అన్యాయంపై నిరసన గళం
సికింద్రాబాద్ జిల్లా సాధించి తీరుతామంటున్న ఉద్యమకారులు
న్యాయం కోసం నినదిస్తున్న లష్కర్ ప్రజలు
సికింద్రాబాద్ ప్రాంత ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి నిరసలుగా మారి మళ్లీ లష్కర్ ప్రత్యేక జిల్లా ఉద్యమం ఊపందుకుంది. లష్కర్ ప్రత్యేక జిల్లా సాధన సమితి పేరుతో ఆవిర్భవించిన ఉద్యమం క్రమేణా ఉధృతం అవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ ‘మీతో సాక్షి’ కార్యక్రమాన్ని నిర్వహించింది. సికింద్రాబాద్ క్లాక్‌టవర్, ఖైరతాబాద్ గణపతి వేదిక వద్ద ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ సందర్భంగా లష్కర్ జిల్లా సాధనకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సమితి ప్రతినిధులు, ఈ ప్రాంత ప్రజలు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో సికింద్రాబాద్ నగరానికి అన్యాయం జరిగిందనే వాదన ఈ ప్రాంత ప్రజల్లో బలంగా నెలకొంది. అప్పట్లో సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. కలెక్టరేట్ నిర్మాణం కోసం స్థల పరిశీలన కూడా చేశారు. అయితే హైదరాబాద్ జిల్లా ప్రాధాన్యం తగ్గుతుందన్న ఒకే ఒక్క కారణంతో సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం స్వస్తి పలికిందన్న ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రంలో రెండు, మూడు నియోజకవర్గాల పరిధితో కొత్త జిల్లాను ఏర్పాటు చేసి చరిత్రాత్మక సికింద్రాబాద్ నగరాన్ని జిల్లాగా ఏర్పాటు చేయకపోవడం పట్ల లష్కర్ ప్రజల్లో నిరసనలు మొదలయ్యాయి. ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్న సికింద్రాబాద్‌ను హైదరాబాద్‌లో విలీనం చేసి ఒకమారు, జిల్లా ఏర్పాటు చేయకుండా మరోమారు ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని అప్పట్లో వివిధ రంగాల ప్రతినిధులు నిరసనలు చేపట్టారు.
అమలుకు నోచుకోని విలీన షరతులు
సికింద్రాబాద్ నగరానికి 1960 నుంచి జరుగుతున్న వరుస అన్యాయాలు, వివక్షతో క్రమేణా ప్రాభవం తగ్గిందని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిలోనూ పూర్తిగా వెనుకబడిందని వారు పేర్కొంటున్నారు. ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్న సికింద్రాబాద్‌ను 1960లో హైదరాబాద్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు.
విలీనం నాటి నుంచి ఇప్పటి వరకు పన్నుల రూపంలో ఇక్కడి నుంచి గణనీయమైన ఆదాయం చేకూరుతున్నా అభివృద్ధి పనులకు మాత్రం ఆశించిన మేర నిధులు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కార్పొరేషన్‌ల విలీనం సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ల నియామకం, నిధుల కేటాయింపు తదితర అంశాలపై రూపొందించిర షరతులను విస్మరించారన్న వాదనలున్నాయి.
ప్రత్యేక ప్యాకేజీని మరిచారు...
బేగంపేట విమానాశ్రయం, గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా యూనివర్సిటీ, పలు రైల్వేస్టేషన్లతోపాటు ప్యారడైజ్, మోండా మార్కెట్, జనరల్‌బజార్, రాణిగంజ్ వంటి చారిత్రాత్మక వ్యాపార వాణిజ్య కేంద్రాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో రహదారులు, ట్రాఫిక్ సమస్యలు యధాతథంగా ఉండడం ఈ ప్రాంత ప్రజలను అసంతృప్తికి గురి చేస్తున్నాయి.
చదవండి: అద్దె అర లక్ష! హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న హౌస్ రెంట్
సికింద్రాబాద్ నగరం 200 సంవత్సరాలు నిండిన నేపథ్యంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్విశతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించి అభివృద్ధి కోసం రూ.200 కోట్ల ప్యాకేజీని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. ద్విశతాబ్ది వేడుకల సందర్భంగా అయినా ప్రత్యేక ప్యాకేజీతో ఈ ప్రాంతంలో ఓ మోస్తరు అభివృద్ధి జరుగుతుందని ఆశించిన ప్రజలకు భంగపాటే ఎదురైంది.
ప్రత్యేక జిల్లాకు అర్హతలు ఇవీ..
పరిధి: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం
అసెంబ్లీ నియోజకవర్గాలు (7): సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్‌నగర్.
మున్సిపల్ డివిజన్లు: 42
ప్రత్యేక జిల్లాతోనే న్యాయం
నగరాల అభివృద్ధిలో నా బాల్యం నుంచి సికింద్రాబాద్‌కు ప్రాధాన్యం దక్కలేదు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాల న్యాయం జరిగే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు రావడం ద్వారా ఈ ప్రాంతం సత్వర అభివృద్ధి సాధిస్తుంది. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది. దశాబ్దాల కాలంగా జరుగుతున్న అసమానతలను సవరించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.
– విజయ్‌కుమార్, సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్
ఉద్యమానికి అనూహ్య స్పందన
జిల్లా సాధన సమితి చేపట్టిన ఉద్యమానికి సికింద్రాబాద్ ప్రాంత ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది. ఏడాది కాలంగా సికింద్రాబాద్ ప్రాంతానికి జరిగిన అన్యాయాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశాం. ప్రజాప్రతినిధులకు సమస్యను వివరించాం. మున్ముందు ఆందోళనలు ఉధృతం చేస్తాం.
– సాదం బాల్‌రాజ్‌యాదవ్,ప్రధాన కార్యదర్శి జిల్లా సాధన సమితి
ప్రభుత్వంపై ఒత్తిడితో సాధిస్తాం
ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లాను సాధించుకుంటాం. ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర మంత్రులు, శాసనభ్యుల మద్దతును కూడగట్టాం. ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలను జాగృతం చేసి ఉద్యమాలను ఉధృతం చేస్తున్నాం. జిల్లా సాధన జరిగే వరకు నిరంతర ఆందోళనలు కొనసాగిస్తాం.
– గుర్రం పవన్‌కుమార్‌గౌడ్, అధ్యక్షుడు జిల్లా సాధన సమితి
Comments
Please login to add a commentAdd a comment