డీఆర్‌ఎఫ్ పాత్ర కీలకం
● హైడ్రా కమిషనర్ రంగనాథ్
● ఔట్ సోర్సింగ్ అభ్యర్థులకు శిక్షణ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) నిర్వహిస్తున్న విధుల్లో దీని అంతర్భాగంగా పని చేస్తున్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) పాత్ర అత్యంత కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చడంతో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హైడ్రా పని చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. డీఆర్‌ఎఫ్‌లోని ఔట్ సోర్సింగ్ విధానంలో కొత్తగా ఎంపిక చేసుకున్న 357 మందికి అంబర్‌పేటలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్‌లో (పీటీసీ) వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కార్యక్రమాన్ని రంగనాథ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో, ప్రభుత్వ పరంగా హైడ్రా కీలక భూమిక పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు రక్షించడంతో పాటు ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో డీఆర్‌ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇప్పుడు దీనికి హైడ్రా విధులు కూడా తోడయ్యాయని చెప్పారు. హైడ్రా మీద నమ్మకంతో ప్రభుత్వం పలు బాధ్యతలు అప్పగిస్తోందని, తాజాగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే పనినీ అప్పగించిందని తెలిపారు. ఈ బాధ్యతల్ని అందరూ అంకిత భావంతో నెరవేర్చాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment