‘నా వాహనం సురక్షితం’ క్యాబ్‌లోనే ప్రయాణించండి | special registration for cabs | Sakshi
Sakshi News home page

‘నా వాహనం సురక్షితం’ క్యాబ్‌లోనే ప్రయాణించండి

Published Wed, Feb 12 2014 12:10 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

special registration for cabs

సాక్షి, హైదరాబాద్: హైటెక్ సిటీలో తిరిగే ప్రతి క్యాబ్ కూడా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రత్యేక నంబర్‌ను పొందాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 1 నుంచి పోలీసు రిజిస్ట్రేషన్ మొదలవుతుందని అందులో పేర్కొన్నారు.

 ఈ సందర్భంగా కమిషనర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాబ్‌ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వివరాలను ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి వివరించారు. పోలీసులు జారీ చేసే నా వాహనం సురక్షితం అనే స్టిక్కర్ ఉన్న క్యాబ్‌లోనే మహిళా ఉద్యోగులు ప్రయాణించాలని ఆయన సూచించారు. పోలీసు రిజిస్ట్రేషన్ నంబర్  లేకుండా తిరిగే క్యాబ్‌లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ పులిందర్‌రెడ్డి, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు.

 రిజిస్ట్రేషన్ ఇలా...
 ఐటీ కారిడార్‌లోని ఉద్యోగులను తరలించే ప్రతి క్యాబ్ పోలీసు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం వాహనం, డ్రైవర్, యజమాని వివరాలు నింపేందుకు ప్రత్యేక ఫారాలను తయారు చేశారు. వాహనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కాగితాలు, ఫిట్‌నెస్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ కాగితాలు సమర్పించాలి. అలాగే డ్రైవర్ వివరాల కోసం అతని ఫోటో, చిరునామా తెలిపే రేషన్, ఓటర్, ఆధార్‌లో ఏదైనా ఒక కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాలి. ఇక వాహన యజమాని వివరాలకై చిరునామా తెలిపే ఏదేని ప్రభుత్వ కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫారాలు కూకట్‌పల్లి ట్రాఫిక్ ఠాణాలో లభిస్తాయి. మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది. ప్రతి ఏటా క్యాబ్‌లు పోలీసుల వద్ద రెన్యూవల్ చేయించుకోవాలి.రిజిస్ట్రేషన్ కోసం రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు.

 క్యాబ్ వివరాలు క్షణాల్లో...
 క్యాబ్‌లకు పోలీసులు ప్రత్యేకంగా క్యూర్ నంబర్‌ను కేటాయిస్తారు. డ్రైవర్ ఫోటో, వివరాలతో కూడిన స్టిక్కర్‌ను వాహనం లోపల, బయటి వ్యక్తులకు కనిపించేలా అతికించాలి. స్టిక్కర్‌లో ఉన్న కోడ్ నంబర్‌ను మొబైల్  యాప్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ సెల్‌నంబర్ 8500411111కు ఎస్‌ఎంఎస్ చేస్తే క్షణాల్లో వాహనం, డ్రైవర్ పూర్తి వివరాలు అందుతాయి. ఇలా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ అయిన క్యాబ్‌ల వివరాలన్నీ త్వరలో ట్రాఫిక్ పోలీసు వెబ్‌సెట్‌లో పొందుపరుస్తారు. ఇలా చేయడంతో క్యాబ్ డ్రైవర్లు నేరాలకు దూరంగా ఉంటారని అధికారులు ఆశిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement