నాంపల్లి చుట్టూ నరకమే!
ఈ పరిసర ప్రాంతాల్లోనే భారీగా ట్రాఫిక్ జాంలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలు అందరికీ విదితమే. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. రోజుకు 1,500 చొప్పున కొత్తగా వచ్చి చేరుతున్న వాహనాలు, గణనీయంగా పెరిగిపోయిన సెకండ్ హ్యాండ్ మార్కెట్, ఆక్రమణలకు గురవుతున్న రోడ్లు.. వెరసీ.. ‘జాం’జాటాలు తప్పట్లేదు. సిటీలోని ఇతర ప్రాంతాల కంటే నాంపల్లి చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లోనే ట్రాఫిక్ జాంలు ఎక్కువగా ఉన్నాయని టామ్ టామ్ సంస్థ తేల్చింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఈ టెక్నాలజీ సంస్థ 2024కు సంబంధించి స్లో మూవింగ్ ట్రాఫిక్ ఇండెక్స్ (14వ ఎడిషన్) పేరుతో ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 500 నగరాల్లో సర్వే చేయగా..ట్రాఫిక్ జాంలకు సంబంధించి హైదరాబాద్ ప్రపంచంలో 18వ స్థానం, జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది.
2023 కంటే 2024లో రెండు గంటలు అదనం
హైదరాబాద్‌లో రద్దీ వేళల్లో 10 కిమీ ప్రయాణించడానికి 32 నిమిషాల సమయం పడుతోంది. సగటున ఒక్కో హైదరాబాదీ ఏడాదికి 85 గంటల చొప్పున బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్‌లో ఉంటున్నాడు. పోలీసులు తీసుకుంటున్న చర్యలతో ఎప్పటికప్పుడు పరిస్థితి మెరుగుపడాల్సి ఉంది. అయితే నగరవాసి మాత్రం 2023లో కంటే 2024 లో రెండు గంటల ఎక్కువ సేపు ట్రాఫిక్ జామ్‌లో గడిపాడని టామ్ టామ్ నిర్ధారించింది. హైటెక్ సిటీ, సాఫ్ట్‌వేర్ హబ్‌లు ఉన్న వెస్ట్రన్ హైదరాబాద్ కంటే సికింద్రాబాద్, పంజగుట్ట, లక్డీకాపూల్, అమీర్‌పేట, ఖైరతాబాద్‌ల్లోనే ఎక్కువ ట్రాఫి క్ జామ్స్ ఉన్నట్లు తేల్చింది. వీటితో పాటు నాంపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించే వాహనాలకే ట్రావెల్ టైమ్ ఎక్కువ పడుతోందని గుర్తించింది. నాంపల్లి, కోఠి, అబిడ్స్‌తో పాటు అంబర్‌పేట (ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల), చాదర్‌ఘాట్‌ల్లో ఇది ఎక్కువని టామ్ టామ్ స్పష్టం చేసింది.
‘రోప్’ చుట్టూ రాజకీయ నేతల క్రీనీడలు..
నగరంలో ఈ పరిస్థితులు మార్చడానికి పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వాటి లో ‘ఆపరేషన్ రోప్’ ఒకటి. దీనిపై ఓట్ బ్యాంక్ రా జకీయాల ప్రభావం, రాజకీయ క్రీనీడలు పడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారి, ఫుట్‌పాత్ ఆక్రమణల్ని తొలగించకుండా స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులు అనునిత్యం అడ్డు తగులుతున్నారు.
10 కి.మీ ప్రయాణానికి ఏకంగా 32 నిమిషాలు
నగరంలో సరాసరి వేగం గంటకు 19 కి.మీ
టామ్ టామ్ సంస్థ– 2024 సర్వేలో వెల్లడి
ఆక్రమణల తొలగింపులో రాజకీయ జోక్యాలు
‘రోప్’తో అయినా రూపుమారుతుందనే ఆశ
టామ్ టామ్ నివేదిక ప్రకారం..
నగరంలోని వాహనాల యావరేజ్ స్పీడ్: పీక్ అవర్స్‌లో గంటలకు 17.8 కి.మీ, సాధారణ వేళ ల్లో 19 కి.మీ., సాయంత్రం వేళల్లో 15.6 కి.మీ.
పది కి.మీ ప్రయాణించడానికి పట్టే సమయం: పీక్ అవర్స్‌లో 31 నిమిషాల 30 సెకన్లు, రద్దీ వేళ్లలో 33 నిమిషాల 41 సెకన్లు, సాయంత్రం వేళల్లో 33 నిమిషాల 24 సెకన్లు
2024లో మిగిలిన రోజుల కంటే సెప్టెంబర్ 21న వచ్చిన శనివారం రోజు నగర వాసి తీవ్ర ట్రాఫిక్ నరకం చవి చూశాడు. ఆ నెల మొత్తం ట్రాఫిక్ రద్దీ కొనసాగింది.
తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ ఉండే ప్రాంతాలు: బేగంపేట, సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, బంజారాహిల్స్, హిమాయత్‌నగర్, మెహిదీపట్నం.
Comments
Please login to add a commentAdd a comment