సాక్షి,సిటీబ్యూరో: వాటర్ ట్యాంకర్లను పెండెన్సీ లేకుండా 24 గంటల్లో డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నట్లు జలమండలి ఒక ప్రకటనలో వెల్లడించింది. వాటర్ ట్యాంకర్ల పెండెన్సీపై ‘సాక్షి’ లో గురువారం ప్రచురితమైన ‘‘ట్యాంకర్.. ఫికర్!’’ కథనంపై స్పందించిన జలమండలి వివరణ ఇచ్చింది. ఈ నెల 25,26 తేదీల్లో బుకింగ్ జరిగిన ట్యాంకర్లను ఎలాంటి పెండెన్సీ లేకుండా 24 పని గంటల్లోనే క్లియర్ చేసినట్లు పేర్కొంది. మొత్తం ఫిల్లింగ్ స్టేషన్లలో రోజువారీగా సగటున 9049 నుంచి 9080 వరకు ట్యాంకర్ల బుకింగ్ జరుగుతుందని, అందులో 86 నుంచి 112 వరకు బుకింగ్ లు మాత్రమే వివిధ కారణాలతో పెండింగ్ పడుతున్నట్లు తెలిపింది. ట్యాంకర్ల డిమాండ్ దృష్ట్యా డెలివరీలను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పసికందును కన్నతల్లే చంపేసింది
మైలార్‌దేవ్‌పల్లి: నీళ్ల బకెట్‌లో పడి 14 రోజుల పసికందు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే చిన్నారిని తల్లే నీటి బకెట్‌లో వేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మైలార్‌దేపల్లి ఇన్‌స్పెక్టర్ నరేందర్ గురువారం వివరాలు వెల్లడించారు. తమిళనాడు ప్రాంతానికి ముదిలాని మణి, ఆరోగ్య విజ్జి(30) భార్యాభర్తలు అలీనగర్‌లోని ఓ కంపెనీలో పని చేస్తూ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, 14 రోజుల కుమార్తె ఉన్నారు. మణికి రెండు కిడ్నీలు పాడైపోవడంతో అతడి చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. దీంతో గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో పాప జన్మించడంతో ఆమె పోషణ విషయమై ఆరోగ్య విజ్జి ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న భర్త పనికి వెళ్లిన సమయంలో విజ్జి తన కుమార్తెను బాత్‌రూమ్‌లోని నీటి బకెట్‌లో పడేసి హత్య చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించింది. గురువారం నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఓపెన్‌టాప్ జీపులో వెళ్తూ
పిస్టల్ తిప్పుతూ..
న్యూసెన్స్‌కు పాల్పడిన
యువకులపై కేసు నమోదు
బంజారాహిల్స్: ఓపెన్ టాప్ జీపులో వెళుతూ.. గాలిలో పిస్టల్ తిప్పుతూ న్యూసెన్స్‌కు పాల్పడిన యువకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1లోని సెర్వి హోటల్ సమీపంలో కొందరు యువకులు నెంబర్ ప్లేట్ లేని ఓపెన్ టాప్ జీపులో వెళ్తున్నారు. వాహనాన్ని నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వెళ్లడంతో పాటు ఓ యువకుడు పిస్టల్‌ను గాలిలో తిప్పుతూ వెళ్తున్నాడు. ఇన్‌స్ట్రాగాంలో ఈ వీడియో వైరల్ అయ్యింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ శ్రీకాంత్ అధికార ట్యాబ్‌లో ఈ వీడియోతో కూడిన ఇన్‌స్ట్రాగాం లింక్‌ను గమనించాడు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయుధాల చట్టం ఉల్లంఘించి పిస్టల్‌ను గాలిలో తిప్పుతూ ప్రజలకు భయభ్రాంతులకు గురిచేశారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భవనం పైనుంచి దూకి
నవ వధువు ఆత్మహత్య
ముషీరాబాద్: భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్ పూర్ లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోలక్‌పూర్‌కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన జిమ్ నిర్వాకుడు శబరీష్ యాదవ్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని, చెప్పకుండా పెళ్లి చేశారని ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు సౌజన్యను తరచూ వేధిస్తున్నారు. ఈ విషయం దాచినందుకు అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు ఆమెను పుట్టింటికి పంపారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి అత్తింటికి వెళ్లిన సౌజన్యను తమ ఇంటికి రావొద్దంటూ అక్కడినుంచి వెల్లగొట్టారు. దీంతో మనస్తాపం చెందిన సౌజన్య పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికి మృతి చెందినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి పుష్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని
మహిళ దారుణ హత్య
సనత్‌నగర్: గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండకు చెందిన నాగరాజు బతుకు దెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చాడు. అయితే భార్యతో గొడవల కారణంగా ఆమెను వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు. కూలీగా పని చేస్తూ ఫుట్‌పాత్‌లపై నిద్రించేవాడు. ఈ నేపథ్యంలో అతడికి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పరిసరాల్లో భిక్షాటన చేసుకునే మహిళతో పరిచయం ఏర్పడింది. బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి భరత్‌నగర్ బ్రిడ్జి కిందికి వెళ్లి ఏకాంతంగా గడిపారు. అనంతరం నాగరాజు ఆమెను తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. దీనిపై సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సనత్‌నగర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు నాగరాజును అరెస్టు చేశారు. అయితే మృతురాలి వివరాలు తెలియరాలేదు. ఆమె సంబంధీకులు ఎవరైనా ఉంటే సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.