కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు జరిగేనా? అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్ సహా దేశ వ్యాప్తంగా 57 కంటోన్మెంట్‌లలో ప్రజాప్రతినిధుల ఎన్నిక కోసం ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు గత నెల 17న కేంద్రం గెజిట్ విడుదల చేసింది. తదనుగుణంగా పూర్తి స్థాయి ఎన్నికల షెడ్యూల్ కూడా జారీ చేసిన బోర్డు అధికారులు, నూతన ఓటరు నమోదు ప్రక్రియ కూడా చేపట్టారు.
రెండు మూడు రోజుల్లోనే తుది జాబితా ప్రకటనతో పాటు ఈ నెలాఖరులో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బోర్డు ఎన్నికలు వాయిదా పడినట్లు మంగళవారం వదంతి కంటోన్మెంట్ వ్యాప్తంగా వ్యాపించింది. బోర్డు ఎన్నికలు ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో సుమారు 25కు పైగా రిట్‌లు దాఖలు కావడంతో కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందా అంటూ పలువురు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఓసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక నిలిపివేసేందుకు ఆస్కారం లేదంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి.
ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయడం లేదా, నోటిఫికేషన్‌ను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలుస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు కంటోన్మెంట్‌లకు చెందిన సివిలియన్ నామినేటెడ్ సభ్యుల లాబీయింగ్ బలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరి ప్రయత్నాలు ఫలిస్తే రక్షణ శాఖ ఎన్నికలపై వెనక్కి తగ్గే అవకాశమూ లేకపోలేదని రక్షణ శాఖ వర్గాల సమాచారం.
నిబంధనలేం చెబుతున్నాయి?
● ది కంటోన్మెంట్ యాక్ట్ 2006, సెక్షన్ 15 ప్రకారం జారీ చేసిన ఎన్నికల నోటిషికేషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం లేదు. అయితే.. ది కంటోన్మెంట్ ఎలక్టోరల్ రూల్స్ 2007, సెక్షన్ 20లో పేర్కొన్న మేరకు.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికల తేదీని గరిష్టంగా 40 రోజుల పాటు వాయిదా వేసే అవకాశం ఉంది.
● జాతీయ విపత్తు సంభవించినప్పుడు, అహింస చెలరేగినప్పుడు, లోక్‌సభ, అసెంబ్లీ, సమీప మున్సిపాలిటీ ఎన్నికల తేదీ అడ్డంకిగా మారినప్పుడు మాత్రమే ఈ సెక్షన్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
● ది కంటోన్మెంట్స్ యాక్ట్ సెక్షన్ 2006, సెక్షన్ 15 ప్రకారం వెలువరించిన నోటిఫికేషన్‌లో మార్పులు, చేర్పులు, పూర్తిగా ఉపసంహరించుకునే వెసులుబాటు కేంద్రానికి ఉంది. ఈ వెసులుబాటుతోనే కంటోన్మెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఉపసంహరించుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
● ఎన్నికల నోటిఫికేషన్ పూర్తిగా ఉపసంహరించుకోని పక్షంలో కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను మినహాయించే అవకాశం కూడా ఉందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment