏళ్లుగా ఆయా ప్రాంతాలను పట్టిపీడిస్తోంది. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ‘అయ్యా! మా దప్పిక తీర్చండి చాలు.. మి మ్మల్ని మరేకోరిక అడగం’ అని ఓటర్లు ప్రజాప్రతినిధులకు రెండుచేతులెత్తి మొక్కుతూనే ఉన్నారు. సమస్య పరిష్కారస్తారని ఆశతో ఓట్లేసి అందలం ఎక్కిస్తున్నారు. ప్రజలంతా నాయకుల్ని నమ్మి గెలిపిస్తే.. వారు మాత్రం 3దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. 9 ఏళ్లలో ఏం చేశావు బాబు ? 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు చిత్తూరుతో పాటు జిల్లాలో మంచినీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారించలేదు. సొంతజిల్లా వాసుల దప్పిక తీర్చలేని ఈయన రాష్ట్రాన్నే ప్రపంచపటంలో పెట్టానని ప్రగల్భాలు చెబుతుంటారు. కానీ జిల్లా ప్రజలకు చేసేందేమీ లేదు. ఓట్ల పేరుతో మోసం చేయడం తప్ప! ఈయన వెంట ఉన్న నాయకులు కూడా మంచినీటి సమస్యను ఆదాయవనరుగా మార్చుకుని ట్యాంకర్ల సరఫరా పేరుతో నిధులు మింగుతున్నారే గానీ, సమస్య పరిష్కారానికి పాటుపడటం లేదు. ఈయనతో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా మూడేళ్లపైబడి సీఎంగా పాలన సాగించారు. ఈయన కూడా గద్దెదిగే ముందు 7,430 కోట్ల రూపాయలతో కండలేరు మంచినీటి పథకాన్ని సిద్ధం చేశారు. 5,900 కోట్లతో టెండర్లు పిలిచారు. 150 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. కిరణ్ సీఎంగా తొలినాళ్లలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే నీళ్లు వచ్చేవే! కానీ చివర్లో ప్రకటించి ఆ పథకాన్ని నీటిపాలు చేశారు. ఈయన హాయంలోనే మంచినీళ్లు ప్రజల గుప్పిటకు చేరలేదు. కనీసం ఈదఫా అయిన చంద్రబాబు మంచినీళ్లు అందిస్తారేమోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి చంద్రబాబు జిల్లా ప్రజల దప్పిక తీరుస్తారా? లేదంటే ఎప్పటిలాగే తనదైన శైలిలో చేయిస్తారా? అనేది వేచి చూడాల్సిందే!! -
చేయి చేయి కలుపుదాం..చెత్తకు టాటా చెబుదాం..
ఖైరతాబాద్: చారిత్రక నేపథ్యమున్న భాగ్యనగరం ఎన్నో అందాలు నెలవు. హైటెక్ సిటీగా గుర్తింపు పొందిని గ్రేటర్లో రోజు రోజుకు పేరుకుపోతున్న చెత్తను అరికట్టి క్లీన్ అండ్ గ్రీన్‌గా చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇందుకోసం నగరంలో 36 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్లను గుర్తించి ఆయా రోడ్లలో ‘చెత్త రహిత సమాజం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంగళవారం జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ పరిధిలోని నెక్లెస్ రోడ్డు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెంట్రల్ జోన్ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (శానిటేషన్) రవికిరణ్, డీఎంసీ సోమరాజుతో పాటు నెక్లెస్ రోడ్డులో వ్యాపారాలు చేస్తున్నవారితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. చెత్తను ఎప్పటికప్పుడు వ్యాపారులు రోడ్లపై పడకుండా బ్యాగుల్లో వేసుకోవాలని, రోజూ మెక్లిన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సిబ్బంది, వాహనాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ఆ చెత్తను ఆయా వాహనాలలో వేయాలని సూచించారు. మెక్లిన్ సంస్థ ఎండీ ప్రేమానంద్ మాట్లాడుతూ రోజూ షిఫ్ట్‌ల వారీగా వాహనాలు తిరుగుతాయని తెలిపారు. సమావేశంలో సెంట్రల్ జోన్ ఏఎంహెచ్ఓలు డాక్టర్ దామోదర్, మనోహర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ముందస్తుగా ఈ ప్రాంతాల్లో అమలు.. మహా నగరానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చెత్త రహిత సమాజ నిర్మాణంలో భాగంగా తొలుత ఏడు ప్రధాన రోడ్లను గుర్తించి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. * బంజారాహిల్స్ రోడ్ నెంబర్. 2 నుంచి నాగార్జున సర్కిల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ వరకు * జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా పెద్దమ్మ ఆల యం, మాదాపూర్ పోలీస్ స్టేషన్ వరకు * జూబ్లీహిల్స్ రోడ్ నెం. 92 నుంచి కళింగ ఫంక్షన్ హాల్, సి.వి.ఆర్ న్యూస్ చానెల్ మీదుగా చెక్‌పోస్ట్ వరకు * బంజారాహిల్స్ రోడ్ నెం. 12 పెన్షన్ ఆఫీస్, ఇన్కమ్ టాక్స్ కార్యాలయం మీదుగా కళింగ ఫంక్షన్ హాల్ వరకు * బంజారాహిల్స్ రోడ్ నెం.1 నుంచి జీవీకే మాల్, జలగం వెంగళరావు పార్కు మీదుగా పెన్షన్ ఆఫీస్ వరకు * ఖైరతాబాద్ చౌరస్తా నుంచి సోమాజిగూడ, సీఎం క్యాంపు కార్యాలయం, బేగంపేట్ ఫ్లై ఓవర్ వరకు * బేగంపేట్ మీదుగా గ్రీన్‌ల్యాండ్, ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు, అసెంబ్లీ పరిసర ప్రాంతాల ప్రధాన రోడ్లలో అమలు చేస్తున్నారు. అతిక్రమిస్తే జరిమానా వచ్చే నెల 1న చెత్త రహిత సమాజ నిర్మాణంపై నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అదే రోజు నుంచి అమలులోకి వస్తుంది. ఆ తరువాత షాపులు, తోపుడు బండ్లు.. ఇలా వ్యాపారాలు చేసుకునేవారి షాపుల ముందు చెత్త కనిపిస్తే మొదటి తప్పిదం కింద రూ.500, రెండోసారి రూ.1000, మూడోసారి రూ.3000, నాలుగోసారి రూ.4000, ఐదోసారి రూ. 10 వేల జరిమానా విధిస్తామన్నారు. ఆ తరువాత కూడా అదే తప్పిదం చేస్తే మూడు నెలల జైలు శిక్ష తప్పదు. -
విధ్వంసకారుడు
చరిత్రను సమాధి చేసిన చంద్రబాబు మస్కతీ డెయిరీకి మల్వాల ప్యాలెస్.. భాగ్యనగరంలో నాలుగు వందల ఏళ్ల సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలు కూలిపోయాయి. ఆ దుష్కీర్తిని మూటగట్టుకున్న చంద్రబాబునాయుడు గురించి తాలిబాన్లకు తెలియదు. తెలిసుంటే అఖండ భారతావనిలో తమకూ ఓ ప్రతినిధి ఉన్నాడని మురిసిపోయేవారు. బాబు హయాం చారిత్రక మహా విధ్వంసానికి నిలువెత్తు సాక్ష్యం. పాఠ్యపుస్తకాల్లోనే కాదు... విశ్వవిద్యాలయాల్లో చరిత్ర శాఖ ను తొలగించాలని పట్టుబట్టిన ఘనత ఆయనది. పర్యావరణంపై ‘హైటెక్’ దాడి హైటెక్ సిటీ నిర్మాణానికి విలువైన రాతి సంపద విధ్వంసం జరిగింది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని అందమైన కొండలు, గుట్ట లు, రాతిశిలలను సమూలంగా తొలగించారు. నగర పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీసేలా వేల ఏళ్ల వయసున్న రాతి శిలలు, వృక్షాలను తొలగించడంపై పర్యావరణవేత్తలు అప్పట్లో తీవ్ర నిరసన తెలిపారు. మల్వాల ప్యాలెస్ నేలమట్టం చారిత్రక చార్మినార్ సమీపంలోని ఖాన్మైదాన్ ఖాన్ రోడ్డులో ఉన్న అద్భుతమైన కట్టడం మల్వాల ప్యాలెస్. ఆసఫ్‌జాహీల కాలంలో కట్టించిన ఈ రాజమందిరంలో నిజాం నవాబులకు ఆర్థిక సలహాదారులుగా వ్యవహరించిన ఉన్నతాధికారులు ఉండేవారు. ఆకట్టుకునే కళాత్మకమైన నిర్మాణశైలి, కర్రతో రూపొందించిన వరండా, కర్రతో చేసిన గేట్ ఈ భవనం ప్రత్యేకతలు. దీనిని ప్రభుత్వం గ్రేడ్-1 భవనంగా గుర్తించింది. అలాంటి చారిత్రక వారసత్వ కట్టడాన్ని బాబు నేలమట్టం చేసి మస్కతీ డెయిరీకి ధారాదత్తం చేశారు. ముష్క్ మహల్ కుతుబ్‌షాహీల శైలిలో కట్టించిన ఈ భవనం బహదూర్‌పుర సమీపంలో ఉంటుంది. అబుల్ హసన్ తానీషా కాలంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా, కమాండర్‌గా ఉన్న మియాన్ ముష్క్ ఈ భవనాన్ని కట్టించాడు. చుట్టూ ప్రహరీ, చక్కటి ఉద్యానవనాల నడుమ, ఓ కాలువతో పాటు ఎన్నో ఆరుబయలు ప్రదేశాలతో అందంగా కట్టించిన అతిపెద్ద ముష్క్‌మహల్ చంద్రబాబు కాలంలో నామరూపాల్లేకుండా పోయింది. ఆదిల్ అలాన్ మాన్షన్ (గద్వాల్ మాన్షన్) నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గద్వాల్ మహారాజులు కట్టించిన ఈ చారిత్రక కట్టడం అప్పటి నిర్మాణ శైలికి ప్రతిబింబం. విశాలమైన ఈ భవనం సైతం చంద్రబాబు హయాంలోనే నేలమట్టమైంది. రవిబార్ ఉర్దూగల్లీ రోడ్డును, ట్రూప్‌బజార్ రోడ్డును కలిపే ప్రదేశంలో రవిబార్ ఉండేది. ఈ భవనం నిజాం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అబ్దుల్ రహీం ఆధీనంలో ఉండేది. భవనం ముందు భాగంలో ఇండో యురోపియన్ నిర్మాణ శైలితో ఆకర్షణీయంగా ఉండేది. దీన్ని రవి బార్ యజమాని కొనుగోలు చేశారు. కొంతకాలం పాటు బార్ కొనసాగింది. ఆర్కిటెక్చర్ విలువల దృష్ట్యా దీనిని వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చారు. హెరిటేజ్ కమిటీకి ఎలాంటి సమాచారం లేకుండానే చంద్రబాబు ప్రభుత్వం దీనిని కూల్చేసింది. బేగంపేట్‌లోని కంట్రీక్లబ్‌లో ఒక భాగమైన చారిత్రక విలాయత్ మంజిల్ సైతం బాబు కాలంలో నేలమట్టమైంది. మరికొన్ని... 1. మూడో నిజాం కాలంలోని అశ్విక దళపతి, రాజ్‌పుత్ యోధుడు జాంసింగ్ పేరుతో కార్వాన్లో జాంసింగ్ ఆలయాన్ని నిర్మించారు. పదిహేను అడుగుల ఎత్తయిన రాతి ద్వారబంధం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అలాంటి ఈ ఆలయాన్ని కూల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వారసత్వ కట్టడాల పరిరక్షకులు అడ్డుకున్నారు. 2. సచివాలయంలోని జీ బ్లాక్‌ను కూడా కూలగొట్టేందు కు ప్రయత్నించారు. 3. బహీర్‌బాగ్‌లోని గాంధీ వైద్య కళాశాల కూల్చివేతకు వ్యతిరేకంగా పలు సంస్థలు పెద్ద ఎత్తున పోరాడాయి. 4. మలక్‌పేట్‌లోని మహబూబ్ మాన్షన్ బాబు హయాం లోనే పూర్తిగా శిథిలమైంది. -
