సాక్షి, సిటీబ్యూరో: వివిధ ఆకారాలు, వాటిపై వివిధ డిజైన్లు, పదాలు, అక్షరాలు, అంకెలు... ఇటీవల కాలంలో నగరంలోని అనేక వాహనాలకు ఈ తరహా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు కనిపిస్తున్నాయి. దీనికి చెక్ చెప్పేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నగర అదనపు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు. నెంబర్ ప్లేట్‌లో ఉండే అక్షరాలు, అంకెల ఆకారం, పరిమాణం కచ్చితంగా మోటారు వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్)లో నిర్దేశించినట్లు మాత్రమే ఉండాలన్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో ఈ–చలాన్ తప్పించుకోవడం కోసం ట్రాఫిక్ కెమెరాల కళ్లు కప్పడానికి కొందరు వీటిని ఫ్యాన్సీగా ఏర్పాటు చేసుకోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో తప్పు నెంబర్లు ఏర్పాటు చేసుకుంటున్నారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. నేరాలు చేయడానికి వాహనాలు వాడే వారు సైతం సక్రమంగా లేని నంబర్ ప్లేట్లు వినియోగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనివల్ల ఉల్లంఘనులు తప్పించుకవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో భద్రతా పరమైన ఇబ్బందులూ తలెత్తుతాయన్నారు.
ఈ అంశాలతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌పై పోలీసు, ప్రభుత్వ వాహనం, కార్పొరేటర్, ప్రెస్, ఆర్మీ, ఎమ్మెల్యే, ఎంపీ సహా ఎలాంటి అక్షరాలు, అంశాలు రాయడం కూడా నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 50, 51 ఉల్లంఘించడమే అని అనిల్‌కుమార్ వివరించారు. తప్పుడు నంబర్ ప్లేట్స్ కలిగి ఉండటం, వాటిలో అంకెలు, అక్షరాల్లో మార్పులు చేయడం వంటి చర్యలకు ఉద్దేశపూర్వకంగా పాల్పడినట్లు గుర్తిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ నంబర్ ప్లేట్ల కారణంగా ఈ–చలాన్ నుంచి తప్పించుకోవడంతో పాటు అసాంఘిక శక్తులు, అనుమానాస్పద వ్యక్తులు, ఉగ్రవాదుల కదలికలు సైతం కనిపెట్టడం కష్టంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి ఉల్లంఘనలు గమనించిన ప్రజలు సైతం స్పందించాలన్నారు. వాటిని ఫొటో తీసి ట్రాఫిక్ పోలీసు ఫేస్‌బుక్, ట్విటర్‌లతో పాటు హెల్ప్‌లైన్ నెంబర్ 9010203626కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఉల్లంఘనకు పాల్పడిన వాహనం నెంబర్ స్పష్టంగా కనిపించేలా ఫొటో ఉండటంతో పాటు తేదీ, సమయం, ప్రదేశం కచ్చితంగా పేర్కొనాలి. నంబర్ ప్లేట్ ఉల్లంఘనకు సంబంధించి గడిచిన రెండు నెలల్లోనే 20,260 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
నిబంధనలు ఇవీ...
♦ ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాలు, కార్లకు తెల్లరంగు ప్లేటుపై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి.
♦ కమర్షియల్, గూడ్స్ వాహనాలకు పసుపురంగు ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి.
♦ నంబర్ ప్లేట్‌పై పేర్లు, బొమ్మలు, సందేశాలు తదితరాలు నిషేధం.
♦ ఎవరైనా బోగస్ నంబర్ ప్లేట్లు కలిగి ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఆర్టీఏ అధికారుల సహాయంతో డ్రైవింగ్ లైసె న్స్ సైతం రద్దయ్యే చర్యలు తీసుకుంటారు.
♦ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ 200్ఠ100 మిల్లీ మీటర్లు, తేలికపాటి వాహనాలు, ప్యాసింజర్ కార్లకు 340్ఠ200 మిల్లీ మీటర్లు లేదా 500 ్ఠ120 మిల్లీ మీటర్లు, మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలకు 340్ఠ200 మిల్లీ మీటర్ల సైజుల్లో ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment