Registration numbers
-
రాష్ట్ర కోడ్ మార్చేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఒకే నంబర్‌తో రెండు, మూడు వాహనాలుంటే ఎలా ఉంటుంది? ఏదైనా నేరాలు, అక్రమాలకు పాల్పడే ఉద్దేశంతో కొంత మంది ఇలా చేస్తుంటారు. కానీ కొందరు వాహనదారుల అత్యుత్సాహం, అవగాహన లేమితో ఇప్పుడు భవిష్యత్తులో ఒకే నంబర్ రెండు వాహనాలకు కనిపించే పరిస్థితి ఎదురుకాబోతోంది. దీంతో ఒక వాహనానికి సంబంధించిన వారు ఏదైనా నేరం చేస్తే దానివల్ల అదే నంబర్ ఉన్న రెండో వాహన యజమాని ఇబ్బంది పడే అవకాశం ఉందని అధికారులంటున్నారు. ఇదీ సంగతి..: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్టేట్ కోడ్ ఏపీ నుంచి టీఎస్‌కు మారింది. దాదాపు పదేళ్లపాటు అదే కొనసాగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మార్చింది. టీఎస్‌కు బదులు టీజీని అమల్లోకి తెచ్చింది. అయితే పాత వాహనాలకు టీఎస్ కోడ్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కానీ కొందరు వాహనదారుల అత్యుత్సాహంతో ఇది సమస్యగా మారనుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ వాహనాలకు టీజీ కోడ్ ఉండాలని బలంగా కోరుకున్న కొందరు... ఇప్పుడు టీజీ కోడ్ అమల్లోకి రావడాన్ని స్వాగతిస్తూ తమ పాత వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్ అక్షరాలను తొలగించి టీజీ అని పెట్టుకుంటున్నారు. సమస్య ఏమిటి? టీజీ కోడ్ కొత్తగా రావడంతో రవాణా శాఖ అధికారులు కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లను మళ్లీ ‘ఎ’ ఆల్ఫాబెట్ నుంచి కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ‘సి’ సిరీస్ కొనసాగుతోంది. రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో టీఎస్ కోడ్‌ను ప్రారంభించినప్పుడు ‘ఇ’ సిరీస్‌తో మొదలుపెట్టారు. ఇప్పుడు త్వరలోనే టీజీ కోడ్‌లో కూడా ‘ఇ’ సిరీస్ మొదలవుతుంది. దానికి 0001 నుంచి నంబరింగ్ మొదలవుతుంది. క్రమంగా గతంలో టీఎస్ కింద కేటాయించిన నంబరే ఇప్పుడు టీజీ సిరీస్‌లో కూడా అలాట్ అవుతుంది. స్టేట్ కోడ్ (టీఎస్, టీజీ) మాత్రమే తేడా ఉంటుంది. అయితే టీఎస్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనదారుడు సొంతంగా టీజీ ఏర్పాటు చేసుకుంటే... అధికారికంగా టీజీ కోడ్‌తో అదే నంబర్ ఉన్న వాహనంతో దాని నంబర్ క్లాష్ అవుతుంది. ఉదా: టీఎస్ ఎ 0001 నంబర్‌తో ఉన్న పాత వాహనదారుడు దాన్ని టీజీగా మారిస్తే.. ఇప్పుడు టీజీ ఏ 0001 అని ఏదైనా కొత్త వాహనానికి నంబర్ అలాట్ అయితే రెండు వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు ఒకటిగా మారి సమస్య ఏర్పడుతుందన్నమాట. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు, నేరాలు జరిగినప్పుడు ఇలా నంబర్లు క్లాష్ అయితే కేసు దర్యాప్తులో చిక్కులు ఏర్పడతాయి. దీంతోపాటు అధికారికంగా సరైన నంబర్ కలిగి ఉన్న వాహనదారుడు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అలా మార్చడం నేరం టీజీ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొందరు టీఎస్ కోడ్ వాహనదారులు వచ్చి తమ వాహనాలకు టీజీ కోడ్ అలాట్ చేయాలని కోరుతున్నారు. కానీ అది సాధ్యం కాదని... టీజీ సిరీస్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్న వాహనాలకు మాత్రమే టీజీ కోడ్ వర్తిస్తుందని చెప్తున్నాం. ఎవరైనా సొంతంగా నంబర్ ప్లేట్‌పై స్టేట్ కోడ్ మారిస్తే దాన్ని ట్యాంపరింగ్గానే భావించి నేరంగా పరిగణించాల్సి ఉంటుంది. అలాంటి వారిపై చర్యలు కూడా ఉంటాయి. వాహనదారులు ఇది తెలుసుకోవాలి. – రమేశ్, జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ -
ఒక్కసారిగా పెరిగిన నెంబర్ ప్లేట్స్ ధరలు.. ఎన్ని లక్షలంటే?
సాధారణ వెహికల్ నెంబర్ ప్లేట్స్ కంటే కూడా వీఐపీ నెంబర్ ప్లేట్స్ సొంతం చేసుకోవాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం వీఐపీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఫీజును భారీగా పెంచింది. ఎంచుకునే నెంబర్ సిరీస్‌లను బట్టి వీటి ధరలు రూ. 18 లక్షల వరకు ఉండవచ్చు. 2013 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వీఐపీ నంబర్ ప్లేట్ ధరను పెంచడం ఇదే తొలిసారి.మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్లలో ఒకటైన '0001' కోసం ఎదురు చూసే కస్టమర్లు మునుపటి కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫోర్ వీలర్ కోసం ఈ నెంబర్ కొనుగోలు చేయాలంటే రూ. 6 లక్షలు, టూ వీలర్ లేదా త్రీ వీలర్ కోసమయితే రూ. 1 లక్ష అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఇది కూడా నగరాన్ని బట్టి ఉంటాయి. ఈ జాబితాలో ముంబై, ముంబై సబర్బన్, పూణే, థానే, రాయగడ, ఔరంగాబాద్, నాసిక్, కొల్హాపూర్, నాసిక్ ఉన్నాయి.ధరల పెరుగుదలకు ముందు వీఐపీ నెంబర్ ప్లేట్ ధర రూ. 12 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు రూ. 6 లక్షలు పెరగడంతో ఇది రూ. 18 లక్షలకు చేరింది. ఈ నెంబర్ కొనుగోలు చేసిన తరువాత జీవిత భావస్వామికి, కొడుకు, కూతుళ్ళకు కూడా బదిలీ చేసే అవకాశం ఉంది.మహర్షత్రలో వీఐపీ నెంబర్ ప్లేట్లతో 240 వాహనాలు ఉన్నాయి. ఇందులో చాలావరకు '0009', '0099', '0999', '9999', '0786' మొదలైన సిరీస్ నెంబర్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చేలా ఈ వీఐపీ నెంబర్ ప్లేట్ ఫీజుల విధానంలో మార్పు చేయడం జరిగింది.వీఐపీ నెంబర్ ప్లేట్లకు ఎందుకు డిమాండ్నెంబర్ ప్లేట్ అనేది.. వాహన రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే. అయితే కొందరు సెంటిమెంట్ లేదా స్టేటస్ తెలియజేసుకోవడానికి వీఐపీ నెంబర్ ప్లేట్స్ కొనుగోలు చేస్తుంటారు. వీఐపీ నెంబర్ ప్లేట్స్ ధరలు మన దేశంతో పోలిస్తే.. దుబాయ్‌లో చాలా ఎక్కువ.ప్రపంచంలో ఖరీదైన నెంబర్ ప్లేట్ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ 'పీ7'. ఇది దుబాయ్ దేశానికీ చెందిన నెంబర్ ప్లేట్. దీని ధర 15 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 125 కోట్లు కంటే ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే నెంబర్ ప్లేట్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: 18 ఏళ్లకే పెళ్లి.. నేడు రూ.18566 కోట్ల కంపెనీకి బాస్: ఎవరీ దీపాలీ?మన దేశంలో కూడా కూడా వీఐపీ నెంబర్ ప్లేట్స్ కోసం లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ తన లంబోర్ఘిని కారు నెంబర్ కోసం రూ. 17 లక్షలు కాచు చేశారు. మలయాళీ స్టార్ నటుడు మమ్ముట్టి తన గ్యారేజిలోని అన్ని కార్లకు 369 అనే నెంబర్ ఎంచుకుంటారు. దీనికోసం కూడా అయన ఎక్కువ ఖర్చు చేస్తారు. -
ఫాన్సీ నెంబర్లపై ఇంత మోజా! 0001 ధరెంతో తెలుసా?
ఇండోర్: ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లపై ఉన్న క్రేజ్ మామూలుదికాదు. తమ ముచ్చటైన వాహనానికి లక్కీ నెంబర్ దక్కించుకునేందుకు వాహనదారులు ఎంత సొమ్మైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు. వీఐపీ నంబర్లంటే అంత మోజు! అందుకే వీటిని ఈ-వేలంలో అత్యధిక ధరకు సొంతం చేసుకుంటూ ఉంటారు. ఈ వ్యామోహమే రవాణా కార్యాలయాలకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. తాజాగా ఇండోర్ ఆర్టీఓ కార్యాలయం కూడా వీఐపీ నంబర్ల విక్రయం ద్వారా బంపర్ ఆదాయన్ని సాధించింది. ‘0001’ రిజిస్ట్రేషన్ నంబర్ 5 లక్షల 21 వేల అమ్ముడుబోయింది. అలాగే 0009 నంబర్ లక్షా 82 వేలకు విక్రయించింది. ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ప్రజలు తమ ఆసక్తి కనబర్చడం ఇదే మొదటిసారి కాదు. ఆ స్పెషల్ నంబర్లు గతంలో కూడా రికార్డు ధరకు అమ్ముడు బోయాయి. ఉదాహరణకు, 2017 లో "0001" నంబరు ఢిల్లీలో రూ .16 లక్షలకు వేలం వేయగా, ఈ సిరీస్ 2014 లో రూ .12. 50 లక్షలకు, 2015 ఏడాదిలో రూ.12.05 లక్షలకు విక్రయించబడింది. పుట్టినరోజు, ఇతర ముఖ్యమైన రోజులతోపాటు, ఇంకా వారి వారి జాతకం ఆధారంగా కొందరు కొన్ని లక్కీ నెంబర్లను ఎంచుకుంటారు. -
నంబర్ ప్లేట్లు ఒకేలా ఉండాలి
సాక్షి, సిటీబ్యూరో: వాహనాలకు అమర్చే రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లపై ఇష్టారీతిన ఫ్యాన్సీ లెటర్లు, ఇతర గుర్తులు వాడరాదని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్‌కుమార్ నంబర్ ప్లేట్ల తయారీదారులను హెచ్చరించారు. సెంట్రల్ మోటారు వెహికల్ నిబంధనలు–1989 ప్రకారం నంబర్ ప్లేట్లు రూపొందించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నాంపల్లిలోని ట్రాఫిక్ కాంప్లెక్స్‌లో వాహనాలకు రిజిస్ట్రేషన్ నం బర్ ప్లేట్లు తయారీదారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంబర్ ప్లేట్ తయారీదారులు తమ వద్దకు వచ్చే కస్టమర్ ఒరిజినల్ ఆర్సీ, యజ మాన్య వివరాలు తీసుకోవడంతో పాటు సెంట్రల్ మోటారు వెహికల్ నిబంధనలు–1989పై అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ఒక సర్క్యు లర్ జారీ చేశారు. సరైన నంబర్ ప్లేట్ లేని వాహనాలు వాడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ– 1 ఎల్ఎస్ చౌహాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్లేటు మారిస్తే మోతే..
సాక్షి, సిటీబ్యూరో: వివిధ ఆకారాలు, వాటిపై వివిధ డిజైన్లు, పదాలు, అక్షరాలు, అంకెలు... ఇటీవల కాలంలో నగరంలోని అనేక వాహనాలకు ఈ తరహా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు కనిపిస్తున్నాయి. దీనికి చెక్ చెప్పేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నగర అదనపు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు. నెంబర్ ప్లేట్లో ఉండే అక్షరాలు, అంకెల ఆకారం, పరిమాణం కచ్చితంగా మోటారు వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్)లో నిర్దేశించినట్లు మాత్రమే ఉండాలన్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో ఈ–చలాన్ తప్పించుకోవడం కోసం ట్రాఫిక్ కెమెరాల కళ్లు కప్పడానికి కొందరు వీటిని ఫ్యాన్సీగా ఏర్పాటు చేసుకోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో తప్పు నెంబర్లు ఏర్పాటు చేసుకుంటున్నారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. నేరాలు చేయడానికి వాహనాలు వాడే వారు సైతం సక్రమంగా లేని నంబర్ ప్లేట్లు వినియోగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనివల్ల ఉల్లంఘనులు తప్పించుకవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో భద్రతా పరమైన ఇబ్బందులూ తలెత్తుతాయన్నారు. ఈ అంశాలతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌పై పోలీసు, ప్రభుత్వ వాహనం, కార్పొరేటర్, ప్రెస్, ఆర్మీ, ఎమ్మెల్యే, ఎంపీ సహా ఎలాంటి అక్షరాలు, అంశాలు రాయడం కూడా నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 50, 51 ఉల్లంఘించడమే అని అనిల్‌కుమార్ వివరించారు. తప్పుడు నంబర్ ప్లేట్స్ కలిగి ఉండటం, వాటిలో అంకెలు, అక్షరాల్లో మార్పులు చేయడం వంటి చర్యలకు ఉద్దేశపూర్వకంగా పాల్పడినట్లు గుర్తిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ నంబర్ ప్లేట్ల కారణంగా ఈ–చలాన్ నుంచి తప్పించుకోవడంతో పాటు అసాంఘిక శక్తులు, అనుమానాస్పద వ్యక్తులు, ఉగ్రవాదుల కదలికలు సైతం కనిపెట్టడం కష్టంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి ఉల్లంఘనలు గమనించిన ప్రజలు సైతం స్పందించాలన్నారు. వాటిని ఫొటో తీసి ట్రాఫిక్ పోలీసు ఫేస్బుక్, ట్విటర్లతో పాటు హెల్ప్‌లైన్ నెంబర్ 9010203626కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఉల్లంఘనకు పాల్పడిన వాహనం నెంబర్ స్పష్టంగా కనిపించేలా ఫొటో ఉండటంతో పాటు తేదీ, సమయం, ప్రదేశం కచ్చితంగా పేర్కొనాలి. నంబర్ ప్లేట్ ఉల్లంఘనకు సంబంధించి గడిచిన రెండు నెలల్లోనే 20,260 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. నిబంధనలు ఇవీ... ♦ ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాలు, కార్లకు తెల్లరంగు ప్లేటుపై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. ♦ కమర్షియల్, గూడ్స్ వాహనాలకు పసుపురంగు ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. ♦ నంబర్ ప్లేట్‌పై పేర్లు, బొమ్మలు, సందేశాలు తదితరాలు నిషేధం. ♦ ఎవరైనా బోగస్ నంబర్ ప్లేట్లు కలిగి ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఆర్టీఏ అధికారుల సహాయంతో డ్రైవింగ్ లైసె న్స్ సైతం రద్దయ్యే చర్యలు తీసుకుంటారు. ♦ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ 200్ఠ100 మిల్లీ మీటర్లు, తేలికపాటి వాహనాలు, ప్యాసింజర్ కార్లకు 340్ఠ200 మిల్లీ మీటర్లు లేదా 500 ్ఠ120 మిల్లీ మీటర్లు, మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలకు 340్ఠ200 మిల్లీ మీటర్ల సైజుల్లో ఉండాలి. -
కొత్త జిల్లాలకు కొత్త రిజిస్ట్రేషన్ కోడ్లు!
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలు ఏర్పాటవుతుండటంతో వాటికి కొత్త రిజిస్ట్రేషన్ కోడ్లను కేటాయించేందుకు రవాణా శాఖ కసర త్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పది జిల్లాలకు కొత్త కోడ్లను కేటాయించిన విషయం తెలిసిందే. కొత్త వాహనాలకు ఆ కోడ్ల ఆధారంగానే రిజిస్ట్రేషన్ నంబర్లు కేటాయిస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నందున కొత్త కోడ్, నంబర్ల కేటాయింపు అనివార్యమైంది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం పది జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం 16వ నంబర్ వరకు వినియోగిస్తున్నారు. ఆదిలాబాద్‌కు టీఎస్ 1, కరీంనగర్‌కు 2, వరంగల్ 3, ఖమ్మం 4, నల్లగొండ 5, మహబూబ్‌నగర్ 6, రంగారెడ్డి 7, 8, హైదరాబాద్‌కు 9, 10, 11, 12, 13, 14, మెదక్‌కు 15, నిజామాబాద్‌కు 16గా వినియోగిస్తున్నారు. రాష్ట్ర విభజనకు పూర్వం జిల్లాల వారీగా వాటి అక్షరక్రమంలో నంబర్లు ఉండేవి. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక అక్షరక్రమానికి బదులు వరుస క్రమంలో కేటాయించారు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించాలని తాజాగా రవాణాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. కొత్త జిల్లాల ఏర్పాటు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఏ జిల్లాకు ఏ నంబర్ ఇస్తారనే విషయంలో స్పష్టత లేదు. వాస్తవానికి నాలుగైదు రోజుల క్రితమే రవాణాశాఖ కొత్త జిల్లాలకు నంబర్లను ప్రతిపాదించింది. జిల్లాల సంఖ్య పెరుగుతుండడంతో మరోసారి నంబర్లు కేటాయించాలని నిర్ణయించారు. పాత వాటి సంగతేమిటి? ఇప్పుడు కొత్త జిల్లాలతో కొత్త కోడ్లు అందుబాటులోకి వస్తే.. గత రెండేళ్లుగా కేటాయిస్తున్న నంబర్లతో ఉన్న వాహనాలను కొత్త కోడ్‌లలోకి మార్చాలా, వద్దా అన్న విషయంలో రవాణాశాఖ ప్రభుత్వాన్ని స్పష్టత కోరింది. -
‘నా వాహనం సురక్షితం’ క్యాబ్‌లోనే ప్రయాణించండి
సాక్షి, హైదరాబాద్: హైటెక్ సిటీలో తిరిగే ప్రతి క్యాబ్ కూడా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రత్యేక నంబర్‌ను పొందాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 1 నుంచి పోలీసు రిజిస్ట్రేషన్ మొదలవుతుందని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాబ్‌ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వివరాలను ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి వివరించారు. పోలీసులు జారీ చేసే నా వాహనం సురక్షితం అనే స్టిక్కర్ ఉన్న క్యాబ్‌లోనే మహిళా ఉద్యోగులు ప్రయాణించాలని ఆయన సూచించారు. పోలీసు రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా తిరిగే క్యాబ్‌లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ పులిందర్రెడ్డి, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ ఇలా... ఐటీ కారిడార్‌లోని ఉద్యోగులను తరలించే ప్రతి క్యాబ్ పోలీసు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం వాహనం, డ్రైవర్, యజమాని వివరాలు నింపేందుకు ప్రత్యేక ఫారాలను తయారు చేశారు. వాహనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కాగితాలు, ఫిట్నెస్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ కాగితాలు సమర్పించాలి. అలాగే డ్రైవర్ వివరాల కోసం అతని ఫోటో, చిరునామా తెలిపే రేషన్, ఓటర్, ఆధార్‌లో ఏదైనా ఒక కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాలి. ఇక వాహన యజమాని వివరాలకై చిరునామా తెలిపే ఏదేని ప్రభుత్వ కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫారాలు కూకట్పల్లి ట్రాఫిక్ ఠాణాలో లభిస్తాయి. మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది. ప్రతి ఏటా క్యాబ్‌లు పోలీసుల వద్ద రెన్యూవల్ చేయించుకోవాలి.రిజిస్ట్రేషన్ కోసం రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. క్యాబ్ వివరాలు క్షణాల్లో... క్యాబ్‌లకు పోలీసులు ప్రత్యేకంగా క్యూర్ నంబర్‌ను కేటాయిస్తారు. డ్రైవర్ ఫోటో, వివరాలతో కూడిన స్టిక్కర్‌ను వాహనం లోపల, బయటి వ్యక్తులకు కనిపించేలా అతికించాలి. స్టిక్కర్లో ఉన్న కోడ్ నంబర్‌ను మొబైల్ యాప్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ సెల్‌నంబర్ 8500411111కు ఎస్ఎంఎస్ చేస్తే క్షణాల్లో వాహనం, డ్రైవర్ పూర్తి వివరాలు అందుతాయి. ఇలా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ అయిన క్యాబ్‌ల వివరాలన్నీ త్వరలో ట్రాఫిక్ పోలీసు వెబ్సెట్లో పొందుపరుస్తారు. ఇలా చేయడంతో క్యాబ్ డ్రైవర్లు నేరాలకు దూరంగా ఉంటారని అధికారులు ఆశిస్తున్నారు.