secunderabad contonment
-
కంటోన్మెంట్ ఎన్నికలు జరిగేనా? ఒకవైపు కోర్టులో కేసులు, మరోవైపు లాబీయింగ్
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు జరిగేనా? అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్ సహా దేశ వ్యాప్తంగా 57 కంటోన్మెంట్లలో ప్రజాప్రతినిధుల ఎన్నిక కోసం ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు గత నెల 17న కేంద్రం గెజిట్ విడుదల చేసింది. తదనుగుణంగా పూర్తి స్థాయి ఎన్నికల షెడ్యూల్ కూడా జారీ చేసిన బోర్డు అధికారులు, నూతన ఓటరు నమోదు ప్రక్రియ కూడా చేపట్టారు. రెండు మూడు రోజుల్లోనే తుది జాబితా ప్రకటనతో పాటు ఈ నెలాఖరులో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బోర్డు ఎన్నికలు వాయిదా పడినట్లు మంగళవారం వదంతి కంటోన్మెంట్ వ్యాప్తంగా వ్యాపించింది. బోర్డు ఎన్నికలు ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో సుమారు 25కు పైగా రిట్లు దాఖలు కావడంతో కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందా అంటూ పలువురు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఓసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక నిలిపివేసేందుకు ఆస్కారం లేదంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయడం లేదా, నోటిఫికేషన్‌ను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలుస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు కంటోన్మెంట్లకు చెందిన సివిలియన్ నామినేటెడ్ సభ్యుల లాబీయింగ్ బలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరి ప్రయత్నాలు ఫలిస్తే రక్షణ శాఖ ఎన్నికలపై వెనక్కి తగ్గే అవకాశమూ లేకపోలేదని రక్షణ శాఖ వర్గాల సమాచారం. నిబంధనలేం చెబుతున్నాయి? ● ది కంటోన్మెంట్ యాక్ట్ 2006, సెక్షన్ 15 ప్రకారం జారీ చేసిన ఎన్నికల నోటిషికేషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం లేదు. అయితే.. ది కంటోన్మెంట్ ఎలక్టోరల్ రూల్స్ 2007, సెక్షన్ 20లో పేర్కొన్న మేరకు.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికల తేదీని గరిష్టంగా 40 రోజుల పాటు వాయిదా వేసే అవకాశం ఉంది. ● జాతీయ విపత్తు సంభవించినప్పుడు, అహింస చెలరేగినప్పుడు, లోక్‌సభ, అసెంబ్లీ, సమీప మున్సిపాలిటీ ఎన్నికల తేదీ అడ్డంకిగా మారినప్పుడు మాత్రమే ఈ సెక్షన్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ● ది కంటోన్మెంట్స్ యాక్ట్ సెక్షన్ 2006, సెక్షన్ 15 ప్రకారం వెలువరించిన నోటిఫికేషన్లో మార్పులు, చేర్పులు, పూర్తిగా ఉపసంహరించుకునే వెసులుబాటు కేంద్రానికి ఉంది. ఈ వెసులుబాటుతోనే కంటోన్మెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఉపసంహరించుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ● ఎన్నికల నోటిఫికేషన్ పూర్తిగా ఉపసంహరించుకోని పక్షంలో కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను మినహాయించే అవకాశం కూడా ఉందని సమాచారం. -
కేంద్రం సూచనలతో.. కంటోన్మెంట్లో టోల్‌ట్యాక్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్లో టోల్ ట్యాక్స్ త్వరలోనే ముగియనుంది. కేంద్రం సూచనలతో టోల్ ట్యాక్స్ రద్దుకు కంటోన్మెంట్ బోర్డు తీర్మానం చేసింది. టోల్‌ట్యాక్స్ రద్దుతో కంటోన్మెంట్ బోర్డు రూ.10 కోట్ల వార్షిక బడ్జెట్‌ను కోల్పోనుంది. అదే సమయంలో కంటోన్మెంట్ గుండా ప్రయాణం సాగించే కమర్షియల్ వాహనదారులకు భారీ ఊరట లభించనుంది. అయితే టోల్‌ట్యాక్స్ రద్దుతో తాము కోల్పోయే ఆదాయాన్ని ప్రత్యామ్నాయ మార్గంలో భర్తీ చేయాల్సిందిగా బోర్డు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. పెండింగ్ సర్వీసు చార్జీల విడుదల, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లకు తోడుగా టోల్‌ట్యాక్స్ నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరనున్నారు. బోర్డు అధ్యక్షుడు, బ్రిగేడియర్ సోమశంకర్ ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో సీఈఓ అజిత్ రెడ్డి, సివిలియన్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ సీఈఓ విజయ్ కుమార్ బాలన్ నాయర్లు పాల్గొన్నారు. ఆదాయ మార్గాలపై ఆసక్తికర చర్చ.. ఇప్పటికే ఆర్థిక లేమితో సతమతం అవుతున్న బోర్డు టోల్ట్యాక్స్ను సైతం రద్దు చేస్తే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బోర్డు సభ్యుడు రామకృష్ణ ప్రతిపాదించారు. ఆరేళ్ల క్రితమే ఆక్ట్రాయ్‌ను రద్దు చేయగా, సంబంధిత పరిహారాన్ని జీఎస్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గతంలోనే టోల్ట్యాక్స్ను రద్దుచేయడంతో సంబంధిత రాష్ట్రాలే నష్టపరిహారాన్ని చెల్లించాయని గుర్తు చేశారు. ఈ మేరకు ఏయే రాష్ట్రాలు కంటోన్మెంట్లకు నష్టపరిహారాన్ని ఇస్తున్నాయో వెల్లడించాలని ఎమ్మెల్యే సాయన్న కోరగా, అధ్యక్షుడు స్పష్టమైన సమాచారం తమ వద్ద లేదన్నారు. ఆర్మీ సర్వీసు చార్జీలను సక్రమంగా చెల్లిస్తే బోర్డు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సాయన్న ప్రతిపాదించారు. నష్టపరిహారం చెల్లిస్తేనే టోల్‌ట్యాక్స్ రద్దు చేస్తామంటూ నెల రోజుల క్రితం బోర్డు తీర్మానం చేసి పంపినప్పటికీ, కేంద్రం మరోసారి సూచించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనని అధ్యక్షుడు సోమశంకర్ అభిప్రాయపడ్డారు. సీఈఓ అజిత్ రెడ్డి సైతం ఇదే అభిప్రాయంతో ఏకీభవించగా, సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కూడా ఆమోదం తెలిపారు. టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేతకు అంగీకారం తెలుపుతూనే నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరదాం అని తీర్మానించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వసూళ్లకు అక్టోబర్ 31 వరకు గడువు ఉండటంతో, అప్పటి వరకు వసూళ్లు యధావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. టెండర్‌కు ఆమోదం టోల్‌ట్యాక్స్ వసూళ్ల నిలిపివేతకు బోర్డు తీర్మానం తీసుకున్న సమావేశంలోనే మరుసటి ఏడాది టెండర్లకు సంబంధించి, గతంలోనే జారీ చేసిన సర్క్యులర్ ఎజెండాకు బోర్డు ఆమోదం తెలపడం గమనార్హం. బోర్డు తాజా నిర్ణయంతో ఆ టెండర్ల ప్రక్రియపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వెల్లడించలేదు. -
కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ పరిధిలో ఇష్టారీతిన రోడ్లు మూసేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన లేఖలో.. కరోనా పేరుతో రోడ్లు మూసేస్తున్నారని, ఈ క్రమంలో ప్రజలు కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ యాక్ట్ సెక్షన్ 258కి ఈ చర్యలు విరుద్ధమని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలివ్వాలని పేర్కొన్నారు. -
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మహిళా దినోత్సవ వేడుకలు
-
కంటోన్మెంట్ పరిసర ప్రాంత వాసులకు ఊరట!
కంటోన్మెంట్ మార్గాన్ని ఉపయోగించుకునే పరిసర ప్రాంత వాసులకు శుభవార్త. ఇన్నాళ్లుగా సైనికాధికారుల ఆదేశాలతో మూసేసిన కంటోన్మెంట్ మార్గాలను వెంటనే తెరవాలని రక్షణమంత్రి ఆదేశించినట్లు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో సఫిల్‌గూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గాన్ని కొన్నాళ్ల క్రితం మూసేశారని, దాంతో స్థానికులు అదనంగా పది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆయన తెలిపారు. గతంలోనే తాను ఈ సమస్యను కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ మార్గాలను వెంటనే తెరిచి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా రక్షణ మంత్రి ఆదేశాలు ఇచ్చారని మల్లారెడ్డి తెలిపారు.