కొత్త జిల్లాలకు కొత్త రిజిస్ట్రేషన్ కోడ్‌లు!
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలు ఏర్పాటవుతుండటంతో వాటికి కొత్త రిజిస్ట్రేషన్ కోడ్‌లను కేటాయించేందుకు రవాణా శాఖ కసర త్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పది జిల్లాలకు కొత్త కోడ్‌లను కేటాయించిన విషయం తెలిసిందే. కొత్త వాహనాలకు ఆ కోడ్‌ల ఆధారంగానే రిజిస్ట్రేషన్ నంబర్లు కేటాయిస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నందున కొత్త కోడ్, నంబర్ల కేటాయింపు అనివార్యమైంది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం పది జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం 16వ నంబర్ వరకు వినియోగిస్తున్నారు.
ఆదిలాబాద్‌కు టీఎస్ 1, కరీంనగర్‌కు 2, వరంగల్ 3, ఖమ్మం 4, నల్లగొండ 5, మహబూబ్‌నగర్ 6, రంగారెడ్డి 7, 8, హైదరాబాద్‌కు 9, 10, 11, 12, 13, 14, మెదక్‌కు 15, నిజామాబాద్‌కు 16గా వినియోగిస్తున్నారు. రాష్ట్ర విభజనకు పూర్వం జిల్లాల వారీగా వాటి అక్షరక్రమంలో నంబర్లు ఉండేవి. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక అక్షరక్రమానికి బదులు వరుస క్రమంలో కేటాయించారు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించాలని తాజాగా రవాణాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.
కొత్త జిల్లాల ఏర్పాటు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఏ జిల్లాకు ఏ నంబర్ ఇస్తారనే విషయంలో స్పష్టత లేదు. వాస్తవానికి నాలుగైదు రోజుల క్రితమే రవాణాశాఖ కొత్త జిల్లాలకు నంబర్లను ప్రతిపాదించింది. జిల్లాల సంఖ్య పెరుగుతుండడంతో మరోసారి నంబర్లు కేటాయించాలని నిర్ణయించారు.
పాత వాటి సంగతేమిటి?
ఇప్పుడు కొత్త జిల్లాలతో కొత్త కోడ్‌లు అందుబాటులోకి వస్తే.. గత రెండేళ్లుగా కేటాయిస్తున్న నంబర్లతో ఉన్న వాహనాలను కొత్త కోడ్‌లలోకి మార్చాలా, వద్దా అన్న విషయంలో రవాణాశాఖ ప్రభుత్వాన్ని స్పష్టత కోరింది.