‘నా వాహనం సురక్షితం’ క్యాబ్‌లోనే ప్రయాణించండి
సాక్షి, హైదరాబాద్: హైటెక్ సిటీలో తిరిగే ప్రతి క్యాబ్ కూడా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రత్యేక నంబర్‌ను పొందాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 1 నుంచి పోలీసు రిజిస్ట్రేషన్ మొదలవుతుందని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాబ్‌ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వివరాలను ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి వివరించారు. పోలీసులు జారీ చేసే నా వాహనం సురక్షితం అనే స్టిక్కర్ ఉన్న క్యాబ్‌లోనే మహిళా ఉద్యోగులు ప్రయాణించాలని ఆయన సూచించారు. పోలీసు రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా తిరిగే క్యాబ్‌లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ పులిందర్రెడ్డి, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ ఇలా... ఐటీ కారిడార్‌లోని ఉద్యోగులను తరలించే ప్రతి క్యాబ్ పోలీసు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం వాహనం, డ్రైవర్, యజమాని వివరాలు నింపేందుకు ప్రత్యేక ఫారాలను తయారు చేశారు. వాహనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కాగితాలు, ఫిట్నెస్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ కాగితాలు సమర్పించాలి. అలాగే డ్రైవర్ వివరాల కోసం అతని ఫోటో, చిరునామా తెలిపే రేషన్, ఓటర్, ఆధార్‌లో ఏదైనా ఒక కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాలి. ఇక వాహన యజమాని వివరాలకై చిరునామా తెలిపే ఏదేని ప్రభుత్వ కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫారాలు కూకట్పల్లి ట్రాఫిక్ ఠాణాలో లభిస్తాయి. మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది. ప్రతి ఏటా క్యాబ్‌లు పోలీసుల వద్ద రెన్యూవల్ చేయించుకోవాలి.రిజిస్ట్రేషన్ కోసం రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. క్యాబ్ వివరాలు క్షణాల్లో... క్యాబ్‌లకు పోలీసులు ప్రత్యేకంగా క్యూర్ నంబర్‌ను కేటాయిస్తారు. డ్రైవర్ ఫోటో, వివరాలతో కూడిన స్టిక్కర్‌ను వాహనం లోపల, బయటి వ్యక్తులకు కనిపించేలా అతికించాలి. స్టిక్కర్లో ఉన్న కోడ్ నంబర్‌ను మొబైల్ యాప్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ సెల్‌నంబర్ 8500411111కు ఎస్ఎంఎస్ చేస్తే క్షణాల్లో వాహనం, డ్రైవర్ పూర్తి వివరాలు అందుతాయి. ఇలా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ అయిన క్యాబ్‌ల వివరాలన్నీ త్వరలో ట్రాఫిక్ పోలీసు వెబ్సెట్లో పొందుపరుస్తారు. ఇలా చేయడంతో క్యాబ్ డ్రైవర్లు నేరాలకు దూరంగా ఉంటారని అధికారులు ఆశిస్తున్నారు.